– డా. యు. ఝాన్సీ

శ్రీశ్రీ ‘దేశచరిత్రలు’ అనే కవితలో…

”ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం?

నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.” (మహాప్రస్థానం)

అని అన్నారు. ఇది దేశచరిత్రలకే కాదు స్త్రీల జీవితాలకు కూడా కింది విధంగా అన్వయించి చెప్పవచ్చు.

‘ఏ నారి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం?

స్త్రీజాతి చరిత్ర సమస్తం పురుష పీడన పరాయణత్వం.”

దీన్నిబట్టి స్త్రీజాతి ఏ విధంగా పీడించబడుతుందో స్పష్టమౌతోంది. భారతీయ స్త్రీని మన కవులు, కళాకారులు రకరకాలుగా వర్ణించారు. కొందరు దేవత అని, కొందరు మాతృమూర్తి అని, కొందరు భూదేవి అని, మరికొందరు బానిస అని అన్నారే తప్ప ఎవరూ కూడా (భావకవులు మినహాయింపు) స్త్రీని సాటిమనిషిగా, ఒక మనసున్న మనిషిగా గుర్తించకపోవడం శోచనీయం.

భారతదేశాన్ని ఎందరెందరో రాజులు పాలించారు. కాలక్రమంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే స్త్రీల స్థితిగతుల్లో ఇరవయ్యో శతాబ్దం వరకూ చెప్పుకోదగ్గ మార్పులు సంభవించలేదనే చెప్పాలి. అనాదిగా స్త్రీ ఎలాంటి అస్తిత్వం కలిగివుంది అని ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకు సమాధానంగా తరతరాల్లో స్త్రీ పరిస్థితిని స్థూలంగానైనా చెప్పుకోవాలి.

1. సామాజిక పరిణామంలో స్త్రీలు:

1.1 ప్రారంభదశలో స్త్రీ: ఆదిమ దశలో స్త్రీలు స్వతంత్రంగా జీవించారు. స్త్రీల మీద పురుష పెత్తనం ఉండేది కాదు. స్త్రీలు వారి ఆహారాన్ని వారే సేకరించుకునేవారు. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలు దాదాపు ఈనాడు మనం చూస్తున్న జంతు సంబంధాలను పోలి ఉండేవి. ఈ దశలో మనుషులకు వావివరసలు తెలిసేవి కావు. స్త్రీ తనకు పుట్టిన పిల్లలకి పాలిచ్చి పెంచేది. ఎదిగిన ప్రతి బిడ్డ తన ఆహారాన్ని తానే సంపాదించుకుంటూ తల్లికి దూరమయ్యేది.

కాలక్రమంలో మానవుడు ప్రకృతిని అర్థం చేసుకుంటూ వచ్చాడు. ప్రకృతి శక్తులను తన జీవనసరళి మెరుగుపరచు కోవడానికి ఉపయోగించడం మొదలు పెట్టాడు. అంటే నిప్పుతో మాంసాన్ని కాల్చుకుని తినడంవంటి కార్యక్రమాలు చేపట్టాడు. ఈ దశలో స్త్రీ, పురుష అనే భేదం లేకుండా జీవనం సాగింది. పని విభజనంతా సంతానోత్పత్తికి సంబంధిం చినది మాత్రమే. అది అతిసహజమైన విభజన అని చెప్పవచ్చు.

పశుపోషణ, భూమి నుండి ఆహారం ఉత్పత్తి చేసుకోడం మొదలైన ఉత్పత్తి సంబంధమైన పనులు ప్రారంభం కావడంతో శ్రమ విభజన రూపాలు స్పష్టం కావడం ప్రారంభమయ్యాయి. పునరుత్పత్తి పద్ధతిని గమనించిన స్త్రీ, పురుషునికంటే ముందుగా భూమినుండి జరిగే ఉత్పత్తిని గ్రహించింది. తద్వారా మొట్టమొదటిగా వ్యవసాయం ఆరంభించింది స్త్రీయే. ఈ విషయం గమనించదగినది. ఈ దశలో స్త్రీ, పురుష సంబంధాలు స్వేచ్ఛా సంబంధాలు.

