యువతరం పరుగు ప్రతిభ వైపా, పతనం వైపా?

నంబూరి పరిపూర్ణ

ఏ దేశ భవిష్యత్తయినా, సంపద వృద్ధయినా ఆ సమాజపు సామరస్య సహకార వైఖరి అయినా – ఆ దేశ యువతరం యొక్క ప్రతిభ, ప్రజ్ఞ, సృజనాత్మకత మీదనే ఆధారపడతాయి అన్నది అందరూ ఆమోదించి, ఆశించే విషయం. ఇందుకు భిన్నంగా ఎవరూ ఆలోచించరు.

కానీ ప్రస్తుత కాలంలో మనదేశపు అత్యంత విలువైన, అపురూపమయిన యువశక్తి ఎందుకూ కొరగాని నిష్ప్రయోజన రీతికి మారుతున్న స్థితిని, పెద్దలం మనం నిస్సహాయంగా చూస్తూ ఊరుకుంటున్నాం.

ఈ నాటి జీవన రంగాలన్నింటా యువకులు అధిక సంఖ్యలో వుంటున్నారు. విద్యార్థులుగా, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ఉద్యోగులుగా, శాస్త్ర సాంకేతిక వృత్తి నిపుణులుగా, రోజు కూలీలు ఆటో డ్రైవర్లుగా జీవికలు సాగిస్తున్నారు.

కాగా యిటీవలి రెండు దశాబ్దాల్లో – వీరి వైఖరీ ప్రవర్తనల్లో ఒక విచ్చలవిడితనం, న్యాయ నైతిక విలువల బేఖాతరు, ప్రేమ ముసుగులో కామోన్మాదం, సుఖ భోగ లాలస మొదలైన దుర్లక్షణాలు పెచ్చరిల్ల సాగాయి. కొందరు జులాయిలుగా మారి, చైన్‌ స్నాచింగులు మొదలు, పట్టపగటి ఇళ్ల దొంగతనాలు, దోపిడీలూ, అడ్డుపడే వారి హత్యలు, ఇలా అత్యంత నీచ రాక్షస ప్రవృత్తుల్ని అలవర్చుకుంటున్నారు. మరికొందరు ఆడపిల్లలపైన అత్యాచారాలకు, ఆపై వారి హత్యలకు నిర్భీతిగా పాల్పడుతున్నారు. అనేక పరిస్థితుల ప్రభావం వల్ల తమలో కలుగుతున్న కామోద్రేకాలను ప్రేమగా భ్రమిస్తున్నారు.

ఈ దుస్థితికి కారణమవుతున్న అంశాలను గురించి విచారించవలసిన అవసరమెంతైనా వుంది. వీటిలోని మొదటి అంశం – నేడు అమలవుతున్న మన విద్యావిధానం. విద్య – వికాసాన్నీ, సత్ప్రవర్తననూ, విచక్షణా జ్ఞానాన్నీ, సచ్ఛీలతనూ కలిగిస్తుందనేది, వారికీ, అభ్యసించే వారికీ వ్యాపార దృష్టి, స్వార్థత తప్ప, మానవత, మానవ విలువలన్నవి ఏ కోశానా వుండడం లేదు. విద్యార్థి పాఠ్యాంశాల జోలికి పోవాల్సిన పనిలేదు. పరీక్షల్లో తరచు వచ్చే ప్రశ్నలకు ఆన్సర్ల గుడ్డి కంఠస్థాలు తదితర డొంక తిరుగుడు అవినీతి మార్గాలను పట్టుకోగలిగితే చాలు. విజ్ఞాన ఆర్జనకు, గుణశీలాల వృద్ధికి చోటేలేని నేటి ప్రైవేటు విద్యా సంస్థల విద్యా విధానం ద్వారా, ఏదో విధంగా డిగ్రీలు సంపాదించడం, వాటి ఆధారంతో మంచి ఉద్యోగాలకెక్కడం, సుఖంగా గొప్పగా జీవించడం – ఇవి మాత్రమే విద్యార్థి యువజనాల జీవిత లక్ష్యాలవుతున్నాయి. న్యాయ నైతిక విలువల, మంచి ఆశయ ఆదర్శాల బోధనకు తావులేని ప్రైవేటు సంస్థల విద్యా వ్యాపారం, మానవ సంబంధాన్ని దారుణంగా దెబ్బదీస్తున్నాయి. స్వంత కుటుంబాల్లోనూ, ఇరుగుపొరుగుల్లోనూ సదవగాహన, స్నేహ సహకార గుణాలు మృగ్యమవుతున్నాయి. ఇంక సాంఘిక సృహ అంటే ఏమిటో, సమాజ శ్రేయస్సు అంటే ఏమిటో తెలియని స్థితికి యువతరం నెట్టబడుతోంది. దేశం కోసం, సమాజం కోసం, అణగారిన వర్గాల కోసం, ప్రజల బానిసత్వ విముక్తి కోసం పాటుబడి, అనేక త్యాగాలు చేసి, ప్రాణాలు విడిచిన ప్రజానేతలు, సంఘ సంస్కర్తల గురించిన బోధన లేని స్థితివల్ల కన్నవారి పట్ల సయితం మమత, బాధ్యతలుండడం లేదు నేటి యువజనానికి.

