– డా|| జరీనా బేగం
కళ కళ్లాడుతూ కలియ తిరుగుతూ
ఇంటికే కళ వచ్చినట్లు
ఇంటి లోగిలిలో మందారాలే విచ్చుకున్నట్లు
మల్లెలు విరుస్తున్నట్లు
కబుర్లతో అమ్మచుట్టూ పెనవేసుకుంటూ
మురుస్తూ ముద్దులొలుకుతూ
తూనిగలా ఝుమ్మంటూ
అమ్మ చేతిలో పని నందుకుంటూ
అంతవరకు నిశ్శబ్దంగా వర్షించే
మేఘాల్లా బరువుగా కదుల్తున్న
కాలాన్ని, గలగలా నవ్వుతూ
మెరుపులా వెలుగుతూ
ఆనందంగా, వర్షిస్తున్న మేఘాల్లా
తేలిపోతూ, చల్లటి నిశ్చింతనూ
మెల మెల్లగా మనసునంతా నింపుతున్నట్లు
ఎంత ప్రశాంతత ఈ కూతురి రాక
తన ఈ అల్లరిలో ఎంత నిశ్చింత
ఈ గల గలల సవ్వడిలో ఎంత హాయి
ఈ తీపి కబుర్లలో సంగీతంలో
ఇంటి లోగిళ్ళు వసంతాలని స్వాగతించినట్లు
పందిళ్ళలో పూల తోరణాలు కట్టినట్లు
పెళ్ళిళ్ళల్లో మంగళ వాయిద్యాలు మోగినట్లు
నీ రాక ఓ పర్వదినాన్ని తెచ్చినట్లు
నీ రాక ఓ మధుమాసాన్ని మోసుకొచ్చినట్లు
నీ రాక గులాబీల గుభాళింపును వెదజల్లినట్లు
నీ రాక ఓ ఆత్మీయ స్పర్శ
నీ రాక ఓ మమతల మోన ప్రకంపన Cialis Online