– కోటం చంద్రశేఖర్
మానవతే మాయం
అత్యంత హేయం
కుళ్ళిన చర్య; దారి
మళ్ళిన చర్య –
మగాడైతే గర్వమా
మృగాడై కీచకపర్వమా –
పదేపదే ఆవిష్కృతం
పదేపదే పునరావృతం –
ఇది
‘అణుకువ అణచివేత’లో గాయపడ్డ ఒక గులాబి కథ-
‘ఆత్మాభిమానం గుండెకోత’లో రాలిపడ్డ ఒక గులాబికథ
చేతులు కలుపుకొని, పెదాలు కలుసుకోమనే ‘పబ్బులు’ వెలుస్తున్నంతకాలం
పెళ్ళికాకుండానే ‘సహజీవనం’ సబబేనని
నవజీవనం సహజమేనని కోర్టులు చిలుక పలుకుల్లా వల్లిస్తున్నంతకాలం
మీసాలు తిప్పుతూ మోసాలు చూపుతూ
హీరోలను ఉత్పత్తి చేస్తున్న సినీ మీడియాలు మొలుస్తున్నంతకాలం
విశృంఖలాన్కి విష సంస్కృతికి
దోహదపడుతున్న మిడ్నైట్ మసాలాలతో ఛానల్స్ పిలుస్తున్నంతకాలం
ఇవన్నీ మామూలే-
విలువలు వలువలు జారుతూ షరామామూలే-
నిషేదిద్దాం అసాంఘిక మాటల్ని –
ఉరితీద్దాం అనాగరిక పాటల్ని –
లాభదృష్టి కామసృష్టేనా
ద్రోహచింతన స్వార్థభావనేనా
సహకారం మమకారంతో సాగుదాం
సంక్షేమం సంరక్షణ స్త్రీకి అందిస్తూ ముందుకు సాగుదాం.
(లైంగిక దాడితో సఫ్దర్జంగ్ ఆసుపత్రిలోని బాధితురాల్కి)