వేటగాడి నైజం వేటాడటమే
జింక పిల్ల చటుక్కున
కన్నుగప్పకపోతే ముప్పు తప్పదు
తేనె పూసినా కత్తి స్వభావం మారదు
కసాయి వాడంటే ఎంత నమ్మకమో
గొర్రె మొద్దుకి
పూలమాలతో సత్కరించిన బలిపశువును
వధించే వరకూ డప్పులమోతలే!
ఒక్కక్షణం చేయి జారిందంటే
భవిష్యత్తు అంధకారం
మాటలో, చర్యలో, నడతలో
కత్తి మీద సాము చేస్తూ
గాయపడకుండా వేటను ఎదుర్కోవాలి
అతివలు
ఆత్మస్థైర్యమే సిసలైన ఆయుధంగా.