అరుదైన మహిళామణులు

వేములపల్లి సత్యవతి

సరళా థక్రాల్‌:

స్త్రీలు గడప దాటి బయటకు అడుగుపెట్టటం మహాపరాధంగా, మహాపచారంగా సమా జంలో కట్టుబాట్లు, సాంప్రదాయలు వున్న రోజుల్లో బ్రిటిష్‌వారు మనదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు వాణిజ్య విమా న చోదకురాలిగా పనిచేసిన మహిళ సరళా థక్రాల్‌.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 1914లో జన్మించింది. తర్వాత వారి కుటుంబం అజ్మీర్‌ వెళ్లి అక్కడే స్థిరపడింది. ఒక పైలట్‌తో సరళ వివాహం జరిగింది. మా మగారు కూడ పైలటే. భర్త-మామగార్ల ప్రోద్బలంతో ఢిల్లీలోని ఫ్లయింగు క్లబ్‌లో సభ్యురాలుగా చేరి శిక్షణ పొందింది. అప్పుడు సరళ వయసు 21 సంవత్సరాలు. అప్పటికే ఆమెకు నాల్గు సంవత్సరాల కూతురుంది. వేయిగంటలు విమా నం నడిపిన అనుభవంతో ‘ఎ’ లైసెన్స్‌ పొందింది. ‘టూ సీటర్‌ జిప్సీవత్‌’ విమా నం ఆమె నడిపారు. పైలట్‌ తప్ప ఇంకెవ్వరూ వుండని ‘సోల్‌’ వివనాన్ని సరళ నడిపారు. ఆ రోజుల్లో చాలామంది పురుషులు కూడ ‘సోల్‌’ విమానాన్ని నడపటానికి సాహసించేవారు కాదు. కాక్‌పిట్‌లో అడుగుపెట్టిన తర్వాత భయము, బెదురులాంటివి తన దరిచేరలేదని సరళ చెప్పారు. మంచి పైలట్‌గా గుర్తింపు పొందారు.
జీవితంలో ఎదురైన ఆటు-పోటులను, వివాదాలను ధైర్యంగా, నిబ్బరంగా భరించారు. ఆమె భర్త, మరది విమాన ప్రమాదాలలో ఒకేరోజు మరణించారు. దానికి తోడు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయినందున వాణిజ్య విమానాలను ప్రభుత్వం నిషేధించింది. భర్త మరణం ఒకవైపు, పైలట్‌ ఉద్యోగం పోవటం మరోవైపు. అయినా ఆమె కృంగిపోకుండా లాహోర్‌లోని ‘వెయె స్కల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌’లో చేరి శిక్షణ పొందారు. పెయింటింగు వచ్చు. నగల-దుస్తుల డిజైన్లకు రూపకల్పన చేయగలరు. ఆమెలోని ఈ సృజనాత్మకశక్తి జీవనాధారమైంది. ఆర్యసమాజ కుటుంబంలో జన్మించుట వలన అబ్బిన సంస్కారం వలన, సంస్కరణల దృష్టివల్లనే వీటన్నిటిని అధిగమించి తృప్తిగా జీవించగలుగుతున్నానంటారామె. ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్‌ ప్రాంతంలో ఒంటరిగానే వుంటున్నారు. ఆర్థికంగా ఎవరిమీదా ఆధారపడకుండా జీవిస్తున్నారు. 92 సంవత్సరాల వయసులో పనిమనిషి సాయంకూడా లేకుండా తన పనులు తానే చేసుకుంటున్నారు. కష్టాలను మరచి పోవటానికి, విజయం సాధించటానికి కష్టపడి పనిచేయటమొక్కటే ఏకైక మార్గమని సరళా థక్రాల్‌ దృఢమైన అభిప్రాయం.
కమలాదేవి చటోపాధ్యాయ:
విధానమండలిలో అడుగుపెట్టిన ప్రథమ మహిళ కమలాదేవి చటోపాధ్యాయ. హస్తకళలకు ఆద్యురాలు. నేడు హస్తకళలు ఈ రూపంలో నిలబడటానికి, ఒక స్థానాన్ని సంపాదించుకోవటానికి కమలాదేవి అనితర కృషియే కారణం. కావున ఆ ఘనత ఆమెకే చెందుతుంది. గొప్ప సమాజసేవిక. అకళింకిత దేశభక్తురాలు. సరోజినీనాయుడు సోదరుడు హరీంద్రనాథ చటోపాధ్యాయను వివాహమాడారు. అభిప్రాయభేదాల వలన విడిపోయరు.
