– కాత్యాయనీ విద్మహే
”స్త్రీల పరిస్థితి ఎంత దయనీయంగా వుందో నాకు బయటకు వెళ్ళకుండా మా కుటుంబాలను చూస్తేనే తెలిసొచ్చింది. పైగా ఈ స్త్రీలందరూ డబ్బు కలవాళ్ళు. వీళ్ళ జీవితాలే ఇంత బాధాకరంగా వుంటే ఇక నిరుపేద స్త్రీల బ్రతుకు ఎంత అద్వనంగా వుండి వుంటాయో అర్థమయింది. అప్పటినుండి స్త్రీల జీవితాలు మెరుగుపడాలనీ అందుకై కృషి చేయ్యలనీ నేను నిశ్చయించుకు నేందుకు ఈ అనుభవాలు, తోడైనాయి.”
– పుచ్చలపల్లి సుందరయ్య, విప్లవ పథంలో నా పయనం’ (మొదటి భాగం) మే 1986, పు. 69.
పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా మహిళా సంఘాలను నిర్మించవలసిన అవసరాన్ని గురించి – 1974 డిసెంబరు 27 నుండి 1975 జనవరి 2 వరకు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కొల్లిపరలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ కార్యకర్తల పాఠశాలలో ప్రస్తావించాడు. కమ్యూనిస్టు పోరాటాలలో పురుషులు శత్రుదాడినుండి తప్పించుకొనేందుకు ఇళ్ళు విడిచి వెళ్ళినప్పుడు పోలీసు దాడులు, అవమానాలను ఎదుర్కొన వలసిన వాళ్ళు, కుటుంబ భారాన్ని మోయాల్సిన వాళ్ళు ఇళ్ళ దగ్గర మిగిలిపోయే స్త్రీలేనని, వాళ్ళలో ఆ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించటానికి అవసరమైన చైతన్యాన్ని అభివృద్ధి చేసేందుకు మహిళా సంఘాలు వుండాలని అభిప్రాయ పడ్డాడు (ఏరిన రచనలు 1, మే 1987 పు. 99)
పురుషులు కమ్యూనిస్టు ఉద్యమాన్ని మను ముందుకు తీసుకొని పోవటానికి సహకరించగల చైతన్యం స్త్రీలలో కలిగించటం వరకే మహిళా సంఘాల అవసరాన్ని గుర్తించినట్లు కనబడుతున్నప్పటికి ఒక కమ్యూనిస్టుగా పుచ్చలపల్లి సుందరయ్య స్త్రీకి పురుషునితో పాటు సమాన హోదా, సమాన హక్కులు ఆశించాడన్నది మాత్రం గమనించాలి. నూతన సోషలిస్టు సమాజంలోనే అవి ఆచరణ వాస్తవం అవుతాయన్నది ఆయన నమ్మకం. అంతవరకు యువతీ యువకులు సామాజిక జీవిత సంబందాలలో అభివృద్ధి చేసుకోవలసిన ప్రజాస్వామిక దృక్పథం గురించి సుందరయ్య హెచ్చరిస్తూనే వున్నాడు. (యువజనులు – రాజకీయాలు, 1973 ఏరిన రచనలు 1, పు: 121 & 125)
ఆ హెచ్చరికను అందిపుచ్చుకొన్నట్లు ఆంధ్రదేశంలో స్త్రీలు అప్పటికే స్వీయ సమస్యలపైన స్వతంత్రంగా గళమెత్తటం ప్రారంభించారు. విద్యార్ధి ఉద్యమంగా ప్రారంభమైన స్త్రీల కార్యోత్సాహం 1974లో ‘అభ్యుదయ స్త్రీల సంఘం’ ఏర్పడటానికి దారి తీసింది. పీడితులలోకెల్ల పీడితులుగా స్త్రీలకు ప్రత్యేక సమస్యలున్నాయని గుర్తించి పనిచేస్తూ 1975 నాటికి ‘స్త్రీ విముక్తి’ అనే పత్రికను కూడా ఈ సంస్థ ప్రచురించసాగింది. ఆ సంవత్సరమే ఒకవైపు భారతదేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించబడి ప్రజాఉద్యమాలన్నీ అణచివేయబడుతుండగా మరొకవైపు అంతర్జాతీయ స్థాయిలో ‘మహిళాసంవత్సర’ ప్రకటన జరిగింది. 1985 వరకు మహిళా దశాబ్దిగా అదిపొడిగించబడింది. ఈ దశకంలో స్త్రీల స్థితిగతులపైన, సమస్యల పైన క్షేత్రస్థాయి అధ్యయనాలు, సైద్ధాంతిక అవగాహన పెరుగుతూ వచ్చాయి. మహిళా దశాబ్ది ముగుస్తుండగా మరణించిన పుచ్చల పల్లి సుందరయ్య వీటన్నిటినీ గమనిస్తూ వుండి వుండాలి. ఒక సమాజం అందరికీ సమాన అవకాశా హక్కులు గల ప్రజాస్వామిక సమాజంగా ఎదగటానికి భిన్న వర్గాల ప్రజా సమూమాలు – అందులో మహిళలు -స్వీయ అనుభవాల నుండి ఆకాంక్షల నుండి ఉద్యమిస్తున్న కొత్త కాలాన్ని కమ్యూనిస్టు నిబద్ధత, నిమగ్నత కలిగిన సుందరయ్య గొప్ప ఆశతో స్వాగతించే వుంటాడు. ఆయన కాలం నుండి అభివృద్ధికరంగా ఎదిగిన ఆంధ్ర దేశ మహిళా ఉద్యమ చరిత్రను, పరిణామాలను అధ్యయనం చేయటం, దాని గతి క్రమాన్ని నిరూపించటం, గమ్యాన్ని నిర్దేశించుకొనటం ఒక సామాజిక అవసరం, పుచ్చలపల్లి సుందరయ్య శతజయంతి అందుకొక చారిత్రక సందర్భం.
1
ఆధునిక భారతీయ సమాజం ప్రజాస్వామిక జీవన విలువలతో నిర్మింపబడాలన్న ఆకాంక్షకు తొలి వ్యక్తీకరణలు వర్గలింగ వివక్షలను ప్రశ్నించటం. స్త్రీకి జీవించే హక్కును, గౌరవంగా జీవించే హక్కును, జ్ఞానంతో జీవించే హక్కును నిరాకరిస్తున్న కౌటుంబిక సామాజిక సంప్రదాయ ధర్మాన్ని సవరించటానికే సంఘ సంస్కరణోద్యమాలు వచ్చాయి. సతీసహగమనం, బాల్య వివాహం, వితంతు దైన్య జీవనం, నిర్బంధ దాంపత్యం మొదలైన సమస్యలతో కునారిల్లుతున్న స్త్రీల జీవితాన్ని సముద్దరించటానికి – స్త్రీ పునర్వివాహం, విడాకులు, స్త్రీ విద్య, ఆర్ధిక స్వాతంత్య్రం మొదలైన అంశాలపై అనుకూల భావజాల ప్రచారం, ఆచరణ కర్యాక్రమం ఊపందుకొన్న కాలం అది. సంస్కరణోద్యమ నాయకత్వం ప్రథమంలో పురుషులదే అయినా, దాని ప్రభావాలకు లోనయిన, ఫలితాలను అనుభవంలోకి తెచ్చుకొంటున్న తొలితరం మహిళలు ఎందరో 20వ శతాబ్ది ప్రారంభానికి స్వయంగా సంఘటితమై, ఎక్కడికక్కడ సంఘాలు పెట్టుకొని తమ సమస్యలపై తామే ఉద్యమించారు. స్వాతంత్య్రోద్యమ రాజకీయాలలో పాలుపంచుకొన్నారు. ప్రజా పోరాటాలలో భాగస్వాములయ్యారు. స్త్రీ సమస్యకు సంస్కరణను మించి రాజకీయార్ధిక పరిష్కారాన్ని ఆశించే స్థాయికి చైతన్యాన్ని పదునెక్కించుకొన్నారు. బ్రిటిషు వలస పాలన నుండి విముక్తి తమ ఆకాంక్షల పరిపూర్తికి వాగ్దానం అవుతుందనుకొన్నారు.
