బీజమంత్రం – ఒడియా మూలం: ప్రతిభారాయ్‌ – అనువాదం: Jayasree Mohanraj

రాణి కాలుజారిన ఆడ కూతుళ్ళను శాపనార్థం పెట్టదు. సానుభూతితో వాళ్ళ పాప ఖర్మాన్ని కడిగి తుడిచివేస్తుంది. మనిషన్న తర్వాత పొరపాట్లు సహజం. సాధు సన్యాసులకే తప్పడం లేదు. విశ్వామిత్రుడు, అహల్య ఇలా యెంతమంది లేరు? శాస్త్రాలు వారి గురించి యేమన్నా రాణి మాత్రం అంటుంది- ‘పెద్దవాళ్ళు బియ్యం నముల్తే అది వాతపిత్తాలకు మంచిది. అదే బీదవాళ్ళు చేస్తే అది ఆకలి తీర్చుకోవడానికా?’ ఈ ప్రపంచంలో ఇంద్రుడిలాంటి కాముకులు, అహల్యలాంటి పరపురుషుల మైకంలో పడిన వారికి కొదవలేదు. గౌతముడిలాంటి ఏకపక్ష తీర్పునిచ్చే పాషాణ గుండెల భర్తలకు కొదవలేదు. పాపులపైన పూలు, చందనం జల్లి మోక్షాన్నిచ్చే రామచంద్రులు కొద్ది మంది మాత్రమే ఉన్నారు, ఉంటారు. ఈ ప్రపంచంలో స్వంత బిడ్డలను మృత్యుముఖంలో పడవేసి తాము మాత్రం స్వర్గానికి వెళ్ళిపోయే విశ్వామిత్ర మేనకల్లాంటి స్వార్ధపరులకు కొదవలేదు. చాలా కొద్దిమంది పాపఫలాన్ని అక్కున చేర్చుకునేవారు కన్పిస్తారు. గర్భంలో బిడ్డ బయటి ప్రపంచం చూసేంత యెదిగిపోతే రాణి గర్భస్రావం చేయడానికి ఒప్పుకోదు. అది తల్లి ప్రాణానికి ముప్పు ఇంతవరకూ యేం చేస్తున్నారట ? ఏమి తెలియలేదా? లేకపోతే రసికుడైన ఆ మగవాడు గాజులు తొడిగి, పాపిట్లో సింధూరం నించి తన ఆలిగా చేసుకుంటాడని అనుకున్నారా? అయినా అటువంటి నిండా మునిగిపోతున్నవారు రాణిని ఆశ్రయిస్తారు. కడుపు దించెయ్యమని చాలా డబ్బు, చీరలు ఇంకా యేమేమో ఇస్తామని ఆశ చూపుతారు. తల్లి సంగతి తర్వాత చూద్దాం బయటివాళ్ళకు తెలియకుండా ఉంటే చాలు. ఆయుష్షు ఉంటే ఆమె బతుకుతుంది. లేకపోతే లేదు. ఈ సమాజం చేసే నిష్ఠూరాల నుండి తప్పుకుంటుంది కనీసం. రాణికు పాపం అంటదు. కాని రాణి యెవరి మాట వినదు. డబ్బాశతో తల్లి ప్రాణాలకు తెచ్చేపని రాణి చేయదు.

 నిజానికి రాణి తలచుకుంటే చాలా డబ్బు గడించి మేడలు, మిద్దెలు కట్టి ఉండేది. కాని జీవితమంతా రాత్రులు మెలకువగా ఉండి గర్భస్రావాలు చేస్తూ ఉన్నా ఆఖరి రోజుల్లో ఆమెకు తన గుడిసె ఓ చిన్న అరుగు, చిన్న గుమ్మం దానికి ఉన్న పాత తలుపు ఉన్నాయి. గుడిసె మీద గడ్డి కప్పు తప్ప డాబా కూడా వేయలేదు. ఆమె రూప సౌందర్యాలు మాసిపోలేదు. ఎక్కడా డబ్బు సంపాదించినట్లు కనపడదు. ఆమె పండిన జుట్టు నూనెతో చితచితలాడలేదు. ఆమె జుట్టు ముడి ఓ మంత్రపు పెట్టెలా కనిపిస్తుంది. దాన్లో ఆమె ఎందరో పెద్దవాళ్ళ, ధనికుల, మధ్యతరగతి వాళ్ళ, పేదవాళ్ళ రహస్యాలను గొంతునులిమి బంధించి ఉంచింది. ఆమెను జుట్టు విరబోసుకుని యెవరూ చూడలేదు. ఆమె నోట్లోంచి యెవరూ వేరేవాళ్ళ రహస్యాలను వినలేదు. ఆమె పునిస్త్రీగా ఉన్నప్పుడూ నుదుట సింధూరం ఎవరూ చూడలేదు. విశాలమైన ఆమె నుదుట ఓ నల్లని చుక్క, ముక్కుకి ఓ వెండి పుడక చేప రూపంలో, చెవులకు ఇత్తడి కమ్మలు, పొడవుగా ఉండే మెడకు గొలుసు యివే ఆమె ఎప్పుడూ వేసుకునేవి. కాళ్ళకు వెండి మట్టెలు, వేళ్ళకు వెండి ఉంగరాలు ముఫై యేళ్ళ క్రితం చేయించుకున్నవి అలానే యిప్పటి వరకూ ఉన్నాయి. అంటే గత ముఫైయేళ్ళుగా ఆమె శరీరం భారం కాలేదని అర్థం. వెడల్పు అంచు ఉన్న తెల్లటి ముతక చీరలు మాత్రమే కడుతుంది. ఆమెను ఇప్పటి వరకు యెవరూ రంగు చీరల్లో చూడలేదు. ఆమె వెడల్పయిన మొహంలో తమలపాకుల్తో యెర్రబడిన పెదవులు బాగుంటాయి. ఆమెది నవ్వు మొహం. దానిమ్మ గింజల్లాంటి పలువరుసలు మాట్లాడేటప్పుడు కనీకనిపించక ఉంటాయి. పళ్ళికిలించి రాణి యెన్నడూ గట్టిగా నవ్వలేదు. ఆమె యెక్కువగా మాట్లాడదు. ఎల్లప్పుడు యేదో బాధ్యతతో నలుగుతున్నట్లే, యేదో ఆలోచనల్లో ఉన్నట్లే కన్పిస్తుంది.