ముత్తు లక్ష్మిరెడ్డి:
విధానమండలిలో ప్రవేశించిన ద్వితీయ మహిళ ముత్తు లక్ష్మిరెడ్డి. మహిళలు శాసనసభలకు ఎన్నికయినపుడు, స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ వంటివాటిలో ఎన్నికయినపుడు నిలకడగా, నిర్మాణాత్మకం గా కార్యక్రమాలను నిర్వహిస్తారని ఈ యిరువులు మహిళలు నిరపించారు.
సుమతీ అయ్యర్‌:
తొలితరం మహిళా క్రికెటర్‌గా, అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా అంచెలంచెలుగా ఎదుగుతూ పోయరు సుమతీ అయ్యర్‌. తమిళనాడు రాష్ట్రం నుంచి సౌత్‌జోన్‌ సెలక్టర్‌గా, యువశక్తి స్టీరింగు కమిటి ఛైర్మన్‌గా, కెనరా బ్యాంక్‌ రిటైల్‌ మార్కెటింగు అధికారిగా పలు బాధ్యతలు నిర్వహించారు. క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌గా, బౌలర్‌గా, అంపైర్‌గా తన ప్రతిభా పాటవాలను చాటుకున్నారు. అవకాశా లుంటే మహిళలు అన్ని రంగాలలోను విజయకేతనం ఎగురవేయగలరని, బాలారిష్టాల్ని అధిగమించి పురోగమించ గలరని నిరూపించారు సుమతీ అయ్యర్‌.
కడప రామసుబ్బమ్మ గారు:
దక్షిణభారతాన జిల్లా బోర్డు అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ కడప రామసుబ్బమ్మగారు. సంఘసేవకురాలు. దేశభక్తుడు కడప కోటిరెడ్డిగారి ధర్మపత్ని.
శిరీన్‌ నిషాత్‌:
కరుడుగట్టిన మతఛాందసుడు కీ.శే. అయతుల్లా ఖొమేనీ పరిపాలించిన ఇరాన్‌ దేశీయురాలు. ఇరానియన్‌ విజువల్‌ ఆర్టిస్ట్‌, ఫిల్మ్‌మేకర్‌. స్త్రీ అంటే అబల అని భావించిన వారి మనస్సులో ముద్రితమైన బొమ్మను చెదరగొట్టాలనే తలంపుతో రకరకాల ఇమేజెస్‌ను మనముందు పెడుతుంటారు నిషాత్‌. ”ఏదైనా ఒకపని చేస్తే గుండె ఆగిపోవాలి. లేకపోతే ఏడుపు రావాలి. అటువంటి పనులు చేయాలని వుంటుంది నాకు. నేను చేస్తున్న పనుల వలన మీ మనసులు కలవరపడినా చాలనుకుంటాను” అని తన అభిప్రాయలను వ్యక్తం చేసింది నిషాత్‌. ఈ అభిప్రాయలను వెల్లడించి నపుడు నిషాత్‌ న్యూయర్కులో ఉంది. అక్కడ ఆమె ‘విమెన్‌ వితౌట్‌ మెన్‌’ అనే ఫీచర్‌ఫిల్మ్‌ (జులై 2004) తీసే పనిలో నిమగ్నమై వుంది.
శిరీన్‌ ఇబాదీ:
ఈమె కూడ ఇరాన్‌ దేశీయురాలే. మహిళా న్యాయవాది. మహిళల హక్కుల కోసం, మానవహక్కుల కోసం పోరాడుతున్న మహిళ. ప్రపంచంలో ‘నోబెల్‌’ బహుమతి పొందిన మొదటి ముస్లిం మహిళ.
సయీదా హమీద్‌:
భారతదేశంలో ”ముస్లిం విమెన్స్‌ ఫోరం” స్థాపించి ముస్లిం మహిళల హక్కుల కొరకు పోరాడుతున్నది. వారి అభివృద్ధికి కృషిజేస్తున్నది.
