ట్రింగ్…ట్రింగ్…ట్రింగ్…
హాల్లో ఫోన్ రంగవుతుంటే, బెడ్రూంలో జడ వేసుకుంటున్నదల్లా… బాబును వాకర్‌తో సహా తీసుకువచ్చి ఫోన్ ఎత్తింది.
”హాలో” ఎవరు మాట్లాడుతున్నది?”
”ఓ వదినగారా?…. బాగున్నారా?.. చాలా రోజుల తర్వాత గుర్తొచ్చినట్టున్నాను” అన్నయ్యగారూ, పిల్లలూ బాగున్నారా?..”
‘ఓ! అలాగా ఎప్పుడొస్తున్నారు?’
‘ఈ రోజు సాయంత్రమా…’ ”మేమా”? ‘ఎక్కడికీ వెళ్ళట్లేదు. ఇంట్లోనే ఉంటున్నాము’.
”ఆ.. ఆఫీసుకా? వెళ్తున్నాను. ఆరింటికల్లా తిరిగి వస్తాను, పర్లేదు, వచ్చేయండి..ఉంటాను..”
అని ఫోన్ పెట్టేసింది మాలిని. టైం చూసేసరికి 8-25 నిమిషాలు అయ్యింది. అంటే, తను బయలుదేరడానికి ఇంకో అయిదు నిముషాలుంది. ఈ లోపల వంశీకి ఫోన్ చేసి విషయం చెప్పి త్వరగా రమ్మనాలని అనుకుంది. అనుకుందే తడవుగా, వెంటనే నంబరు డయల్ చేసి ”హలో అకౌంటెంట్ వంశీగారున్నారా? నేను వాళ్ళమిసెస్ను మాట్లాడుతున్నాను” అంది.
”ఆ.. ఏమండీ, నేను మాలినీని, ఇప్పుడే మీ అక్కగారు..
మీనాక్షి లేరా.. అదే పెద్దత్తయ్యగారి రెండో కూతురు ఫోన్ చేసిందండి. రేపు రెండో శనివారం కదా! మనం ఇంట్లో ఉంటామని, పిల్లలతో సహా వస్తానంది. సాయంత్రం మీరు త్వరగా రండి. నేను మామూలుగానే వస్తాను. వీలైతే కొన్ని సరుకులు కూడా తీసుకురండి” అని గబగబా విషయం చెప్పేసింది.
”ఆ.. అన్నయ్యగారు కూడా వస్తున్నారంట”.
”సరే అయితే… వస్తారుగా… మరి ఉంటా” అని ఫోన్ పెట్టేసి, అంతే త్వరగా హాండు బ్యాగు తీసుకుని, వాకర్‌లో ఉన్న బాబుని, వాడికి సంబంధించిన వస్తువులున్న బుట్టను తీసుకుని బయటకు వచ్చి తాళం వేసి, రోడ్డు మీదకొచ్చి బస్సెక్కి వెళ్ళిపోయింది.
……….
వంశీ, మాలిని ఇద్దరూ ఉద్యోగస్తులు. వంశీ ఒక ప్రభుత్వ కంపెనీలో అకౌంటెంట్, మాలిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. వంశీ తల్లిదండ్రులకు లేకలేక కలిగిన సంతానం. తండ్రి వైపున అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎవరూ లేరు. తల్లికి మాత్రం ఒక అక్క, అన్న వున్నారు. అన్నకి ఇద్దరూ అమ్మాయిలే, అక్కకు కూడా ముగ్గురూ కూతుర్లే కావడం. అందునా మామయ్య పిల్లలకన్నా, పెద్దమ్మ పిల్లలకన్నా వంశీ చిన్నవాడవడంతో అందరికీ అతనంటే ప్రాణం.
ఉద్యోగ రీత్యా కూకట్‌పల్లిలో వుంటున్న వంశీ రెండు సంవత్సరాల క్రితమే హైదరాబాదుకు చెందిన మాలినిని పెళ్లి చేసుకున్నాడు. తల్లి దండ్రులను తమ వద్దకు వచ్చి ఉండమని ఎంత బ్రతిమిలాడినా వ్యవసాయం సాకుతో ఎప్పుడూ రారు. సంవత్సరం దాటిన తర్వాత మనవడినే తమ వద్దకు పంపమని అంటూ వుండడంతో…. సెలవు దొరికితే ఇద్దరూ కలిసి బాబును తీసుకుని ఊరికి వెళుతుంటారు.
