‘సాహిత్య సమాలోచన’లో అందెవేసిన చెయ్యి ఆశాజ్యోతి

మల్లవరపు విజయ

ఈ వసుదైక సాహితీ స్రవంతిలో ఎందరో రచయితలు, వ్యాసకర్తలు, కవులు, భాషాపరమైన లిపి మొదలైన క్షణం నుండి అక్షర రూపాల్లో పొందుపరిచిన వారి భావాలు కోకొల్లలు. పోతన, కాళీదాసు నుండి ఈనాటి అక్షర శిఖామణులు, వేమన, విశ్వనాథ, దుర్గానంద్‌, శ్రీశ్రీ, జాషువాల వరకు తెలుగు సాహితీ ఉద్యానవనాన ఆవిర్భవించి, అక్షర సముద్రాల జ్ఞానాన్ని పంచి అస్తమించిన సూర్యులు… ఆ జ్ఞాన సముద్రాలను ముందుకు నడిపిస్తున్న నేటి మేటి సాహితీ మాణిక్యాలు ఎందరో! అనేక సామాజిక రుగ్మతలను రూపుమాపే దీర్ఘ కావ్యాలు వ్రాసి వాసికెక్కారు.

మనలో కలిగిన భావాలు ఒక లయాత్మక దిశగా నడిపించడమే సాహిత్యం. మనిషికి – సమాజానికి మధ్య వారధిగా వుండి మానవ సంబంధాలను బలపర్చేవాడే కవి, సగటు మనిషి జీవితాల నుండి ఈనాటి గ్లోబలైజేషన్‌ వరకు ఎన్నో అంశాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు.

1) ”తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవయిత్రుల”లో పురాణాల నుంచి నేటి ఆధునిక కాలం వరకు స్త్రీలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యల గురించి రచించి, స్త్రీలకు మనోధైర్యాన్ని కలిగించారు. స్త్రీలను జాగృతి పరిచే విధంగా ఎంతోమంది కవయిత్రులు తమ తమ రచనలను స్త్రీ సమాజానికి అందించి ఉన్నత స్థానాన్ని పొందగలిగారు.

అభ్యుదయాత్మక దశకంలో కూడా! వీరేశలింగం పంతులు, గురజాడ వంటి సాహితీ వేత్తల – సాహిత్యం, స్త్రీలలో చైతన్యాన్ని కలిగించాయనటంలో అతిశయోక్తి లేదు.

2) స్త్రీవాద కవిత్వం – తీరు తెన్నుల్లో – కొన్ని దశాబ్ధాల తర్వాత మహిళా చైతన్యం అక్షరమై సాహిత్యంలో నిశ్శబ్ద సమరాన్ని ఛేదిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ తనచుట్టూ వున్న సంకెళ్ళను తెంచుకొని వెలుపలకు రాగలిగింది.

డా||కె.ఆశాజ్యోతిగారు స్త్రీల చైతన్యం కోసం అనేక గ్రంథాలు అధ్యయనం చేసి, స్త్రీ విముక్తి, స్త్రీ సంపూర్ణ భద్రత, స్త్రీ చైతన్యం, స్త్రీ వికాసం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ స్త్రీవాద కవయిత్రుల నుండి అనేక అభ్యుదయ రచనలను సేకరించి అందులోకి పరకాయ ప్రవేశం చేసి, సమ సమాజ అభ్యుదయాన్ని కాంక్షించే రచనలు రాయాలంటూ వర్ధమాన రచయితలకు సహితం మార్గదర్శకాన్ని చూపుతున్న వీరు నిజంగా అభినందనీయులు.

3) బోయి భీమన్నగారి ”గుడిసెలు కాలిపోతున్నై” వచన కవితా సంపుటిని గురించి ప్రస్తావిస్తూ ఆయన అభ్యుదయ మార్గంలో నడచి, యువ చైతన్యం ద్వారా భావ విప్లవం, జాతి సమైక్యత, కుల నిర్మూలన, సమ సమాజ స్థాపన కొరకు పాటుపడి యువకుల్లో చైతన్యం తెచ్చిన దళిత కవిగా కీర్తిల్లాడని, గుడిసెలు కాలిపోవడమంటే దేశానికి అంగవైకల్యం వచ్చినట్లేనని, గాయపడ్డ సమాజం ఎప్పటికీ అభ్యుదయ బాటలో నడవలేదు, అన్నిట్లోనూ నిర్వీర్యమైపోతున్నట్లు అర్థమని విశ్లేషిస్తుంది. కాని బోయి భీమన్నగారు కోరుకున్నది అది కాదంటూ, గుడిసెలు కాలిపోవడమంటే! కాలిన ఆ చితి మంటల నుండి కొత్త వెలుగులు ఆవిర్భవించి, సమ సమాజావిష్కరణ జరగాలని కవి తపనని తెలియజేస్తూ, ఎందులో పదాన్ని కదిపినా సమాజం పట్ల గౌరవం, అసమానతల పట్ల తిరస్కారం, అడుగడుగునా ఆయన కవితల్లో కనబడిన విధానాన్ని ఆ మంటల చితి నుండి వెలుగు రేఖలు విచ్చుకోవాలని ఆశాజ్యోతిగారు రాసిన విధానం అద్భుతంగా వుంది.

