డా. నళిని
”బచావో! బచావో! మేరీ బేటీకో బచావో!”
ఏడెనిమిదేళ్ళ పాపని అడ్డంగా చేతలమీద వేసుకుని ఏడుస్తూ పరిగెత్తుకుని వచ్చింది ఓ స్త్రీ.
పసిపిల్లకి టీకా ఇస్తున్న లలిత గబగబ అవుట్ పేషంట్ గదిలోకి దారితీస్తూ, ఆ స్త్రీని అటు రమ్మని సైగ చేసింది. ఆ పాపని కౌచ్్ మీద పడుకోబెడుతూ, తల్లిని వివరాలు అడిగింది.
తల్లి బక్కపలుచగా, పేదగా వుంది. మాసిపోయిన చీర, విశ్లేషణకి అందని చూపులు, చింపిరి జుత్తు, పరిసరాల మీద ఎలాంటి ధ్యాస లేని ధోరణి. పాప మగతగా పడుకుంది. చెయ్యివేసి చూస్తే జ్వరం లేదు.
”తెలుగు వచ్చా?”
”హాఁ జీ.”
”అసలేమయిందో చెప్పు.”
”ఎర్రబట్ట అవుతోందమ్మా.”
లలిత ఉలిక్కిపడింది.
”ఎప్పటినించి?”
”నిన్న సాయంత్రంనించి. ఈ దినం ఎక్కువయింది.”
”దెబ్బ తగిలిందా?”
”లేదు.”
”ఎవరైనా కొట్టారా?”
”లేదు.”
”ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా?”
”లేదు.”
నర్సు కోసం బెల్ కొట్టి, మెల్లగా పాప చెడ్డీ తొలగించింది లలిత. చెడ్డీ నిండా రక్తం మరకలు. పల్స్ చూస్తే కొంత నీరసంగా వుంది. బి.పి. ఫర్వాలేదు. నర్సు తెచ్చిన చేతితొడుగులు వేసుకుని పాప మర్మాంగాన్ని జాగ్రత్తగా పరిశీలించింది. చివరలు కోసుకున్నట్టు చీలికలు కనిపిస్తున్నాయి. వాటినించి రక్తం చిమ్ముతోంది. ధారలు తగ్గాయి. కొంచెం లోపలి వరకు ఆ చీలికలు విస్తరించాయి.
లలితను ఆలోచనలు ముంచెత్తాయి. ఈ చిన్నపిల్లకి ఈ గతి ఏమిటి? ఎవరు చేసి వుంటారు? తెలిసినవాళ్ళా? పరాయివాళ్ళా? గుండె, ఊపిరితిత్తుల పరీక్ష యాంత్రికంగా కానిచ్చి, కడుపు నొక్కి చూసి, పాలిపోయిన గోళ్ళని సాలోచనగా చూసింది. తర్వాత నార్మల్ సెలైన్‌లో ముంచిన దూదిని అంగం బయట అదిమిపట్టి, నర్సుని పంపేసింది. చేతులు తుడుచుకుంటూ తల్లివైపు తిరిగింది.
తను కూర్చుంటూ, తల్లిని కూడా కూర్చోమంటూ కుర్చీ చూపించింది. మెల్లగా తల్లిని వివరాలు అడిగింది. ఈమె భర్త మొదటి భార్యతో వేరేచోట వుంటాడు. అప్పుడప్పుడు ఈమె దగ్గరకు వస్తాడు. వచ్చినా తప్పతాగి వస్తాడు. తిడతాడు. కొడతాడు. ఆమె పాచిపని చేసి సంపాదించిన పైసలన్నీ ముక్కుపిండి వసూలు చేస్తాడు. వీళ్ళకి ఒక్కతే కూతురు. మొదటి భార్యకి ఇద్దరు మగపిల్లలు.
”పాపని బాగా చూసుకుంటాడా?”
”ఆఁ, మిఠాయిలు కొనిపెడతాడు.”
”పాపని మరే విధంగా బాధపెట్టడు కదా!”
ఆమెకి లలిత ప్రశ్న అర్థమయిందో లేదో. కన్నతండ్రే కసాయిగా మారిన వృత్తాంతాలు ఈ మధ్య వార్తల్లో కోకొల్లలు. వావివరసలు లేని ఆదిమ సమాజంలోకి తిరోగమిస్తున్నామా?