 అయితే రాణికి యెవరి గురించి అంత ఆలోచన? భర్త కలకత్తాలో పనిచేస్తాడు. ఎప్పుడైనా యింటికొస్తాడు. ఆమె ఒక్కగానొక్క కొడుకు కూడా పదిహేనేళ్ళ వాడయినప్పటి నుండి కలకత్తాలోనే ఉన్నాడు. తండ్రితో బాటు వాడు కూడా పరాయి రాష్ట్రంలోనే ఉన్నాడు. ఇక తోడి కోడళ్ళు, మరుదులు, బావలు, అత్తలతో రాణికి సంబంధాలు అంతంత మాత్రమే. ఒక్క చూరు కింద ఉన్నా వేరు కుంపట్లు. నిజం చెప్పాలంటే రాణిది ఏకాకి జీవితం. అయితే ఒంటరి తనం అనుభవించడానికి ఆమెకు తీరికెక్కడ? చుట్టుపక్కల పది గ్రామాల్లో ఆమె ఒక్కతే నమ్మదగిన గర్భోద్ధారిణి, స్త్రీలకు సంకట హారిణి. గ్రామాల్లో పెద్దపెద్ద అంగలేస్తూ ఆమె ఒకదాని తర్వాత ఒక గర్భస్రావం చేస్తూ వెళ్తుంది. ఎవరెంతిస్తే అంత సంతోషంగా తీసుకుంటుంది. బేరాలాడదు. గర్భయాతన కన్నా పెద్ద యాతన ఉండదు. తోటి స్త్రీలు నొప్పులతో కష్టం భరిస్తుండగా బేరసారాలు చేసేందుకు రాణికి మనసొప్పదు. ముందు బిడ్డ యీ భూమ్మీద పడనీ. ఆ తర్వాత సంగతి చూసుకోవచ్చు. సక్రమ సంతానమో, అక్రమ సంతానమో ముందు బిడ్డ యేడ్పు వినిపిస్తే రాణి మనసంతా పులకించిపోతుంది. గొంతులో యేదో అడ్డం పడినట్లనిపిస్తుంది. లోకులు రాణి కడుపుదించేందుకు చాలా అడుగుతుందని అనుకుంటారు. కాని వారికేం తెలుసు శిశువు రాణి అంతరాత్మ యెంత శాంతి పొందుతుందని? ఆడబిడ్డయినా, మొగబిడ్డయినా మొదటి యేడ్పుతో యీ భూమ్మీద పడ్తారు. అంతేచాలు. విడిపోయిన జుట్టుముడిని సరిచేసుకుంటూ, నోట్లో ఓ కిళ్లీ తురిమేసుకుని ప్రసూతి గది నుండి మారు మాట్లాడక బయటకు వచ్చేస్తుంది. రాణికి పనయిపోయిన తర్వాత యెవరెంత యిచ్చినా ఆమె యిల్లు మునుపట్లా గడిచిపోతుంది. ఏమీ మార్పు ఉండదు. ఒంటరి ఆడదాని ఒక్క  కడుపుకు ఇంత అన్నం కూర కాకుండా వెండి బంగారాలు తినాలని అనుకోదు కదా, అత్యాశకు పోవడానికి? పాపపు గర్భం తీసి బయటకు వచ్చినప్పుడల్లా రాణి గుండె బరువెక్కిపోతుంది. మనసు తేలికై పోతుంది, పోనీ ఆడకూతురు బతికి పోయింది కదా అని. తప్పెవరిది అని ఆలోచించాల్సిన సమయం కాదిది. పాపపు గర్భం పురుషుడి వలనేనని స్త్రీల తప్పులేదని రాణి ఎప్పుడూ అనదు. అయితే అప్పుడప్పుడు నిర్దోషులు అమాయకులైన ఆడవాళ్ళు ఇలా కడుపు చేసుకుంటారు. కుంతికి జన్మించిన కర్ణుడితోపాటు పాండవులు కూడా అక్రమ సంతానమని అనుకుంటే కర్ణుడికి జన్మనిచ్చిన కుంతి తప్పేం ఉంది? అమాయకురాలైన ఆడపిల్ల చేతిలో అంత బుద్దిమంతుడైన రుషి పురుష వశీకరణ మంత్రం ఇచ్చేసి ఆమె కుతూహలంతో దాన్ని ప్రయోగిస్తే ఆమెను దోషిగా నిలబెట్ట వచ్చునా? అయితే మగవాడు స్త్రీకు పుత్రదానం చేయలేకపోతే ఆమెను యేదేవతల దగ్గరకో పంపొచ్చట. ఏమంటే కులాన్ని రక్షించాలి అనంటారు. భర్త మగతనాన్ని కాపాడుకుంటాడు. అది మాత్రం కాదు పదిపదకొండేళ్ళ అమాయకులైన ఆడపిల్లలను బాబాయిలు, తండ్రులు, అన్నలు, పాలేర్లు, ట్యూషన్‌ మాస్టార్లు…… ఛీ….ఛీ….. భూమ్మీద నరకం కాక ఇంకేమవుతుంది? ఇదీ కాక వదినా మరిది. బావ మరదలు ఇలా రాణి ఎన్ని చూడ్లేదు? అయితే మనిషన్న తర్వాత తప్పుచేస్తారు. కాలు జారతారు. అన్న సానుభూతితో చూస్తుంది రాణి అన్నింటినీ.

