నెల్లుట్ల రమాదేవి కథల్లో స్త్రీలు

టి. అన్నపూర్ణ

తెలుగు కథానికను సంపద్వంతం చేసినవాళ్ళలో స్త్రీల భాగస్వామ్యం తక్కువేమి కాదు. స్త్రీలు కథలు రాయకుండా ఉండే మానవజీవితంలోని అనేక అనేక పార్శ్వాలు, చీకటికోణాలు సమాజానికి తెలిసేవికావు. మానవసంబంధాలు వ్యక్తి సున్నితస్పందనలు, మనస్తత్వాలు స్త్రీల కథల్లో విశిష్టంగా కన్పిస్తాయి.

నెల్లుట్ల రమాదేవి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈమె కథలు, కవిత్వం రాయడమేకాక కార్టూన్‌ ప్రక్రియలోకూడా ఆమెకు మంచిప్రవేశం ఉంది. రమణీయం, మనసు భాష, మనసు మనసుకూ మధ్య పుస్తకాలను వెలువరించారు.

”మనసు మనసుకూ మధ్య” కథాసంపుటిని పరిశీలించి నప్పుడు కథలు ఎంతో వస్తువైవిధ్యంతో ఉన్నాయి. ఈమె కథల్లో మాతృత్వం విలువను చెప్పే స్త్రీలు, రాజకీయ నాయకుల వాగ్దానాలకు మోసపోయినవారు, బాధ్యతలేని భర్త నుండి దూరమై కుటుంబాన్ని పోషించుకునే ఇల్లాలు, కట్నం కోసం వెంపర్లాడే వ్యక్తిని భర్తగా అంగీకరించక తిరస్కరించే ఆత్మాభిమానం ఉన్న విద్యావంతులైన యువతులు ఈమె కథల్లో కనిపిస్తారు. ఇంకా పిల్లల సంతోషమే తన సంతోషంగా బ్రతికే మాతృమూర్తి, వ్యక్తిత్వమే ఊపిరిగా ఉన్న యువతులు, తనప్రేమను అర్థం చేసుకోలేని భర్తను చూసి నిస్సహాయులైన భార్యలు, వృద్ధాప్యంలో కూడా అమ్మమ్మే అమ్మవాత్సల్యాన్ని పంచే స్త్రీలు నెల్లుట్ల రమాదేవి కథల్లో కనిపిస్తారు.

”స్తన్యం” అనే కథలో మల్లి తల్లిగారింటికి పురుడు పోసుకుందామని వచ్చినా రెక్కాడితేగాని డొక్కాడని తల్లిదండ్రుల పరిస్థితి చూసి బాలింత అయినా రాఘవరెడ్డి పొలంలో కూలిపనికి వెళ్ళుతుంది. మధ్యాహ్నం వేళకు సంటోనికి పాలిచ్చివత్తానంటే దొర గంటగంటకు ఇంటికిపోతే ఈ పొలం ఎవ్వడు గొయ్యాలె? నీ మొగడా? అని కోపంతో అంటాడు. రాఘవరెడ్డి కూతురైన అనురాధకు కొడుకు పుట్టాడు. అనురాధకు పాలులేని కారణంగా, బాబుకు డబ్బాపాలు పడని కారణంగా డాక్టర్ల సూచనమేరకు నెల బాలెంతరాలైన మల్లిని తన మనవడికి పాలుపట్టమని రాఘవరెడ్డి భార్య అంటుంది. మల్లి సంతోషంతో దొరబాబుకు పాలుపట్టి పొలంపోయి మామిడిచెట్టునీడలో వేసిన బాబుకు ఇప్పుడు ఎండగా ఉండడం వల్ల పెదవుల తడికోసం వెదుకుతున్న తనకొడుకును చూసి మల్లి ప్రేమగా గుండెలకు అత్తుకున్న సమయంలో వాళ్ళకు గొడుగుపట్టి నిలబడి ఉన్న రాఘవరెడ్డిని చూసి మల్లి చిరుమందహాసంగా నవ్వింది.

కర్కషమైన గుణం కల్గిన రాఘవరెడ్డికి పేగుబంధం, ప్రేమ విలువ తనదాక వస్తేగాని తెలుసుకోలేకపోయినందుకు బాధపడ్డాడు. పేదరికంలో ఉన్న స్త్రీల బాధను రచయిత ఈ కథద్వారా తెలిపారు.

