– డా. బండారి సుజాత
ఆడువారి మాటలకు అర్థాలు వేరంటు
అందమైన జీవితానికి అర్థమే లేదంటు
మగవారి చేతులలోనే స్త్రీ జీవితముందంటు
చెప్పకనే చెబుతున్నవీ శ్రీరంగ నీతులు
అంచెలంచెలుగా ఎదిగినవి స్త్రీ జీవితాలు
ఆదినుండి ఆడంబరం పురుష జీవితాలు
ఇకనైన మారండి ఓ తల్లీ, తండ్రి
సమానంగా పెంచండి మీ సంతానాన్ని
ఆడపిల్ల పుట్టితే అక్కడిదే అనుట మాని
ఆప్యాయతకు నెలవాయె చిరునామయని
వంశాంకురం కొరకు వరాలు పట్టుట మాని
ఆడైనా మగైనా అసమానత మాని
మానవత్వపు విలువలతో మనిషిగ పెంచండి
విలువలతో పెంచండి విజ్ఞతను నేర్పండి
తోడివారి జీవితాలు తెలిపి మరీ పెంచండి
తల్లి, చెల్లి, తనయ, చెలి అందరూ ఆడవారె
ఆడవాళ్ళు లేని బ్రతుకు లేదంటు తెల్పండి
క్రూరత్వపు టాలోచనల కులహీనుడు మనకొద్దు
కారుణ్యపు టాలోచనల కరుణామూర్తి కావాలి
పెంపకంలో తేడా లేక పెంచి చూపించండి
తన, పర బేధాలు లేని తనయులు కావాలి మనకు
ఆడపిల్ల రక్షణకు ఆది మనం కావాలి
మానవత్వపు పరిమళాల మార్గాన్ని చూపాలి
భావి జీవితాలకు మనం భద్రత కల్పించాలి. Cialis