స్త్రీ పురుష సమానత్వాన్ని స్త్రీల ఆర్ధిక స్వాతంత్య్రాన్ని సంపూర్ణంగా విశ్వసించి, వివాహంలోకానీ విడాకుల విషయంలో కానీ, వివక్షను వ్యతిరేకించిన జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ స్వతంత్ర భారత ప్రభుత్వ పాలనా పగ్గాలు చేపట్టింది. ఆధునిక ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రణాళికాబద్ధ సాంఘిక ఆర్ధిక అభివృద్ధి పౌరులందరికీ న్యాయం స్వేచ్ఛ, సమానత్వం అన్న సూత్రాలమీద జరగాలని నెహ్రూ కన్న కలలు స్త్రీల విషయంలో వాస్తవీకరించబడ లేదు. కరాచీ కాంగ్రెస్ (1931)లో మహిళా శ్రామికుల హక్కుల పరిరక్షణకు చేసిన తీర్మాణాలు కానీ, జాతీయ ప్లానింగ్ కమిటీకి (1939-40) స్త్రీల సబ్‌కమిటీ – ఓటు హక్కు, ప్రజా సంఘాలలో, ఉద్యోగాలలో స్థాయి, లైంగిక నీతి మొదలైన అంశాలపై సమర్పించిన నివేదిక కానీ, రాజ్యాంగ నిర్మాణ సమయంలో పరిగణనలోకే తీసుకొనబడలేదు. వివాహానికి ఆస్తి వారసత్వానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలతో ప్రవేశపెట్టబడిన ‘హిందూ కోడ్ బిల్లు’ను – సంప్రదాయ హిందూ వర్గం నుండి వచ్చిన ఒత్తిడికి తలవొగ్గి 1952 సాధారణ ఎన్నికల ప్రయోజనాల దృష్ట్యా నెహ్రూ – తాత్కాలికంగా విరమించినట్లు ప్రకటించాడు. ఆ మేరకు మంత్రివర్గం నుండి డా|| ఆర్.బి.ఆర్ అంబేద్కర్‌ను వదులుకొనటానికి కూడా ఆయన వెనుకాడలేదు. సమాన హక్కులు, సమాన అవకాశాలు అన్న వాగ్దానాన్ని విస్మరించి స్త్రీ సమస్యను దాని రాజకీయ పనును నుండి తప్పించి సంక్షేమ పరిధికి కుంచింపచేయటం స్వతంత్ర భారత ప్రభుత్వపు తొలి అడుగులోనే సంభవించిన చారిత్రక విషాదం.
1952లో మళ్ళీ అధికారాన్ని చేపట్టాక నెహ్రూ ప్రభుత్వం హిందూకోడ్ బిల్లులోని అంశాలు ఆధారంగా ఒకదాని తరువాత ఒకటిగా ఐదు చట్టాలను చేసింది. అవి ప్రత్యేక వివాహ చట్టం (1954) హిదూ వివాహ చట్టం (1955) హిందూ వారసత్వ చట్టం (1955) హిందూ మైనారిటీ మరియు సంరక్షణ చట్టం (1956) హిందూ దత్తత మరియు మనోవర్తి చట్టం (1956) వరకట్న నిషేధ చట్టం (1961) – ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి స్త్రీ సమస్యకు లభించిన ఈ చట్టబద్ధ పరిష్కారం వల్ల మొత్తంగా ప్రభుత్వ సంక్షేమ దృక్పథం కారణంగా స్త్రీలకు సమకూడిన ప్రయోజనాలు పెద్దగా ఏమీ కనబడవు. గృహిణులుగా, తల్లులు వారి పాత్ర మరొక సారి స్థిరీకరించబడింది. అంతే.