”చెల్లని చెక్కు”లో వడ్రంగి కులంలో పుట్టిన భద్రయ్య, సరోజినీ దంపతుల కుమారుడు సురేష్‌. తాను తండ్రిలాగా కులవృత్తి చేయకుండా ఉద్యోగం చేయాలని అతన్ని ఇంజనీర్‌గా చూడాలని భద్రయ్య తాపత్రయపడ్డాడు. ప్రాణంలేని సురేష్‌ను చూసి తల్లి, తండ్రి నీరుకారిపోయారు. తమ కుమారుడు తెలంగాణా ఉద్యమంలో పాత్రపోషిస్తూ మరణించాడు. కాబట్టి అక్కడకు ఊరిజనంతో పాటు సురేష్‌ సన్నిహితులు, ప్రెస్‌వాళ్ళు, పార్టీవాళ్ళుకూడా వచ్చారు. సురేష్‌ను పొగడుతూ చివరగా ఎమ్మెల్యేవచ్చి చెక్కురాసి అందరి సమక్షంలో ఫోటోతీస్తుండగా భద్రయ్య దంపతులకు అందించాడు. సరోజిని కొద్దిరోజులకు చెక్కును బ్యాంకుకు తీసుకెళ్ళగా అందులో డబ్బులేదని చెబుతారు. మరికొద్దిరోజులకు దూరంగా బాడ్రాయి దగ్గర సురేష్‌గురించి మీటింగు పెట్టారని పక్కింటి యాదమ్మ సరోజినికి చెబుతుంది. ఇద్దరు కలిసి చెక్కుపట్టుకొని మీటింగుకు వెళ్ళారు.

అప్పటికి యువకుడు, దార్శనికుడు, మేధావి, అమరజీవి, ఆత్మబలిదానం చేసిన త్యాగమూర్తిని కన్నందుకు తల్లిదండ్రులేకాక ఈ ఊరు కూడా గర్విస్తుందని చెబుతుండగా ఇలాంటి ఉల్లెక్కల మాటలెందుకు చెబుతారయ్యా? థూ నీ బతుకుజెడ! నాకొడుకు ఒక్కపాలేగాలిండు! నువ్వైతే దినాం ఏదో ఒక చౌరస్తల కాల్తనే ఉన్నవు గదా! అని చెల్లని చెక్కును ఎమ్మెల్యే మీదకు విసిరి వెళ్ళిపోయింది.

ఈ కథలో సహజంగా కొడుకును పోగొట్టుకున్న స్త్రీ, రాజకీయ వాగ్దానాలకు మోసపోయిన స్త్రీ కనబడుతుంది.

”కొడుకంటే….?” కథలో రాజుకు పన్నెండేళ్ళ ప్రాయంలో తల్లికి జ్వరం వచ్చి, తండ్రి వారం రోజులుగా తాగి తిరుగుతూ ఇంటికి రానందుకు, చెల్లికి పాలులేక, తల్లికి తిండిలేక, తల్లి జ్వరానికి మందుల్లేక బాధపడుతున్న తల్లిదుఃఖాన్నీ చూడలేక బాలగోపాలుడి వేషం ధరించి తల్లి బాధను తన శక్తిమేరకు పోగొట్టడానికి ప్రయత్నిస్తాడు. రైలులో యాచకుడిగా పాటలు పాడితే వచ్చిన డబ్బులను ఇంటి ఖర్చులకు ఉపయోగించేవాడు. తల్లి ఇండ్లల్లో పనిచేసినా ఆ డబ్బు కూడా పిల్లలను సాదడానికి సరిపోయేది కాదు. తండ్రి అప్పుడప్పుడు ఇంటికి తాగివచ్చి తల్లిని కొట్టేవాడు. జీవితం మీద విరక్తి పుట్టినా ఆడపుట్టుక పుట్టినందుకు తాను పిల్లలకోసమైన జీవించాలనుకుంటుంది.

రాజు ఇప్పుడు తల్లికి బాలగోపాలుడు కాదు, రైల్లో అడుక్కునే ముష్టివాడు కాదు, తల్లిని ఓదార్చే తనయుడుగా కనబడతాడు.

సహజంగా బాధ్యతలేని తండ్రి ఉండడం ద్వారా ఆ కుటుంబం ఇతరులతో సమానంగా సమాజంలో బ్రతకలేదు ఈ కథలో స్త్రీ ఒక భార్యగా, తల్లిగా, కృంగి, కృషించిన వైనం కనబడుతుంది.

”నీ తాళికో నమస్కారం!” లో జానకి పెళ్ళి జరుగుతున్న సందర్భంలో మండపంలో కట్నం డబ్బు అందని కారణంగా వియ్యంకుడు డబ్బు ఇచ్చేవరకు పెళ్ళి జరగదని చెప్పి వరున్ని తీసుకెళుతుండగా అక్కడున్న పెద్దలంతా ఒకనెలలో డబ్బు సమకూర్చుతాం. ఇప్పుడు పెళ్ళి జరిపించి డబ్బు ముట్టిన తర్వాతనే అమ్మాయిని తీసుకెళ్ళమని చెబుతారు. పెళ్ళి కొడుకు తిరిగి పందిట్లోకి రాగానే పెళ్ళికూతురు లేచి తాళి చేత్తోపట్టుకొని హృదయవిదారకంగా ఎర్రబడిన కళ్ళతో నాతో కలిసి బ్రతకాల్సిన నీకు కనీసం ఇక్కడ చూస్తున్న వాళ్ళకు ఉన్నంత జాలి కూడా లేనందుకు ఏమాత్రము సంస్కారం లేకుండా సంతలో పశువులాగా అమ్ముడుపోయినందుకు తాళి తనపై విసిరేయగా అది చూస్తున్న కొన్నికళ్ళు మెచ్చుకున్నాయి. కొన్ని కళ్ళు నిందించాయి.

సమాజంలో పురుషుల అమ్మకానికి స్త్రీలు, వాళ్ళ తల్లిదండ్రులు బలవుతున్న విషయం ఈ కథ ద్వారా రచయిత తెలిపారు.

”జీవనసంధ్యలో” జానకి కొడుకు సూర్య, కోడలు వనజ. ఇద్దరు ఉద్యోగం చేస్తారు. వాళ్ళ పాప హరిత బాగోగులను చూసుకోవడం కోసం తల్లివస్తుంది. ఒకరోజు తల్లి, భార్య, కూతురు పేరంటానికి వెళ్ళిన సందర్భాంలో అమ్మరాసుకున్న డైరీ చదువుదామని సూర్యు తీశాడు. అందులో తల్లి, తండ్రికి చెప్పాలనుకున్న మనస్సులోని ఆలోచనను, ఆవేదనను, అభిమానమును, తనను విడిచి ఉండలేని తనంతో కూడుకున్న బాధను, ప్రేమను వ్యక్తపరుస్తూ రాసుకున్న మనస్సులోని మాటలన్ని ”భర్త” పెద్దకొడుకు దగ్గర ఉన్నాడు కాబట్టి తనతో ఈ భావాలన్ని పంచుకున్నట్లుగా ఊహించి రాసుకుంటుంది.

తండ్రి కూడా భార్యలేనితనాన్ని, అనురాగజీవితం నుండి వియోగజీవితమును పొందిన ఊహను రాసిన డైరీ జానకి కోసమని చదివిన సూర్య అలాగే ఉండిపోతాడు. ఏం బాబు? ఒంట్లో బాలేదా? అని బయటినుండి వచ్చిన జానకి అడుగుతుంది. అదేమిలేదమ్మా! అని సూర్య మర్నాడు ఉదయం లేచి ఊరెళ్ళి తండ్రిని తీసుకొనివస్తానన్న కొడుకు మాటలకు ఆశ్చర్యపోయింది. ఇంతలో వనజ కూడా మీరిద్దరూ మా దగ్గరే ఉండండత్తయ్యా! అనగా జానకి కళ్ళల్లోని తడి మనస్సును పట్టించింది.

ఈ కథలో సహజమైన మాతృత్వపు విలువలు కనబడతాయి. పిల్లల మనస్సులను తల్లిదండ్రులు అర్థంచేసుకున్నంతగా, తల్లిదండ్రుల మనస్సులను పిల్లలు అర్థం చేసుకోరు. తల్లి తనపిల్లల సంతోషమే తన సంతోషంగా భావిస్తుందన్న విషయం రచయిత్రి ఈ కథ ద్వారా తెలిపారు.

