గౌతమి గత వారం రోజులుగా ఆఫీసుకు వెళ్ళడం లేదు తన మనస్సులో చాలా ఆవేదనతో గందరగోళంలో ఉంది. 45 సంవత్సరాల నడి వయస్సులో ఉన్న గౌతమికి తన జీవితమంతా కళ్లముందర పదే పదే కదలాడుతోంది.
గౌతమికి 17 సంవత్సరాల వయసులోనే పెళ్లైయింది. అబ్బాయి కుటుంబం, గౌతమి వాళ్ళ కుటుంబానికి చాలా దూరపు బంధువులు. అబ్బాయి డిగ్రీ వరకు చదువుకుని, సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. మంచి సంబంధమని గౌతమి అమ్మనాన్నలు పెద్దగా ఆలోచించకుండా పెళ్ళికి ఒప్పేసుకున్నారు. ఇంటర్‌మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న గౌతమి చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.పెళ్ళైన కొత్తలో గౌతమికి అత్తారింట్లో వాతావరణమంతా చాలా వింతగా అనిపించేది. ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేవడం, వంట పని, ఇళ్ళు ఊడవటం, తుడవటం, బట్టలు ఉతకడం అన్నీ తనే చేయాలి. అత్తగారికి అనారోగ్యం వల్ల ఆమె ఎక్కువగా గౌతమికి సాయపడలేక పోయేది. గౌతమి అత్తగారి కుటుంబం పెద్దదనే చెప్పాలి. నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు వారికి. కృష్ణ మొదటి వాడు. అతనే గౌతమి భర్త. గౌతమి ఆ ఇంటికి పెద్దకోడలు. పెద్ద కోడలు అనే పేరుతో ఇంటి బాధ్యతలన్నీ మీద వేసుకోవాల్సి వచ్చింది. కృష్ణ ఉదయ్నాన్నే ఇంటి నుండి వేళ్ళేవాడు, సాయంత్రం ఏ ఆర్ధరాత్రికో వచ్చేవాడు. ఇంటి ఖర్చులన్నీ కృష్ణ సంపాదన మీద నడిచేది.
ఆడవాళ్ళు బయటకెళ్ళి సంపాదించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని గట్టిగానమ్మేవాడు కృష్ణ. ఇంటి పనులు చేయడం ఆడవారి బాధ్యత, సంపాదించడం మగవారి బాధ్యత అనే వాదనను బలపరిచే వారిలో కృష్ణ ముందుంటాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. గౌతమి ఇంట్లో ఎలాంటి బట్టలు వేసుకోవాలనే దగ్గరనుండి అన్ని విషయాలు కృష్ణ చెప్పినట్లుగానే జరగాలి. పెళ్ళైన కొత్తలో గౌతమికి ఇవన్నీ చూసి, భర్తకు తన మీద చాలా ప్రేమ అనుకునేది. ఇవన్నీ తనచుట్టూ విధిస్తున్న ఆంక్షల కవచమని అర్ధం చేసుకోవడానికి కొంచెం సమయం పట్టినా, చేసేది ఏమి లేక అలవాటు పడిపోయింది. అయినా వీటన్నింటిని ఆలోచించేంత సమయం, తీరిక గౌతమికి
ఉండేవి కాదు, రోజంతా పనితోనే సరిపోయేది.