4) పంచమ స్వరం – దళిత తత్త్వ నిర్దేశనంలో అక్షరం ఆయుధమై అనుక్షణం మనిషికి మనోధైర్యాన్ని కలిగిస్తూ శక్తినిస్తుంది అనేది అక్షరాలా నిజం. బోయి భీమన్నగారి కలానికి అద్భుతమైన శక్తి వుంది. అందుకే దళితుల గురించి అణగారిన ప్రజల గురించి తన హృదయ కుహరంలో నిక్షిప్తమై ఉన్న భావాలను, కవితలుగా, పద్యాలుగా కూర్చారు. అవి పాఠకుల మనస్సులలో గూడుకట్టుకొని దివిటీలుగా నిలిచి వెలుగునిచ్చాయి. బోయి భీమన్నగారు రచించిన ‘పంచమ స్వరం’లో ఆయనలోని ఆవేదన ఎవరి మనస్సునైనా కదిలిస్తుంది! నిజమే రాక్షస రాబందులు రాజ్యమేలుతున్న ఈ సమాజంలో ధనికులు ఎప్పుడూ ప్రగతికి నిరోధకాలే. కాని బోయి భీమన్న గారు అంకిత భావంతో పోరాడుతూ తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తేగలిగారు.

ఆశాజ్యోతిగారు ఇంత చక్కని పుస్తకాన్ని పాఠకులకు అందించినందుకు సంతోషంగా వుంది. సాహిత్యంలో సమాలోచన ద్వారా బోయి భీమన్నగారు రచించిన రచనల గురించి తెలుసుకొనే అవకాశం పాఠకులకు మీ ద్వారా లభించినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

5) బోయి భీమన్న ‘డ్రగ్‌ ఎడిక్టులు’ – కావ్యం యాభై ఆరు కవితల కుసుమ గుచ్ఛం, ఇందులో మతాన్ని ప్రధానాంశంగా ఎన్నుకొన్నారు. ఇందులో ‘డ్రగ్గు’ని దేవునితో ‘ఎడిక్టులను’ మతవిశ్వాసులతో పోల్చారు. మనిషికి స్వంత ఆలోచనలు నశించాయని వాపోతారు. మూడోకన్ను తెరిస్తే ముల్లోకాలను భస్మం చేయ్యగల శివుడు తన విగ్రహాన్ని గజనీ ఒక్క దెబ్బతో ముక్కలు ముక్కలు చేస్తే తనేం చెయ్యగలిగాడని దేవణ్ణి పరిహసిస్తూ, ఆ దేవుణ్ణి పూజిస్తున్న భక్తులూ తిలోదకాలు పలికారని వ్యంగ్యోక్తులు చల్లుతూ, ‘కోటి విద్యలు…. శతకోటి ఉద్యోగాలు… అనంతకోటి ప్రణాళికలు…. ఇది మానవ జీవితం…. దీనికి దేవుడక్కర్లేదని’…. ఘంటాపథంగా చెబుతాడు. సమాజంలో మానవత్వాన్ని అభిలషించిన వాడు బోయి భీమన్నగారు. విద్య యొక్క ఔన్నత్యాన్ని ఎరుకపరుస్తూ కుల నిర్మూలన కావాలని ఎలుగెత్తి చాటిన ధైర్యశాలి, ఆ కవి పుంగవుడు. ఆ మహాశయుని కవిత్వంలో రస గుళికలు రాల్తాయి, అగ్ని పూల విస్ఫోటాలు పఠీల్‌మని పేల్తాయి… అందుకే అతడు సంపూర్ణ మానవతావాది అయ్యాడు. మనుషుల హృదయాల్లో చిరంజీవిగా మిగిలాడనే రచయిత్రి భావావేశం కడు ప్రశంసనీయం.