అడపాదడపా మామయ్య పిల్లలైన వదినలు, పెద్దమ్మ పిల్లలైన ముగ్గురు అక్కలే వీరి దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు. వంశీకి ఊరునుంచే సంవత్సరానికి సరిపడా అన్ని సరుకులూ వస్తూ ఉంటాయి. పెళ్ళిలో మాలిని తల్లిదండ్రులు ఒక్కర్తే కూతురని, కొత్త కాపురానికి ఏవీ తక్కువ కాకుండా అన్నీ ఇప్పించి, కూకట్‌పల్లిలో కూతురి పేరుమీద ఇల్లు కూడా కొనిపెట్టారు. మిగతా ఏఖర్చులు ఎక్కువగా లేనందున, ఇలా ఎవరు వస్తానన్న, వచ్చినా వాళ్ళకి బట్టలని, ఏవో ఒకటి పెట్టి పంపుతుంటాడు. వంశీ మాదిరిగానే మాలిని కూడా నిండు మనసుతో వాళ్ళని ఆహ్వానించి అతను ఏదన్నా దానికి తనూ సరే అంటుంది.
…………….
సాయంత్రం ఆఫీసునుండి బయలుదేరి, బాబును క్రష్‌లో నుండి తీసుకుని వస్తూ, పళ్ళు, కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తూనే, గేటు దగ్గరే ఎదురైన టింకూ, బేబిలను చూసి, ‘బాగున్నారా… నానా’, ఏం చేస్తున్నారు?” అని పలకరిస్తూ ఇంట్లోకి వెళ్ళి, భుజం మీదే నిద్దరబోయిన బాబును ఉయ్యాల్లో వేసి, బెడ్రూమ్లో నుండి కబుర్లు, వినిపిస్తుంటే… ”హమ్మయ్య ఈయన వచ్చినట్టున్నారు” అనుకొని లోనికి వెళ్ళి ”వదినగారు బాగున్నారా?… ఎంతసేపైంది వచ్చి?” అని ”అన్నయ్యగారూ బాగున్నారా?”… అని అడిగింది.
”ఆ… ఏంబాగులే అమ్మ…, పొద్దుననగా ఇంట్లో బయలుదేరి, ఇక్కడకు వచ్చేసరికి, ”ఎందుకొచ్చారు?” అన్నట్టు తాళం మమ్మల్ని వెక్కిరించింది. పిల్లలేమో ఆకలని ఒకటే గొడవ”, ఏం చేయాల్రా… దేవుడా అనుకుంటుంటే… ఒక్క పక్క ”వద్దంటే బయల్దేరతీసావు” అని మీ అన్నయ్యగారి నసుగుడు. ఇంతలోపల తమ్ముడు వచ్చి తాళం తీస్తే లోపలికి వచ్చి.. ఇదిగో ఇలా మంచమ్మీద పడ్డాం. వంశీయే, తను తెచ్చిన పళ్ళు పిల్లలకు తినడానికి ఇచ్చి, ఇంత కాఫీ మాకు, పిల్లలకు బోర్నవిటా పోస్తే… అవి తాగి ఇప్పుడే కొద్దిగా కుదుటపడి పిల్లలు అలా బయటికి వెళ్ళారమ్మా”.. అంది.
మాలిని వంశీ వైపు తిరిగి ”అయ్యో అదేంటండి, మిమ్మల్ని త్వరగా రమ్మని చెప్పానుగదండీ… నాకేమో ఆఫీసులో కంపల్సరీ వర్క్ ఒకటుంది. అందుకే లేటయ్యింది. అలానే బాబును తీసుకుని వచ్చేసరికి ఇంతసేపయ్యింది”.
”ఏమండీ…, ఆ డబ్బాలో కారప్పూసలు, కాజాలు ఉన్నాయండి, మీకు గుర్తులేదా…? పాపం పిల్లలు ఆకలికి ఎలా తట్టుకున్నారో!” అంటూనే వంటింట్లోకి వెళ్ళి నాలుగు ప్లేట్లల్లో కారప్పూసలు, కాజాలు పెట్టుకొచ్చి, మీనాక్షికి వాళ్ళాయనకి ఇచ్చి, పిల్లల్ని లోపలికి పిలిచి తినమని చెప్పింది.
”వదినగారూ… టీ తాగుతారా” అని అడిగి, టీపెట్టడానికి లోపలికి వెళ్ళి, టీ పెడుతుంటే…., బాబు నిద్రలోనుండి లేచాడేమో… ఒకటే ఏడుపు… స్టౌ చిన్నదిగా పెట్టి పరుగున వచ్చి వాడిని ఎత్తుకుని, బాత్రూమ్కు ఏమైనా వెళ్ళాడేమో…. అని చూసి డైపర్ మార్చింది.