హిందూకోడ్ బిల్ ఉపసంహరింపబడిన సంవత్సరమే (1951) తెలంగాణ రైతాంగ పోరాట విరమణ జరిగింది. అప్పటికి దాదాపు పదేళ్ళుగా కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా మహిళా సంఘాలు ఏర్పడి గడ్డివేళ్ళ స్థాయి నుండి స్త్రీల సమస్యను, వివక్షా స్వభావాన్ని, కుటుంబంలో భార్యలపై భర్తల పెత్తనాన్ని చర్చకు పెట్టే చైతన్య పరిచే పనిలో వున్నాయి. పురుషులతో సమానంగా ఆస్తిహక్కు, విద్యావకాశాలు, విడాకుల హక్కు మొదలైన డిమాండ్లతో చట్టాలలో సవరణకై ఒత్తిడులు పెంచాయి. మహిళలకు రాజకీయ శిక్షణ శిభిరాలు నిర్వహించబడ్డాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో స్త్రీల భాగస్వామ్యం పెరుగుతూవచ్చింది. ఇది రైతాంగపు భూమి హక్కుల కోసం జరిగే ఉద్యమం అనివార్యంగా స్త్రీ విముక్తి గురించి పనిచెయ్యాలన్న అవగాహనను పెంచింది. స్త్రీ విముక్తికి జరగాల్సిన పోరాటానికి ఒక రూపం ఏర్పడసాగింది. ఈ పరిస్థితులలో సాయుధ రైతాంగ పోరాట విరమణ స్త్రీ విముక్తి ఉద్యమ నిర్మాణం పిండదశలోనే విచ్ఛిన్నం కావటానికి కారణమైంది.
పోరాట విరమణ వల్ల విముక్తమైన గ్రామాలను సైతం తిరిగి అప్పచెప్పవలసి రావటం, భూపరిమితి చట్టాల అమలు కోసం ప్రభుత్వం వైపు ఆశగా చూస్తూ మిగిలిపోవటంలో రైతాంగం ఎంత హింసను అనుభవించిందో నైజాం వ్యతిరేక సాయుధరైతాంగ పోరాటంలో పాల్గొనటం వలన తాము పొందిన చైతన్యం తమ చైతన్యంతో ఉద్యమానికిచ్చిన మహిళా దృష్టికోణం – అన్నీ ఉపసంహరించుకొని మళ్ళీ నాలుగు గోడల మధ్యకు వెళ్ళటంలో స్త్రీలు అంతే హింసను అనుభవించారు. ఆ రకంగా 1951 హిందూకోడ్ బిల్లు విరమణ ఒకవైపు, తెలంగాణ రైతాంగపోరాట విరమణ మరొక వైపు – స్త్రీ విముక్తి ఉద్యమ నిర్మాణాన్ని అంకురం దశలో చిదిమివేశాయి.
అదే 1951లో సామ్యవాద సమాజస్థాపన లక్ష్యంగా ప్రణాళిక బద్ధ ప్రయాణానికి పటం గీస్తూ మెదటి పంచవర్ష ప్రణాళిక అమలులోకి వచ్చింది. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత నిచ్చినా ఆ కాలంలో వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే వారి జీవన ప్రమాణాలుపెరగలేదు. మొదటి పంచవర్ష ప్రణాళిక ముగిసే, నాటికి రూపొందించిన పారిశ్రామిక విధానం వలన ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో దీర్ఘకాలిక పారిశ్రామిక స్వావలంబనకు పెద్ద పీట వేసి వినియోగవస్తువుల ఉత్పత్తి పరిమాణం తగ్గించటం వల్ల వినియోగ వస్తువుల ధరలు పెరిగి అధిక సంఖ్యాకులైన సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి రాకుండా పోయాయి. పేదలు మరింత పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి మూడు, నాలుగు పంచవర్ష ప్రణాళికలలో వినియోగ వస్తూత్పత్తికి ప్రాధాన్యం ఇస్తే అంతిమంగా అది విలాసవస్తువుల ఉత్పత్తిని పెంచింది. ఫలితంగా ఆశేష ప్రజానీకం అభివృద్ధి వెలుపల వుండి పోతుండగా ధనికులు మరింత విలాసవంతమైన జీవితం గడపటానికి అవకాశాలు కలిసి వచ్చాయి. భూగరిష్ఠ పరిమితి చట్టాలు, వాటి వైఫల్యాలు, హరిత విప్లవం, దాని పరిణామాలు ఈ కాలానివే. ఈ పరిస్థితిని మార్చాలన్న స్థిర సంకల్పం నుండే వ్యవసాయ విప్లవం ఇరుసుగా నూతన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసమైన పోరాటానికి ‘నక్సల్బరి’ ఒక నమూనాను ఇచ్చింది.