 భర్తకి పుట్టనీ, పర పురుషుడికి పుట్టనీ ప్రసవ వేదనతో తన్నులాడుతున్న స్త్రీలు మాత్రం రాణి కంటికి దేవిమాతృలుగా కనిపిస్తారు. అప్పుడే భూమ్మీద పడ్డ పసికందులు దేవతా వరప్రసాదులు ఆమెకు. స్త్రీకి ఈ రూపంకన్న అందమైంది ఇంకొకటి లేదు. ఎవరైనా పసిపాపలుగా ఉన్నప్పుడు ముద్దొస్తారు. రాణి తన కళ్ళతో దేవుడ్ని చూడలేదు, సంబరాల్లో చూసింది మాత్రమే. కారణం ఆమెకు గుడిలో ప్రవేశం లేదు. ఆమె తక్కువ కులంలో జన్మించింది. నీచమైన పనులు చేసేవాళ్ళు తక్కువ జాతివారు కారు, కాని నీచమైన పనుల మరకలు తుడిచే వారిని తక్కువ జాతి అంటారు. ఆమె తోటివారు అశుభ్రాన్ని శుభ్రం చేస్తారు. అందుకే వారిని తక్కువ జాతివారని చిన్న చూపు చూస్తారు గాని నిజంగా తక్కువ రకమైన పనులు చేసేవారు మాత్రం ఉచ్ఛకులం వారుగా చలామణి అవుతారు. రాణి చిన్న మెదడు సమాజంలో జరుగుతున్న ఈ విపరీతాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. దీన్ని ఖండించలేదు కూడా. ఈ పూల చెట్టు మందిరం గోడ దగ్గర ఉన్న చెత్త కుప్ప మీద మొలకెత్తింది. దాని వలన చెట్టు తనను తాను తిట్టుకుంటుందా? పూలనివ్వక ఉంటుందా? రాణి కూడా తన కర్తవ్యపాలనలో వెనుకాడదు, కాని అప్పుడప్పుడూ ఆమెకనిపిస్తుంది, బాగా రుద్దుకుని స్నానం చేసి తడిబట్టలతో, అడుగులో అడుగు వేసుకుంటూ మందిరంలోపలకు వెళ్ళాలని, ఓ మూల ఒదిగి నిల్చుని గర్భగుడిలో దేవుడిని తనివితీరా చూడాలని. ఏమీ కోరుకోదు. ఇంకెవరి కోరికనూ పంచుకోదు. కాని ఒకే ఒక్క ప్రార్థన చేస్తుంది. ”హేప్రభూ ! మనిషి ప్రాణం కుక్కపిల్ల కంటే హీనమా? నా నేతి ఎన్ని పిల్లల్ని కనలేదు. కాని ఎవరూ దాని పిల్లల్ని అక్రమ సంతానమని అనలేదు. అయితే మనిషికి జన్మించిన పసివారు ఎందరు అక్రమ సంతానం అనిపించుకుంటూ వీధిన పడలేదు. సమాజం దృష్టిలో వారు నిమ్నులు, అసహ్యించుకోదగినవారు, కీటకాలు, వారందరినీ నేనే యీ ప్రపంచంలోకి తెస్తున్నాను, వారి గొంతునులిమేయడానికి మనసొప్పక ఇది పాపమా? ఇక తల్లి ప్రాణానికి ముప్పు లేకపోతే ఎన్నో నలుసులను గర్భంలోంచి కడిగి తీసేస్తున్నాను. అది కూడా పాపమా? అందరూ నా చేత పనిచేయించుకునేవారే. అందరూ నేను చేసే యీ రెండు పనులనూ పాపమని అనేవారే, అయితే దానికి నేను చింతించను. నా చింతంతా ఆ అభాగ్యులయిన పసివారి కోసమే, వారినెక్కడకు పంపించేయాలి? తల్లి గర్భంలోంచి వెలికి తీసివారిని వీధిన పడెయ్యడానికి చేతులెలా వస్తాయి ? నేనేం చేయాలి ?..

