శారదా శ్రీనివాసన్
ఒక వూళ్ళో ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. అతని
పేరు చలమయ్య. చలమయ్యది పెద్ద మేడ. ఆ మేడ చుట్టూ పెద్ద తోట. ఆ తోట తరవాత బోలెడు పంట పొలాలు అవన్నీ చలమయ్యవే ఇప్పుడు.
ఆ చలమయ్య భవనానికి కాస్త పక్కగా ఒక చిన్న పూరిగుడిశ ఉంది. అందులో చలమయ్య పొలంలో పనిచేసే ముసలి రామయ్య, అతని భార్య లక్ష్మమ్మ ఉంటున్నారు. పాపం నిరుపేదలు.
అసలు చలమయ్య అంత పెద్ద ధనవంతుడెలా అయ్యాడో చెప్పనేలేదు కదూ! తన పొలంలో పనిచేసే కూలీలకు సరిగా కూలీ ఇచ్చేవాడు కాదు. నీళ్ల జీతానికి చేయించుకునే వాడు. వూళ్లో వున్న కొద్దిపాటి రైతులెవరికైనా ఏదైనా అవసరం వచ్చిందంటే, వారికి అప్పులు ఇచ్చి మెల్లగా వారి పొలం తనపేర రాయించేసుకునేవాడు.
ఇలా చాలామంది పేదవాళ్ల నోరు కొట్టి ఇంత పెద్ద ఆస్తి సంపాదించాడు చలమయ్య. అతని భవనం ప్రక్కనే రామయ్య ఉన్నాడని చెప్పానుగా. ఆ రామయ్య శరీరంలో శక్తి ఉన్నన్నాళ్లు చలమయ్య పొలంలో పనిచేశాడు. అయితే ఇప్పుడు బాగా ముసలివాడై పోయాడుగా. సరిగా పనిచేయడం లేదని, రామయ్యను మాన్పించివేశాడు చలమయ్య.
ఇంట్లో పాపం రామయ్యకు, అతని భార్య లక్షమ్మకు తినేందుకు తిండికూడా లేదు. వాళ్లకు వాళ్ల లాంటిదే ఒక ముసలి ఆవు వుంది. అది కాసిని పాలిస్తుండేది. అయితే తాము తినడానికే తిండి లేకపోతే, ఇంక ఆవునెలా పోషిస్తారు? అందుకని దానిని సంతకు తీసుకుపోయి కాస్త మంచి ధరకు అమ్ముకురమ్మంది లక్షమ్మ తన భర్తతో. ఆ వచ్చిన డబ్బుతో కొన్నాళ్ళయినా తిండి తినవచ్చు గదా అని అనుకున్నారు.
రామయ్య ఆవును తీసుకొని సంతకు బయలుదేరాడు. కాస్త ఆలస్యమైనా మంచి ధర పలికితేనే అమ్మమని మరీ మరీ చెప్పింది లక్షమ్మ.
అవును తోలుకుని వెడుతున్న రామయ్యకు తోవలో ఒక మరుగుజ్జువాడు కనిపించాడు. అతని చేతిలో ఒక చిత్రమైన గంగాళం ఉంది. చెవుల గంగాళం. ఆ మరుగుజ్జువాడు అన్నాడు కదా; ”చూడు ముసలయ్యా! అవును అమ్మడానికి తీసుకుపోతున్నావా? ఎంతకిస్తావ్?” అని.
రామయ్య రెండు వందలు అన్నాడు. ”చూడు ఈ చెవుల గంగాళం ఇచ్చేస్తాను గాని నాకు ఆ ఆవును ఇస్తావా?” అని అడిగాడు మరుగుజ్జు.
ఇవ్వనుగాక ఇవ్వను అన్నాడు రామయ్య. అప్పుడు – ఆశ్చర్యంగా ఆ గంగాళం అంది ”తాతా తాతా! ఆవునిచ్చి నన్ను తీసుకో నీకు మేలు చేస్తా” అని.
గంగాళం మాట్లాడటం విని ఆశ్చర్యపోయాడు రామయ్య. సరే, ఏదైతే అది అవుతుంది లెమ్మని, ఆవునిచ్చి, ఆ చెవుల గంగాళం పుచ్చుకుని, వెనక్కి తిరిగి ఇంటిముఖం పట్టాడు.
ఆవునమ్మి ఎంత డబ్బు తెస్తాడా అని ఎదురు చూస్తున్న లక్షమ్మకు గంగాళం నెత్తిన పెట్టుకుని వచ్చే రామయ్య కనిపించాడు. ఇంటికొచ్చి జరిగిన సంగతంతా చెప్పాడు రామయ్య. కిలుమెక్కి నల్లగా ఉన్న ఆ చెవుల గంగాళం చూసి అసహ్యించుకుంది లక్షమ్మ. మొగుడు చేసిన పనికి కోపం వచ్చింది. అయినా ఏమీ అనలేదు.
సరే, ఆ గంగాళాన్ని లోపలికి తీసుకుపోయి తెల్లగా తోమింది.
అప్పుడా గంగాళం ”నన్ను పొయ్యి మీద పెట్టు. నన్ను పొయ్యి మీద పెట్టు” అన్నది.
లక్షమ్మ దాన్ని గబగబా తీసుకుపోయి పొయ్యిమీద పెట్టి మంట చేసింది. కాస్త వేడెక్కిందో లేదో, ఆ చెవల గంగాళం ”నే దూకుతా, నే గెంతుతా” అంటూ అరిచింది.
అయ్యో ఎక్కడికి దూకుతావంటూ లక్షమ్మ అడిగే లోపుగానే, అది తెరచివున్న గుమ్మంలోకి ఒక్క గెంతు గెంతి, బయటికి వెళ్లిపోయింది.