సింధూ నాగరికతనాటికి స్త్రీలు ఆహారోత్పత్తిలో ప్రధానపాత్ర వహించడమే కాకుండా తనకు పుట్టిన పిల్లలతో గుంపుగా సాంఘిక జీవనానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. అది గుంపు పెళ్ళిళ్ళ దశ అయివుంటుందని చరిత్రకారుల అభిప్రాయం. ఎనరల్‌ పిల్సు అను ఇండాలజిస్టు ‘ఆర్యుల రాకకు ముందు భారతదేశంలోని తెగలు మాతృస్వామిక సమాజాలు’ అని చెప్పాడు. సంతానం స్త్రీకి చెందినదిగా ఉండేది. తల్లి తన కష్టార్జితంతో సమకూర్చిన పరికరాలను మాత్రమే పిల్లలు తమవిగా భావించేవారు.

ఈ వివరాల ద్వారా ఆరంభదశలో స్త్రీ స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో జీవించి తనకున్న మేధస్సును ఉపయోగించి మానవ జీవనాన్ని మెరుగుపరచడంలో ప్రధానపాత్ర వహించిందని తెలుస్తోంది.

1.2 పురుషాధిపత్య సమాజంలో స్త్రీ: మధ్య ఆసియా నుండి ఆర్యులు దాదాపు క్రీ.పూ.1500 సంవత్సరాలు కాలంలో ఈ దేశానికి వచ్చారని చరిత్ర చెబుతోంది. ఆనాటికి ఆర్యుల ప్రధాన జీవనాధారం పశుపోషణ. వారు మన దేశం వచ్చేనాటికి ఇక్కడ మాతృస్వామిక వ్యవస్థను కూలద్రోసి దాని స్థానంలో పితృస్వామిక విలువలను స్థాపించారు.

పితృస్వామిక సమాజ లక్షణాలు ప్రధానంగా రెండు – 1. బహుభార్యత్వం , 2. స్త్రీలపై సంపూర్ణాధిపత్యం

ఎక్కువమంది సంతానాన్ని పొందే క్రమంలో పురుషుడు బహుభార్యత్వాన్ని పాటించడం జరిగింది. పశువులను లొంగదీసుకొనే విధంగానే స్త్రీలను కూడా లొంగదీసుకున్నాడు. తద్వారా భార్యలందరూ భర్తలకు బానిసలుగా మారారు. అంతవరకు స్త్రీ తన శరీరం మీద, పిల్లల మీద కలిగివున్న హక్కుల్ని పురుషుడు చేజిక్కించుకున్నాడు. స్త్రీలు పురుషునికి చెందిన ఆస్తిగా మార్చబడ్డారు. క్రమక్రమంగా ఏర్పడిన జనపదాలు, గణరాజ్యాలు స్త్రీలను సంపూర్ణ బానిసత్వంలోకి నెట్టివేశాయి. ఈ క్రమంలో మాతృస్వామ్య వ్యవస్థ నామరూపాలు లేకుండ పోయింది.

1.3 బానిస వ్యవస్థలో స్త్రీ: పితృస్వామిక వ్యవస్థ అభివృద్ధి చెందిన క్రమంలో ఏర్పడిందే ఈ బానిస వ్యవస్థ. ఈ దశ స్త్రీని పుట్టుబానిసగా మార్చివేసింది. స్త్రీని ఒక మనిషిగా కాక ఒక జంతువుగా పరిగణించారు. బానిస దశ ఏర్పడేనాటికి ఉన్న మతాలు కూడా స్త్రీలను తక్కువగానే చూశాయి. బానిస వ్యవస్థలో వృత్తిరీత్యా అనేక విభజనలు జరిగాయి. ఈ విభజనలవల్ల స్త్రీల జీవితం మరింత దుర్భరంగా మారింది. స్త్రీ జీవితం బానిసకు బానిసగా మారినట్లు తెలుస్తోంది అంటే ఒక పురుషుడు మరొక పురుషునికి బానిస అయితే ఆ బానిసకు బానిస స్త్రీ.