అట్టడుగు చట్రాల నుండి, కులీన వ్యవస్థనుండి అంచెలంచెలుగా ఎదిగి, విస్తార సాహితీ సేవా దళితుడిగా గుర్తింపు పొంది, ఒక జాషువా, ఒక బోయి భీమన్న, ఒక కొలకలూరి ఇనాక్‌ అనిపించుకున్న కవికుల దిట్ట కొలకలూరి ఇనాక్‌ గారు, అతని సాహిత్యంలో స్త్రీవాద దృక్పథం, బహుజనవాద దృక్పథం, దళిత జీవుడి వేదనా తత్త్వం గూడు కట్టుకొని ఉన్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. రచయిత్రి ప్రస్తావిస్తున్నది వాస్తవమే కథకులు, కవులు, నాటక కర్తలు, నావలిస్టులు, వ్యాసకర్తలు అందరూ కనుమరుగవుతూ ఉంటారు. మళ్ళీ పుడుతూ ఉంటారు. కాని సాహిత్యం ఎప్పటికీ నిలిచి పోతుంది. దానికి మరణం లేదు. ‘ నా ప్రేమకు శబ్ధం లేదు – నా వేదనకు నిశ్శబ్ధం లేదు’ అన్న ఇనాక్‌ గారి ఉవాచ ఎవరి గుండెనైనా తడుతుంది. ‘నా కన్నీటి బొట్లు నా రచనలు’ అన్న అతని మాటలు గుండె లోతుల్లోంచి, బతుకు నిశీధాల్లోంచి, గతికిన అనుభవాల్లోంచి వచ్చాయని తెలియజేస్తాయి.

‘పైసా లేనివాడు… పైగా హరిజనుడు… ప్రధానమంత్రి కాగలిగి… ఐదేళ్ళూ పదవిలో ఉండి…. పైసా లేకుండా… పాత మనిషిగా… బతగ్గలిగిన్నాడు…. భారత దేశం బాగుపడ్డట్టు’ అట్టడుగున సమాజపు పునాదుల్లోకి తొక్కబడుతున్న నాటి దీన స్థితిని చూచి, హృదయం ద్రవించి, దళితుడి అభ్యున్నతిని ఆశించిన అతడు నిజంగా మహనీయుడని, అతని భావాలు, పంథాలు, సాహిత్యం, చెప్పకనే చెబుతున్నాయి. ‘హ్యాట్స్‌ ఆఫ్‌ టు ఇనాక్‌’ గారికి ఒక కవిగా, ఒక కథకుడిగా, ఒక నాటక రచయితగా, ఒక నావలిస్టుగా, విభిన్న ప్రక్రియల్లో తన కవన ప్రతాపాన్ని చాటి, దళితులు, స్త్రీల, అభ్యోన్నతికి పాటు పడుతూ ముందుకు సాగుతున్న అతనికి నా సాహితీ అభినందనలు. తండ్రిని గురించి కూతురు విశ్లేషించిన తీరూ అభినందనీయమే.

ఆశాజ్యోతిగారు కన్నడ భాష, ప్రాచీన కన్నడ సాహిత్యాన్ని అనువాదం గావిస్తూ దానిపై పరిశీలనాత్మకమైన భావ వ్యక్తీకరణ చేస్తూ, ఇరుగు పొరుగైన ఆంధ్ర, కన్నడ రాష్ట్రాలు ఎప్పటి నుండో కలుగొలుపుగా ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాల భాష వేరైనా, జీవన శైలిలో మార్పు లేదని చెబుతున్నారు. సరిహద్దుల్లో ఒక భాష ప్రభావం మరో భాషపై ఉండటం అనివార్యమంటున్నారు. భాషాపరంగా ప్రస్తావిస్తూ కరు+నాడు = కర్నాడు అంటే నల్లని ప్రాంతమని. అదే కాలానుగుణంగా ‘కర్నాటక’గా మారిందని అలాగే బెంద + కాళు + ఊరు = బెందకాళూరు అంటే బాగా ఉడికిన దినుసులు కరిగిన ఊరుగా విపులీకరిస్తూ ఈ పదమే కాలక్రమేణా ‘బెంగుళూరు’గా మారి ఉండవచ్చని శబ్ధోత్పత్తి శాస్త్రకారుల ఉవాచని మనకందిస్తున్నారు. వైవిధ్య జీవన విధానాన్ని నామ విచారణ సామాజిక, భౌగోళిక నేపథ్యాన్ని వివరిస్తుందని వారి భావన, స్థల నామాలు మానవ జాతి చైతన్యానికి ప్రతీకలని, వ్యక్తి నామాలు సంస్కృతీ ప్రతిబింబాలని స్పష్టీకరిస్తున్నారు. 12వ శతాబ్ధంలో శైవమత సంస్థాపకులైన బసవేశ్వరుని ప్రశంసిస్తూ అతడు మానవ సమానత్వాన్ని ప్రబోధించిన ప్రవక్తని, అతని భావాలు జనసంద్రంలోకి వెళ్ళడానికి ‘వచన’ ప్రక్రియనే మాద్యమంగా స్వీకరించి అక్కమహదేవి, నీలాంబిక, గొగ్గమ్మ, ముక్తాయమ్మ లాంటి ఎందరో స్త్రీలను ప్రభావితం చేసి కవియిత్రులుగా తీర్చిదిద్దిన ఘనత బసవునిదేనని నొక్కి వక్కాణిస్తున్నారు.

