మల్లాప్రగడ రామారావు
మనిషిని, మనిషిగా చూడడం మనవల్లకాదన్నది ”నినద భీషణ శంఖము దేవదత్తమే”నన్నంత నిజమని వేరే చెప్పాలా? మనకేమో, ఇంట్లోనే కాదు బయట వ్యవహారాలలో కూడా, కొందరు ”ఒరే”, ”ఒసే”, కొందరేమో ”ఏమోయ్”,
”ఏవమ్మా”, మరికొందరు మాత్రం ”ఏమండీ”.
ఎందరో మాట్లాడేరు, రాసేరు గురజాడ గురించి, అందుకే నేను మన గురించి మాట్లాడతాను.
”ఇలాంటి ఓ వ్యక్తి, ఈ భూప్రపంచం మీద నడయాడేడంటే భావితరాల వాళ్ళు నమ్మకపోవచ్చు” అన్నారట ఐన్‌స్టీన్ గారు – గాంధీ గారి గురించి.
నేననుకుంటానూ, మనం ఇప్పటికి నూటయాభై ఏళ్ళ క్రితం పుట్టామనీ, గురజాడ ఇప్పటికీ నూటయాభై ఏళ్ళ తర్వాత పుట్టారనీ.
”ఆకాశ మార్గాన బైరాగి గారు దిగొచ్చారం”టే ఒప్పుకుంటాం కాని, ”మగడు వేల్పన పాత మాటది, ప్రాణమిత్రుడు నీకు నేను” అంటే, మెచ్చుకుంటామా.
ఆకాశంలో మిగిలిన సగం కూడా కంఠాభరణాలూ, కర్ణాభరణాలూ పెట్టుకుని మురిసిపోతుంటే, ఏడ్చేవాళ్ళని నవ్వించడానికి కాకపోతే, అవేం మాటలండీ – ”సతుల సౌరను కమలవనమునకు పతుల ప్రేమయే వేవెలుంగ”ని.
హాస్యానికైనా హద్దున్డాలి. మంచీ లేదు. చెడ్డా లేదు. కులమొక్కటే గుణమై కూర్చుండగా ”ఎంచి చూడగ మంచి చెడ్డలే రెండు కులములు మనుజులందున” అనొచ్చునా.
ఇంతకీ, ”మంచియన్నది మాలయైతే, మాలయేనగుదున్” అంటే, అప్పుడు కాబట్టి చెల్లింది.
మనిషి చేసే రాయీ, రప్పల మహిమ మనకి తెలుసు కాబట్టే, భక్తి వరదలా ఈ దేశంలో పారుతోంది.
దలైలామా గారికిలా ”ఇంత దైవభీతి ఉన్న భారతదేశంలో, ఇంత అవినీతా!” అన్న ధర్మ సందేహం మనకి లేదు. దేవుడూ మన ‘ద్రవ్యాకర్షణ’లో భాగస్తుడేనని, ఆయన వాటా ఆయనకు అర్పించుకుంటామని, ఆది లోనే ఆ భరోసా ఇస్తామని, సాక్షాత్తూ ఆదాయపన్ను శాఖ అత్యున్నత అధికారి ఒకరి దినచర్య సాక్షిగా మనం వక్కాణించగలం.
మనిషిని, మనిషిగా చూడడం మనవల్లకాదన్నది ”నినద భీషణ శంఖము దేవదత్తమే”నన్నంత నిజమని వేరే చెప్పాలా? మనకేమో, ఇంట్లోనే కాదు బయట వ్యవహారాలలో కూడా, కొందరు ”ఒరే”, ”ఒసే”, కొందరేమో ”ఏమోయ్”, ”ఏవమ్మా”, మరికొందరు మాత్రం ”ఏమండీ”.
కోట్లమంది పూర్ణమ్మలు పుట్టకుండానే వారి పుట్టిమునుగుతోందని, నూరు మంది ఆడవాళ్ళకు, నూట ఇరవై మంది మగవాళ్ళతో అరుణ తార చైనా కూడా ఈ విషయంలో చాలా ముందుందని మీ దగ్గర దాచలేను.
తల నెరవడం మొదలవడం తడవు, వెనకటి రోజులన్నీ రూపు మార్చుకుని తళతళలాడుతూ మనక్కనిపిస్తాయి. ”మంచి గతమున కొంచెమేనోయి” అంటే మనమొప్పుకుంటామా.
పోనీ కదా అని, మన రాజ్యాంగ ప్రవేశికలో ”సామ్యవాద” విశేషణాన్ని ఇంకా వుండనిచ్చాము గాని, ”స్వంత లాభమే” చోదక శక్తిగా గుర్తించిన మనం, దాన్ని కొంతైనా మానుకొంటామా.
పామరం. పామరం. ”నరుల చెమటను తడసి మూలం ధనం పంటలు పండవలె’ నట. ఏలిన వారినుండి భూవినియోగం మారుస్తూనో, వృత్తాకార రహదారి దారి మళ్ళిస్తూనో ఒక్క కాగితం పుట్టిస్తే, అల్లుళ్ళ ఖాతాల్లోకీ, కొడుకుల వ్యాపారాల్లోకి, కోట్లు, కోట్లు నడచి వస్తాయని మనకి కదా తెలుసు.
ఆశలకైనా హద్దు వుండాలి. ”మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును”ట. మసీదులు కూల్చడాలూ, దేవాలయాలు ధ్వంసం చెయ్యడాలూ, చర్చిలు పేల్చడాలూ ఇందుకోసమే అనుకుంటున్నారేమో పెద్దాయన పైన కూర్చుని.
ఇలా చెప్పుకుంటూ పోవడం ఎందుక్కాని, చెప్పాలంటే, ”గురజాడది, గురుజాడేమో కాని మన జాడవేరు”
అన్నారు కదా కాళోజీ గారు – ”రఘుపతి రాఘవ రాజారాం. రాం దారికి రానే రాం” అని.
ఇక్కడికి కడుపుమంట మాటలు చాలించి, చివారఖరికొస్తే …. ”సాయంకాలమైంది” అని మానవమాత్రుడు రాయగలడా” అన్నారట రావి శాస్త్రి గరు. ఆ సాయంకాలం అర్థరాత్రి అయిందని అందరూ నిర్ధారించారు. కాని, ”ఎప్పుడు తెల్లవారుతుందో, ఈ చీకట్లు తొలుగుతా”యో, మానవ మాత్రున్ని నేనేం చెప్పగలను. ఎందుకంటే, వెంకటేశాలకేమో, బుచ్చమ్మ చముర్రాసుకోదని మాత్రమే తెలుసు. తలచెడిందని తెలిసిన గిరీశాలు అది తమ ప్రయోజనాలకే వినియోగించుకుంటున్నారు.