”మంచిగే చూసుకుంటడు.”
”ఇంటికి ఇంకెవరు వస్తారు?”
”మా బంధువులు ఒకరిద్దరు.”
”మగవాళ్ళు?”
”ఎప్పుడన్న ఒకసారి. ఆయన వుంటెనే వస్తరు.”
”పాప దినచర్య ఏమిటి?”
”అంటే ఏంది?”
”నిద్ర లేచాక ఏమి చేస్తుంది?”
”తినబెట్టి బడికి పంపుత.”
”ఎన్నో క్లాసు?”
”అవ్వల్.”
”ఒకటో క్లాసు పిల్ల కదా, మరి స్కూలుకి ఒక్కతే పోతుందా, నువ్వు దిగబెడతావా?”
”గుట్ట దిగితే గంత దూరల ఇస్కూలు. ఆమెనే పోతది. పొదుగాల నాకు తీరది.”
”సాయంత్రం?”
”ఆమెనే వస్తది.”
”గుట్ట దగ్గర ఏమీ భయం లేదా?”
”మూడేళ్ళసంది ఆడనే వున్నం. అందరెరికే.”
”ఎప్పుడైనా ఏడుస్తూ ఇంటికొచ్చిందా?”
”లేదు.”
”గుర్తుచేసుకో. ఎవరైనా మీద చెయ్యి వేశారని చెప్పిందా?”
”లేదు. అందరూ తెలిసినవాళ్ళే వుంటరు.”
”నిన్న మొన్న ఏడుస్తూ వచ్చిందా?”
”లేదు.”
ఈమెనించి ఇంక ఏమీ రాబట్టలేనని లలితకి అర్థమయింది. నర్సుని పిలిచి, పాపని అబ్జర్వేషన్లో వుంచమని చెప్పింది డాక్టర్. విటమిన్ ‘కె’ ఇంజెక్షన్ ఇచ్చి, ఐ.వి. ఫ్లూయిడ్స్ మెల్లగా పోనిస్తూ, బి.పి., పల్స్ వంటి వైటల్స్ని మానిటర్ చేయమని చెప్పింది. మళ్ళీ బ్లీడింగ్ అయితే తనని వెంటనే పిలవమని చెప్పింది.
అడ్మిషన్ తప్పనిసరి అని తల్లికి చెప్పింది. ఆమె అభ్యంతరం చెప్పలేదు.
ఒక గంట తర్వాత ఓ.పి. ముగించుకుని, ఆ పాప దగ్గరకి వెళ్ళింది లలిత. పాప కళ్ళు తెరిచి పరిసరాలను పరిశీలిస్తోంది. ఆ పాప ముఖంలో బాల్యం తాలూకు మెత్తనిదనం లోపించింది. తల్లీకూతుళ్ళు ఇద్దరి ముఖంలో భయంగాని, బాధగాని కనిపించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో వుండవలసిన కంగారు, భయం వారిలో లేదు.
అది డాక్టర్ని కలవరపెడుతోంది. ఆమెకి ఏదో విషయం అంతుచిక్కడం లేదు. ఏమిటది? సమ్‌థింగ్ ఇజ్ మిస్సింగ్!
సాయంత్రం ఇంటికి వెళ్తూ పాప గదిలోకి తొంగి చూసింది లలిత. పాప లేచి కూర్చుని బన్ను తింటోంది.
”పాపా, నొప్పి తగ్గిందా?”
తల ఊపింది. ధ్యాసంతా తిండి మీదనే.
”నీకు దెబ్బ తగిలిందా పాపా?”
తల్లి వైపు తిరిగి మళ్ళీ తిండిలో నిమగ్నమయింది.
”ఎవరైనా కొట్టారా?”
మౌనం!
”పుల్ల గుచ్చారా?”
మౌనం!
”నీ మీద చెయ్యి వేశారా?”
మౌనం!
”భయం లేదు పాపా. నాకు చెప్పు. నీకు నొప్పి తగ్గి ఇంటికి వెళ్ళాలి కదా!” అంటూ తల నిమిరింది డాక్టర్. అయినా ఏ స్పందనా లేదు.
