– కోపూరి పుష్పాదేవి
సైకియాట్రిస్టు డా. చంద్రిక ఎదురుగా అసహనంగా, అనాసక్తంగా కూర్చుని ఉంది సన్నిహిత. పక్కన కూర్చున్న ఆమె తల్లి అరుంధతి ఆందోళనగా డాక్టరువైపు చూస్తోంది.
”ఆఁ చెప్పమ్మా… ఏమిటి నీ సమస్య?” అడిగింది డాక్టరు. తను చూస్తున్న మెడికల్ జర్నల్ పక్కనపెట్టి సన్నిహితవైపు చూస్తూ.
”అదీ… అమ్మాయి” అంటూ చెప్పబోతున్న అరుంధతిని చేతి సైగతో ఆపి ”నువ్వు చెప్పమ్మా… నీ పేరేమిటి? ఏమిటి నీ ఇబ్బంది?” అడిగింది సన్నిహితను ఆసక్తిగా గమనిస్తూ.
సన్నిహితలో ఉలుకూపలుకూ లేదు. వంచిన తలను మరింత క్రిందికి దించి చేతిగోళ్ళను పరీక్షగా చూసుకుంటోంది.
”ఓహో… నీ పేరు సన్నిహిత. ఇదిగో ఈ ఫైలు మీద రాశారు. చాలా బాగుంది నీ పేరు. ‘సన్నిహిత’ అంటే అందరికీ సన్నిహితంగా మసలుతూ ‘అందరి మనిషివని’ అన్పించుకుంటావన్నమాట… సరేసరే నీ బాధ ఏమిటో చెప్పు.”
అప్పటికీ సన్నిహిత నోరు విప్పలేదు. వంచిన తల ఎత్తలేదు.
”నీ సమస్య ఏమిటో నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? తెలియకుండా నేనెలా వైద్యం చెయ్యగలను?” అన్నది డాక్టరు. మనసులో ”ఈ అమ్మాయి ఎంత బాగుంది…! ఆడవారికే మోహం కలిగేటట్లు. తను చాలామంది అందమైన ఆడవాళ్ళను చూసిందిగానీ, ఇంత అపురూప లావణ్యవతిని ఇంతవరకూ చూసి ఎరుగదు. పచ్చని ఆమె కంఠసీమలో మంగళసూత్రం, నల్లపూసల గొలుసులు మరింత అందంగా తళుకులీనుతున్నాయి.
”ఈమె నవ్వితే పువ్వు విచ్చుకుంటున్నట్లూ, పలికితే పసిపాప నవ్వినట్లూ ఉంటుందేమో…” సన్నిహిత రూపం డాక్టరులోని భావుకతను మేలుకొల్పింది.
డాక్టరు ఎంతగా అడిగినా, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సన్నిహిత మౌనం వీడలేదు. డాక్టరు వంక కన్నెత్తి కూడా చూడలేదు.
ఇక లాభం లేదనుకుని ఆమెను పక్కగదిలో కూర్చోమని చెప్పి అరుంధతిని అడిగింది డాక్టరు, ”అసలు అమ్మాయి సమస్య ఏమిటని…?”
అరుంధతి చెప్పడం మొదలుపెట్టింది.
”ఇది నా రెండో కూతురు. స్టెల్లా కాలేజ్‌లో యమ్.బి.ఏ. చేస్తోంది. మంచి తెలివైంది. శ్రద్ధగా చదువుకునేది.
ఆరునెలల క్రితం అంతర్ కళాశాలల వక్తృత్వ పోటీలకంటూ హైదరాబాద్ వెళ్ళింది. అక్కడ ఎమ్.సి.ఏ., చేస్తున్న అరవింద్ పరిచయమయ్యాడు.”
జ జ జ
విసుగు, విరామం లేకుండా మోగుతున్న సెల్‌ఫోను గాఢనిద్రలో ఉన్న సన్నిహితను లేపేసింది.
విసుగ్గా సెల్ అందుకున్న సన్నీ చిరాకు మంత్రం వేసినట్లు మాయమైంది.
”హాయ్ అరవింద్… ఇప్పటిదాకా కలలో నువ్వే…, ఇప్పుడు సెల్‌లోనూ నువ్వే… నీకింకేమీ పనీపాటా లేదా…?” అడిగింది లేచి కూర్చుంటూ.
”అవును అందాలభామా… నా పనీ నువ్వే…, నా పాటా నువ్వే… అది సరేగానీ మొద్దూ… అసలు నిద్ర ఎలా పడుతోంది నీకు? నాకైతే నిద్ర రావడం లేదు, ఆకలి వెయ్యడం లేదు, చదువుకోబుద్ధి కూడా కావడం లేదు. అసలు నిన్నేం చేసినా పాపం లేదు. హాయిగా, మంచిగా చదువుకునేవాణ్ణి, నాకు ప్రేమజబ్బు అంటించావు, వేధించుకు తింటున్నావు.”