”మనసు మనసుకూ మధ్య” కథను పరిశీలిస్తే రాజారావు కూతురుకు పాతకాలపు పెళ్ళిచూపులు, సంప్రదాయాలు అంటే పెద్దగా నచ్చవు. తోడు లేనిదే జీవితానికి అర్థముండదని, నీకు ఒక స్థిరత్వాన్ని ఏర్పరచడమనేది తల్లిదండ్రులుగా అది మా బాధ్యత కూడా అంటాడు రాజారావు. మోహన్‌ తన కుటుంబంతో పెళ్ళిచూపులకు వచ్చి, సంధ్యను చూసి మీరునాకు నచ్చారని చెప్పాడు. సంధ్య అప్పుడేనా? నాలో మీకు నచ్చింది బాహ్యసౌందర్యమే కదా! మీ ఆశయాలు, అభిప్రాయాలు నాకు చెప్పి, నా ఇష్టాఇష్టాలు మీరు తెలుసుకోరా! అంటుంది. సంధ్య ఫ్రెండ్‌ కవితను మోహన్‌ఫ్రెండ్‌ అనుసరిస్తున్నాడని సంధ్యకు తెలిసి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నన్నడిగితే నేనే చెప్పేదాన్నికదా! అంటుంది మోహన్‌తో.

ఈ విధంగా చేయడం ద్వారా నీక్కాబోయేభార్య ఆత్మాభిమానం ఎంత దెబ్బతింటుందో ఆలోచించలేదా? భార్యను సాటిమనిషిలా, వ్యక్తిత్వం ఉన్న స్త్రీలా చూడలేని నీ సంస్కారానికి ఓ నమస్కారం! ఇప్పుడే ఈ విధంగా ఉండే రేపు ఏ విధంగా ఉంటారో? అంటే మోహన్‌ సారీ చెబుతాడు. ”బట్‌ అయామ్‌ నాట్‌ గోయింగ్‌ టు షేర్‌ మై లైఫ్‌ విత్‌ యూ!” మోహన్‌ ఒక ఆడపిల్ల తన హృదయమును ఒక తెరిచిన పుస్తకంలా చదివేసినందుకు ఆశ్చర్యపోతాడు.

సమాజంలో బాధ్యతారహితంగా ప్రవర్తించే పురుషుల మధ్య స్త్రీల జీవితం, వాళ్ళ స్వేచ్ఛ అణగారిపోతున్న పరిస్థితిని ఈ కథ ద్వారా రచయిత్రి చూపించారు.

”ఐ మిస్‌ యూ సోమచ్‌!”లో శాంతికి భర్తకు సేవలు చేయడం అంటే చాలా ఇష్టం. కానీ రమేష్‌ ఆ పనులకు నాయర్‌ ఉన్నాడు కదా! అని నీ జీవితాన్ని సుఖంగా అనుభవించు. మనహోదాకు తగ్గట్టుగా ప్రవర్తించు అని బయటకు వెళ్ళాడు. శాంతి మహాబలిపురం చూపించమని భర్తను అడుగుతుంది. రమేష్‌ అక్కడ ఏముంటాయి! రాళ్ళు రప్పలు తప్ప అయినా నువెళ్ళు అంటాడు. రమేష్‌తో కలిసి బయటకు, పార్టీలకు వెళ్ళినప్పుడు తను ఆయనకు నచ్చిన చీర, నగలు వేసుకోవాలి.