 గర్భంస్రావం చేసినపుడల్లా రాణి మనసు కలతబారిపోతుంది. తడిబట్టలతో గుడిముందర కళ్ళు మూసుకుని నిలబడి ఏం ప్రార్థిస్తుందో యేమో తెలియదు గాని ఆమెను వెంటనే దేవత ఆవహిస్తుంది. రాణి దేవిరూపం దాలుస్తుంది. ఆమె జుట్టుముడి విడిపోతుంది. ఒక్కొక్కర్నీ వాళ్ళు చేసిన పాపాల లెక్క అడుగుతుంది. అయితే ఎవరి రహస్యాన్నీ బయటపెట్టదు. పుచ్చకాయల దొంగలు భుజాలు తడుముకుంటారు.

 ఆమెను దేవి ఆవహిస్తే మాత్రం బ్రాహ్మణులు, జమీందార్లు, సామాన్యులు అందరూ చేతులు కట్టుకుని నిలబడతారు. తమ రహస్యాలెక్కడ బయటపడతాయోనని భయపడ్తారు. ఆమెకు సాష్టాంగ నమస్కారాలు పెడ్తారు. ”అమ్మా, నువ్వేం ఆజ్ఞాపిస్తే మేం దాన్ని పాటిస్తాం. మమ్మల్ని రక్షించు. మమ్మల్ని మన్నించు” అంటారు. రాణి కళ్ళెర్రజేసి ఒక్కొక్కరి వైపు చూస్తుంది. ”మీకేం తక్కువని నా దగ్గరకొచ్చారు.? ”అని అడుగుతుంది అప్పుడు వారి కోరికల పట్టీ పెరిగిపోతుంది. ధనం, సంతానం, ఆస్తి…… మనుష్యులు ఆశకు అంతులేదు. ఎంత ఉన్నా లేమితనమే కొందరికి…… ఏమీలేని వారికి కూడా కావాలన్న ఆశ. కొందరి దగ్గర ధనముంటే కొందరికి లేదు. అయితే అందరి దగ్గరా ఉన్నదొక్కటే – లేమితనం, ఆశ. మనుష్యుల ఆశ, స్వార్థం అన్నీ యిమడ్చుకునే మట్టిలాంటిది. తనలోకి అన్నింటినీ పీల్చేసుకుంటుంది. పిప్పిని మాత్రం మిగులుస్తుంది, ప్రాణాన్ని.

 రాణి వారి కోరికల పట్టీని చూసి గట్టిగా నవ్వుతుంది. ”నేను ఒక్కటే యివ్వగలను – సంతానం, ధనం, పాడిపశువులు కావాలంటే గుడిలోపలికెళ్ళి మొక్కుకోండి. పిల్లల్లేని వాళ్ళు – కొడుకు ఉండి కూతురు లేకపోతే, కూతురు ఉండి కొడుకులు లేకపోతే వాళ్ళు మాత్రమే మొక్కండి. మిగితా వారంతా వెళ్ళిపోండి… పోండి… లేకపోతే మీ చెంపలు వాయగొడ్తాను” అంటుంది, అందరూ తలలు దించుకుని వెళ్ళిపోతారు. సంతానం ఆశించేవారు, ఆడవాళ్ళు రాణి చుట్టు చేరుతారు. రోజులు గడిచినా రాణి అన్నస్పర్శ చేయదు. మొక్కుతున్న వారికి రాణి వాణి వినిపిస్తుంది.- ‘ఫలానా నెల, ఫలానా తిథిలోపల, ఫలానా చోట మీ కోరిక నెరవేరుతుంది’ అని మీరు దత్తత స్వీకరిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. అలా చేయకపోతే చాలా అరిష్టం జరుగుతుంది! రాణి ఆజ్ఞను తోసి పుచ్చే సాహసం ఎవరికీ లేదు. రాణి అంటరానిదై ఉండొచ్చు కాని ఆమెను దేవి ఆవహించినప్పుడు ఆమె జగన్మోహిని. అప్పుడు ఆమె ఆజ్ఞను పాటించాల్సిందే. రాణి ఏకాంతంలోనే ఒక్కొక్కరినీ ఆజ్ఞాపిస్తుంది. ఆమె చెప్పినట్లే వారికి నిజంగా అర్ధరాత్రి పసికందు యేడ్పు గుడి దగ్గరో, తమ పెరట్లో వెదురు పొదల మాటునో, తులసికోట దగ్గరో, నూతి గట్టుపైనో వినిపిస్తుంది. తెల్లవారేసరికి పిల్లల్లేని దంపతుల ఒళ్ళో పసికందు కనిపిస్తుంది. ఎవరి పాప ? ఏ జాతి ? పాప ఫలమా, పుణ్యఫలమా ? ప్రశ్నలన్నీ సుడిగుండంలా తిరిగి మనస్సులో యేదో మారుమూల దాక్కుంటాయి. ఒకటే జవాబు. ‘పుణ్యఫలమే- మనిషి కూన – దేవి ఆజ’్ఞ !