కన్నడ సాహిత్యంలో బీజావాపనం సంస్కృత మూలాలు నుండే జనించటం వల్ల ప్రాథమిక సాహితీ రచన అనువాదం నుండే ఉద్భవించి ఇది శిష్ట సాంస్కృతికమే కాక పితృస్వామ్య భావజాల వాహికగానూ సాగిందని, కనుకనే స్త్రీని ఈ సాహిత్యంలో పాపకర్మ ఫలాంశంగా వర్ణించబడిందని వాపోతారు. రత్న త్రయంగా పేరొందిన రన్న, పొన్న, పంప, సమాజానికి దిగుమతి చేసిన స్త్రీ రూపం పితృస్వామ్య భావజాల నమూనాలేనని అభిప్రాయపడుతున్నా జమిలిగా ప్రాచీన కన్నడ సాహిత్యంలో స్త్రీని ఒక బేలగా, సాధ్విగా, గయ్యాళిగా, జారిణిగా చిత్రిస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని మరుగు పరిస్తే, అదే వచన సాహిత్యంలో రాణించిన కవయిత్రులు స్త్రీ ఆలోచించగలదు అనే విషయాన్ని నిరూపిస్తూ నాటి సమాజంలో కొత్త గాడ్పును సృష్టించారని రచయిత్రి తెలియజేస్తున్నారు.

12 వ శతాబ్ధి అక్కమాదేవిని గూర్చి రాస్తూ రచయిత్రి ఆమె సమాజగతంగా తొడిగిన సంకెళ్ళను ఛేదించుకొని విశ్వ కుటంబీకురాలైందని కొనియాడుతున్నారు. మరో కవయిత్రి హోన్నమ్మ గురించి ప్రస్తావిస్తూ స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం ఎందుకని ఆనాడే ప్రశ్నించిన తీరును అభినందిస్తున్నారు. అలాగే సత్యక్క స్త్రీ పురుషులను శరీరాకృతులతో కొలవండనే విధానాన్ని, నీలమ్మ స్త్రీ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వైనాన్ని, దళిత కవయిత్రి గొగ్గవ్వ స్త్రీ పురుషుల మధ్య అసమానతలని, అనైతికతను దుయ్యబట్టిన తీరును వర్ణిస్తూ వారి ఆర్తి, కృషి సార్వజనీనమై ఇప్పటికీ నిలిచి వుండటానికి వారి అభ్యుదయ భావజాల సాహిత్యమేనని ప్రశంసలను కురిపిస్తున్నారు.

ప్రముఖ కవులు బోయి భీమన్న మరియు కొలకలూరి ఇనాక్‌ గార్ల సాహితీ సంపత్తిని, విశిష్టతనీ, పరిణతిని, ప్రజా జీవన స్రవంతి, బంగారు వెన్నులీనుతున్న వారి భావాలను వెలికి తీసి చూపించిన ఆశాజ్యోతి గారి ప్రయత్నం బహుముఖ ప్రశంసాదాయకం, అలాగే ప్రాచీన – ఆధునిక కన్నడ మహిళల స్థితిగతులను పురుషాధిక్య పదఘట్టనల క్రింద నలిగిన వారి జీవితాలు, కార్చిన కన్నీరు కళ్ళకు కట్టినట్లుగా ఈ పుస్తకంలో విశదీకరించిన తీరు కొనియాడదగింది. ఇవేగాక కన్నడ మరియు ఆంధ్ర సాహిత్యాన్ని సమన్వయించి చెప్పిన మీ కథనం వైశిష్ట్యాన్ని సంతరించుకుంది. ఆశాజ్యోతి గారి కలం చిందించిన సిరా, పాఠకుల ముందు పరచిన వారి భావాలు పఠితుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాయని ఆశిస్తూ… అభినందిస్తూ…..

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో