– .

– డా|| మామిడి లింగయ్య

వి. ప్రతిమ స్త్రీ, పురుష సమానత్వాన్ని కాంక్షించే కవిత్వం రాసింది. అన్ని రకాల సంబంధాలు కలగలసిన కుటుంబం అనేది వ్యక్తిగతంకాదు. అది సామాజిక, రాజకీయ వ్యవస్థ. సమాజంలో స్థిరపడిన రాజకీయ విలువలే కుటుంబంలో స్త్రీల జీవితాన్ని నిర్దేశిస్తున్నాయి. వారి ఆశలను, ఆశయాలను అభిరుచులను అణచివేస్తున్నాయి.

కుటుంబంలోని స్త్రీల జీవితాల్లోని సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాలు పురోగామిదిశగా పయనించాలన్నది

వి.ప్రతిమ గారి కవిత్వం దృక్పథం, స్త్రీ పురుష సంతాన ప్రేమల, శాశ్వతత్వాన్ని కోరుతూ, పురుషాహంకారం నాశనమైతే కుటుంబం జీవితం ఇంకా ఉన్నతంగా ఉంటుందని ఆశించే గృహిణులు, ఉద్యోగినుల ప్రాతినిధ్య కవిత్వం, వి. ప్రతిమ కవిత్వం.

కుటుంబ అనుబంధాలన్నిటినీ స్పృశిస్తూ పురుషాధిపత్యాన్ని, క్రూరత్వాన్ని థిక్కరించటమే ఆమె కవిత్వపు వస్తువు. స్త్రీవాద సాహిత్యం వల్ల ‘అమ్మ’కి ప్రాధాన్యం పెరిగింది.

రెక్కలొచ్చి కొడుకు తల్లిని వదిలి వెళ్ళినప్పటి మాతృవేదనను ‘మరలా విత్తబడ్డ దుఃఖం’ కవితగా వ్రాసింది.

”నీకే లోకం చూపించేందుకు నేను పునర్జన్మ ఎత్తినపుడయినా

అర్థరాత్రి పక్క తడిపి నువ్వేడ్చినపుడయినా

అన్నం తిననని మారాం చేస్తూ నన్నింటిచుట్టూ పరిగెత్తించినపుడయినా

బడికెళ్ళనని మొరాయించినపుడూ

వ్రాయని పరీక్ష రాశానని మభ్యపెట్టినపుడూ

నీ చొక్కాజేబులో అర్థం కాని ప్రేమలేఖ దొరికినపుడు ఎప్పుడయినా

ఎన్నడయినా నిన్నోమాట అన్నానా కన్నా – నిన్ను చదివించడం కోసం

నీ స్థాయి కోసం నీ జీన్స్‌ప్యాంట్ల కోసం, నీ ఫారిన్‌ బూట్ల కోసం, రేబాన్‌ గ్లాసుల కోసం వెరసి

నీ ఆనందం కోసం, సుఖమన్న పదానికర్థం మరిచి, పని రాక్షసినై, ఎన్ని గంటలు

ఆఫీసుకంకితమయ్యాను

ఎన్ని నిద్రలేని దీర్ఘరాత్రులు…

ఇంతా చేస్తే ప్రయోజకుడైన కొడుకు ‘అమ్మ’ను నిర్దాక్షిణ్యంగా వదిలివెళితే తెగని తనయుడి స్మృతులలో ఒక్కో రోజు ఒక్కో యుగంలా గడుపుతున్నానని, తన రాతి గుండె కొట్టుకుంటూనే ఉందనడం బలమైన వ్యక్తీకరణ.

వేల వేల చరిత్రల్ని మిళితం చేసుకున్న ఈ పంచభూతాలు ఏ పురాతన స్త్రీ ప్రేమ గాధనడిగినా ప్రతి అమ్మ కథా ఒకటేనంటాయి అంటూ ”కథలన్కీన ఒకటే” అనే కవిత వ్రాసారు వి. ప్రతిమ.

జీవితం పెత్తందారు రగిల్చిన కుంపటి ఆర్పడానికి

నలుసొకడొచ్చాడని తెగ కులుకుతుంటావు.

భర్త వల్ల బాధలు పడే స్త్రీలు, కొడుకు వల్ల ఆ బాధలు తీరగలవనే ఆశతో ఉంటారు. కాని కొడుకు వలన కూడా బాధలు పడడం ఒక విషాదం. తల్లికి ప్రేమ మాత్రమే జీవితాంతం ఉండే బలహీనత.

”జారిపడిపోయిన పొగడ్త దండ కోసం

మసక చీకట్లో వెతుకులాడుతూనే ఉంటావు

నాటకానికి తెరపడేదాకా” అన్న వాక్యాల ద్వారా కవయిత్రి ఆ విధమయిన బలహీనతను ప్రతిభావంతంగా వ్యక్తీకరించగలిగిందని ఈ కవిత రుజువు చేస్తుంది.

”ఆడపిల్ల ఆడపిల్లే” అంటూ కుటుంబంలో స్త్రీ స్థానాన్ని నిర్దేశించింది సమాజం. అప్పటి వరకు కంటికి రెప్పలా చూసుకున్న కన్నవారి నుండి స్త్రీ ‘పెళ్ళి’ అయ్యీ అవటంతోనే పరాయిదైపోతుంది. పుట్టింటికి రావటమంటే చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళటమే. కాన్పుకి తల్లి గారింటికి వచ్చి, పురిటి వాసనలింకా వీడకముందే భర్త చేసిన ఒక్క ఫోన్‌ కాల్‌తో పచ్చి ఒంటితో ప్రయాణమైపోయే కూతుర్ని తలుచుకుని, అక్కడెలా వుంటుందో ఏం చేస్తుందోనని కుమిలిపోయే అమ్మను ”మూడోకన్ను” కవితలో చూపించిన ప్రతిమ ”పెళ్ళికి నిర్వచనమిదే అయితే

తప్పక తెలుసు

ఏదో ఒక రోజు నేను మూడోకన్ను

తెరవక తప్పదు” అనడంలో స్త్రీల కనీస సౌఖ్యాలనయినా వారికి దూరం చేయకుండా ఉండటానికి పితృస్వామ్య ఆధిపత్య ధోరణులను ధిక్కరించడానికి సిద్ధమవుతున్నానని చెప్పడమే.

పురుషాధిపత్య వ్యవస్థలో పెళ్ళి తరువాత స్త్రీకి గతమనేది ఉండదు. ఉండరాదు. భర్త, పిల్లలు, ఇల్లే వర్తమానంగా జీవిస్తూ భవిష్యత్తాలోచనలు కూడా కుటుంబ సమర్థ నిర్వహణ గురించే చేయాల్సి రావడాన్ని ”మౌనసముద్రం” కవితగా మలిచారు ప్రతిమ. లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకోబోయే వరకూ యంత్రంలా కదులుతూ అందరికీ అన్నీ సర్దిపెట్టే హడావుడిలో గృహిణిలోని సృజనాత్మకత హరించి వేయబడటాన్ని బతుకులో జీవరసం ఆవిరి కావటాన్ని ఈ కవిత చిత్రించింది.

”నిన్ను ప్రేమించనూ లేను, ప్రేమించకుండా ఉండనూ లేను

అయితే నన్నణచి, అణచి అంచులకు నెట్టివేసే

నీ ఆధిక్యతను ఎండకట్టేదాకా

ఏకచ్ఛత్రాధిపత్యాన్ని తగలేసే దాకా

నా వాళ్లందరితో కలిసి గళం విప్పే దాకా

ఇదిగో, నేనిలాగే

రెండు భాగాలుగా బ్రతుకుతుంటానని తీవ్ర స్వరంతో చెప్పింది కవయిత్రి.

సహజీవన బంధంగా సాగాల్సిన భార్యాభర్తల సంబంధం వీడక అధికార వ్యవస్థగా తయారైనపుడు దానిమీద నిరసన, ధిక్కారం ‘జీవిత దృక్పథం’గా పెంపొందించుకొమ్మని స్త్రీ లోకానికి పద నిర్దేశం చేసింది ప్రతిమ.

మోడువారిన జీవితాన్ని చిగురింప చేసుకోవాలనే సందేశాన్నిచ్చిన కవిత ‘రాతిమొక్క’ ‘పునురుత్థానం’ కవితలో

”వెన్నెల నింపుకున్న నీ గొంతుని నొక్కిపట్టి

చిక్కటి చీకటి నిండిన బురదలో దొర్లుతూ

నీలోక నువ్వు ముడుచుకుపోయే నీ ఇల్లే

నీకు సమస్త లోకమైన చోట

బతుకంతా నిశ్శబ్దమైపోయిన చోట

పదేపదే ముక్కలౌతున్న హృదయ శకలాలున్న చోట

వంటరితనం శతృవై ఎదురొచ్చిన చోట

నువ్వు తప్పకుండా నిష్క్రమించాల్సిందే

అడవిదున్నల గిట్టల తాకిడికి చెల్లాచెదురైన

నీ కలల గూళ్ళని పునర్నిర్మించుకోవడానికి

రా…… సమూహంలోకి” అని ఆహ్వానిస్తూ మాట్లాడాల్సిన సందర్భంలో మౌనంలో ఉండవద్దని

”మౌనం కూడా నేరమే

నీ నిర్ణయాల్ని నిర్మొహమాటంగా ప్రకటించు

కుంకుమ పువ్వంటుకున్న పిడికిలని బిగించు”

అని ధిక్కార బావుటాని ఎగరవేసింది.

‘శతాబ్ది ప్రియుడు’ కవిత నేటి సైకో ప్రేమికుల చేష్టలకు క్షణక్షణం అమ్మాయిలు పడే వేదనను ఆవిష్కరించింది. నువ్వు లేక నేను లేనంటూ వెంటపడడం, వేధించడం, మాటి మాటికీ ఫోన్లు చేయడం, ఇంటిల్లి పాదినీ ఉక్కిరి బిక్కిరి చేయడం, దారిలో కాపుకాయడం, ఐలవ్యూ అనమని పీడించడం, కాదంటే కత్తి పుచ్చుకుని క్లాసు రూములోకి ప్రవేశించి హత్య చేయడం, కిరోసిన్‌ పోసి తగులబెట్టడం – ఇలా నేటి సైకో ప్రేమలను తెలియచెప్తుంది.

అది ప్రేమైనా, యుద్ధమైనా కుల మతాల ఘర్షణలైనా నష్టపోయేది ప్రధానంగా స్త్రీలే. ”రగిలేది రావణకాష్టం కాదు” కవిత రామజన్మ భూమి – బాబ్రీ మసీద్‌ సంఘటనలో జరిగిన మానవ హననాన్ని తెలియజెప్పేది.

”ఇంకెప్పటికీ కబురివ్వలేని నా గాంధీదామ్‌ స్నేహితురాలి మీదొట్టు

మంటల్లోకి విసరబడ్డ మాసూమ్‌ స్మృతిగా

అత్యాచారమైపోయిన సోదరీమణు లందరి గుర్తుగా

నేనిప్పుడు నమ్మకాన్ని పాతిపెట్టు కున్నాను” అంటుంది ప్రతిమ.

ఈ రెండు కవితలు వేరు వేరుగా కన్పిస్తున్నప్పటికీ స్త్రీల జీవితాలకు సంబంధించి వీటి ద్వారా ఒక ఏకసూత్రతను గమనించవచ్చు. అది సైకో ప్రేమలయినా, సామూహిక అత్యాచారాల యినా, హత్యలైనా రెండు దేశాల మధ్య యుద్ధాలయినా, కుల మతాల ఘర్షణల యినా ప్రధాన బాధితురాలు స్త్రీ అన్నది.

పశ్చిమాఫ్రికా దేశం లిబేరియాలో ఐక్యరాజ్యసమితికి చెందిన శాంతి దళాల సైనికులు అత్యాచారం జరపని యువతి లేదంటే అతిశయోక్తి లేదు. కేవలం 103 మందితో కూడిన భారత మహిళా, పోలీసు బృందం అక్కడి పరిస్థితులను చక్కదిద్దింది.

చిలకలన్నీ ఒక ఐక్య సంఘటన

ఇప్పుడింక

వెండి పంజరంలోని చిలక

ఇనుప పంజరాన్నిన ఎద్దేవా చేయదు

బంగారు పంజరమైనా సరే

బయట పడాలనే చూస్తుంది

సంకెళ్ళెప్పుడూ తమంతట తాము విచ్చుకోవు

ఈ సమాజంలో స్త్రీలకు వారి వారి వర్గాల్ని బట్టి అనేక విధాలైన పంజరాలు న్నాయి. బంగారు, వెండి, ఇనుప, సామాజిక స్థాయికి సంబంధించినవి. అణచివేత విషయంలో అందరిదీ ఒకటే పరిస్థితి అని కవయిత్రి అభిప్రాయం. ధనికురాలైన స్త్రీ పేద స్త్రీలను పరిహసించదు. అందరూ కలిసి పంజరమనే దాన్ని లేకుండా చేస్తారని కవయిత్రి భావన.

భార్యలను తమ అధీనులుగా భావించే భర్తల పురుషస్వామ్య పెత్తనాన్ని ఆవిష్కరించి, ధైర్యం బోధించి ధిక్కార ప్రకటన చేసిన కవితలు ”ప్రార్థన, నటనలు చాలు” అనేవి.

ఈ విధంగా పితృస్వామ్య వైఖరులను ధిక్కరించమని, మహిళా లోకాన్ని చైతన్యవంతం అవుతూ తమ హక్కుల సాధనకోసం ఉద్యమించమని తెల్పటమే

వి. ప్రతిమ గారి కవిత్వ సారాంశం.

 

 

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.