అమినా నక్వీ:
హైదరాబాద్‌ ఉస్మానియ యూని వర్శిటీిలో బురఖా ధరించి అడుగుపెట్టిన ముస్లిం విద్యార్థిని. యూనివర్శిటీలో పరదాచాటునే న్యాయశాస్త్రం చదివి స్టేట్‌ తొలి మహిళా న్యాయవాదిగా పనిచేసిన ముస్లిం వనిత. ముంబయిలో తొలి మహిళా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేసింది. చీఫ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా రిటైరయింది. 1954- 56లో ఉస్మానియ యూనివర్శిటీ సెనేట్‌ సభ్యురాలిగా నామినేట్‌ చేయబడింది. ఆల్‌ ఇండియ విమెన్స్‌ కాన్ఫరెన్స్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, గిల్ట్‌ ఆఫ్‌ సర్వేలాంటి స్వచ్ఛంద సంస్థలతో కలసి పనిచేస్తున్నారు.
డాక్టర్‌ బి. విజయభారతి:
దళిత మేధావి. రచయిత్రి. ఆమె రాసిన సిరీస్‌లోని ‘షట్చక్రవర్తులు’ పుస్తకానికి 2003వ సంవత్సరంలో కెనడాలోని ‘డాక్టర్‌ అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ మిషనరీస్‌’, ‘ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లిటరరీ’ అవార్డులు వచ్చినవి. ప్రొఫెసరయిన విజయభారతి ‘దక్షిణాంధ్ర వాఙ్మయంలో సాంఘిక వ్యవస్థ’ అనే అంశంపై పిహెచ్‌డి చేసిన దళిత మహిళ. తెలుగు అకాడమీకి ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన తొలి దళిత మహిళ. ‘ప్రాచీన సాహిత్యకోశం’, ‘ఆధునిక సాహిత్యకోశం’ ఆమె సంపాదకత్వంలోనే వెలువడినవి. జ్యోతిబాఫూలేని ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమాలకు, తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన రచయిత్రి విజయభారతి.
కిరణ్‌బేడీ:
సంచలనాత్మకమైన పోలీస్‌ ఆఫీసర్‌గా వార్తలకెక్కారు. మాఫియ ముఠాలకు, రౌడీషీటర్లకు, గుండాలకు, అక్రమార్జన పరులకు, అరాచకశక్తులకు ఆమె సింహ స్వప్నం. సమర్ధ అధికారిణిగా, వృత్తిపట్ల అంకితభావంతో పనిచేసిన ఉన్నత పోలీస్‌ ఆఫీసర్‌గా గణుతికెక్కారు. విధి నిర్వహణలో అన్యాయన్ని ఎదిరించి న్యాయం చేకూర్చటానికి ఎవరి మాటలను లెక్క చేయలేదు. ఎవరి ముందు తలవంచలేదు. కొరకరాని కొయ్యలాగ వున్నదని తలచిన కొంతమంది ప్రబుద్ధులు తమ కార్యం నెరవేర్చుకోవటానికి ఆమె భర్త ద్వారా ఆమె మీద వత్తిడి తెచ్చారు. అయినా ఆమె లొంగలేదు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు పొడసూపినవి. వాటిని లెక్కచేయలేదు. ఒకసారి ఢిల్లీలో ఏదో సందర్భంలో ఒక న్యాయవాదిని అరెస్టు చేసింది. దానికి వ్యతిరేకంగా న్యాయవాదు లంతా ఏకమై కోర్టులకెళ్లమని బహి ష్కరించారు. అయినా ఆమె ఆ న్యాయవాదిని వదలలేదు. ప్రస్తుతం ఢిల్లీలో ‘బ్యరో ఆఫ్‌ పోలీస్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఈ మధ్యనే ఢిల్లీ పోలీస్‌ కమీషనర్‌గా కిరణ్‌బేడీ కంటె రెండు సంవత్సరాల జూనియర్‌ అధికారి దద్వాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినవి. సీనియర్‌ అయిన కిరణ్‌బేడీని నియమించ కుండా తనకంటె రెండు సంవత్సరాల జూనియర్‌ను ఆ పదవిలో నియమించి నందుకు ఆమె మనస్తాపం చెందారు. న్యాయపోరాటానికి వెనుకాడ లేదు. కేంద్ర కేబినెట్‌లో అంతిమ నిర్ణయం తీసుకోవలసిన దేశప్రధాని మన్‌వెహన్‌సింగు తన సీనియర్టీని ఎలా విస్మరించారని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇలా చేయటం వలన తననే కాకుండా పోలీస్‌ వ్యవస్థనే అగౌరవపరిచారని నిర్భయంగా చాటారు. ప్రధాని మన్‌మోహన్‌ ప్రతిభను గౌరవిస్తారన్న నమ్మకం యింకా తనకున్నదని, న్యాయం జరిగేవరకు పోరాడతానని ప్రకటించారు. ఆమె చేసిన అత్యుత్తమసేవలను, విధినిర్వహణలో అసాధారణమైన ధీరోదాత్తతను గుర్తించి ఐక్యరాజ్యసమితి ఆమెకు పతకం యిచ్చి సత్కరించింది. ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమె స్వంతం చేసుకున్నారు. మన ప్రభుత్వంలో నిజాయితీ లోపిస్తున్నదని ఢిల్లీ పోలీస్‌ కమీషనర్‌గా నియమించక పోవటంతో తేటతెల్లమౌతున్నది. ఇంతేగాక మన ప్రభుత్వం నుండి ఆమెకు ఇంతవరకు పోలీస్‌పతకం గాని, రాష్ట్రపతి పోలీస్‌ పతకం గాని లభించలేదు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం?
గీతాజోహ్రి:కిరణ్‌బేడీ తర్వాత చెప్పుకోదగిన మహిళా పోలీస్‌ ఆఫీసర్‌ గీతా జోహ్రి. గుజరాత్‌లో సిఐడీ విభాగం పీజీగా నియమింపబడింది. సోహ్రబుద్దీన్‌, అతని భార్య కౌసర్‌బీ నకిల్‌ ఎన్‌కౌంటర్‌ కేసును వెలికితీసింది. ఆ దంపతులు వైద్యంకోసం హైదరాబాద్‌ నుండి గుజరాత్‌కు బయలుదేరారు. ఆంధ్ర-గుజరాత్‌ సరిహద్దుల్లో బూటకపు ఎన్‌కౌంటర్‌ పేరుతో హతవర్చబడ్డారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ కేసులో నిందితులైన గుజరాత్‌ పోలీస్‌ అధికారుల నుంచి సేకరించినట్లు తెలిసింది. ఈ కేసులో ఆంధ్ర పోలీస్‌ అధికారుల ప్రమేయం కూడ వున్నదన్న సమాచారం తెలుసుకోవటానికి హైదరాబాద్‌ వచ్చి సంబంధిత అధికారులను కలసి వెళ్లింది. సుప్రీంకోర్టు ఆమె రిపోర్టులను స్టేట్‌ గవర్నమెంట్‌ ద్వారా కాకుండా ఆమె స్వయంగా పంపాలని ఆదేశాలు జారీచేసింది. ఆమె ఎంత నిజాయితీగల, అంకితభావంతో పనిచేస్తున్న ఆఫీసరో ఈ ఉదంతం వలన తేటతెల్లమవుతున్నది. సీఐడీ విభాగానికి చెందిన ముగ్గురు సీనియర్‌ ఐపిఎస్‌ ఆఫీసర్లపై 16-7-07న అలహాబాద్‌ హైకోర్టులో అభియెగపత్రం (చార్జీషీట్‌) దాఖలుచేసింది. సోహ్రబుద్దీన్‌ను చంపివేసిన ఎటిఎస్‌ విభాగం ఆయన భార్య కౌసర్‌బీని కూడా చంపి శవాన్ని దహనం చేసిందని ఆ అభియెగపత్రంలో పేర్కొన్నారు. అయిదుగురు ఆంధ్ర పోలీస్‌ అధికారులపై కూడ అభియెగాలు నమోదు చేశారు. ఇలాంటి జటిలమైన క్రిమినల్‌ కేసుల్లో పనిచేయటానికి చాలా తెగువ, ధైర్యసాహసాలు అవసరం. అవి గీతా జోహ్రిలో పుష్కలంగా వున్నాయి. దేశంలో ప్రతి రాష్ట్రానికీ కిరణ్‌బేడీ, గీతా జోహ్రిలాంటి ఆఫీసర్లు కనీసం ఒక్కరున్నా ప్రజలకెంతో మేలు జరుగుతుంది. కేసు విచారణలో వుంది.