 మనిషి కూనలకు పాపమంటదు. ఈ విషయం రాణి నిరూపించింది. పాపఫలమని గొంతు నులిమి చంపబోయిన పసి పిల్లలే పెద్దవారై కులగౌరవాన్ని నిలబెట్టి తమను తాము నిరూపించుకుంటారు. వారి కీర్తిగౌరవాలను చూసి రాణి గుండెలు నిండిపోతాయి. కాని ఆమె మాత్రం అసలు విషయాన్ని గోప్యంగా ఉంచుతుంది. పూనకం వచ్చినప్పుడు ఆమె ఎవరికి యేం చెప్తుందో రెండోవారికి తెలియదు.

 తాను గర్భస్రావం చేసిన ఆడపిల్లలకు పెళ్ళికుదిరి పెళ్ళిరోజు వస్తే రాణి పాదాలు భూమ్మీద ఉండవిక. కాని అందరు ఆడవాళ్ళలాగ రాణికి పెళ్ళి పందిరిలోకి వెళ్ళి వధూవరులను ఆశీర్వదించే హక్కులేదు. కారణం ఆమె అంటరానిది పైగా పాపి. పాపగర్భం తీసేయాలన్న నిర్ణయంలో ఆమెకు భాగం లేకపోవచ్చు. అయితే ఆ పని చేస్తుంది కదా !

 భ్రూణహత్య మహాపాపం. అందుకే రాణి అంటరానిది మాత్రమే కాదు, పాపి కూడా. ఆ చుట్టు పక్కల రాణి కాక మరికొంత మంది మంత్రసానులున్నారు, కాని వారు రక్తం పీల్చే పిశాచాలు. ఇబ్బంది ఉండేవాళ్ళను పీడిస్తారు, ఇంకా ఏవేవో ఉపాయాలు పన్ని ఆడపిల్లల ప్రాణాలు తీస్తారు, అదీగాక రహస్యాలను ప్రచారం చేసేస్తారు. చనిపోయిన తర్వాత కూడా వారిని కళంకం అంటిఉండేట్లు చేస్తారు. ఇక వాళ్ళంతా రాణికి విరోధులు. రాణి ఉన్నంత వరకూ వారి ఆదాయానికి గండి పడినట్లే. ఎంత సంపాదించినా వారి దాహం తీరదు. ఈ ప్రపంచంలో పుణ్యం కన్నా పాపమే ఎక్కువ. పాపాన్ని పెంచే వ్యాపారాలు ఎన్నెన్నో కదా!

 కాలం నీళ్ళలా ప్రవహిస్తుంది. నీళ్ళపైనా అడ్డువేసి ఆపవచ్చు గాని కాలాన్ని ఎవరు ఆపగలరు? కలకత్తాలో ఉండే రాణి భర్త కాలం చేశాడు. రాణి అలవాట్లలో గాని, వేషభాషల్లో గాని, ఏమాత్రం మార్పులేదు. ఆమె ఏనాడూ ఆభరణాలు గాని, కాటుక, సింధూరం గాని పెట్టుకోలేదు, చేతికి గాజులు వేయగా ఎవరూ చూసి ఉండలేదు. అందుకే ఆమె సదవగానూ విధవగాను కూడా ఒక నిండు నదిలాగానే ఉంది.

 రాణి కొడుకు పెళ్ళి చేసుకుని కోడల్ని ఇంటికి తెచ్చాడు. కొడుకు కూడా తండ్రిలాగానే భార్యను ఊర్లో విడిచిపెట్టి కలకత్తాలో ఉండనారంభించాడు. ఒకళ్ళిద్దరు పిల్లలు పుడితే కొడుకు మనస్సు ఇంటివైపు మళ్ళుతుందని రాణి ఆశించింది. అప్పుడు తన వృత్తిని కోడలికి అప్పజెప్పి యింటి పట్టున ఉండొచ్చని అనుకుంది. తన తర్వాత కోడలు ఆ ప్రాంతంలో ఆడ కూతుళ్ళకు సహాయపడుతుందని అనుకుంది.