బాబు బ్యాగు తీసి దానిలో నుండి పాలసీసా తీస్తే, పొద్దున పోసిన పాలన్నీ అలాగే వున్నాయి. ”అయ్యో అదేంటి! ఆయా బాబుకు పాలు పట్టలేదా?’ అనుకుని వంటింట్లోకి వెళ్ళి ఆపాలన్నీ పారబోసి గిన్నెలో కొన్ని వేడి నీళ్ళు పెట్టింది. బాబు ఏడుపు ఎక్కువైంది. ”ఏంటి నాన్న ఆకలేస్తుందా? ఉండు ఒక్క ఐదు నిమిషాలు, సీసా కడిగి పాలు పోస్తా…”
”ఏమండి ఒకసారి ఇలా వస్తారా?” అని వంశీని పిలిచింది. ”ఆ… వస్తున్నా అంటూ వంశీ వంటింట్లోకి రాంగానే ”ఏమండి ఒక్కసారి కొద్దిగా బాబును తీసుకొని ఆడించండి. ఇంతలోపల నేను బాటిల్ కడిగి, పాలు వేడి చేసి, వదినా వాళ్లకి టీ తీసుకువస్తాను” అంది.
”సరే… ఇలా తే అంటూ బాబును వంశీ ఎత్తుకోగానే, ఓరేయ్ తమ్ముడూ…. ఇలా రారా…, వంటింట్లో నువ్వేమి చేస్తున్నావురా? చాలా రోజుల తర్వాత అక్క వచ్చింది. దాంతో కబుర్లు చెపుదాము అని లేకుండా… పెళ్ళాం వెనకాలే వెళతావేంటిరా?”… అంది.
”ఆ… వస్తున్నానక్క, బాబు ఏడుస్తుంటే…” అంటూ బాబును తీసుకుని మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు.
”ఒరేయ్ నాన్న… కన్నా” అంటూ మీనాక్షి వంశీ చేతిలో ఉన్న బాబును తీసుకుని ”అరేయ్ అత్తను రా… నేను, మీ అత్తను” అనగానే వాడు మళ్లీ ఏడుపు లంకించుకున్నాడు. ”అయినా… నిన్నని ఏం లాభం లేరా…, అయ్యో! మా అక్క ఒక్కతి ఉంది, దాన్ని చూడాలి, ఇంటికి పిలవాలి, అని మీ నాన్నకే ఉంటే… నువ్వు నేను ఇలా ఎత్తుకోగానే ఏడిచేవాడివి కాదురా” అంటూ బాబును తిరిగి వంశీకి ఇవ్వబోయింది. టింకూ, బేబీలు బాబు అమ్మ దగ్గర ఉన్నాడని చూసి హాల్లో తింటూ వున్న వాళ్ళు కాస్తా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు. ఈ పరుగులో ప్లేటులో ఉన్న కారప్పూసలు, కాజాలు అన్నీ కిందపడ్డాయి. అయినా కూడా ”నాని, నాని’ అంటూ వాడిని ఎత్తుకోబోయాడు టింకూ. ”నాకే కావాలి, నేను ఎత్తుకుంటాను అని బేబి గొడవ చేయడం మొదలు పెట్టింది. ఇద్దరు కలసి ”నేనే, నేనే” అంటూ గొడవ పెడ్తుంటే, ఈ అల్లరికి మరీ ఎక్కువైంది బాబు ఏడుపు.
”ఏంటిరా నీవు మరీ ఇంత సున్నితం, ఊరికెనే ఏడుస్తున్నావు. పిరికోడ” అంటూ మీనాక్షి కసిరింది.వెంటనే వంశీ కల్పించుకుని బాబును ఎత్తుకుని, టింకూ, బేబీలకు ”నాని ఇప్పుడే కదా లేచింది, వాడు పాలు తాగిన తర్వాత వాకర్‌లో వేస్తాను. అప్పుడు ఇద్దరూ కలిసి ఆడిద్దురుగానీ” అని సర్ధి చెప్పాడు.