నర్సు దగ్గర వైటల్స్ చార్టు తీసుకుని పరిశీలించింది. ఇంక బ్లీడింగ్ లేదు. పల్స్, బీపి నార్మల్. మూత్రం రెండుసార్లు పోసింది.
”రంగు ఎలా వుంది సిస్టర్?”
”ఎర్రగానే వుంది మేడమ్.”
”ఫ్లూయిడ్ రాత్రి వరకు కంటిన్యూ చేయండి. పీడియాట్రిక్ సర్జన్‌ని పిలిచాను. ఆయన వచ్చి చూసే వరకు కింద టాంపూన్ అలాగే వుంచండి. రక్తంతో తడిస్తే మాత్రం మార్చండి. అంతే. సర్జన్ వచ్చాక నాతో మాట్లాడించండి. అవసరమైతే సూచర్స్ వెయ్యాల్సి రావచ్చు. అన్నీ సిద్ధంగా వుంచండి. ఈ లోపు ఇంకేదైనా ప్రోబ్లమ్ వస్తే నాకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేయండి, జాగ్రత్త!”
అర్థం కాని పజిల్లా వున్న ఆ తల్లీ కూతుళ్ళని చూస్తూ గదిలోంచి బయటకు వచ్చింది డాక్టర్ లలిత.
ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిందే కాని ఫోను ఎప్పుడు మోగుతుందా అని ఎదురుచూస్తోంది. చివరకు రాత్రి ఎనిమిదిన్నరకి ఫోను మోగింది.
సర్జన్ పాపని పరీక్షించాడట. నెమ్మదిగా కుర్చీకి చేరగిలబడి, డాక్టర్ చెప్పే వివరాలను వింది. మొదటిసారిగా ఇలాంటి కేసు చూసిన షాక్ నించి ఆమె ఇంకా తేరుకోవడం లేదు.
”ఇప్పటికి సూచర్స్ అవసరం లేదు మేడమ్. మీ ట్రీట్మెంట్తో రక్తం చిమ్మడం తగ్గిపోయింది. వైటల్స్ అన్నీ స్టేబుల్‌గా వున్నాయి. రేపు ఇంటికి పంపవచ్చు. కానీ మేడమ్, ఒక్కమాట. ఇది మొదటిసారి కాదు. ఆ పాప మీద అనేకసార్లు అత్యాచారం జరిగినట్టు చాలా హీల్డ్ స్కార్స్ వున్నాయి. అనేక స్టేజెస్‌లో వున్నాయి, దిస్ ఇజ్ ఎన్ ఓల్డ్ కేస్ ఆఫ్ అబ్యూజ్!”
ఏడేళ్ళ కూతురుకి, ఆమె తల్లికి ఇది కొత్త కాదా? అందుకేనా ఆ మౌనం! అందుకేనా ఆ నిర్లిప్తత! జ్వరం వస్తే పడినంత ఆందోళన కూడా వారిలో లేదే? కేవలం రక్తస్రావం కావడంవల్ల ఇలా భయపడి వచ్చారు గానీ లేకపోతే ఈ కథ బయటికి వచ్చేదే కాదన్నమాట!
ఎవరో తెలిసినవాళ్ళు చేస్తున్న అఘాయిత్యం కావచ్చు. ఆ పసికందును బలి తీసుకుంటోంది. తల్లికి అది తప్పు అనిపించడం లేదా? భర్తే చేస్తున్నాడా? ఎవరో చుట్టం చేస్తున్నాడా? ఇంట్లోనా? గుట్ట వెనుకా?
ఆ పాపని ఎలా రక్షించాలి? పోలీసు కంప్లెయింట్ ఇవ్వాలా? ఉమెన్ సెల్‌కి చెప్పాలా? ఆ తల్లిని బజారుకి ఈడ్వాలా?
రాత్రంతా ఆలోచనల మీద ఆలోచనలు. టాబ్లెట్ మింగి బలవంతంగా కళ్ళు మూసుకుంటే మూడింటికి నిద్ర పట్టింది. అలవాటు ప్రకారం ఐదింటికి మెలకువ వచ్చింది.