1.4 భూస్వామ్య వ్యవస్థలో స్త్రీ: బౌద్ధమతంలో బ్రహ్మచర్యం సాధారణ సూత్రం. బౌద్ధమతస్తులను తమవైపు మలచుకోవడం కోసం అప్పటి ఆధిపత్యవర్గం శృంగార సాహిత్యాన్ని ముందుకు తీసుకువచ్చింది. వేదాలను, ఉపనిషత్తులను సృష్టించింది. ఇవన్ని కూడా వైదికమతం అధికారమతం కావడానికి తోడ్పడ్డాయి. తద్వారా స్త్రీ మరింత అణచివేతకు గురైంది. విద్యకు దూరమైంది. నిషేధాలకు గురైంది. స్త్రీ కేవలం వంటింటికి, పూజామందిరానికి, పడకటింటికి పరిమితమైపోయింది. ఈ విధంగా ఒక్కొక్క దశలో స్త్రీ అణచివేతకు గురౌతూ వచ్చింది.

2. ఆధిపత్యవర్గం సృష్టించిన సాహిత్యంలో స్త్రీ స్థితిగతులు: 2.1 వేదాల్లో స్త్రీ: క్రీ.పూ.1500 నుండి 500 సంవత్సరాల మధ్య కాలాన్ని వేదకాలంగా పిలుస్తున్నారు. ఈ కాలంలో వేదాలు రాయబడ్డాయని పరిశోధకుల అభిప్రాయం. వేదాల ద్వారా ఆనాటి స్త్రీల స్థితిగతులను తెలుసుకోవచ్చు.

వేదకాలంలో స్త్రీ సంతానం కంటే పురుష సంతానానికే ఎక్కువ గౌరవం ఉండేది. ఈ కాలంలో స్త్రీ జీవిత లక్ష్యం ‘పురుష సంతానాన్ని కనడం’ (ఋగ్వేదసంహిత 5-46-7)గా మారిపోయిందనడానికి వేదాల్లో అనేక శ్లోకాలు ఆధారంగా కనిపిస్తున్నాయి. ఈ క్రింది శ్లోకం ఉదాహరణగా చెప్పవచ్చు.

”మానో అగ్నిమతయే మావీరతాయై రీరభ” (ఋగ్వేదసంహిత 3వ మండలం 16వ శ్లోకం 5వ ఋక్కు)

అంటే ఓ అగ్ని! నీవు మమ్మల్ని అపుత్రక విషమ భూతులనుగా చెయ్యవద్దని అర్థం. తాత్విక చర్చల్లో పాల్గొని, ప్రశ్నించడానికి స్త్రీలకు హక్కు ఉందని చెప్పడానికి గార్గి, మైత్రేయి నిదర్శనం. కాని ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నవారి సంఖ్య వేళ్ళమీద లెక్కించవచ్చు. స్త్రీలకు తాత్వికమైన, శాస్త్రీయమైన విద్యను అభ్యసించే అవకాశం లేకపోవడంవల్ల పురుషులు, శాస్త్రాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పురుషాధిక్యతను కొనసాగించారు. బహుభార్యత్వం, బహుభర్తృత్వం రెండూ వేదకాలంలో వున్నప్పటికీ ఎక్కువగా ఏకభార్యత్వం ఉండేది. బుద్ధుడికి యశోధర అనే ఒకే భార్య ఉండటం అందుకు మంచి ఉదాహరణ. తొలి వేదమైన ఋగ్వేదంలో వివాహం తప్పనిసరి అని కనిపించదు. ప్రేమ వివాహాలకు గౌరవమున్నట్లు తెలుస్తోంది. భర్త చనిపోతే ఆ స్త్రీ తన భర్త అన్ననో, తమ్ముడినో తిరిగి పెళ్ళి చేసుకోవచ్చు. స్త్రీ స్వేచ్ఛ పూర్తిగా హరించివేయబడలేదని చెప్పవచ్చు.