”నేనేం చేశానమ్మా. పాపం… అసలే నేను అమాయకురాలిని. చేసిందంతా నువ్వుచేసి అభాండం నామీద వేస్తున్నావు. ఇక్కడ నా చదువు సాగక నేను అల్లాడుతుంటే…”
”ఎవరే ఫోనూ? అంటూ అక్క సంజన గదిలోకి రావడంతో మళ్ళీ మాట్లాడతాలే” అంటూ ఫోన్‌కాల్ కట్ చేసి, ”అరవింద్ అక్కా…, పాపం ఆకలి వెయ్యడం లేదట, నిద్ర పట్టడం లేదట, చదువు బుర్రకు ఎక్కడం లేదట… నవ్వుతూ చెప్పింది సన్నిహిత.
”ఇక్కడ నీ పరిస్థితీ అదేగా…, అయినా ఇంకెన్నాళ్ళులే. రేపు నెలలో నా డెలివరీ అవగానే మీకు మూడుముళ్ళూ, మీ విరహాలకు వీడుకోళ్ళూ…” అన్నది సంజన ప్రేమగా చెల్లెలి తల నిమురుతూ.
”పో అక్కా…, అరవింద్ కోసం నేనేమీ అంతగా కలవరించిపోవడం లేదు. అతనే…”
”అంతగా ప్రేమించేవాడు దొరకడం నీ అదృష్టమే. ఎన్ని జన్మల పుణ్యమో… అంత అందగాడూ, ఆస్థిపరుడూ నిన్ను వెతుక్కుంటూ రావడం…”
జ జ జ
”రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా?” అన్నట్లు వియ్యాలవారిద్దరూ లక్ష్మీపుత్రులవడంతో సన్నిహిత, అరవింద్‌ల కల్యాణం అంగరంగ వైభోగంగా, అత్యంత ఆర్భాటంగా, ఆడంబరంగా జరిగింది.
మరునాడు దగ్గరవాళ్ళవరకే పిలుచుకుని ఒక స్టార్ హోటల్లో వారి మొదటిరాత్రికి ఏర్పాట్లు ఘనంగా చేశారు.
వరసైనవారి సరసాలతో, వేళాకోళాలతో, జోకులతో నవ్వుల నవరత్నాలతో డిన్నరు ముగించి, నూతన వధూవరులకు గుడ్‌విషెస్ తెలిపి, వీడుకోలు పలికి ఇంటికి చేరారో లేదో అరవింద్‌నించి అతని అమ్మానాన్నలకు ఫోన్…
”సన్నిహిత పిచ్చిపిచ్చిగా, భయంకరంగా ప్రవర్తిస్తోంది. నన్ను రక్కుతోంది, కొరుకుతోంది, ఏడుస్తోంది…” అంటూ.
అరవింద్ తల్లిదండ్రులు విస్తుపోయారు. సన్నిహిత అమ్మానాన్నలకు కబురు చేరవేశారు.
ఆఘమేఘాల మీద నలుగురూ హోటల్‌కు చేరారు. గది బయట వరండాలో అరవింద్ బిక్కుబిక్కుమంటూ నిలబడి ఉన్నాడు.
గందరగోళంగా మారిన గదిలో ఏడుస్తూ సన్నిహిత.
”ఏంటమ్మా?” అంటే ఏమీ చెప్పదు. ఎంత అడిగినా మౌనమే సమాధానం.
మరునాడూ అదే తీరు. ఆ మరునాడూ అదే హోరు.
మూడునిద్రలు ముక్కచెక్కలయ్యాయి.
పగలంతా మామూలుగా ప్రవర్తించే సన్నిహిత, రాత్రిపూట భర్త గదిలోకి వచ్చినా, మీద చెయ్యివేసినా అపరకాళిక అవుతోంది. వీరంగం సృష్టిస్తోంది.
ఉదయం ఏమడిగినా ఏమీ చెప్పదు. ”నాకేం తెలియదు” అంటుంది. అందరూ తలలు పట్టుకున్నారు. ఎవరికీ ఏమీ
అర్థంకావడం లేదు.
గుళ్ళూ, గోపురాలూ, మొక్కుబడులూ, విభూదులూ, వైద్యాలూ అన్నీ అయ్యాయి. ఏమీ సుగుణం లేదు. రోజురోజుకీ పరిస్థితి మరింత దిగజారుతోంది.
ఆఖరుకు ఎవరి సలహా మీదో సైకియాట్రిస్టు దగ్గరికి వచ్చారు.
ఎన్నో ప్రయత్నాల తర్వాత డా. చంద్రిక దగ్గర నోరు విప్పింది సన్నిహిత.