గబగబ తయారై హాస్పిటల్‌కి వెళ్ళింది డాక్టర్ లలిత. ముందుగా ఆ పాప గదికే వెళ్ళింది. పాప హాయిగా నిద్రపోతోంది. అందమైన కలలు కంటోందా? పీడకలలు రావా? తల్లి లేచి కూర్చుని చాయి తాగుతోంది. ఆమె బాగోతం మా అందరికీ అర్థం అయిందన్న బెదురు కూడా లేదు.
నర్సు దగ్గర కేస్షీటంతా చూసి, పాపని పరీక్షించింది లలిత.
”ఈ పూట ఇంటికి వెళ్ళవచ్చమ్మా. అంతా బాగానే వుంది.”
”షుక్రియా డాక్టర్.”
”కానీ ఇకనించి పాపని ఎక్కడికీ ఒంటరిగా పంపకూడదు. నువ్వే స్కూలుకి తీసుకెళ్ళి తీసుకురావాలి. సామాన్లు, సరుకులంటూ పాపని బయటకి పంపకు. పువ్వులా చూసుకోవాలి. ఎవరో ఆమెని ఆగం చేస్తున్నారు. పాపం చిన్న పిల్ల. దానికి తెలీదు. నువ్వే తెలివిగా దాన్ని రక్షించుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదం. ఇంకోసారి ఇలా జరిగితే, రక్తం ఆగకపోతే పాప ప్రాణానికే అపాయం తెలుసా?”
ఆ తల్లి ముఖంలో ఒక నీలినీడ కదిలి మాయమయింది. మళ్ళీ అదే దేభ్యం ముఖం, అదే నిర్లిప్తత!
అప్పటికి లలిత పిలిపించిన సోషల్ వర్కర్ షాను వచ్చింది. ఆమెకి కేసంతా వివరించి బయటికొచ్చింది లలిత. అరగంట తర్వాత షాను వచ్చి, ఏమీ రాబట్టలేకపోయానంది. తల్లి దగ్గర ఇంటి అడ్రసు తీసుకుని, రోజూ వెళ్ళి కౌన్సెలింగ్ ఇస్తానంది.
వారం తర్వాత షాను ఫోను చేసింది. ఈ వారంలో ఏమీ విశేషాలు లేవంట. పాప స్కూలుకి వెళ్తోంది. అయితే, ఆమెకి చూచాయిగా ఒక విషయం అర్థమయిందని చెప్పింది. పిల్లకి బాబాయి వరస కుర్రవాడు ఒకడు రోజూ గుట్టచాటున ఆ పిల్లని వాటేసుకుంటాడట. చాక్లెట్లు తినిపిస్తాడట. తల్లిని ఏదో విధంగా ఆదుకుంటూ వుంటాడు. అందుకే తల్లికి అభ్యంతరం లేదు.
జీవించడానికి ఏ ఆధారం లేని ఆ తల్లిది తప్పా?
ఆధారం లేని ఆడదాన్ని దోచుకునే వ్యవస్థది తప్పా?
కుప్రిన్ నవల ‘యమకూపం’ చదివిన రోజులా లలితకి కడుపులో దేవుతోంది. వారంరోజులపాటు ఆమెను ఆ సంఘటన వెంటాడుతూనే వుంది. మళ్ళీ రొటీన్లో పడ్డాక ఈ కథ మరుగైపోయింది.
ఈ మధ్య పత్రికల్లో చేదువార్త చూసిన ప్రతిసారీ బాల్యాన్ని కోల్పోయిన ఆ పాప ముఖం వికృతంగా కనిపిస్తుంది. లలితను వేధిస్తుంది.
(స్త్రీలపై ఇంటా బయటా జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ ప్రతి సంవత్సరం 16 రోజులపాటు నవంబరు 25 నుండి డిసెంబర్ 10 వరకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని అంతర్జాతీయ మహిళాసంస్థలు 1991లో పిలుపునిచ్చాయి. దీనికి స్పందిస్తూ రాష్ట్రంలో ‘జెండర్ సమన్యాయ ఐక్యవేదిక’ ఏర్పడింది. దాని ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ సందర్భంగా ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రాసిన కథనం)