గౌతమి అత్తమామలకు మాత్రం పిల్లలందరూ మంచిగా చదువుకుని, ఉద్యోగాలు చేయాలనే కోరిక బలంగా ఉండేది. అందుకే కృష్ణ చదువుకుని, వ్యాపారం చేస్తున్నా మిగతా ముగ్గురు అబ్బాయిలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని వారి వారి రంగాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. గౌతమి వాళ్ళ మావయ్య గౌతమి చేత రెండవ సంవత్సరం ఇంటర్‌మిడియట్ పరీక్షలు వ్రాయడానికి ఫీజు కట్టించాడు. ఇది కృష్ణకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా, నాన్నను ఎదిరించే ధైర్యం లేక ఊరుకున్నాడు. గౌతమి సెకండ్ క్లాసులో ఇంటర్ పాస్ అయ్యింది. అదే సంవత్సరం ప్రభుత్వ శాఖలలో క్లరికల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసారు. గౌతమికి కూడా 18 సంవత్సరాలు నిండటం, ఇంటర్ పాస్ అవ్వడం వల్ల, మావయ్య ప్రోత్సాహంతో అప్లికేషన్ పెట్టింది. ఆ పోస్టులకు అప్పట్లో పెద్దగా పోటీ లేకపోవడం వల్ల, గౌతమి సెలెక్ట్ అయ్యింది. మొదటి పోస్టింగు తన సొంత ఊరైన వరంగల్ జిల్లాలోనే వచ్చింది. గౌతమి ఆ ఉద్యోగంలో చేరే ముందు ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. కృష్ణ ”గౌతమి ఉద్యోగానికి వెళ్ళడం కుదరదని తెగేసి చెప్పేసాడు”. గౌతమి అత్తయ్య, మావయ్యలు కృష్ణకు నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నం చేసారు. ఉద్యోగం చేసి ఆడవాళ్ళు సంసారాన్ని, కుటుంబాన్ని పట్టించుకోరని, భర్త అదుపులో ఉండరని కృష్ణ నమ్మకం. పెళ్ళైనప్పటినుండి భర్త మాటకు ఎదురు చెప్పని గౌతమికి ఈ సారి మాత్రం తన చేతికి అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలని మాత్రం అనిపించలేదు. అందుకే ఊరి నుండి అమ్మ నాన్నలను పిలిపించి, వారి చేత చెప్పించింది గౌతమి ఎంతమంది చెప్పినా కృష్ణ మాత్రం ఒప్పుకోలేదు. గౌతమి అఖరి ప్రయత్నంగా తనవైపు నుండి ఎటువంటి ఇబ్బందులు రావని కృష్ణకు భరోస ఇచ్చింది. అంతేకాక ప్రతినెల జీతం డబ్బులు మొత్తం కృష్ణకే ఇస్తానని వాగ్దానం చేసింది కూడా. ఇంతమంది గౌతమి ఉద్యోగంలో చేరే విషయంలో పట్టించుకోవడం వల్ల కృష్ణ ఒప్పుకున్నాడు. మొత్తానికి గౌతమి
ఉద్యోగంలో చేరింది. అప్పటి నుండి గౌతమికి ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యత కూడా చేరడంతో, ఇంతకు ముందు 5 గం||లకు నిద్రలేచేది, ఇప్పుడు 4 గం||లకు లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసి ఆఫీసుకు పరుగులు తీసేది. నెల నెల తన చార్జీలకు అయ్యే ఖర్చులు పోగా మిగతా డబ్బులన్నీ కృష్ణకే ఇచ్చేసేది. గౌతమి ఎప్పుడూ కృష్ణని సంపాదన, లెక్కలు అడిగేదికాదు, కృష్ణ కూడా చెప్పేవాడు కాదు, మనుషులు పనిలో మునిగిపోయి కాలాన్ని పట్టించుకోకుండా, కాలం ఎంత వేగంగా గడిచిపోయిందని అనుకున్నట్లుగా గౌతమికి పెళ్ళై 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ ఐదేళ్ళలో తన ముగ్గురు మరుదులకు, ఆడపడుచులకు