సుశీలా చౌరాసియ:
పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌గా పనిచేసిన మొదటి భారతీయ మహిళ సుశీలా చౌరాసియ. ఆమె ఆ పదవిని 1979 మే 14వ తేదీన చేపట్టారు.
రాణీ కుముదునిదేవి:హైదరాబాద్‌ ప్రథమ మహిళా మేయరుగా పనిచేసారు.
కప్పగంతుల కమల:
ప్రాకృత భాషావేత్త కమల. ప్రాకృత సాహిత్యం ప్రజా సాహిత్యమని, లౌకిక సాహిత్యమని, గ్రామీణ, గిరిజన జీవితాల్ని చిత్రించిన సాహిత్యమని, దేశీఛందస్సులను ప్రోత్సహించిన సాహిత్యమని అనేక ఉదాహరణలతో నిరపించారు. ప్రాకృత గాథల్ని తెలుగులోకి తేవటం, సంస్కృత ఛాయతో అందివ్వటం చాలా కష్టంతో కూడుకున్న పని. కాని కమలగారు ఆ లోటును చాలావరకు తీర్చారు. పేదవారిని గురించి, గ్రామీణులను గురించి, గిరిజనులను గురించి, సాధారణ ప్రజల దైనిక జీవితాలను గురించి విపులంగా విశదీకరించిన విదుషీమణి. మానస సరోవర యత్ర ముగించుకొని తిరిగివస్త నేపాల్‌ చేరిన తర్వాత అక్కడే మరణించారు. అరుదైన ప్రాకృతభాషావేత్తను, విదుషీమణిని కోల్పోయం. దేశంలో నేడు వేళ్లమీద లెక్కింపదగిన అతికొద్దిమంది ప్రాకృత సాహిత్యవేత్తల్లో కమలగారు ఒకరు కావటం తెలుగువారు గర్వించదగిన విషయం.

కల్పనా చావ్లా:
అంతరిక్షంలోకి అడుగుపెట్టిన ప్రథమ భారతీయ మహిళ కల్పనాచావ్లా. ప్రపంచంలోనే అంతరిక్షయనం చేసి తిరిగివచ్చిన మొదటి మహిళ వాలెంటీనా తెరస్కోవా. రష్యా దేశీయురాలు. ఏ దేశానికి చెందినా ఆనందించదగిన, అభినందించ దగిన విషయమే కదా! కల్పనాచావ్లా హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో పుట్టింది. చండీగఢ్‌లోని పంజాబ్‌ యూనివర్శిటీలో ఇంజనీరింగు చదివింది. ఆపై ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లింది. విద్య పూర్తయిన తర్వాత ‘నాసా’ అంతరిక్ష పరిశోధన శిక్షణకేంద్రంలో స్థానం సంపాదించుకుంది. ‘నాసా’ నుండి అంతరిక్ష యనానికి ఎంపికయింది. రోదసీలో ప్రవేశించి అక్కడ చేయవలసిన పరిశోధనలను దిగ్విజయంగా నిర్వహించి భూమి మీదకు రావటానికి సిద్ధమయింది. ఆమెను తీసుకొస్తున్న ‘కొలంబియ’ వ్యోమనౌక కొన్ని క్షణాలలో భూమి మీదకు దిగవలసిన సమయంలో పేలిపోయింది. దివినుండి భువికి దిగుతున్న తార. ఆమెతోపాటు ఆ నౌకలో ప్రయణిస్తున్న ఏడుగురు వ్యోమగాములు మాడిమసై పోయరు. అనుకోని ఈ దుర్ఘటనకు ప్రపంచమంతా దిగ్భ్రాంతికి లోనయింది. భారతీయులు దుఃఖసముద్రంలో మునిగిపోయరు. ఆ దుర్దినాన్ని భారతీయులు ఎన్నటికీ మరచిపోలేరు. కల్పనాచావ్లా అమెరికన్‌ను వివాహమాడి అమెరికా పౌరసత్వం తీసుకుంది. దుఃఖాశ్రువులతో ఆమెకు జోహార్‌లర్పిద్దాం.

