మా అమ్మమ్మ మాకు ఎన్నో కథలు చెప్పేది. కొన్ని కల్పితాలు, కొన్ని జరిగినవి. కథలంటే నాకు ప్రాణం. చెవికోసుకుంటాను. ఆమె చిన్నప్పటి కాలంలో తాను చూసినవి, వినినవి, తెల్సుకున్నవి, ఎన్నో సమస్యల్ని, బాధల్ని, పరిస్థితుల్ని అన్నీ కలబోసి చెప్పేది.
మనకు స్వాతంత్య్రం రాక మునుపు కథ ఇది. మా ఊళ్లో రాధ అనే అమ్మాయి వుండేది. రాధకి అమ్మనాన్న, తమ్ముడు మేనత్త వుండేవాళ్ళు. ఆ ఊరు పల్లెటూరు. వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. ఆ ఊర్లో సెలయేరుండేది. ఊరు కానుకొని ఎత్తైన కొండలుండేవి. కొండల్లోను, కొండ కింద, దేవుని గుళ్ళుండేవి. పచ్చటిపైర్లు, పైరగాలి, కోనేరు, కొనేట్లో తామర్లు, మర్రిమాన్లు, మర్రి ఊడలు, వేప, చింత మానులుండేవి. రాధకి స్నేహితురాళ్ళుండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ కింద నడవరు, కొండల్లోనూ, చెట్లమీద, మిద్దెలమీద, కోతుల్లా తిరిగేవాళ్ళు. రాధకి ఈ స్వేచ్ఛ ఇచ్చిందెవరంటే వాళ్ళ మేనత్త, వాళ్ళ నాన్నకి చెల్లి. మేనత్తకి బాల్యవివాహం జరిగింది. అత్తగారింటి కాపురానికి వెళ్లకనే భర్త పోయారు. భర్త మొహం చూసెరగదు. పుట్టిల్లే సర్వస్వం ఆమెకి. ఒంటి చేత్తో ఇంట్లో పన్లు, వీధుల్లో పనులు, వ్యవసాయపు పనులు చక్కబెట్టి చుట్టబెట్టేది. రాధంటే మేనత్తకి పంచప్రాణాలు. కలసి తింటారు, కలసి తిరుగుతారు, కలసి నిద్రపోతారు.
రాధకి పదేళ్ళు నిండాయి. రాధవాళ్ళనాన్న రాధకి పెళ్ళి ప్రయత్నాలు చెయ్యసాగారు. పక్కూరి అబ్బాయితో పెళ్ళి నిశ్చయమైంది. పెళ్ళి మాటంటే చాలు, మేనత్తకి ”పుండుమీద కారం జల్లినట్లు” కాకలేసేది. ఇపుడేం పెళ్ళి, రాధ చిన్న పిల్ల. ‘పెళ్ళీవద్దూ గిళ్లీ వద్దూ’ అంటూ పోరేది. రాధవాళ్ళనాన్న, చెల్లి మాటను పెడచెవిన పెట్టేవారు. మేనత్త అరిచి గీపెట్టినా సరే, రాధపెళ్ళి జరిగింది. పెళ్ళి మాత్రమే జరిగింది. కాపురానికి పంపరు. పిల్ల పెద్దమనిషి కావాలగదా! పిల్ల ఇంట్లోనే వుండేది.
రాధ స్నేహితురాళ్ళందరికీ ఆఏడు పెళ్ళిళ్ళు అయ్యాయి. అందరూ అదే ఊర్లోనే వున్నారు. కాపురాలకెళ్ళలేదు. మళ్ళీ ఆటలు మొదలయ్యాయి. చెట్టూ పుట్టా, చేను చెలక, వానవంగడని దేన్నీ వదలక సమస్త ప్రకృతినీ స్వంతం చేసుకొని సంతోషించారు. ‘చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు’, పెళ్ళి అయినా బాల్యపు చేష్టలు పోలేదు.