అధర్వణ వేదంలో ‘అక్రమసంబంధాలు పెట్టుకున్న స్త్రీలు ఆడపిల్లల్ని కంటారని, భర్తతో మాత్రమే సంబంధాలు పెట్టుకున్న స్త్రీలు మగపిల్లల్ని కంటారు’ అని చెప్పబడింది. ఇవన్ని స్త్రీలను తమ చెప్పుచేతల్లో పెట్టుకోడం కోసం పితృస్వామ్య వ్యవస్థ కల్పించిన రాజకీయం అని స్పష్టమౌతుంది. స్త్రీ ఆస్తి కలిగివుండటం అనే విషయానికొస్తే, స్త్రీకి అన్నదమ్ములు లేని పక్షంలో మాత్రమే తండ్రి ఆస్తి సంక్రమించేది.

2.2 గృహసూత్రాల్లో స్త్రీ : గృహసూత్రాల రచన ద్వారా కుటుంబజీవితం మరింత పటిష్టం చేయబడింది. గృహసూత్రాల్లో స్త్రీ పరిస్థితిని వివరించాలంటే గృహసూత్రాల్లో పేర్కొన్న ఎనిమిది రకాలైన వివాహాల గురించి స్థూలంగానైనా తెలుసుకోవాలి. అవి

1. బ్రహ్మ వివాహం, 2. దైవ వివాహం, 3. ప్రజాపత్య వివాహం, 4. ఆర్ష వివాహం, 5. గంధర్వ వివాహం, 6. అసుర వివాహం, 7. పైశాచిక వివాహం, 8. రాక్షస వివాహం

వీటిలో మొదటి మూడు రకాల వివాహాలు పాలకవర్గానికి చెందినవి. ఈ మూడు రకాల వివాహాల్లోనూ వరకట్నం ఇవ్వడం ఆనాడే ప్రారంభమైంది. ఆనాటి పాలకవర్గాలు స్త్రీని భోగవస్తువుగా చూశారు. అందుకే ఆమె పతివ్రతగా వుండాలని భావించి ‘ఘోషా పద్ధతి’ని ప్రారంభించారు. స్త్రీని ఒక ‘పరాన్నబుక్కు’గా తయారుచేశారు. తద్వారా ఇంట్లో ఆమె చేసే శ్రమకు విలువలేకుండా పోయింది. గృహసూత్రాల్లో స్త్రీలకుండే ఆస్తిహక్కును తిరస్కరించారు. వరకట్నం రూపంలో తెచ్చుకున్న ధనం మాత్రమే స్త్రీకి చెందినదిగా పరిగణించేవారు. స్త్రీ జీవితాన్ని దుర్భరం చేయడానికా!? అన్నట్లు ఆమె చేయవలసిన పనులను ఆచరించవలసిన నియమాలను గృహసూత్రాల్లో పేర్కొనడం జరిగింది. ఈ సూత్రాలను అప్పటి ఆధిపత్యవర్గం అధికారికంగా కొంతకాలం, అనధికారికంగా ఇంకొంతకాలం ఇంటింటా ప్రచారం చేసింది. నేటికాలంలో కూడా ప్రతి స్త్రీ లేదా గృహిణి చేసే పనులను గమనించి నట్లయితే గృహసూత్రాలు భారతీయ సమాజంపై ఎంతటి ప్రభావాన్ని చూపాయో మనకు అర్థమవుతుంది.