2
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విరమణకు (1951) శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాట ప్రారంభానికి (1958) మధ్య కాలంలో (1956) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రరాష్ట్రంలో ఆదివాసీ స్త్రీలు అడవి సంపదపై సహజ హక్కులు భంగపడుతుంటేను, నిత్య జీవితం గిరిజనేతరుల దోపిడికి, అటవీ అధికారుల వేధింపులకు బలి అవుతుంటేనూ తమ పురుషులతో పాటు స్త్రీలూ పోరాటాలలోకి సమీకృతులయ్యారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా మైదాన ప్రాంతాల్లో ముఖ్యంగా ఉద్దానం పరిసర ప్రాంతాలలోనూ భూస్వామ్య పీడనకు వ్యతిరేకంగా నిర్వహించబడిన ఉద్యమాలలోకి కూడా స్త్రీలు సమీకృతులయ్యారు. పార్టీ ప్రయోజనాల కోసమే ప్రధానంగా మహిళాసంఘాలు ఏర్పడినా స్త్రీలపై భూస్వాముల, వడ్డీ వ్యాపారస్తుల లైంగిక దోపిడి వంటి సమస్యలు కొంతవరకు చర్చలోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఒక దశాబ్ద కాలం పూర్తి కాకుండానే దాని భూస్వామ్య అనుకూల వైఖరి బట్టబయలు అవుతూ వచ్చింది. ద్రవ్యోల్బణం అధికధరలు, ఆహార కొరత, నిరుద్యోగం మొదలైనవి మధ్య తరగతి యువతరం చూపును నక్సల్బరి వైపు మరల్చింది. శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటానికి మద్దతు పలికేలా చేసింది. రచయితలను మీరెటువైపు అని సవాల్ విసిరే స్థాయికి తెచ్చింది. ఈ పరిస్థితులలో పెల్లుబుకిన ప్రగతి శీల విద్యార్ధి రాజకీయాల నుండి నూతన మహిళా ఉద్యమం ఊపిరిపోసుకొన్నది.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధులు పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా 1973 ఆగస్టులో ప్రారంభించిన ఉద్యమంలో మహిళా విద్యార్ధులు చురుకైన పాత్ర నిర్వహించారు. పెద్ద ఎత్తున విద్యార్ధినులను ఇందులోకి సమీకరించారు. ఆ క్రమంలోనే విద్యార్ధినులు ప్రత్యేక స్త్రీల సంఘం అవసరాన్ని గుర్తించారు. ఏ పార్టీకి అనుబంధంగా కాక స్వతంత్రంగా కార్యక్షేత్రం ఎన్నుకొని పనిచేయాలని భావించారు. తత్ఫలితంగానే 1974 సెప్టెంబరు 29న అభ్యుదయ స్త్రీల సంఘం ఏర్పడింది. స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు, విముక్తికై పోరాడేందుకు అవసరమైన చైతన్యాన్ని ఆర్ధిక విధానానికి సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటాలను నిర్మించటం ప్రధాన లక్ష్యాలుగా ఈ సంఘం ప్రకటించింది. వరకట్నం, బాల్యవివాహాలు, అశ్లీలత గురి చూచి పనిచేయవలసిన సమస్యలు అని గుర్తించింది. ఆస్తిలో ఆడపిల్లలకు వాటా, సమానపనికి సమానవేతనం, ప్రసూతి సెలవలు, శిశు సంరక్షణ కేంద్రాలకు సంబంధించిన చట్టాలను ఖచ్ఛితంగా అమలు జరిగేలా చూడాలని భావించింది. అత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోవటాన్నినిరసిస్తూ జరుగుతున్న ఉద్యమ నేపధ్యం నుండి పుట్టిన సంస్థ కనుక అత్యవసర వస్తువుల సక్రమ పంపిణీకి, అవినీతి, నల్లబజారు, అక్రమ నిల్వల వ్యతిరేకంగా జరిగే పోరాటాలలో ముందుండాలని అభ్యుదయ స్త్రీల సంఘం నిర్ణయించుకొన్నది.