ఇటు పట్టణ యువతను అటు గ్రామీణ యువతను పట్టి పీడిస్తూ తప్పుడు మార్గాలు తొక్కిస్తున్న మరో ముఖ్య విషయం – నిరుద్యోగం! ఆర్థిక బలం తక్కువై, టెక్నికల్‌ కోర్సులు చేయలేకపోతున్న పేద విద్యార్థులకు మామూలు డిగ్రీ చదువులు – ఉద్యోగాల్ని సంపాదించి పెట్టలేక పోతున్నాయి. గ్రామాల్లోని వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత చేతి వృత్తులన్నీ మూలబడిపోయి, ఏ రకమైన బ్రతుకుదెరువులు కనబడక, పట్టణాలకు నగరాలకు ఎగబ్రాకుతున్న గ్రామీణ జనం ఇక్కడా కడుపు నింపే పనులు దొరక్క ‘బెగ్‌ బారో అండ్‌ స్టీలు’ మార్గాలననుసరిస్తున్నారు.

యువకుల్లో కొందరి దృష్టి తమ కామవాంఛల్ని తీర్చుకోవడానికే కాగా, మరికొందరి దృష్టి ప్రేమ పేరుతో ఆస్తి, నగా నట్రా వున్న ఆడవారిని వలలో చిక్కించుకుని, అవి అన్నీ దోచేసి, తరవాత చంపి అవతల పారవేసే పన్నుగడల మీదకు పోతోంది.

ఇంక రకరకాల మీడియాల మాట. నేటి విద్యార్థులు, విద్యార్థులు కానివారు కూడా లైంగికంగా దుర్మార్గపు, కిరాతక చర్యలకు పాల్పడేట్లు చేస్తున్న వినోద సాధనాల గురించి ప్రతి కుటుంబమూ, ప్రతి తల్లి దండ్రులూ గట్టిగా ఆలోచించాలి. వీటి దుష్ట ప్రభావాల నుంచి బిడ్డలను కాపాడుకునేందుకు గట్టిగా పూనుకోవాలి.