రాధ ఎపుడెపుడు కాపురాని కొస్తుందాయని రాధ మొగుడు ఎదురు చూడసాగాడు. రాధ వాళ్ళూరెళ్ళి, రాధని చూసి, రాధతో మాట్లాడాలని ఆయన ఆరాటం. ఏదో ఒక వంకతో గుర్రమెక్కి రాధవాళ్ల ఊరొచ్చేవారు రాధ మొగుడు. బస్సులూ ఆటోలు లేవు గదా! గుర్రాలే, ఎడ్లబండ్లే వాళ్ళ ప్రయాణ సాధనాలు.
రాధ మొగుడొస్తే చాలు రాధని ఆయన కంట పడనీయదు వాళ్ళ మేనత్త. గుర్రం రెక్కలు శబ్దం వినగానే లోపల గదిలో కూచోబెట్టి వచ్చేస్తుంది రాధని.
‘రాధ ఎక్కడ? ఏం చేస్తోంది?’ అని అడగనే అడుగుతారాయన.
‘పడిశం, జరం, బాగలేదు’ అని మేనత్త చెప్పేస్తుంది. అల్లుడొచ్చాడని రాచ మర్యాదలన్నీ జరుగుతాయి. మర్యాదలెవరిక్కావాలి, రాధని చూస్తే చాలన్నట్లుంటాడాయన. రాధ వాళ్ళనాన్న, అమ్మ, తమ్ముడూ అందరూ ఆయన చుట్టూ చేరి కబుర్లు చెప్పేవాళ్ళు. ఆయన మనసు మాత్రం రాధమీదుండేది. రాధ తండ్రి ఇది గమనించక పోలేదు.
”రాధా! మంచినీళ్ళు తే” అంటాడు తండ్రి. ఆఘమేఘాల మీదెెళ్ళి మంచినీళ్ళు తెచ్చిస్తుంది మేనత్త. ‘రాధెక్కడ’? రాధ తండ్రి ప్రశ్న.
‘బాగలేదుకదా’ పొడిపొడిగా జవాబు చెప్పెళ్లి పోతుంది మేనత్త. రాధ మొగుడు రాధని చూట్టానికి రావడం, చూడకుండా వెళ్ళిపోవటం.
‘పానకంలో పుడకలాగా’ మేనత్త అడ్డు తగలటం జరిగేది.
పసి వయస్సులో ఆడపిల్లలకి పెళ్ళి చేయటం, అత్తగారింటికి పంపడం, పిల్లల్ని కనడం మేనత్త కిష్టం వుండేది కాదు. బాల్య వితంతువుగా ఆమె ఎంతో మానసిక ఘర్షణకి లోనైంది. బాల్య వివాహం అనే సంప్రదాయం మంచిది కాదని రాధకి నూరిపోసేది. రాధ, మేనత్త మాటల్ని చక్కగా అర్థం చేసుకుంది. పెళ్ళి అయితే అయ్యింది గానీ, మొగునింటకిి కాపురానికి పోబాక, ఇపుడిపుడే పిల్లా జల్లా కనద్దు తల్లీ, పనిపాటా, వంటావార్పు నేర్చుకో, మొగుని ముఖం చూడద్దు”, అంటూ రాధకి నూరిపోసేది మేనత్త.
”నేను నీ దగ్గరే వుంటానత్తా’ అంటూ ముదిగారంగా అనేది రాధ. రాలిన పూలేరి రాధ, దండలు గుచ్చి గుళ్ళో దేవునికిచ్చేది. స్నేహితురాళ్ళతో గుళ్ళో ‘అచ్చన్న గాయలు’, ‘బారా కట్టాలు’ ఆడేది. ఆకలి కాగానే పరిగెత్తి ఇల్లుచేరేది. ‘ఆ పరుగేంది, నిదానంగా నడు’ అంటూ రాధతల్లి తిట్టేది. ”ఆడపిల్లవి, ఇల్లు దాటచ్చా, ఎప్పుడుచూడు ఆటలు, ఆటలు అంటూ రాధ తల్లి తిట్లభారతం పొడిగించేది.