నిశ్శబ్దం నిండిన శాంతి జీవితంలోకి సంతోషాన్ని తెచ్చింది పాప (ప్రణతి) పాపకు తండ్రి బుద్ధులు రాకుండా పెంచాలను కుంటుంది. ఐదు సంవత్సరాలు రాగానే పాపను బోర్డింగ్‌ స్కూల్లో చేర్పించాడు రమేష్‌. శాంతి తన పదేళ్ళ వైవాహిక జీవితంలో బాగా అర్థం చేసుకున్నది ఆయనకు కారు, బంగళా, కంపెనీతోపాటు భార్య కూడా ఒక స్టేటస్‌ సింబల్‌ మాత్రమే! శాంతి చెల్లి పెళ్ళికి వెళ్ళింది. అక్కడికి చిన్నప్పటి స్నేహితురాలు ఇందిర, తనను ప్రేమించిన చందన్‌, అతని భార్య మృదుల కూడా వస్తాడు చందన్‌, మృదులల దాంపత్యజీవితంలో ఐదుసంవత్సరాల పాప పేరు ”శాంతిప్రియ” అని తెలుసుకొని చాలా బాధపడుతుందని శాంతి. చందన్‌ పలకరింపులో ఆప్యాయత కనిపించింది శాంతికి. రమేష్‌తో విసిగిపోయిన ప్రతీక్షణం నిన్ను తిరస్కరించినందుకు ఎంతగా కుమిలిపోయానో నిద్రలేని నా కళ్ళకు తెలుసు అని మనస్సులో అనుకుంటుంది. తిరుగు ప్రయాణం సందర్భంలో చందన్‌ను పిలిచి ”ఐ మిస్‌ యూ సోమచ్‌!” అంటూ తిరిగి తన నిరాశాప్రపంచంలోకి వెళ్ళిపోయింది.

జీవితంలో సంపదతోపాటు, ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమలు అన్నింటితోపాటు భార్య మనస్సును అర్థం చేసుకోలేని భర్త వలన స్త్రీ అనుభవించే బాధను ఈ కథ ద్వారా వ్యక్తం చేశారు.

”లిటిల్‌ స్టార్‌” కథలో జానకి, రామారావుల కూతురు స్వాతి లేఖ రాసింది. స్వాతి పురుడుపోసుకోవడానికి ఇంటికి వస్తుందనగానే జానకి సంతోషించింది. రవికి తల్లిదండ్రులు లేని కారణంగా చదువుపై శ్రద్ధ ఉండడంతో రామారావుగారు ఇంజనీరింగ్‌ వరకు చదివించాడు. ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది. వెంటనే రవి, స్వాతిని పెళ్ళిచేసుకున్నాడు. ఇప్పుడు రవికి ఢిల్లీలో ఎనిమిది నెలలు ట్రైనింగ్‌ ఉందట ఇద్దరు కలిసి వస్తున్నారు. స్వాతికి బాబు జన్మించాడు. స్వాతి పేరుకు మాత్రమే తల్లి, ఆలనా, పాలనా మొత్తం జానకి చూసుకుంటుంది. రామారావు బాబుకు ఉన్నంతలో బారసాలచేశాడు. ఐదవనెలలో రవి వచ్చి భార్యను, కొడుకును తీసుకొని వెళ్ళాడు.

శాంతికి ఉద్యోగం వచ్చిందని తాను ఆ ఉద్యోగాన్ని వదులుకోలేనని స్వాతి, రవి ఇద్దరు వచ్చి బాబును రామారావు, జానకిల దగ్గర వదిలి వెళ్ళారు. అప్పుడప్పుడు వచ్చిచూసేవారు. బాబుకు ఐదు సంవత్సరాలు నిండగానే స్కూల్లో చేర్పించడం కోసమై తల్లిదండ్రుల దగ్గరకు వస్తుంది స్వాతి. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులకు తన కొడుకే ఒక తోడని భావించి బాబుపై వారికున్న ప్రేమను, వాత్సల్యాన్ని కాదనలేక, బాబును వారికి దూరం చేసే ధైర్యం లేదని మనస్సులో అనుకుంటుంది స్వాతి.

సహజంగా తల్లిదండ్రులతోడు పిల్లలకు ఎప్పటికి ఉంటుంది. కానీ వృద్ధాప్యంలో పిల్లలతోడు తల్లిదండ్రులు కోరినప్పుడు వాళ్ళు చూపించే ప్రేమ వారికి తోడుగా నిలుస్తుందని ఈ కథ చెబుతుంది.

ఈ కథల్లోని స్త్రీలు క్రింది మధ్యతరగతి స్త్రీలు. అయినా తమకు జీవితం ఉందని గుర్తించినవారే. కొన్ని కథల్లో నిస్సహాయంగా కన్పించినా, మరికొన్ని కథల్లో మాత్రం స్వతంత్య్రమైన వ్యక్తిత్వం కల స్త్రీలుగా కన్పిస్తారు. ఈ కథలన్నీ ఇచ్చే సందేశం స్త్రీలు జీవితాన్ని గెలుచుకోగలరనే ఆత్మవిశ్వాసాన్నిస్తాయి.

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.