సునీత విలియం:
కల్పనా చావ్లా చేదు జ్ఞాపకం భారతీ యుల హృదయలలో మాసిపోకముందే భారతీయ సంతతికి చెందిన సునీత విలియం భారతీయ ద్వితీయ మహిళా వ్యోమగామినిగా 2006 డిశంబర్‌ 11వ తేదీన ‘నాసా’ కేంద్రం నుండి సూయజ్‌ వ్యోమనౌకలో అడుగుపెట్టింది. సునీత భారతదేశంలో జన్మించలేదు. అమెరికాలో జన్మించింది. తండ్రి గుజరాత్‌కు చెందిన దీపక్‌ పాండ్య. తల్లి బోనీ స్లోవేనియ దేశీయురాలు. అమెరికా జాతీయుడైన మైఖేల్‌ను వివాహం చేసుకుంది. అమెరికా పౌరసత్వం తీసుకుంది. కల్పన, సునీత భారతీయ సంతతికి చెందిన వారైనా అమెరికా పౌరులుగానే అంతరిక్షంలోనికెళ్లారు. సునీత ఆరుమాసాలు అంతరిక్షంలో వుండి తనకు అప్పచెప్పిన పనిని విజయవంతంగా పూర్తిచేసింది. రోదసీలో మొత్తం 29 గంటల 17 నిమిషాలు నడిచి రికార్డు నెలకొల్పింది. ఐఎఎఎస్‌లోనే వుంట ఏప్రియల్‌ 16న బోస్టన్‌లో జరిగిన వరథాన్‌ పరుగులో పాల్గొని మరో రికార్డు స్వంతం చేసుకుంది. అంతరిక్షంలోనే కాకుండ ‘నాసా ఎక్స్‌ట్రీమ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మిషన్‌ ఆపరేషన్స్‌’ నీవె బృందంతో కలసి మే 2002లో తొమ్మిది రోజులు సముద్రగర్భంలో వుండి పరిశోధనలు చేసింది.
అంతరిక్షం నుండి 23-6-07 శనివారం తెల్లవారుఝాము ఒంటిగంట 19 నిమిషాలకు ‘అట్లాంటిస్‌’ నౌకలో కాలిఫోర్నియలోని ఎడ్వర్డ్‌ వివనాశ్రయంలో భూమిమీదకు క్షేమంగా అడుగుపెట్టింది. ఆమెతోపాటు మరో ఆరుగురు వ్యోమగాములు భువికి చేరారు. అంతరిక్షంలో ఆరుమాసాలు గడిపి రోదసీలో 29 గంటల 17 నిమిషాలు నడిచిన ఘనత సునీత విలియంకే దక్కుతుంది. ఆకాశవీధుల్లో ఎంత ఎత్తుకు ఎగరగలదో అంత ఎత్తు ఎగిరి, సముద్రగర్భంలో ఎంత లోతుకు చొచ్చుకుపోగలదో అంత లోతుకు చొచ్చుకుపోయిన సునీత విలియమ్‌కు జేజేలు. ఆనందంతో హృదయపూర్వక అభినందనలు తెలుపుకుందాము. సెప్టెంబర్‌ 21న తన తండ్రి జన్మస్థానమైన జల్సాన్‌కు (గుజరాత్‌) వచ్చింది. గ్రామస్తుల అపూర్వ స్వాగత సత్కారాలకు వుబ్బితబ్బిబ్బయింది. అమెరికా పౌరసత్వం తీసుకున్నప్పటికి భారత పుత్రికనే అని చెప్పింది.

తస్లిమా నస్రీన్‌:

ప్రపంచంలో అన్ని దేశాలలోను, అన్ని భాషలలోను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కవయిత్రులు, రచయిత్రులు వున్నారు. పలురకాల అవార్డులు, పురస్కారాలు, జ్ఞానపీఠ అవార్డులు అందుకున్నవారు వున్నారు. స్త్రీవాద, దళిత, వర్గ, విప్లవ, అభ్యుదయ, భావ కవయిత్రులు, రచ యిత్రులు వున్నారు. తలకు వెల కట్టబడిన సంచలనాత్మకమైన రచయిత్రి తస్లిమానే నేమో! బంగ్లా దేశీయురాలు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్‌గా పనిచేస్త రచనా వ్యాపకంలోనికి అడుగుపెట్టింది. 1993లో బంగ్లా ప్రభుత్వం ఆమె రచనలు కొనసాగించ రాదని ఆజ్ఞలు జారీచేసి ఆమె పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయనికి నిరసనగా ఆమె వైద్యవృత్తికి రాజీనామా చేసింది.
బురఖా ధరించి పరదాచాటున కూపస్థమండకాలలాగ పడివుండవలసిన ముస్లిం మహిళలు చైతన్యవంతులవటం కరుడుగట్టిన మత దురహంకారులు, ఛాందసులు సహించలేకపోతున్నారు. ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్‌లో జకియజాకీ అనే జర్నలిస్టును తాలిబాన్‌ ముష్కరమూకలు వారి హెచ్చరికలను ఆమె లెక్క చేయలేదని రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో కాల్చి చంపారు. అదేవిధంగా ముల్లాలు తస్లిమా తల నరికితెచ్చినవారికి లక్షల్లో (ధనము) యిస్తామని ఫత్వా జారీచేశారు. ఖురానును-అల్లాను దూషించిందని అబద్ధ్దపు కేసుపెట్టి దైవదూషణ నేరం క్రింద బంగ్లా ప్రభుత్వం రెండు వసాలు జైలులో పెట్టింది. విడుదలయిన తర్వాత అప్పటినుండి నేటివరకు ప్రవాస జీవితం గడుపుతున్నది. అమెరికా, జర్మన్‌, స్వీడన్‌ దేశాలలో తలదాచుకోవలసి వచ్చింది. యూరోపియన్‌ పార్లమెంట్‌ నుంచి స్వేచ్ఛాభావజాల ప్రకటన కొరకు ‘సఖరోల్‌’ అవార్డు లభించింది. నేషనల్‌ సెక్యులర్‌ కౌన్సిల్‌లో తస్లిమా గౌరవ సభ్యురాలుగా ఎంపికయింది. ఆమె రచనలు దాదాపు 20 భాషలలోనికి అనువదించ బడినవి. ప్రథమంగా సంచలనం సృష్టించిన, బంగ్లాదేశ్‌ ప్రభుత్వ ఆగ్రహానికి గురై, ప్రపంచములో అభ్యుదయవాదులచేత ఆదరించబడిన నవల ‘లజ్జ’. దానిలో బంగ్లాదేశ్‌లో మైనారిటీల భయంకరమైన వాస్తవ జీవితాలను యథాతథంగా రాసింది. ప్రతిభాపాటిల్‌ (రాష్ట్రపతి) ముస్లిం మహిళాసోదరీమణులు బురఖాను ధరించటం మానివేయమని విజ్ఞప్తి చేసింది. దానికి మన హైదరాబాద్‌లోని ముల్లాలు, మతాధికారులు (ముషీరాబాద్‌ లోనను కుంటా) సమావేశమై తమ మతవిషయలలో జోక్యం చేసుకున్నందుకు నిరసనగా ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు.