ధనవంతుడైన చలమయ్య ఇంట్లో ఆ రోజు చుట్టాలు వచ్చారని – వాళ్ల వంటావిడ పాయసం తయారు చేయటానికి గాను, వంట పాత్ర కోసం చూస్తున్నది. ఇంతలో పిలిచినట్లు తెరచి వున్న కిటికీలో నుంచి తళతళలాడే గంగాళం వచ్చి పొయ్యిమీద కూర్చున్నది. ఆ గంగాళంలో తియ్యటి, కమ్మని పాయసం వండింది వంటావిడ.
పాయసం చేయడం పూర్తి కాగానే ”నే దూకుతా, నే గెంతుతా” అంటూ ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగాను దూకి కిటికీలోంచి దూసుకుపోయి ఆ గంగాళం రామయ్య ఇంట్లోకి చేరింది చెవుల గంగాళం. గంగాళంతో పాటు పాయసం కూడా పోయిందని లబోదిబోమని మొత్తుకుంది వంటావిడ.
నిండుగా కమ్మటి పాయసంతో వచ్చిన గంగాళాన్ని చూసి, ఆ పేద దంపతులు చాలా సంతోషించి ఆ పాయసం తిన్నారు. పాత్ర ఖాళీ అయ్యాక, చక్కగా తోమి మళ్లీ పొయ్యి మీద పెట్టింది లక్షమ్మ. అది కాస్త వేడెక్కగానే ”నే దూకుతా, నే గెంతుతా” అంటూ అరచి ఒకే దూకుతో పొలాల్లోకి దూసుకుపోయింది.
అక్కడ చలమయ్య పొలంలో ధాన్యం కుప్పలు పోసి ఉంది. ధాన్యం పోయడానికి సంచుల కోసం ఎదురు చూస్తున్నారు కూలీలు. చెవుల గంగాళం వచ్చి అక్కడ వాలడంతోనే ”అరే బాగుందే ఈ గంగాళం అని అందులో కూడా ధాన్యం నింపడం ప్రారంభించారు. చూడండి అంత చిన్న గంగాళంలో పోసిన కొద్దీ ధాన్యం ఇంకా పడుతున్నదే కాని, నిండటం లేదు. చివరకి ధాన్యం కుప్ప అంతా అయిపోయింది. మాయ గంగాళం ఇక ”నే దూకుతా, నే గెంతుతా” అంటూ రివ్వుమని ఎగిరి కంటికి కనిపించకుండా పోయి రామయ్య ఇంట్లో చేరింది.
నిండుగా ధాన్యం తెచ్చిన గంగాళాన్ని చూసి ఆ పేద దంపతులు ఆనంద పడిపోయారు. ఇంక ఆ యేటికి తిండికి కొదవ వుండదని, ఆ ధాన్యాన్నంతా బస్తాలలోకి ఎత్తి, జాగ్రత్త చేసుకున్నారు.
ఖాళీ అయిన గంగాళాన్ని తోమి పొయ్యి మీదికెక్కించింది లక్షమ్మ. మళ్లీ కాస్త వేడెక్కగానే ”నే దూకుతా, నే గెంతుతా” అంటూనే దూసుకుపోయింది మాయా గంగాళం.
సరిగ్గా అదే సమయానికి చలమయ్య ఏం చేస్తున్నాడో తెలుసా! మేడ మీద తన గదిలో కూర్చుని, ఇనప పెట్టి తెరచి డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు. గంగాళం వచ్చి చలమయ్య ఒడిలో వాలింది. మిలమిలా మెరిసిపోయే ఆ చెవుల గంగాళం అందానికి మురిసిపోయిన చలమయ్య ”బలే తళతళలాడే ఈ గంగాళంలో మెరిసే నా బంగారు నాణాలు, నింపుతాను” అంటూ నగలూ, నాణాలు, అన్నీ తీసి అందులో వేస్తున్నాడు. అది కదల్లేదు. నిండలేదు. డబ్బంతా అందులో వేసి మురిసి పోతుండగా ”నే దూకుతా, నే గెంతుతా” అంటూ లేచింది మాయ గంగాళం.
అయ్యో ఎక్కడికి? ఎక్కడికి? అంటూ మొత్తుకుంటూనే ఉన్నాడు చలమయ్య.
అంతే కిటికీలోంచి ఎగిరి తిన్నగా రామయ్య వాళ్ల గుడిశ చేరింది. గంగాళం కోసమే ఎదురు చూస్తున్న లక్షమ్మ అది తెచ్చిన డబ్బంతా భద్రపరచింది.
ఈసారి మళ్లీ పొయ్యిమీద వేడెక్కగానే ”నే దూకుతా, నే గెంతుతా” అంటూ రోడ్డున పడింది. ఆ గంగాళం కోసం వెదుకుతూ వచ్చిన చలమయ్య అది కనిపించగానే ఒక్కసారి వాటేసుకున్నాడు. అయితే ఆ మాయ గంగాళం ఆ చలమయ్యను తీసుకుని, అలాగే దూకుతూ గెంతుతూ ఎక్కడికో వెళ్ళిపోయింది. మళ్లీ ఆ గంగాళం గానీ, ఆ చలమయ్య గానీ, వూళ్ళో వాళ్ళకు కనిపించలేదు.
చలమయ్య వలన నష్టపోయిన వారంతా తమతమ పొలాలను తిరిగి స్వాధీన పరచుకుని పంటలు పండించుకుంటూ సుఖంగా వున్నారు.
కధ చాలా బా వుంది.