ఇంత లోపల టీ కప్పులతో, పాల బాటిల్‌తో వచ్చిన మాలిని, టీలు మీనాక్షికి, వాళ్ళాయనకి ఇచ్చి, పాలబాటిల్ తీసుకుని వంశీ దగ్గరనుండి బాబును తీసుకుంది. ”ఏమండి, టీ మీకు కూడా ఆ ట్రేలో ఉంది తీసుకోండి” అంది. వంశీ టీ తీసుకుని ”మాలిని నువ్వు తాగవా?” అన్నాడు, ”లేదండి బాబుకు పాలు పట్టిన తర్వాత తాగుతాను” అని బాబుకు పాలు పట్టడంలో మునిగిపోయింది.
బాబు పాలు తాగిన తర్వాత, కొద్దిగా ఏడుపు ఆపగానే వాడిని వాకర్‌లో వేసి, హాల్లో పిల్లలు పారబోసినవి అంతా తీసి శుభ్రం చేసి ఖాళీ కప్పులు తీసుకుని వంటింట్లోకి వెళ్ళి, బియ్యం కడుగుదాము అనుకొని, ‘ఏం కూరలు చెయ్యాలో!… వదినగారినే అడిగి చేస్తే మంచిది’ అని, మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చింది. ”వదినగారు అన్నంలోకి ఏం కూరలు చేయమంటారు?” అని అడిగింది.
”అయ్యో! అమ్మాయ్, బియ్యమైతే కడగలేదుగా? ఎందుకంటే! మీ అన్నయ్యగారు రాత్రిపూట అన్నం తినరు. చపాతీలు మాత్రమే తింటారు. మేము ఏదైనా తింటాము. ఇక కూరల విషయానికి వస్తే, పిల్లలకి బంగాళదుంప వేపుడు అంటే ఇష్టం. మీ అన్నయ్య అది తినరు. అందుకని ఆయనకి బెండకాయ వేపుడు చెయ్యమ్మ. అలాగే కొద్దిగా ముద్దపప్పు, రసం, ఏదైనా ఆకుకూర పచ్చడి చెయ్యమ్మ. నేనైతే దేనితోనైనా సర్దుకుంటానమ్మా” అంది.
”అలాగే వదినగారూ” అంటూ ఒకసారి వంశీ ముఖంలోకి చూసి ”ఏమండి కొద్దిగ బాబును చూడండి” అని వంటింట్లోకి వెళుతూ టైం చూస్తే 7:30 అయ్యింది. వెంటనే వెళ్ళి బియ్యం కడిగి పొయ్యిమీద పెట్టి చపాతికి పిండి తడిపి పక్కనపెట్టి, బంగాళదుంపలు కుక్కర్లో ఉడకబెట్టింది. ఇంతలోపల బెండకాయలు కోసి వేపుడు చేసింది. తర్వాత, బంగాళదుంపలు తీసి వేపుడు చేసి, పప్పు ఇంకో కుక్కర్లో పెట్టింది. అన్నం కాగానే రసం చేసింది. ఫ్రిజ్‌లో చూస్తే పుదీనా ఒక్కటే వుంది. దానితో పచ్చడి చేసి చివరకు చపాతీలు చేసింది. బయటికి వచ్చి చూస్తే సరిగ్గా తొమ్మిది అయ్యింది. బాబు తనని చూసి నవ్వుతుంటే, అప్పటివరకు పడ్డ శ్రమను మరచి హాయిగా నవ్వుకుని, బెడ్రూమ్లోకి వెళ్ళి మీనాక్షి వాళ్ళని భోజనానికి పిలిచింది.
”హమ్మయ్య అయ్యిందా తల్లీ, బాగా ఆకలేస్తుంది. ఇంకా ఎప్పుడు పిలుస్తావా అనుకుంటున్నా” అంటూ మీనాక్షి లేచి వెళ్ళి డ్రైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. అన్నీ తెచ్చి పెట్టి పిల్లల్ని కూడా పిలిచి, అందరికీ వడ్డించింది. ”మాలిని నువ్వుకూడా కూచో” అని వంశీ అనగానే ”లేదండి మళ్ళీ బాబు ఏడిస్తే ఇబ్బంది అవుతుంది. నే తర్వాత తింటాలే” అని బాబుకు సిరిలాక్ కలపడానికి లోనికి వెళ్ళింది”.
మీనాక్షిగారు భోజనం చేస్తూ ”ఒరేయ్ వంశీ, మేము ఎప్పుడు వచ్చినా ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. ఈసారి పిల్లలు కూడా నాతో ప్రామిస్ చేయించుకుని మరీ వచ్చారు. రేపు ఎటైనా వెళ్దాంరా” అంది.
”సరే అక్కా మీ ఇష్టం. చెప్పండి పిల్లలు ఎక్కడికి వెళ్దాం” అన్నాడు వంశీ టింకూ, బేబిలను చూస్తూ, టింకు ”రామోజీ ఫిలింసిటీ అంటే, బేబి కాదు ఎన్.టి.ఆర్. గార్డెన్ అంది”. మీనాక్షేమో ”ఏమోరా…, నాకైతే బిర్లామందిర్ వెళ్ళాలని వుంది” అంది.
ఇవన్నీ వంటింట్లో నుండి వింటున్న మాలిని, బయటికి వస్తూ ”రామోజీ ఫిలింసిటీ అయితే ఇక్కడికి చాలా దూరం. అక్కడికి వెళ్ళాలంటే ఒక రోజంతా పడుతుంది. మీకభ్యంతరం లేకపోతే, నేను ఒకటి చెపుతాను” అంది.
”చెప్పత్తయ్యా, చెప్పు” అన్నారు పిల్లలు. పొద్దున్నే బిర్లామందిర్ చూసుకుని అటునుండి బిర్లాసైన్స్ మ్యూజియం, ప్లానిటోరియం చూసుకుని తర్వాత ఎన్.టి.ఆర్. గార్డెన్ చూస్తే బాగుంటుంది” అంది. పిల్లలు వెంటనే ”అలాగే, అత్త చెప్పింది మాకు ఓ.కే.” అంటూ తమ అంగీకారం తెలిపారు.
మీనాక్షి మాత్రం ”ఏంట్రా వంశీ నువ్వేమి అనవు. తనకు నీకన్నా ఎక్కువ తెలుసా?” అనగానే, వంశీ ”అక్క తనన్నది నిజమే, ఫిలింసిటి ఇక్కడికి చాలాదూరం, ప్లానిటోరియం మ్యూజియంలలో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు” అన్నాడు. ”అయితే సరే, పొద్దున్నే బయల్దేరదాం” అంది మీనాక్షి.
”అయితే మాలిని పొద్దున్నే ఏం వండుతావ్” అని మళ్ళీ తనే అడిగింది. ”చెప్పండి వదినా… ఏం చేయాలో” అంది.
”పిల్లలూ మీకేం కావాల్రా” అంది మీనాక్షి.
టింకూ ”పూరి విత్ ఎగ్ఫ్రై” అన్నాడు, ‘కాదు దోశ, పులిహోరన్నం” అంది బేబి.
”మాలినీ పులిహోర, దోశ, పూరి, ఎగ్ఫ్రై చేసి, అలాగే కొంచెం, పెరుగన్నం, ఏదైనా స్వీటు చేయమ్మ చాలూ. ఇంకా ఎక్కువ ఐటమ్స్ అయితే నీకిబ్బందవుతుంది. ఎలాగూ కారప్పూసలూ, కాజాలూ, వున్నాయిగా వాటితో సర్దుకోవచ్చులే” అంది.
”సరే వదినా.. అలాగే” అంది మాలిని, భోజనాలు వడ్డిస్తూనే, బాబుకు సిరిలాక్ తినిపించింది. భోజనాలు కాగానే బాబును వంశీకిచ్చి తాను తినేసి, గిన్నెలు షింక్‌లో పడేసి అన్నీ సర్దింది. రేపన్నా పనమ్మాయి కాస్త పొద్దున వస్తే బాగుండు, అనుకుంది.
ఇంతలో దోశకు పప్పు నానబోస్తుంటే.., ”మాలినీ, పిల్లలు పడుకుంటారేమో పక్కలు సర్దుదువుగాని రా” అని వంశీ కేకేయగానే వెళ్లి పక్కలు పరిచి అందరికి దుప్పట్లు ఇచ్చి మళ్ళీ వంటింట్లోకి వచ్చింది. పొద్దున పెరుగన్నానికి కావాలని, ఫ్రిజ్‌లోంచి పాలపాకెట్ తీసి కాగబెట్టి తోడేసింది, పొద్దున్నే అన్నీ చేయాలంటే ఆలస్యం అవుతుందని, పూరీకి పిండి తడిపి, ఎగ్ఫ్రైకి ఉల్లిపాయలు తరిగి ఫ్రిజ్‌లో పెట్టింది. హాల్లోకి వెళ్ళి టైం చూసేసరికి 11:30 అయ్యింది.
”మాలినీ ఇక్కడ కొన్ని నీళ్ళు తెచ్చి పెట్టమ్మా” అని మీనాక్షి పిలవగానే ఫ్రిజ్‌లో నుండి బాటిల్ తీసి, వెళ్లి బెడ్రూమ్లో పెట్టింది.
