ఇంద్రగంటి జానకీబాల
ఏ నలుగురు స్నేహితులు కలిసినా, నాలుగు మాటల తర్వాత వచ్చే విషయం తెలుగు టి.వి.ఛానల్స్‌లో ప్రసారమవుతున్న డైలీ సీరియల్స్ గురించే-, వాటి గురించి ఆహా! ఓహో! అని చెప్పుకోవడం వుందా అంటే అనుమానమే.
‘ఒకటే సాగ లాగుడు’ – అని ఒకరంటే-,
ఎక్కడా మనకి కనిపించని సమస్యలు” అని మరొకరు.
”ఆడవాళ్ళు విలన్సండీ బాబూ”-.
”అయినా ఆవేషాలు, ఆ చీరలు, ఆ ఇళ్ళూ, అబ్బబ్బ-..”
”ఆడవాళ్ళని చెంపదెబ్బ కొట్టని సీరియల్ చూపించండి”-
”సీరియల్ ఏమిటి? ఎపిసోడ్ చెప్పండి ప్రతీ ఎపిసోడ్‌లోనూ పేట్ పేట్‌మని ఆడవాళ్ళని చెంపదెబ్బలు కొట్టడం- వాళ్ళు వెళ్ళి ఆమడ దూరంలో పడటం, అంతుపట్టని ఏడుపు-, అర్థం పర్థం లేని కల్పిత సమస్యలు”-
ఇలాగే సాగుతుంటాయి సంభాషణలు-, ఎక్కడో ఒక్కటో అరో బాగుందని చెప్తూవుంటారు. అయితే ఈ విమర్శలు, విముఖతలు నిజమేనా-, అందరూ సీరియల్స్ చూసి ఇలాగే విసుక్కుంటారా-, అదే నిజమయితే వాటికెందుకంత ఆదరణ లభిస్తోంది. ఎందుకంత రేటింగ్ వచ్చి, వందలకొద్దీ ఎపిసోడ్‌లు నడుస్తున్నాయి?- వెయ్యి ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న పండగలు అంత ఉత్సాహంగా ఎలా జరుపుకుంటున్నారు? ప్రేక్షకులు ఆదరాభిమానాలు లేకపోతే వాళ్లే ఎందుకంత హడావిడి చేస్తున్నారు అని ఆలోచించాలి. ఈ విమర్శలు, విసుగులూ ప్రదర్శిస్తున్న వాళ్ళు నిజంగానే టి.వి. సీరియల్స్ చూడకుండా వుంటున్నారా’- ప్రశ్న.
ఇవన్నీ ఆలోచించి, తక్కించుకుంటే మనలోనే నిద్రపోతున్న ఎన్నో గుణాలు, ఆలోచనలు, ఆశలు, ఆదర్శాలు బయటకొస్తూ కనిపిస్తాయి.
అలాంటి కొన్ని సంగతులు ముచ్చటించుకుంటే బాగుంటుందనే ప్రయత్నమే ఈ రచన ఉద్దేశం.
సినిమాకైనా, టి.వి. సీరియల్‌కైనా, రంగస్థల నాటకానికైనా ముఖ్యమైనది కథ-, కథ అనే భూమిక కాస్త కొత్తగా, ఆసక్తిదాయకంగా, సహజంగా వుంటే ఆ ప్రక్రియలు రాణిస్తాయి. ఇది అందరూ పైకి అనుకునే మాట. కానీ పైకి అనే మాటకీ, లోపలుండే గుణానికి తేడా వుంటుంది.
క్రూరత్వం, ద్రోహ చింతన, దుర్మార్గం, హింస, అన్యాయం, అక్రమం ఇవన్నీ వద్దు వద్దు అనుకుంటాం గానీ, వాటిని తెర మీద (బుల్లితెరైనా సరే) చూపిస్తుంటే మిరపకాయబజ్జీలు తింటున్నట్లు కసి, కోపం, ఉత్సాహం కలిసి బలే వుంటుంది. తెరమీద జరుగుతున్నది తప్పు, అన్యాయం అనిపిస్తూనే-, అసహనం అవాస్తవికం అని తలపిస్తూనే మనల్ని, మన ఆలోచనల్ని ఆకర్షించే శక్తి వాటికుంటుంది. ఆ కాస్సేపు వాటికి బానిసలమైం చూసేసి తర్వాత తల విదిలించుకుని విమర్శించటం మొదలుపెడతాం. అసలు చూడటమెందుకు? వాటిని పోషించటమెందుకు అని ప్రశ్నిస్తే-,
చూడకపోతే ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? ఎంత దుర్మార్గం టి.వి. సీరియల్స్‌లో నడిచిపోతోందో మనం గ్రహించటం ఎలా? అందుకే చూస్తున్నాం” ఒక జవాబు.
”ఏదో కాలక్షేపం కోసం-” చప్పరింత
”బయట వుద్యోగాలు చేసి, అలసిపోయి ఇంటికొచ్చి ఇంత తిన్నాక, మనకంటూ ఏదీ చేసే ఓపిక వుండదు. అప్పుడె టి.వి. ఆన్ చేస్తే నిద్రొచ్చే వరకు కాలక్షేపం”- ఒక సమర్థన.
”పుస్తకం ఏదైనా చదవవచ్చు కదా!”
”అబ్బో! అంత ఓపికెక్కడండీ…” అంటూ ఆవులింత.
”మరి అంత అసహజంగా వుండే విషయాలు అందులో చూపిస్తుంటే మీకేమనిపించదా”-
”అనిపించటానికేముంది? అవన్నీ పట్టించుకుంటామా ఏంటీ? ఏదో చూసి వదిలేస్తాం”
”మనసుకేం పట్టవంటారా”-,
ఆమె ఆలోచనలో పడి ”అలాగనీ పూర్తిగా చెప్పలేం. కొన్ని పాయింట్లు బాగుంటాయి. మనకీ అవి సరిపోతాయి. అలాంటివి తీసుకుంటాం.”-
”వాటినెలా గుర్తిస్తారు?”-
అదేం పెద్ద సమస్యకాదండీ- మన యింట్లో, మన పొరుగింట్లో జరిగే విషయాలే తెరమీద చూస్తుంటే భలేగుంటుంది”-.
కాలింగ్‌బెల్ మోగింది. ఇప్పటికిది ఆగింది.