ఇప్పటి సినిమా నిర్మాతలు, టీ.వీ. ఛానళ్ల వారూ జనానికి అందిస్తున్నది వినోదం, ఆహ్లాదం కాదు; కేవలం అసభ్యత, చెడు విలువలు, చెడు సంస్కృతి! ప్రతి సినిమాకు ప్రేమ మాత్రమే కథా వస్తువు. ప్రేమ కథా నాయకా నాయికలు పదో తరగతి మైనరు ప్రేమికులు కూడా కావచ్చు!! హైస్కూలు నించీ కాలేజీ విద్యార్థుల వరకూ చదువుతో, భవిష్యత్తుతో పనిలేదు. వనాల్లో పార్కుల్లో, కొండ చరియల్లో గుండెల మీద, మొలమీద గుడ్డ పీలికల్తో, ఒళ్ళంతా గాలికి వదిలేసి, బూతు భంగిమ్మల్లో గంతులేసే ప్రియురాలిని కౌగిలింతల్లో ముంచడమే కథానాయకుడి అత్యవసర కర్తవ్యం. నాయిక తన సెక్సు అంగాలన్నింటినీ ఎంత నగ్నంగా ప్రదర్శించ గలిగితే అంత గొప్ప నటనా పటిమ గలదయినట్టు! కళాసేవ చేస్తున్నట్లు!

స్త్రీని ఎంత నగ్నంగా, ఎంత అసభ్యంగా ప్రేక్షకులకు చూపించగల్గితే అంత అధికంగా డబ్బు గెల్చుకోగలమన్న నీచభావన – సినీ పెట్టుబడి దార్లకుండవచ్చు. తమ మాన మర్యాదల్ని, వ్యక్తి పరమైన విలువల్నీ పణంగా బెట్టి డబ్బును అది లక్షల్లోనే గావచ్చు – సంపాదించే నీచానికి ఎందుకు, ఏం ప్రాణం మీదికి వచ్చిందని దిగాలి ఈ ఇంగ్లీషులో తప్ప మాట్లాడని నటీమణులు? వీరి వస్త్రాలంకరణల్ని కాపీ గొడుతూ, అతి సెక్సీగా మసలుతున్న యువతులు – కామోన్మాదుల్ని మరింత వెర్రెక్కిస్తున్నారు. తమ ఇష్ట ప్రకారం దుస్తులు ధరించే హక్కు, స్వేచ్ఛ తమకున్నదని వాదించడమెలాంటిదీ అంటే – మదమెక్కిన ఏనుగు ముందుకు నడిచి వెళ్లడం వంటిది.

కుటుంబంలో, సమాజంలో స్త్రీల ప్రతిపత్తిని, అస్థిత్వ గౌరవాన్ని, విలువలను పరిరక్షించే కృషిలో నిమగ్నమై యుండే స్త్రీ వాదులకు, కళ, వినోదాల ముసుగులో దోపిడీ కాబడుతున్న స్త్రీల శారీరక మానసికపరమైన విలువల పట్ల శ్రద్ధ చూపవలసిన బాధ్యత వుండాలి, వుండి తీరాలి. మరి స్పందనేది? జనం ముందు ప్రదర్శిస్తున్నది. ఆ ఒక్క తారనే గాదు, స్త్రీ జాతి మొత్తాన్ని!

సినీ పరిశ్రమ దారులు పాలక నేతలకు ఎన్నికల తరుణంలో విరాళాలుగానూ, ఇతర సందర్భాలలోనూ అందించే కోట్ల ధనం వల్ల ఆ నిర్మాతలు ఎంత అశ్లీంగానూ, అసభ్య దృశ్యాలతోనూ, ద్వంద్వ సంభాషణలతోనూ చిత్రాలు తీసి జనమ్మీదికి వదులుతున్నా ఏలికలు పట్టించుకోరు. సమాజం. సమాజం అది చూడలేక సిగ్గుపడుతున్నా, యువజనం వెర్రెక్కి కిర్రెక్కి పెడదారులు పడుతున్నా ప్రభుత్వానిది అంధ బధిర స్థితే. వినోదం పన్ను మంచి రెవెన్యూ ఒనరు అన్న యావే సెన్సారు బోర్డు మాత్రం ‘నామ్‌ కే వాస్తు’ బోర్డుగా గాక ఇంకెలా వుంటుంది?