”మాలినీ బాబు పడుకున్నాడు, పక్కవేద్దువురా” అనగానే ”వస్తున్నానండి” అంటూ హాల్లో పక్కవేసి బాబును పడుకోబెట్టి, వంశీతో ”ఏమండి అలారం ఐదింటికే పెట్టండి. పొద్దున్నే లేవాలి” అంటూ పడుకుంది.
……………..
పొద్దున్నే అలారం మోగటంతోనే నిద్రలేచిన మాలిని త్వరగా పులిహోర, పూరి, ఎగ్ఫ్రై, సేమియా పాయసం, దోశలు చేసి పెరుగన్నంకలిపింది. ఏడవుతుండగా పనిమనిషి రాగానే గిన్నెలు వేసి అందర్నీ నిద్రలేపి, వాళ్ళు స్నానాలు ముగించేసరికి టిఫిన్ పెట్టింది. అప్పటివరకు వంశీతో అడుతున్న బాబును తీసుకుని
నీళ్ళుపోసి, రెడీ చేసి, వాడికి కావలసిన వస్తువులన్నీ ఒక బ్యాగులో, వంటకాలు అన్నీ ఇంకో బ్యాగులో సర్ది తనూ రెడీ అయ్యింది. అందరూ కలిసి మొత్తమ్మీద తొమ్మిదింటికల్లా బయటపడ్డారు.
రోజంతా తిరిగి తిరిగి అన్నీ చూసి, రాత్రి తొమ్మిదింటికి ఇంటికి చేరుకున్నారు. తిరగడం వలన అలసిపోయి పడుకున్న బాబును రాగానే ఉయ్యాల్లో పడకోబెట్టి, వంటింట్లోకి వెళ్ళి మళ్ళీ వంటలో నిమగ్నమయ్యింది. ఇంతలో ఫోన్ మోగడంతో, ఎవరైనా ఎత్తుతారేమో అనుకున్న మాలిని, ఇంకా ఎవరు ఎత్తకపోవడంతో ”ఏమండి కొద్దిగా ఫోన్ తీయండి” అంది. ”వాడు బాత్రూమ్లో
ఉన్నాడమ్మా, నీవే తీయి” అని మీనాక్షిగారి సమాధానం రాగానే, హాల్లోకి వెళ్ళి ఫోన్ ఎత్తింది.
”హలో! ఎవరు?”…. ‘చిన్న వదినగారు మీరా! బాగున్నారా?” అందరూ బాగున్నారా?” అని అడిగింది.
…………….
”ఆ!…. మీనాక్షి వదినగారా నిన్ననే వచ్చారు, పిలవాలా? ఉండండి పిలుస్తాను, ఒక్క నిమిషం” అంది.
”వదినగారూ చిన్నొదినగారి ఫోన్, మిమ్మల్ని పిలుస్తున్నారు” అని చెప్పి, పొయ్యిమీద కూర వుందని గుర్తొచ్చి వెళ్ళిపోయింది. మీనాక్షిగారు ఫోన్లో మాట్లాడి లోపలికి వెళ్ళి, వంశీతో ఆ కబుర్లు చెపుతూ ”ఒరేయ్ వంశీ మొన్న చిన్నక్క వస్తే దానికి 1800 పెట్టి చిన్నంచు కంచిపట్టుచీర, బాబుకు ఏడువందలు పెట్టి డ్రెస్సు తెచ్చావటగదరా…, అదే చెప్పింది ఇప్పుడు” అంది. వంశీ ”అవునక్కా” అన్నాడు. ”అవును లేరా, నాతో ఎందుకంటావు. నేనెక్కడ అడుగుతానో” అని చెప్పలేదు కదూ.., అయినా, దానిమొగుడంటే…, మంచి పొజిషన్లో వున్నాడు. అదీ గాక దానికి ఒక్కడే కొడుకు, మేమంటే ఏదో మామూలు ఉద్యోగస్తులం, ఇద్దరు పిల్లలాయే. మాకు పెట్టాలంటే నీకు చేతులు రావులేరా” అంది నిష్ఠూరంగా. ”అబ్బే అదేం లేదక్క ఈ రోజు తిరిగి తిరిగి అలిసిపోయాం కదా, రేపు షాపుకు తీసెకెళ్లచ్చులే అనుకున్నాను” అన్నాడు.