అనుకొన్నట్లుగానే అనేక మహిళా కళాశాలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి వరకట్నానికి వ్యతిరేకంగా బహిరంగ సభను నిర్వహించింది అభ్యుదయ మహిళా సంఘం. అలాగే అమ్మాయిలను అవమానించి వేధించే సంస్కృతికి వ్యతిరేకంగా యాక్షన్ ప్రోగ్రాములు తీసుకొన్నది. స్త్రీని అసభ్యంగా చిత్రించే సినిమా ప్రకటనలపైన, వ్యాపార ప్రకటనలపైన యుద్ధం ప్రకటించింది. అశ్లీల చిత్రాల ప్రదర్శనను, అశ్లీల సాహిత్యపు అమ్మకాలను తీవ్రంగా ప్రతిఘటించింది. 1975లో అధిక ధరల వ్యతిరేక ఉద్యమంలో ఇతర ప్రజాసంస్థలతో కలిసి కరపత్రాలు పంచటంలో స్త్రీలను సమీకరించి ప్రదర్శనలు, ఊరేగింపులు నిర్వహించటంలో అభ్యుదయ స్త్రీల సంఘం చురుకైన పాత్ర నిర్వహించింది. అభ్యుదయ మహిళా సంఘాన్ని అతి కొద్ది కాలంలోనే వరంగల్లు, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, తిరుపతి వంటి పట్టణాలకు జనగాం, నర్సంపేట, కోదాడ, వనపర్తి లాంటి తాలూకా ప్రాంతాలకు విస్తరింపచేయటం జరిగింది. మధ్య తరగతి విద్యార్ధి సమస్యలకే పరిమితంకాకుండా కార్మిక, బస్తీ స్త్రీల సమస్యలపై పని చేసింది అభ్యుదయ స్త్రీల సంఘం, కార్మిక వాడలలో తాగునీరు, డ్రైనేజీ, కరెంటు మొదలైన సమస్యలపై పోరాటాన్ని తన ఏజెండాగా చేసుకొన్నది. 1975ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించినప్పుడు ప్రభుత్వం మంత్రుల, అధికారుల భార్యలతో సెమినార్లు సమావేశాలు నిర్వహించి దానినొక ఉత్సవంగా చేయటాన్ని అభ్యుదయ స్త్రీల సంఘంనిరసించింది. శ్రామిక స్త్రీల విముక్తి గురించి, అవిద్య, అజ్ఞానం, అణిచివేతలలో మగ్గిపోయే అసంఖ్యాక స్త్రీల విముక్తి గురించి ఆలోచించాలని, పనిచేయాలని నిస్వార్ధంగా ప్రకటించిన అభ్యుదయ స్త్రీల సంఘం అత్యవసర పరిస్థితి మూలంగా ఆంక్షలకు నిర్భంధాలకు గురికావలసి వచ్చింది. ఏమైనా రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలుగా కాక స్వయంప్రతిపత్తితో పనిచేయటానికి సంఘర్షించే చైతన్యంతో మహిళా సంఘాలు ఎదగటానికి ఆంధ్రద్రేశ్‌లో తొలి బీజాలు వేసింది. అభ్యుదయ స్త్రీల సంఘం అత్యవసర పరిస్థితి తొలగిన తరువాత (1977) ఏర్పడిన స్త్రీ శక్తి సంఘటన ఆ బీజాలు మొలకెత్తటానికి దోహదకరంగా పనిచేసింది.