 తల్లితండ్రులు పిల్లల్నికంటారేగానే వారు తమ గుణాలను పుణికి పుచ్చుకుంటారన్న నమ్మకం లేదు. అటువంటప్పుడు పరాయి యింట్లోంచి వచ్చిన కోడలు పిల్ల తమకు వారసురాలు అవకపోతే  ఆశ్చర్యమేముంది? రాణి కోడలు జగడాలకోరు. అందరితో పోట్లాట పెట్టుకుంటుంది. ఆఖరికి ఇల్లు రెండు ముక్కలైంది. మధ్యన గోడకట్టేదెలా? కోడలు వల్ల అందరికీ దూరమైంది గాని నిజానికి రాణికి ఎవరి పట్లా కోపం లేదు.

 అది విధివ్రాత అనే అనాలి. పరాయి యింటి ఆడపిల్లల మానం కాపాడే రాణి స్వంత కోడలి మానం కాపాడలేకపోయింది. సుఖ ప్రసవం అయిన తర్వాత ఆడవాళ్ళు రాణి అమృత హస్తాన్ని పొగడుతారు. కాని అది కోడలి విషయంలో విషమే అయింది. రాణి కొడుకు వయసులో ఉన్న భార్యను ఊళ్ళో పెట్టుకుని దేశాల మీద పడ్డారు. ఏడాది కాలం పాటు ఇంటికే రాలేదు. కోడలి కడుపులో నాలుగు నెలల నలుసు పాపగర్భం!

 అర్థరాత్రి పూట పెద్దింటివారి ఆడపడుచుల పాపగర్భం దించడానికి వెళ్ళేటప్పుడు కోడలికి జాగ్రత్తలు చెప్తుంది. ”తలుపేసుకో నేను వచ్చేసరికి తెల్లవారి పోతుంది. దూర గ్రామానికి వెళ్తున్నాను.” రోజులు బాగా లేవు. కోడలంటే ఎవరికీ పడదు, ఆమెనోటికి హద్దులేదు. లేకపోతే ఇంటి మధ్య గోడ లేచి ఉండదు. పరాయి వాళ్ళ కోడళ్ళను రక్షించేందుకు తన కోడలిని ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే రాణికి గుబులుగా ఉంటుంది. అయితే ఆ విషయం కోడలెలా అర్థం చేసుకుంటుంది? రోజూ ఆ విషయమై గొడవే. అయినా మూర్ఖులకు నచ్చజెప్పేది చాలా కష్టం. దిక్కులేని వారికి దేవుడే దిక్కు.

 భయమెక్కడుంటుందో చీకటి అక్కడే ఉంటుంది. రాణి భయం నిజమైంది. సొంత యింట్లోనే దొంగతనం జరిగింది. రాణికి స్వంత కోడలిపై నమ్మకముంది. ఎందుకు నమ్మదు ? తనుకూడా విదేశంలో ఉన్న భర్త రాకకై సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ రాత్రులు గడిపింది. పరపురుషుడి చూపులకు ఆమె ఎప్పుడూ చలించలేదు. అంటే అది అసత్యమే అవుతుంది. కాని ఆమె ఎప్పుడూ తన శరీరాన్ని అదుపులో ఉంచుకుంది.

 తల్లి కడుపులో శతృవు జన్మించినట్లు మన మనసే మనకు శతృవు. ఎల్లప్పుడూ పాపం వైపుకే మొగ్గు చూపుతుంది. కట్టు తెంచుకొమ్మని ఉసిగొల్పుతూ ఉంటుంది. తిరిగి అదే మనసు తెల్లవారగానే ప్లేటు తిరగేస్తుంది. మననే శాపనార్దాలు పెడుతుంది పాపం చేశామని. మనస్సు ఒక విషసర్పంలాంటిది. సర్పానికన్న తెలుపునలుపులు కలయికే మనస్సులో రంగులు. సర్పంలాగానే మనసుకూడా కుబుసం విడుస్తుంది. కొత్తరూపం సంతరించుకుంటుంది. ఒక్క నిముషంలో అన్నాళ్ళూ తన  దేహాన్ని అంటిపెట్టుకున్న కుబుసాన్ని ఛీకొట్టి విడిచేస్తుంది. మనస్సుకి కూడా పాములాంటి పడగ ఉంటుంది. బుసలు కొడ్తుంది. విషాన్ని పీల్చుకునే గుణముంది. నమ్మకం లేని మనిషిలో ఓ పుట్ట ఉంటుంది. దాన్లో పాములాంటి పాపం చుట్టుకుని పడుకుని ఉంటుంది. తన దార్లో తాను పోతున్న మనిషిని ఆ పాము ఎప్పుడు ఎందుకు కాటు వేస్తుందో ఆ ఈశ్వరునికే  తెలిసుండాలి. మనిషికి మాత్రం తెలియదు. బయటకు కనిపించే పామంటే రాణికి భయంలేదు. మనస్సులో దాగి ఉన్న పామంటేనే ఆమెకు భయం. బయట కనిపించే పాము కాటేస్తే చావు ఖాయం. కాని మంత్రం వేసి మాయ చేసి వైద్యంచేసి చనిపోతున్న వారి నోట్లో    నిర్మాల్యం పోయొచ్చు. సానుభూతి అనే పూలనలంకరించి మృత దేహాన్ని లేపుతారు. అయితే మనసు అనే పాము కాటేసి కానిపని చేస్తే జీవితమంతా జ్వాలా ముఖంలో ఉండాల్సిందే దగ్ధమవుతూ ఉండాల్సిందే. సానుభూతికి తావేది? మిగిలేది నింద, ఛీత్కారం, నిష్టూరాలు మాత్రమే. పరాయి యిండ్ల ఆడకూతుళ్ళ అవస్థలు చూసి రాణి తన మనస్సులో పాపం అంటకుండా జాగ్రత్త పడింది. వయస్సు దాటింది. కాని శరీరం అదుపు తప్పలేదెప్పుడూ ఎందరో కొమ్ములు తిరిగిన మగవారు కూడా రాణిి చూపులదర్పాన్ని ఎదురించలేకపోయారు.