”ఏమోరా… నాకు అవన్నీ ఏం తెలీదు. మావాడికి డ్రస్సు ఏమొద్దు కానీ, సైకిలు కొనిపెట్టు. దానికి ఏదో నాలుగైదు వందల్లో మామూలు డ్రస్సు. నాకో చిన్నంచు సీకో గద్వాల్ చాలురా. మీ బావగారికి మళ్లీ వచ్చినపుడు చూద్దువుగానిలే” అంది.
”సరే అక్క అలాగే” అన్నాడు వంశీ. వంటింట్లో నుండి ఈ సంభాషణ అంతా విన్న మాలిని నవ్వుకుంది. బయటికి వచ్చి అందర్నీ భోజనాలకు పిలిచి వడ్డించి, తనూ తినేసి, అన్నీ సర్ది పడుకునేసరికి మళ్ళీ 12 అయ్యింది.
ఉదయమే అరింటికి లేచిన మాలిని, టిఫిన్‌లోకి వడచేసి, టీలు పెట్టి, పాలు వేడి చేసి అందర్నీ లేపింది. లేవగానే అందరూ మొహాలు కడుక్కుని టిఫిన్లు చేసి, టి.వి. చూస్తూ కూర్చున్నారు. వంశీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ”అక్కా త్వరగా రడీ అయితే మనం బట్టల షాప్‌కి వెళదాం, లేటయితే ఈ రోజు ఆదివారం షాపులన్నీ ఒంటిగంటకే మూసేస్తారు. వచ్చిన తర్వాత లంచ్ చెయ్యొచ్చు” అన్నాడు. ”సరే అలాగే” అని పిల్లల్ని రెడీ చేసి, తనూ రెడీ అయ్యింది” మీనాక్షి.
”ఏమండి లంచ్‌లోకి చికెన్ తీసుకువస్తారా” అని వంటింట్లోంచి అడిగింది మాలిని. ఇది వింటూనే ”అమ్మో! చికెన్ వద్దురా, నాకూ, పిల్లలకు అసలు ఇష్టం ఉండదు. మీ బావగారికే ఇష్టం. కావాలంటే మటన్ తీసుకురా” అంది. వెంటనే పిల్లలు ”వద్దు, వద్దు, మాకు ఫిష్‌ఫ్రై కావాలి” అన్నారు.
అప్పుడు మీనాక్షి వాళ్ళాయన కల్పించుకుని ”వంశీ మీ అక్కకి మటన్, పిల్లలకి ఫిష్ తీసుకురా; నేను ఏదైనా తినగలను” అన్నాడు. ”అయితే అక్కా ఒక్క అరగంట ఆగండి నేవెళ్ళి మటన్, ఫిష్ తీసుకుని వస్తే, మాలిని మనం వచ్చేలోపు లంచ్ ప్రిపేర్ చేస్తుంది” అని వంశీ బయటికి వెళ్ళి, వచ్చేటప్పుడు ఆటో మాట్లాడుకుని వచ్చి. అందర్నీ తీసుకుని వెళ్లాడు.
వాళ్ళు వెళ్ళగానే మాలిని మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫలావ్ చేసి, చారు చేసింది. బాబుకు తినిపించి, నీళ్ళుపోసి వాడిని పడుకోబెట్టి, తనూ రెడీ అయ్యి, అన్నీ వంటకాలు టేబుల్‌పై సర్దింది.
సరిగ్గా రెండవుతుండగా టింకూకు సైకిలు, మీనాక్షిగారికి చీర, పాపకి డ్రెస్‌తో హుషారుగా తిరిగి వచ్చారు.
షాపింగ్ కబుర్లు చెబుతూ భోజనాలు ముగించి, మాలినికి బట్టలు చూపిస్తూ ”ఈసారికి వీటితో సర్దుకుందాంలే అని పిల్లలని ఒప్పించేసరికి తలప్రాణం తోకకొచ్చిందనుకో మాలిని. ఇంతకీ మా సెలక్షన్ ఎలా వుంది?” అని అడిగింది. ”బాగున్నాయి వదినా” అని చెప్పి మాలిని బెడ్రూమ్లోకి వెళ్ళి, పడుకుంటారేమోనని పక్క సర్ధింది.
మీనాక్షి, వాళ్ళాయన పడుకుంటే, పిల్లలు మాత్రం మనం సినిమాకెళ్ళాల్సిందే అని వంశీతో వాదనకు దిగారు. మాలిని కల్పించుకుని ”సరేలే వెళ్దాం. మీరైతే కాసేపు పడుకోండి” అంది. వెంటనే పిల్లలు బెడ్రూమ్లోకి వెల్ళి పడుకున్నారు.