2.3 అర్థశాస్త్రంలో స్త్రీ: శత్రుబారినుండి రాజ్యాన్ని రక్షించుకోడం కోసం స్త్రీలను ఉపయోగించుకునే పద్ధతిని కౌటిల్యుడు తన ‘అర్థశాస్త్రం’ అనే గ్రంథం ద్వారా అలవాటు చేశాడు. రాజకుటుంబాల్లో పరిరక్షక పరివారంలో అధికసంఖ్యాకులు స్త్రీలే. స్త్రీలపై స్త్రీ గూఢచారులను నియమించేవారు. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేశారు. అర్థశాస్త్రం ప్రకారం భర్త ఆజ్ఞ లేకుండా స్త్రీలు ఆటలాడడానికి గాని, స్నేహితుల ఇళ్లకుగాని వెళ్తే పన్ను చెల్లించవలసి వచ్చేది.

రహస్య స్థలాల్లో సంభాషణలు కొనసాగించిన స్త్రీని దెబ్బలు కొట్టవచ్చు. రహస్య సంబంధాలు పెట్టుకున్న స్త్రీని గ్రామం మధ్యలో నిలబెట్టి కొట్టించేవారు.

2.4 మనుధర్మ శాస్త్రాల్లో స్త్రీ: మనువు రాసిన మనుధర్మశాస్త్రం పురుషాధిక్యతను మరింత అధికం చేసింది. భర్తను భగవంతుని స్థాయికి చేర్చి భార్యను పాతాళానికి తోసేసింది. తద్వారా స్త్రీకి ఎలాంటి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేకుండా చేసింది. భర్తపట్ల తన కర్తవ్యాన్ని నెరవేర్చని స్త్రీకి మరణానంతరం అనేక శిక్షలు ఉంటాయని లేదా భూలోకంలోని తీవ్రమైన వ్యాధులకు గురవుతారని భయపెట్టి భర్తలు తమ అవసరాలు నెరవేర్చుకునేవారు. మనుధర్మశాస్త్రంవల్ల స్త్రీ పరిస్థితి మరింత దిగజారినట్లు తెలుస్తోంది.

2.5 రామాయణ, మహాభారతాల్లో స్త్రీ: రామాయణం ప్రధానంగా కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడానికి పూనుకుంది. ఏకభార్యత్వం, ఏక భర్తృత్వం అనే భావాలను ప్రచారం చేసింది. స్త్రీలకు పాతివ్రత్యం అనేది ఎంత ప్రాముఖ్యమో సీత పాత్ర ద్వారా చెప్పించడం జరిగినది. సీత పాత్ర ద్వారా స్త్రీ సమాజాన్ని కష్టాలు అనుభవించడానికి, అన్నింటిని మౌనంగా భరించడానికి మానసికంగా సిద్ధం చేసి ‘సీతమ్మ పడ్డ చెరలుకంటే నా చెరలు తక్కువే’ అని స్త్రీలు గాలి పీల్చుకునే పద్ధతిని అలవాటు చేసింది.

మహాభారతం బహుభార్యత్వం, బహు భర్తృత్వం అనే విధానాలను పాలకవర్గాలకు అంగీకారయోగ్యమని పరోక్షంగా చెప్పింది. దీనికి ఉదాహరణగా ద్రౌపది, కృష్ణుడు కనిపిస్తున్నారు. ఈ విధంగా సాహిత్యంలో కూడా స్త్రీల పరిస్థితి దయనీయంగానే ఉంది.

సామాజిక పరిణామంలో స్త్రీలు కలిగివున్న స్థితిగతులను, సాహిత్యంలో స్త్రీని చిత్రించిన తీరు చూస్తే మాతృస్వామ్య సమాజంలో తప్ప మిగిలిన అన్ని దశల్లోనూ స్త్రీ అణచివేతకు, పీడనకు, దోపిడీకి గురవుతూ పితృస్వామ్య స్వార్థానికి బలైపోతూ వస్తుందనే వాస్తవం మరోసారి వెల్లడౌతోంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.