 అందుకే రాణి తన కోడల్ని శంకించడం లేదు. కేవలం తన విధిరాతను నిందిస్తుంది. కోడలు గాని ఆమె చేసే పనులకు గాని రాణి బాధ్యురాలు కాదు. ఆమెకు విషయం తెలిసి వచ్చేసరికి ఇక గర్భస్రావం చేసే పరిస్థితి దాటి పోయింది. పుట్టింట్లో మూడు నెలలు ఉండి తిరిగి వచ్చిన కోడలు గర్భస్రావం చేయమని పట్టుబట్దింది. రాణి ససేమిరా అంది. ‘ నీ ప్రాణానికి భయం ఉంది నీ కడుపులో పెరుగుతున్న నలుసు మనిషికందే కదా. పుట్టి బట్టకట్టనీయి. నేనేర్పాట్లు చేస్తాను. అందరికి విషయం తెలిసిపోయినా ఫర్వాలేదు. ఈ చుట్టుపట్ల ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అందరి రహస్యాలు నాకు తెలుసు, అందుకే నా ముందు ఎవరూ నోరిప్పలేరు. గుసగుసలు లేస్తాయేమో, లేవనీ. రాజునైనా తూలనాడని వారెవరు? మంచిదైంది. ఈ విషయం తెలిస్తేనైనా కొడుకు ప్రతీ సంవత్సరం వచ్చి కొన్నాళ్ళు యింటిపట్టున ఉంటాడేమో. నిన్ను దిక్కులేని దానిలా వదిలెయ్యడు. కలకత్తాలో పనుల్లోకి చేరిన ప్రతీ మగాడికీ స్వంత గ్రామంలో ఓ పెళ్ళాముండాలి. అదే పెళ్ళాం ఎవరివలనో కడుపు తెచ్చుకుంటే వారి మగతనానికి చేటనిపిస్తుంది. నువ్వు కంగారు పడకు. పుట్టింటికి వెళ్ళు పురుడు చేసేందుకు నేవస్తాను. పుట్టిన పసికందుకి ఏర్పాట్లు నేచేస్తాను, అని కోడలికి నచ్చజెప్పింది.

 కాని కోడలుపిల్ల ఒకే మంకుపట్టు పట్టింది. కడుపు తీసేయమని, తాను చనిపోయిన ఫర్వాలేదట, రాత్రంతా అత్తతో గొడవ పడ్తూనే ఉంది. తెల్లవారగానే పుట్టింటికి ప్రయాణమైంది. రాణికి పోటీగా ఉన్న ఎవరో ఆశపోతు మంత్రసానిని పిలిపించారు కోడలి పుట్టింటివారు, అయిదు నెలల గర్భాన్ని తీయించడానికి ఆ ప్రయత్నంలోనే కోడలి ప్రాణం కాస్తా పోయింది. అది రాణి జీవితంలో ఓ పెద్ద ఎదురు దెబ్బ. రాణి జాగ్రత్తగా ఆపని చేయడానికి సిద్ధపడి ఉంటే పాపం కోడలు బతికి ఉండేదేమో. రాణి కోడలిని కాదు తనను తాను నిందించుకుంది. ఎంతమంది ఆడపిల్లలను ఆ పరిస్థితి నుండి తాను తప్పించలేదు, పుట్టిన పసివారిని అనాధలు కాకుండా కాపాడలేదు? కాని తన స్వంత కోడలిని కాపాడలేకపోయింది. తప్పెవరిది?