తస్లివ నస్రీన్‌ ఆగష్టు తొమ్మిది 2007న హైదరాబాద్‌ వచ్చారు. ఆమె రచించిన ‘శోధ్‌‌’ నవలను, చైనా రచయిత్రి నవల ‘జాంగుచాంగు’ను తెలుగులోనికి అనువాదం చేసి వాటిని ఆమెచేత ఆవిష్కరించుటకు సోమాజీగడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాట్లు చేయబడినవి. ‘శోధ్‌’ ను చెల్లుకుచెల్లు ‘జాంగుచాంగును’ అడవిగాచిన వెన్నెల పేర్లతో అనువదించారు. ‘ఈనాడు’ దినపత్రిక జర్నలిజం స్కూల్‌ ప్రిన్సిపాల్‌ నాగేశ్వరరావుగారు అధ్యక్షత వహించారు. కార్యక్రమం మొదలై తస్లిమా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇంతలో మజ్లిస్‌ ఎమ్‌ఎల్‌ఏలు తమ అనుచరగణముతో సభలో ప్రవేశించి వేదికను ధ్వంసం చేసి తస్లిమాపై దాడికి దిగారు. కార్యక్రమ నిర్వాహకుడు ఇన్నయ్యగారు, నాగేశ్వరరావుగారు, మీడియ ప్రతినిధులు, ప్రెస్‌క్లబ్‌ కార్యకర్తలు అంతా ఏకమై ఆమెను కాపాడారు. కార్యక్రమ నిర్వాహకులలో ఓల్గాకూడ వున్నారు. చివరకు పోలీసు రక్షణతో బేగంపేట వివనాశ్రయం చేర్చి కలకత్తాకు పంపివేశారు. ఆమె ప్రాణాలకు భద్రతలేదు. పురుషాహంకారులకు వ్యతిరేకంగా తన కలాన్నే కత్తిగా చేసి పోరాటం సాగిస్తానని, భయపడి వెనుకంజ వేసేది లేదని తస్లిమా తన భావాలను ప్రకటించింది. దాడిచేసిన ముస్లింనేతలు తస్లిమాపై నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ కేసుపెట్టారు.
మన రాష్ట్రంలోని ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయవాదులు ముక్తకంఠంతో ఈ హేయమైన దాడిని ఖండించారు. వివిధ మహిళాసంఘాలు మజ్లిస్‌ ఎమ్‌ఎల్‌ఏలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినవి. న్యాయస్థానంలో కేసు కూడ పెట్టినవి. నిజంగా ఒక విలక్షణమైన, సంచలనాత్మక మైన రచయిత్రి తస్లిమా నస్రీన్‌. మాతృదేశాన్ని వదలిపెట్టడమే కాకుండా తల్లితండ్రులను తోబుట్టువులను అందరన వదలి దేశదేశాలు తిరిగి తలదాచుకోవలసి వస్తున్నది. అందరి సహకారంతో ఆమెకు ఆ దుర్దినాలు తొలగిపోవాలని ఆశిద్దాం.

ఒకళ్లకు పుట్టింది. ఇద్దరికి పుట్టింది. అర్ధరాత్రి కూడా అందరికీ పుట్టిందని మన పల్లెల్లో ఈ సామెతను వాడతారు. ఏదైనా చెడుపని ఒకరు చేస్తే దాన్ని చూసి మరొకరు ఆలాంటి పనినే చేసినపుడు ఆ సామెత చెప్పుతారు. తలలకు వెలకట్టి తెచ్చి యిచ్చినవారికి భారీ పారితోషికం యివ్వబడుతుందని యింతవరకు ఇస్లాం మతంలోని ముల్లాలు ప్రకటించారు. వాళ్ళకన్న మేమేమి తక్కువ తిన్నామా అని విశ్వహిందపరిషత్‌ కరుణానిధి తలనరికి తెస్తే తెచ్చినవారికి బంగారము, కోటి రపాయలు యిస్తామని ప్రకటించారని పత్రికల్లో వచ్చిన వార్త. ఇంతకూ దీనికి కారణం సేతుసముద్రం ప్రాజెక్టు వివాదం. ప్రజాస్వామిక యుగంలో భావస్వేచ్ఛా ప్రకటనకు వీలులేకుండ పోతున్నదని తస్లిమాపై దాడి, రామసేతువివాదం, అలాగే సల్మాన్‌ రష్దీ విషయంలోను చోటుచేసుకున్న ఘటనల వలన తేటతెల్లమౌతోంది. ఇది ఆరోగ్యకరమైన లక్షణం కాదు. సమాజానికి ముప్పుతెచ్చే వీటిని ఆదిలోనే అంత మొందించాలి

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to అరుదైన మహిళామణులు

  1. maddirala siddardha says:

    మీ వ్యాసము చాలా బాగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.