ఐదవుతుండగా వంశీ వెళ్ళి ఫస్ట్షోకి టిక్కెట్లు తెచ్చి, అందర్నీ లేపి రడీ అవ్వమని తను రడీ అయ్యాడు. మీనాక్షి లేచి ”అవునురా తమ్ముడూ మా దగ్గర కొత్త సినిమాలు, తొందరగా రావు. మేం చూసేసరికి అది సగం కట్ అయిపోతుంది” అంటూ లేచి రడీఅయ్యి బయటికి వచ్చింది. ఈ లోపల మాలిని బాబుకి తినిపించి, రడీ చేసి తనూ రెడీ అయ్యింది.
అందరూ కలిసి అరున్నరకల్లా బయలుదేరి వెళ్లి సినిమాచూసి పదింపావుకి తిరిగి వచ్చారు. రాగానే మాలిని అన్నం వండి బాబుకు పాలు పట్టి పడుకోబెట్టి అందరికీ వడ్డించి తనూ తినేసింది. 11.30కి అందరూ పడుకుంటుంటే మీనాక్షి ”ఒరేయ్ వంశీ పొద్దున్నే నాలుగింటికి మేం బయలుదేరతాంరా, 3.30కి లేపు” అంది. ”అదేంటక్కా అప్పుడే వెళతానంటున్నారు. రెండు రోజులుండి వెళ్ళండి” అన్నాడు.
”లేదురా రేపు ఎలాగూ పిల్లలకు స్కూలు పోతుంది. కనీసం ఎల్లుండైనా వెళతారు. మళ్ళీ వేసవి సెలవుల్లో వస్తాంలే” అని వెళ్ళి పడుకుంది. ఉదయం 3.30కే లేచి మీనాక్షి, పిల్లలు రడీ అవ్వగానే, నాలుగింటికి వంశీ వెళ్ళి వాళ్ళని బస్సెక్కిచ్చి వచ్చిన తర్వాత ఇద్దరూ మళ్లీ పడుకున్నారు.
…..
అరింటికి లేచిన వంశీ ”మాలిని లే…., ఆరయింది, ఆఫీసుకు టైము అవుతుంది” అంటూ వుంటే… ”అలసిపోయానండీ కొద్దిసేపాగి లేస్తాను, ప్లీజ్…” అంది మత్తుగా. ”లే మాలిని, ప్లీజ్ నీకే లేటవుతుంది. పోనీ నాకు చెప్పు బియ్యం ఎన్నిపెట్టాలో?” అంటూ వుండగా ఫోన్ మోగింది. ”అబ్బా… ఈ దరిద్రపు ఫొనొకటి. పీకిపారెయ్యాలి దీన్ని. అయినా ఇంత పొద్దున్నే ఎవరబ్బా?” అనుకుంటూ వెళ్ళి ఫోన్ తీసాడు.
”హాలో………………. ఎవరు?”
”ఆ…. పెద్దక్కా….నువ్వా?” ”ఏంటి ఇంత పొద్దున్నే…. అందరూ బాగున్నారా?… బావగారూ… పిల్లలూ….”
”ఓ…. హో! ఇక్కడికి వస్తున్నారా… ఎప్పుడు?….. ఈ శనివారం సాయంత్రమా…..! అలాగే రండి, ఎక్కడికి వెళ్ళట్లేదు…”
”అలాగే… రాత్రే అనుకున్నారా! …. అందుకే ఉదయమే చేస్తున్నావా! ఎక్కడికీ వెళ్ళట్లేదు, … పర్లేదు అక్కా… సరే… అలాగే రండి”.
”మీనాక్షక్కా! పొద్దున్నే వెళ్ళింది పిల్లలకి స్కూలుందని” ”ఆ బాబూ, మాలిని బాగున్నారు”.
”సరే…. అక్కా…. అయితే ఉంటాను.” అని ఫోన్ పెట్టేసి ”మాలినీ లే… నీకో శుభవార్త…,, ఇప్పుడే పెద్దక్క ఫోన్ చేసింది. రేపొచ్చే శనివారం సాయంత్రం ఇక్కడికి వస్తున్నారంటా… మనం ఎక్కడికైనా వెళ్తున్నామేమోనని కనుక్కోవడానికి ఫోన్ చేసింది. ఎక్కడికీ వెళ్ళట్లేదని చెప్పాను.” అని ముసిముసిగా నవ్వుతూ.. చెప్పేసరికి..
మాలిని ఒక్కసారిగా లేచి ”ఆ …. ఈ శనివారమా!…” అంటూ నీరసంగా మంచమ్మీద పడిపోయింది.