అరవింద్ నా మీద చెయ్యి వెయ్యగానే ఢిల్లీలో ఫార్మశీ విద్యార్థిని మీద బస్సులో జరిగిన ఘాతుకం నాకు గుర్తుకు వస్తోంది. ఆమె అనుభవించిన నరకం నా మనసును మెలిపెడుతోంది. అంతే… తర్వాత నేనేం చేస్తున్నానో నాకు తెలియడం లేదు.” భోరుమన్నది సన్నిహిత.
మహా చెత్త కధ ఇది. అస్సలు బాగో లేదు. ఢిల్లీలో ఫార్మశీ విద్యార్థిని మీద జరిగిన అత్యాచారానికి సున్నితంగానూ, బాధ్యతాయుతంగానూ, ఆవేశంగానూ, ఆక్రోశంగానూ, స్పందించాలంటే, దాన్ని తాను చాలా ఇష్టపడి పెళ్ళి చేసుకున్న భర్త దగ్గర ఇలా ప్రవర్తిస్తున్నట్టు చూపించడమా? ఇదీ ఒక రకం స్పందన అనుకుంటే, పెళ్ళయిన ప్రతీ స్త్రీ, భర్త దగ్గరకి రాగానే అలా స్పందించడమేనా? ఈ అత్యాచారం విషయంలో, సంఖ్యలో చాలా తక్కువగా నయినా, పురుషులు మాత్రం బాధ పడలేదా? అప్పుడు వారు కూడా ఆ అత్యాచారాన్ని గుర్తు చేసుకుని, తమ భార్యలకి దూరంగా పారిపోవచ్చా? ఈ విధంగా స్పందన చూపించడం చాలా నాటకీయం, చాలా నెగిటివ్ తనం. సహజంగా మంచి వారైన సన్నిహితా, అరవిందూ ఆ అత్యాచారం గురించి చాలా సార్లు చర్చించే వుంటారు పెళ్ళికి ముందు. అలా చర్చించ లేదు అని ఎవరయినా అంటే, దానర్థం, ఇప్పుడు సన్నిహిత నాటకం ఆడుతున్నట్టు అర్థం వస్తుంది. ఏదో కధ కోసం అంతా కల్పించినట్టు వుంది గానీ, ఏ మాత్రమూ సహజంగానూ లేదు.
ఒక మాట చెప్పాలి. సమాజంలో “పురుష పెత్తనం” పోవాలీ అంటే, “మంచి” పురుషులను కూడా కూడకట్టుకోవాలి. సహజ పద్ధతుల్లో స్పందనలుండాలి. మంచి మనుషులందరూ పురుష పెత్తనానికి వ్యతిరేకంగా వుండాలి. అంతే గానీ, స్త్రీ జాతీ, పురుష జాతీ శతృ వర్గాలు కావు. శతృ వైరుధ్యాలున్న మిత్ర వర్గాలు.
“ఆడవారికే మోహం కలిగేటట్లు.” వంటి వాక్యాలు చాలా ఎబ్బెట్టుగా వుంటాయి, అవి స్త్రీలు రాసినా, పురుషులు రాసినా. రాముణ్ణి వర్ణించేటప్పుడు, “పురుషులకే మోహం కలిగేటట్టు” అని రాస్తారు, వికారంగా. ఇలాంటి పిచ్చి వర్ణనలు రాయడం మానుకుంటే, చెప్పే విషయాలకి మంచి గంభీరత్వం వస్తుంది.
స్త్రీల అందచందాలని వర్ణించడమూ, పురుషుల ఆజానుబాహు, పరాక్రమాల్ని వర్ణించడమూ ఫ్యూడల్ సాంప్రదాయాలు.
ప్రసాద్
మీతో ఏకీ భవిస్తున్నాను. ఎక్కువ శాతం ఎవరు మంచివారుంటారు అంటే, మెజారిటీ స్త్రీలదే. కాని స్త్రీల వల్ల భాద పడుతున్న మగవారూ ఉంటారని వారు గుర్తిస్తే ఈ ప్రపంచాన్ని అందంగా ఆరోగ్యంగా మార్చగలం.
ఇది ఢిల్లీ లో జరిగిన ఇన్సిడెంట్ గురుంచి కధ రాయాలనే తపన తో రాసినట్లుంది.
అసలు ఈ ఫాస్ట్ యుగం లో పిల్లలుచాల తెలివిగా వుంటున్నారు.
అందు లోMBA చేస్తువున్న అమ్మాయి ఏంతోషార్ప్ గ వుంటుంది.
కధ కి, కధ లో చెప్పబడిన కారణనానికి సింక్ అవలేదు అనిపించింది.
రాసిన పద్ధతి బావుందిగాని కధా వస్తువు మాత్రం చాల పేలవంగా వుంది
ఫల్గుణి