 రాణి కోడలిని తప్పు పట్టలేదు. కొడుకుని తప్పుపట్టింది. కొడుకు తన పెళ్ళాన్ని తప్పు పట్టలేదు. తల్లిని తప్పు పట్టాడు. వయసులో ఉన్న కోడలిని ఇంట్లో వదిలి ఆమె అర్ధరాత్రులు పరాయి వాళ్ళ యిండ్లకు వెళ్ళడం వల్లనే ఇంట్లోకి పాపం ప్రవేశించింది. మగవారు విదేశాలకు వెళ్తారు. ఆడవాళ్ళు యింటి పట్టున ఉండాలి. వయసులో ఉన్న కోడళ్ళను అత్తగార్లు ఓ కంటకనిపెడ్తూ ఉండాలి. అందుకే కోడలి చావుకి రాణియే భాధ్యురాలు.

 రాణికి తెలిసిందల్లా ఎవరూ ఎవరికీ కాపలా ఉండలేరు. ఎవరికి వారే కాపల. కేవలం అర్ధరాత్రుల్లోనే దొంగలుపడరు. పగటిపూట కూడా ఇల్లు కొల్లగొట్టొచ్చు. పాపం గుడ్డిది దానికి రాత్రి పగలు తేడా లేదు. రాణికి అత్తగారుండలేదు. మరి ఆవిడకు ఎవరు కాపలా కాసేరు? ఆమె ఎన్నిసార్లు అర్ధరాత్రులు కబురు వస్తే పురుడు పోసేందుకు, కడుపు దించేందుకు వెళ్ళలేదు ఆమెను పిల్చుకెళ్ళేందుకు ఆడవాళ్ళు రారు. మగవాళ్ళే వస్తారు. దారి చూపేందుకు వారిలో ఆమెను దారి మళ్ళించాలని చూసేవారికి కొదవలేదు. అటువంటప్పుడు ఆమె పెద్దపెద్ద అంగలేస్తూ నడిచి వారిని దాటుకుని ముందుకెళ్ళిపోయేది. మగవారు పెంపుడు కుక్కల్లా నోరు మూసుకుని తోక ముడుచుకుని ఆమె వెనకనడిచే వారు. తల్లిగా ఈ విషయం కొడుక్కి అర్థమయేలా ఎలా చెప్పగలదు రాణి ? అందుకే ఆమెను దోషిగా నిలబెట్టి కొడుకు కలకత్తాకు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు కన్నీరు నిండిన కళ్ళతో వాడి తలనిమిరి ఆశీర్వదించింది. ఆమెకప్పుడు తెలిసింది వాడు కలకత్తాలో ఎవర్నో ఉంచుకున్నాడని, వాడు ఊళ్ళోకి రావడం అదే ఆఖరని. పరదేశంలో ఉన్న కొడుకులు తల్లి కోసం ఊరికి రారు, పెళ్ళాలకోసం వస్తారు. విదేశాల్లో ఉన్న కొడుకులు తల్లి చేతివంటను తల్చుకుంటారు గాని తల్లిని చూసేందుకు రావడానికి వారికి శెలవు దొరకదు, బండి ఖర్చులకు డబ్బులుండవు, ఇంటికి డబ్బు పంపకపోతే లేదుగాక ఆర్నెల్లకో, ఏడాదికో ఉత్తరం ముక్కైనా రాయడని రాణి అనుకోలేదు. కలకత్తా నుండి ఎవరైనా వస్తే తాను బాగున్నాడని వారిచేత కబురు పంపుతాడు అంతే. ఎప్పుడైనా పదోపరకో పంపిస్తాడు. దానికి మరికొంత చేర్చి రాణి వాడికోసం అరిసెలు, మరమరాలు, వడియాలు, కొబ్బరి పాకం, నెయ్యి కొని వచ్చిన వారితోనే పంపేది. వయసులో ఉన్నప్పుడే రాణి భర్తమీద ఆధారపడలేదు. వయసుడిగిన తర్వాత కొడుకు మీద ఆధారపడలేదు. ‘నీ కడుపుకి చాలకపోయినా నాకెందుకు డబ్బు పంపుతావు? నువ్వు హాయిగా ఉండాలి నాకోసం బెంగ పెట్టుకోవద్దు’ అని కబురు పంపుతుంది. ఆమె కాళ్ళు చేతులు ఆడేంతవరకు చింతలేదు. రాణి మాత్రమే కాదు ఆ హరిజనవాడలో సగానికి పైగా ఆడవాళ్ళు ఒంటరి వాళ్ళే. నిజానికి అందరి భర్తలూ కలకత్తా వాసులే. ఇక కొడుకుల మాటకొస్తే మీసాలు మొలిచేవేళకు తండ్రులదారి అనుసరించి కలకత్తాకు ప్రయాణమవుతారు. మగవాళ్ళకు అన్ని విధాలా అనుకూలమే. ఊళ్ళోనే ఉంటే పాకీపని చేయాల్సి వచ్చేది, రోడ్లు ఊడ్చేపని, పెద్దింట్లో పెళ్ళికుదిర్తే బాజా వాయించాల్సి ఉంటుంది.          (ఇంకావుంది)

Share
This entry was posted in అనువాదాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.