ఇప్పుడిస్తున్న చిత్రాల విషయంలో మేధావి వర్గాలవారు, విద్యార్థులకు యువకులకు ఇస్తున్న సలహాలు, ఓదార్పులు బహు చిత్రంగా వుంటున్నాయి. సినిమాల్లోని అశ్లీల హింసాత్మక సన్నివేశాలను వదిలేసి, వాటిలో మంచినే గ్రహించాలట? అసలు మంచి అంటూ వుంటేనా? హంసలకు మల్లే నీటినీ పాలనూ వేరుచేసి గ్రహించగల శక్తి మానసిక పరిణతిని ఇంకా పొందని కౌమార యౌవ్వన దశలో వున్న యువకులకుంటుందా?

సమాజ జీవితాన్ని అల్లకల్లోల పరిచి, యువతరాన్ని భ్రష్టులుగా మార్చుతున్న మరో ప్రభుత్వ విధానం గురించి ఎంత చెప్పుకున్నా తీరదు. దేశం స్వతంత్రమయ్యింది లగాయితు, ఇప్పటి వరకూ, దేశాన్ని పాలించి నడుపుతున్న వారంతా గాంధీ భక్తులే. ప్రజాహితమైన ఆయన బోధనలనూ, ఆదర్శ ఆశయాలనూ అనుసరించుతున్నా మంటున్న ప్రజా నేతలే. కానీ, ఆయన తన జీవితాంతం సాగించిన మద్యం వ్యసన వ్యతిరేక పోరాట ఉద్యమాన్ని మాత్రం పూర్తిగా సమాధి చెయ్యగలరు. మధ్య వ్యసనానికి ప్రాణం పోసి జనమందరికీ అందించగలరు. మద్యం అమ్మకాలు ఎంత అధికంగా చేయగలిగితే, అన్ని ఎక్కువ ప్రమోషన్లను అబ్కారీ ఉద్యోగులకు ప్రసాదించగలరు. యావత్తు సమాజాన్నీ మద్యం మత్తులో ముంచేయడం గాంధీజీ నత్‌ చింతనను నెరవేర్చినట్లు!

ప్రభుత్వ ఖజానాను నింపడానికి ప్రజలంతా త్రాగుబోతులవ్వాల్సిందే. తమను ప్రేమించ నిష్టపడని అమ్మాయిలను రేప్‌ చేసి, చంపిపారేస్తున్న కుర్రాళ్ళలో తాగుబోతులే ఎక్కువ. వాళ్ళేనా, తాగుబోతు తండ్రులు, అన్నలు సయితం కన్న కూతుళ్ళమీద, తోడబుట్టిన చెల్లిమీద అత్యాచారాలకు పాల్పడుతున్నారే!

ఒక పక్క మద్యం అమ్మకాల టార్గెట్లు ఏడాదికేడాదికి పెంచడం, మరొక పక్క మద్య వ్యతిరేక ప్రచార కమిటీని ఏర్పరచి నడపడం!! పేకాట వల్ల సమాజం పాపం – ఎంతో నష్టపడుతుందన్న దిగులుతో పేకాట రాయుళ్ళమీద పోలీసు దాడులు, అరెస్టులు?… తాగుబోతు యువకులు అత్యాచారాలకు దిగడంతోనే ఆగడం లేదు. తాగుడుకు డబ్బులివ్వని అమ్మల్ని నాన్నల్ని చంపేస్తున్నారు. తాగి గొడవపడి, ప్రాణ స్నేహితుల్ని హతమారుస్తున్నారు. పత్రికల నిండా యిలాంటి ఉదంతాలు ఎన్ని రావడం లేదు. మన ప్రజా ప్రభుత్వం స్వయంగా తలపెట్టి ఉద్యమ స్థాయిలో నడుపుతున్న మద్య వ్యాపారం అది అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఓ ప్రధాన సంక్షేమ కార్యక్రమమని అనుకుందామా!