పదహేను మంది స్త్రీల సంఘటన ‘స్త్రీ శక్తి సంఘటన’ వీరిలో చాలా మందికి వామపక్ష రాజకీయ పార్టీలతో సంబంధాలున్నాయి. వామపక్ష రాజకీయ పార్టీలలో స్త్రీ సమస్య పట్ల సరియైన అవగాహన లేవన్న విమర్శతో ప్రారంభించి వానిని చక్కదిద్దే కార్యక్రమం వారు తీసుకొన్నారు. అయితే వామపక్ష రాజకీయ పార్టీల అనుబంధ సంస్థగా కాక స్వతంత్రమైన గుర్తింపు, ప్రత్యేకమైన పనితీరుతో వాళ్ళందరు సిద్దమయ్యారు. చైతన్యవంతంగా ప్రయత్నించారు. కూరగాయల ఎగుమతికి, సాంఘిక సంక్షేమ హాస్టళ్ళల్లో జరిగే అధికార దుర్వినియోగానికి, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించింది స్త్రీ శక్తి సంఘటన. కూరగాయల ఎగుమతి వల్ల ధరలు పెరిగి, సామాన్య గృహిణులకు అందుబాటులో లేకుండాపోవటం వలన ఆ సమస్యపై వాళ్ళను కదిలించటం సులభమైంది. అదలా వుంచితే ఒక ఆర్ధిక విధానం స్త్రీల జీవితంపై వేసే ప్రభావాల గురించి ఆలోచించటం నేర్పిన ఒక అనుభవం అయింది ఇది. అలాగే సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ గురించి, ఉద్యోగినుల హాస్టళ్ళ గురించి, ఆక్కడి జీవన పరిస్థితులను, పనితీరును అధ్యయనం చేసే క్రమంలో స్త్రీల మీద ఇంట్లోనే కాక బయట కూడా అమలయ్యే పితృస్వామిక నియంత్రణ, ఒంటరి స్త్రీ సమస్య మొదలైనవి స్త్రీ సమస్యలుగా ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసినదిగా గ్రహింపు కలిగింది.
కుటుంబంలో అసమానతలు, వివక్ష, వరకట్నం వేధింపులు వధూదహనాలు, హింస మొదలైన సమస్యల మీద పనిచేస్తూ స్త్రీ శక్తి సంఘటన కుటుంబ హింసపై వీది నాటకాలను ప్రదర్శించటం ద్వారా ప్రజల చైతన్యాన్ని అభివృద్ధి పరిచే ప్రయత్నం చేసెంది. రేప్‌కు వ్యతిరేక ఆందోళన 1970వ దశకంలో చాలా కీలకమైంది. 1972లో మహరాష్ట్రలో పోలీసుల చేత రేప్ చేయబడిన ‘మధుర’ కేసులో ఆమె పదిహేనేళ్ళ బాలికే కానీ కన్యకాదని రేప్‌ను ప్రతిఘటించలేదని రెండు కారణాలు చెప్పి సుప్రీంకోర్టు, బొంబాయి హైకోర్టు తీర్పును కాదని పోలీసులు నిర్థోషులని తీర్పు ఇచ్చిన సందర్భంలో 1978లో మహిళా సంస్థలు దేశ వ్యాప్త ఆందోళనకు దిగాయి. రేప్ చట్టాలలో సవరణలను కోరి సాధించాయి. ఆ అనుభవాల నుండిస్త్రీ శక్తి సంఘటన 1978లో రమీజాబీ రేప్ కేసులోనూ, 1979లో షకీలా కేసులోనూ ప్రభుత్వ పోలీసు అధికారులే అత్యాచార నేరస్థులని నిరూపించటంలోనూ, ప్రచారం చేయటంలోనూ, నేరస్థులను తగిన విధంగా శిక్షించాలని డిమాండు చేయటంలోనూ తీవ్రంగా కృషి చేసింది.