పెళ్ళిళ్ళు చేయడం వేరు కాపురాలు వాళ్ళు ఉద్యోగం చేస్తున్న ఊర్లల్లో కాపురాలు పెట్టించడం వరకూ అన్ని పనులు గౌతమి ముందుండి చేసింది. పెళ్ళిళ్ళ ఖర్చుతో అప్పులు భారం కూడా బాగానే పడింది. అత్తమామలు కూడా మిగతా పిల్లల దగ్గర ఉంటామంటూ వెళ్ళిపోయారు. గౌతమి కూడా ఇద్దరి పిల్లల తల్లి అయ్యింది. ఈ ఐదేళ్ళ సమయంలో కృష్ణ ప్రవర్తనలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇంటికి కొన్ని రోజులుపాటు తరచుగా రాకపోవడం జరిగేది. గౌతమి చిన్న పిల్లలతో ఒంటరిగానే ఉండేది. మొదట్లో వ్యాపార పనుల వల్ల ఇంటికి రాలేకపోతున్నానని చెప్పేవాడు. తర్వాతర్వాత అది అతని అలవాటుగా మారిపోయింది. గౌతమి గురించి, పిల్లల గురించి అసలు పట్టించుకోవడం మానేసాడు. కుటుంబం పెద్దదిగా ఉన్నప్పుడు గౌతమి కృష్ణ ప్రవర్తన గురించి పెద్దగా ఆలోచించేదికాదు కాని ఇప్పడు మనస్సులో చాలా ఆవేదన పడుతోంది. గౌతమి కృష్ణతో మాట్లాడిన ప్రతిసారీ ఇంట్లో పెద్ద యుద్దమే జరుగుతుంది. ఈ గొడవలను చూసి పిల్లలు కూడా చాలా భయపడేవారు. అందుకే పిల్లల ముందర గౌతమి కృష్ణతో వాదనకు దిగకుండా జాగ్రత్త పడేది. కృష్ణ చేసిన అప్పులు కూడా ఎక్కువై, అప్పు ఇచ్చిన వాళ్ళు తరచుగా ఇంటికి వచ్చి గొడవ చేసేవారు. ఇంట్లో పరిస్థితులన్ని గౌతమి మీద చాలా ప్రభావం చూపాయి. కృష్ణ అప్పుల గురించి మాట్లాడిన ప్రతిసారీ గౌతమిని ఉద్యోగం మానేసి ఇంట్లో పడి ఉండమని ఇష్టానుసారంగా, అసభ్యకరంగా తిట్టేవాడు. మరొకవైపు గౌతమి అత్తమామలు కొడుకు ప్రవర్తనతో విసిగిపోయి, గౌతమి పిల్లలను ఎటువంటి లోటు లేకుండా చూసికోవాల్సిన బాధ్యత నీదేనని పదే పదే చెప్పేవారు. అంతే గౌతమి ముందు రెండే లక్ష్యాలు కనిపించసాగాయి. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, అప్పులన్నీ తీర్చేసేయాలి. కాని తన జీతంతో ఇవన్నీ సాధ్యపడవని కూడా తెలుసు. అమ్మనాన్నల కోసం, భర్తను వదిలేసిన ఆడదాన్ని సమాజం చులకనగా చూస్తుందనే భావనతో కృష్ణ నుండి విడిపోలేకపోయింది. అప్పటివరకు నిజాయితీతో, బాధ్యత గల ఆఫీసరుగా పనిచేసిన గౌతమిని, తన సహోద్యోగులు చూసి భయపడేవారు. తన నిస్సహాయతను, పరిస్థితులను ఆఫీసులో మిగతా సహ ఉద్యోగులకు చెప్పుకుని సాంత్వన పొందేది గౌతమి. అదే అదునుగా తీసుకుని తన సహ ఉద్యోగులు గౌతమికి డబ్బును సులభంగా సంపాదించే మార్గాల గురించి పదే పదే చెప్పసాగారు. దేవుడు మనల్ని చిన్నచూపు చూసినప్పుడు, మనం లంచం తీసుకుంటే తప్పుకాదని వాదించేవారు. గౌతమి వారన్న మాటల గురించి ఆలోచించసాగింది. తన నీతి, నిజాయితీల వల్ల తనకు ఒరిగేదిమిలేదన్న అభిప్రాయానికి వచ్చింది. తనకున్న అవసరాలు తీరిపోయేంతవరకూ లంచం తీసుకున్నా, తర్వాత మానేద్దాం అని నిర్ణయించుకుంది. అప్పటి నుండి ప్రతి పనికి లంచం లేనిదే పని చేసేది కాదు. అప్పులన్నీ తీర్చేసింది. పిల్లల చదువులకు కావాల్సిన డబ్బులను ఆదా చేసింది. సొంత ఇల్లు, కారు కొనుక్కుంది. డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా కృష్ణ మాత్రం తనతో బాగుండటం లేదని వెలితి తనని బాధించేది.