ఇంతవరకూ చెప్పుకున్న రకరకాల కారణాలు, పరిస్థితులు, ఆడపిల్లల హత్యల్ని రోజురోజుకు పెంచుతున్నాయి. ఫలితంగా వారి సంఖ్య బాగా తగ్గిపోతున్నది. ఆడపిల్ల పుట్టడమే అనర్థకమని భయపడి పిండదశలోనే చిదిమివేసే పరిస్థితులు, పుట్టిన పసికందుల్ని చంపి పడేసే అమానుషం! ఇందుకు దారిదీస్తున్నది ప్రధానంగా ఆర్థిక దుస్థితి. ఆడపిల్ల పెళ్లికివ్వాల్సిన కట్నాల బేరసారాల భయం.

ఆడపిల్లకు చట్టరీత్యా దఖలు పడ్డ ఆస్తిహక్కు, ఆమె చదువు, ఉద్యోగస్థాయి, వీటికి తగ్గ సంబంధాలు గాక లక్షల లక్షలు పోసి గొప్ప అంతస్థు వ్యక్తి కిచ్చి చేయాలనే అత్యాశ. మనిషి రుచి మరిగిన పులికి మల్లే – అతను అదనపు కట్నం కోసం నెల తిరక్కముందే నవ వధువుల్ని చంపేసే క్రూర చర్యలకు దారి దీయడాన్ని గుర్తించరెందుకు కన్నవాళ్లు!

చివరగా మన సాంఘిక నీతి ధర్మాల గురించి కొంచెం గుర్తు చేసుకుందాం. ఆడపిల్ల పెంపకంలో, సమాజంలో ఆమె మెలిగే రీతిలో ఎంత వివక్ష, ఎన్ని ఆంక్షలు! ఆడపిల్ల భర్తకు మాత్రమే గాదు, అన్నదమ్ములకూ సేవకురాలు. మగబిడ్డ మగరాజయితే, ఆడపిల్ల అంట్లముండ. ఆడది తిరిగి చెడితే మగాడు తిరక్క చెడతాడు. భార్యకు పాతివ్రత్యం, భర్తకు బహు స్త్రీల బాంధవ్యం, మన అపూర్వ ప్రాచీన ధర్మం. ఈ ధర్మం ప్రకారమే మన దేవుళ్ళకు ఇద్దరేసి భార్యలు. ఈ దేవుళ్లు సుమతి నర్మదల లాంటి పాతివ్రత్యాల్ని పరీక్షించి వారి భర్తల్ని రక్షిస్తారు. అనసూయచేత పూర్తి నగ్న రూపంలో ఇనుప గుగ్గిళ్ళు వండించి, ఆరగించి, ఆమె ఆ పనిని వారి ఆదేశానుసారం నెరవేర్చినందుకు సంతోషించి, ఆమె పాతివ్రత్యాన్ని దత్తాత్రేయలుగా అవతరించి నిర్ధారించుతారు.

ఇంద్రుడు అహల్యను భంగపరచడం, లీలావతిని చెరబట్టి తీసుకుపోవడం దగ్గర్నుంచి, ఇటు ద్రౌపదీ వస్త్రాపహరణం వరకూ జరిగిన సంఘటనలు. ఈ నాటి స్త్రీల హింసకు, అణచివేతకు, అకృత్యాలకు ప్రాచీన కాలంనించీ వేసిన బలమైన, వివక్షల పునాదులు. ఇలాంటి దురంతాల కొనసాగింపు ఢిల్లీలో నిర్భయ దుస్సంఘటన. అనుదినం దేశం అన్ని దిక్కులా నిస్సిగ్గుగా జరుగుతున్న అత్యాచారాలు, ఆ పైన హత్యలు.

ఇప్పటికీ – కుటుంబంలో, సమాజంలో స్త్రీ పురుషులకు అమలవుతున్న వేర్వేరు నీతులు, లింగ వివక్ష ఏదీ పట్టని ప్రభుత్వ అలసత్వ పాలన, సంక్షుభిత సమాజ పరిస్థితులు. ఇవన్నీ గూడి, యువతను పతన దశకు నెట్టడం లేదా?

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.