1978 నాటికి ఉత్తర తెలంగాణ రైతాంగ ఉద్యమం ఉదృతస్థాయి లో వుంది. సిరిసిల్లా, జగిత్యాల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి పోలీసు బలగాలను మోహరించి రైతు కూలీ సంఘ కార్యకర్తలను భయభ్రాంతులను చేసే విధంగా గ్రామాలలో భూస్వా ముల, గుండాల, పోలీసుల దాడులు నిత్యకృత్యమయ్యాయి. అందులో భాగంగా స్త్రీలు అనేకమంది అత్యాచారాలకు గురయ్యారు. కొదురుపాక రాజవ్వ, సత్తెవ్వ మొదలైన వాళ్ళు ఆ కోవలో వారు. ఆయా సందర్భాలలో స్త్రీ శక్తి సంఘటన గ్రామాలకు వెళ్ళి ఆ స్త్రీలను కలిసి నిజాలను రాబట్టే నివేదికలు ప్రచురించింది. సత్తెమ్మ (1985) పక్షాన కోర్టులు పబ్లిక్ ఇంటరెస్ట్ కేసు కూడా పెట్టింది. ఆ రకంగా శ్రామిక స్త్రీల సమస్యలతో తన ఏజండాను విస్తృతంగా చేసుకొన్నది. లైంగిక అత్యాచారం ఆధిపత్య స్థాపనలో భాగం అన్న అవగాహనను అభివృద్ధి చేసింది. అలాగే లింగనిర్ధారణ పరీక్షలు, ప్రభుత్వ జనాభా విధానం శరీరం మీద స్త్రీల హక్కులను పూర్తిగా నిరాకరిస్తున్నాయని – విమర్శ పెట్టింది. వ్యక్తి గతమంతా రాజకీయమే అన్న సూత్రం ప్రాతిపదికగా స్త్రీ శరీరం మీద, మెదడు మీద సమాజంలో అమలవు తున్న నియంత్రణలను అర్ధం చేసుకోవాలన్న అవగాహనను ఇచ్చింది.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటలంలో స్త్రీల పాత్ర, అనుభవాలను పరిశీలించి పరిశోధించి స్త్రీ శక్తి సంఘట ప్రచురించిన మనకు తెలియని మన చరిత్ర (1986) ఉద్యమాలను అనుభవాలను స్త్రీల దృష్టికోణం నుండి అధ్యయనం చేయటానికి, విశ్లేషించటానికి ఒక తొలి నమూనా.
కమ్యూనిస్టు పార్టీల నిర్మాణంలోని బిగువైన వర్గ చట్రం నుండి మాత్రమే కాక మానవ సంబంధాలలోని అసమానతలను లింగ ప్రాతిపదిక మీద అర్ధం చేసుకోవలసి వుందన్న నూతన స్త్రీవాద దృక్పధాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అంటుకట్టటంలో అభ్యుదయ స్త్రీల సంఘం, స్త్రీ శక్తి సంఘటన రెండూ గొప్ప చారిత్రక పాత్రను నిర్వహించాయి. ‘ఫెమినిస్టు స్టడీ సర్కిల్’ వంటివి అందుకు అవసరమైన సైద్ధాంతిక జ్ఞానాన్ని అధ్యయనం, చర్చల ప్రాతిపదిక మీద వ్యాప్తిలోకి తెచ్చాయి. దానితో స్త్రీ సమస్య మీద ఎవరి అవగాహన మేరకు వాళ్ళు ఎక్కడికక్కడ సంఘాలుగా ఏర్పడి అవగాహన కార్యక్రమాలు, ఆచరణ కార్యక్రమాలు నిర్వహించటం మొదలైంది. భిన్న సామాజిక సాంస్కృతిక సందర్భాల నుండి స్పాంటేనియస్ ఉద్యమాలు నిర్దిష్ట ప్రయోజనాన్ని ఆశించి నిర్వహించబడటం 1980 దశకం నుండి స్త్రీల ఉద్యమంలోని ప్రత్యేకత. ఈ దశకంలోనే అన్వేషి అనే స్త్రీల అధ్యయన సంస్థ హైదరాబాదులో ఏర్పడింది. 1993 నుండి నడుస్తున్న ‘భూమిక’ పత్రికకు సంపాదకురాలు కొండవీటి సత్యవతి. అస్మిత కూడా ఆ రకంగా ఏర్పడి పనిచేస్తున్న సంస్థే.