మొదట్లో అవసరాల కోసం డబ్బులు తీసుకున్న గౌతమి, తర్వాత్తర్వాత తన విలాసవంతమైన ఖర్చులకు, ఖరీదైన బట్టలకు, నగలకు, విహారయాత్రలకు, పార్టీలకోసం లంచం తీసుకునేది. అవతల వాళ్లు లంచం ఇచ్చుకోలేకపోయినా, వారిని పీిడించేది, చాలా సార్లు ఆఫీసు చుట్టు తిప్పించుకొనేది. ఇదంతా తప్పు అని ఆలోచించే విచక్షణను కూడా కోల్పోయింది. అదే సమయంలో గౌతమి పనిచేస్తున్న ఆఫీసులో రమ అనే ఉద్యోగి బదిలీ మీద ఇక్కడికి వచ్చింది. రమ చాలా తెలివైనది, సమాజం పట్ల చాలా అవగాహన కల్గిన మనిషి. వ్యక్తిగత జీవితంలోనైనా, ఉద్యోగ బాధ్యతలలోనైనా చాలా క్రమశిక్షణ కల్గిన మనిషి. రమకి చాలా తక్కువ సమయంలోనే గౌతమితో మంచి స్నేహం ఏర్పడింది. కాని రమకు, గౌతమి చేసే అవినీతి పనులను పసిగట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. అప్పుడప్పుడు గౌతమి తన గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్పుకునేది రమతో. సాధారణంగా స్త్రీలు కావాలని తప్పదు మార్గాలు ఎంచుకోరు, వారికి ఎదురైన పరిస్థితుల వల్ల వారు నిస్సహాయస్థితిలో రకరకాల ఊబులలో పడతారని బలంగా నమ్మే రమ, గౌతమికి ఎలాగైనా తన ప్రస్తుతం ఉన్న స్థితిని తెలియచెప్పాలని నిర్ణయించుకుంది. ముందుగా తన దగ్గరున్న కొన్ని మంచి పుస్తకాలను గౌతమి చదవమని చెప్పింది, దాంతో కనీసం తనలో ఆలోచన మొదలవుతుందనే ఆశతో. ఖాళీ సమాయాల్లో స్త్రీల స్థితి, పరిస్థితులు గురించి గంటల తరబడి మాట్లాడుకునేవారు. ఇవన్నీ కూడా గౌతమి ప్రవర్తనలో పెద్దగా మార్పును తీసుకురాలేకపోయాయి. రమ ఒకసారి గౌతమిని తన సొంతూరుకు తీసుకెళ్ళింది. గౌతమి రమ కుటుంబాన్ని చూసి నిశ్చేష్టురాలైయింది. కనీసం ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు. ఆధునిక వస్తువులు ఎక్కడా కనిపించలేదు. పంటలు పండక చాలీచాలనీ సంపాదనతో బ్రతుకుతున్న రమ అక్కలు, అన్నయ్య, వారి పిల్లలను చదివించడానికి తన జీతంలో రూపాయి, రూపాయి ఆదా చేసి కష్టపడుతున్న రమ వీటన్నింటిని దగ్గరగా చూసిన గౌతమికి, తను రోజు ఆఫీసులో కలిసి పనిచేసే రమనేనా అని సందేహం కూడా వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఇద్దరూ మిద్దెపైన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రమ గౌతమిని ”నాకు సాయం చేస్తావా” అంది. గౌతమి మనసులో రమ తన సమస్యల నుండి బయటపడటానికి డబ్బులు అడుగుతుంది, ఎంతైనా పర్వాలేదు సాయం చేయాలని నిర్ణయించుకుని, ”ఎటువంటి సాయం”అంది.
నేను చాలా రోజుల క్రితం ఒక కథ వ్రాసాను. కాని దానికి సరైన ముగింపు నేను వ్రాయలేకపోతున్నాను. నువ్వు చదివి నాకు సలహ ఇవ్వగలవా అంది రమ. సరేనంటూ గౌతమి ఆ కాగితాలను తీసుకొంది. కథ చదువుతున్నంత సేపు గౌతమి కళ్ళల్లోనీళ్ళు ఉబికి వస్తున్నాయి. ఆ కథ తన జీవితాన్ని తనే చదువుకుంటున్నట్లుగా అనిపించింది. ఈ కథలో కథానాయిక నేనే ఇది నా కథ అని గౌతమి మనసులో అనుకుంది. ”కథ ఎలా ఉంది” అని రమ, గౌతమిని అదిగింది. ”ఈ కథకు ముగింపు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని వ్రాయాలి. నాకు కొంచెం ఇస్తావా అని అడిగింది” గౌతమి. సరేనని తలూపింది రమ.
గౌతమి, రమ ఊరి నుండి వెనక్కు వచ్చినప్పటి నుండి చాలా ముభావంగా ఉండి పోయింది. పదే పదే రమ రాసిన కథను చదువుకుంటూ ఉంది. ఆఫీసుకు వారం రోజులు శెలవు పెట్టింది. రమ జీవితం, తన కుటుంబ పరిస్థితులు పదే పదే గుర్తుకొచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రమ కూడా తన సమస్యలతో సతమతమవుతోంది. కాని రమ తన పరిస్థితులు తన వ్యక్తిత్వాన్ని బలహీనం చేయకుండా చాలా జాగ్రత్త పడుతోంది. రమకు సాధ్యపడింది, నాకెందుకు సాధ్యపడదూ! నేనెందుకు మారకూడదూ! అని నిర్ణయించుకుంది. ఈ కథలో లాగా నాలాంటి ఎంతో మంది స్త్రీలు తమ నిస్సహాయ స్థితిలో, అంధకారంలో తమకు తెలియకుండానే చెడు మార్గంలో ప్రయాణం చేసి చివరికి తమ ఉనికిని కోల్పొతున్నారు. ”నేను అలా చేయకూడదు, నా జీవితం నా చేజారిపోకూడదు” అని పదే పదే మనసులో అనుకుంది గౌతమి. వెంటనే టేబిల్ మీద ఉన్న కాగితాలను తీసుకుని రాయడం మొదలుపెట్టింది.
”అవును, నిజమే నేను తప్పులు చేసాను. నా కుటుంబ పరిస్థితులు నా వ్యక్తిత్వాన్ని బలహీనం చేసాయి, అందుకే అడ్డదారులలో నడిచారు. నేను స్వతహాగా అలాంటి వ్యక్తిని కాదు. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు, కాని తన తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దుకున్నప్పుడే బలమైన మనిషిగా మారతాడు. అందుకే నేను నిర్ణయించుకున్నా. ఇప్పటి వరకు నేను అవినీతితో సంపాదించిన ఆస్థినంతటిని అనాధాశ్రమానికి వ్రాస్తున్నాను. నా మిగిలిన జీవితాన్ని అర్ధవంతంగా జీవించాలనుకుంటున్నాను. తన ఇద్దరి పిల్లలను కూర్చొబెట్టుకుని తన గతమంతా చెప్పి తన నిర్ణయం కూడా చెప్పింది. తల్లి పరిస్థితిని అర్ధం చేసుకున్న పిల్లలు ”నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం అమ్మా” అని సంతోషంగా చెప్పారు. తన 28 ఏళ్ళ వైవాహిక జీవితంలో ఎన్నడూ మనిషిగా, తన వ్యక్తిత్వాన్ని గౌరవించని భర్తకు విడాకులు ఇవ్వాలని అనుకుంది”.
గౌతమి కథకు ముగింపు నిచ్చింది. మరుసటిరోజున కొత్త కాంతితో, తేలికబడిన మనస్సుతో ఆఫీసుకు వెళ్ళిన గౌతమిని చూసి, రమ చాలా సంతోషంగా ఆలింగనం చేసుకుంది. ”నువ్వు రాసిన కథకు నేను ముగింపు వ్రాసాను. చూడూ” అంటూ కాగితాలను రమ చేతిలో పెట్టింది. ”అవునా” అంటూ రమ కాగితాలను తీసుకుని గబగబా చదివేసింది. నా ప్రయత్నం ఫలించింది, నీ జీవితంలో క్రొత్త మజిలీ ప్రారంభమైంది గౌతమి అని రమ మనసులో అనుకుంటూ
”థాంక్యూ గౌతమి, చాలా బాగా వ్రాసావు.” అంది.