‘అదింగాసిన్నపిల్ల, ఆడుకోనీలే’ అంటూ మేనత్త వెనుకేసుకొచ్చేది. అదిగో ఇదుగో అనంగానే రెండేళ్ళు గడిసిపోయినాయి. రాధ ఎదిగికూర్చుంది. జరగరాంది జరిగిందని వలవలా ఏడ్చేసింది మేనత్త. వారం రోజులు గడప దాటనీయ్యక, ఎవరికంటా పడనీయ్యక, లోపలిగదిలో వుంచి, అన్ని సపర్యలూ మేనత్తే చేసింది. తల్లికి కూడా చెప్పలేదు. తల్లి అడిగింది ‘రాధకి జరమా’ యని, ‘అవునని’ ముక్తసరిగా జవాబు చెప్పింది మేనత్త. తండ్రి అడిగినా, స్నేహితురాళ్ళ డిగినా అదే జవాబు. రాధ తల్లికి అనుమానం వచ్చింది. మేనత్త దగ్గరకెళ్ళి ‘అవునా’ అని అడగాల్సింది అడిగేసింది. ”అవునుతల్లీ… అవును, నోరు మూసుకో, కొంపలంటుకు పోతాయి” అంటూ రుసరుస లాడింది మేనత్త.
”సంతోషంగదా! దైవికం, అత్తగారికి చెప్పి పంపుదాం” అని తల్లి అంది. ”తల్లి తల్లీ… నీతో ఇదే నొప్పి, ఎవురికీ సెప్పా వద్దూ పెట్టా వద్దు” అంటూ కోప్పడింది మేనత్త.
”ఏమీ…” దీర్ఘం తీసింది తల్లి. ”అత్తగారింటోళ్ళకి తెలిత్తే రాధని కాపురానికి తోలీల్లగదా” విడమర్చి చెప్పింది.
రాధ పదిరోజుల తర్వాత, గుమ్మందాటి బయట కొచ్చింది, పసుప్పచ్చటి ముద్ద బంతిలా. ముఖంలో జాబిల్లి శోభతో, కన్నుల్లో వెన్నెల సోనతో, విరబూసిన కలువలా చూడచక్కగా వుండింది.
గుడి మెట్లమీద అచ్చన్నలు, వేపచెట్టుకింద నాల్గురాళ్లాట, ఏట్లోనూ ఇసుక లోను వెయ్యి ఆటలు మొదలయ్యాయి మళ్ళీ.
స్నేహితురాళ్ళడిగారు ‘ఏల ఇన్నాళ్ళు’ యని
‘నాకు బాగలేకుండే’ పొడిగా రాధ జవాబిచ్చింది.
రాధకి, మేనత్త ఇంటి పనులు, వంటపనులూ నేర్పించసాగింది. ‘అసలు రహస్యం బట్ట బయలు’ చెయ్యద్దని చెప్పింది. ”అత్తంటి వాళ్ళకి తెలిస్తే నిన్ను వాళ్ళూరికి పిల్చకబోతారు.జాగ్రత్త”. చిన్నపిల్లకి ఎన్నో బోధించేసింది.
ఒకరోజు మిట్టమధ్యాహ్నం ఊరి బయటున్న శివాలయంలో రాధ స్నేహితులందరూ ఆడుకుంటున్నారు. దుమ్మురేగుతూ ఒక గుర్రం శివాలయం వైపు రావటం, దూరం నుంచే శాంతమ్మ చూసింది. గుర్రం కాస్త దగ్గరికి రాగానే ‘రాధా! నీ మొగుడే… గుర్రం మీద…” అంటూ కేకేసింది. ఆడుకుంటున్న అచ్చనరాళ్ళని విసిరేసి, స్నేహితురాండ్లందరూ ఒక్కొక్కరు, ఒక్కొక్క స్తంభం చాటున దేవాలయంలో దాక్కున్నారు అంతానిశ్శబ్ధం. గుడి ముందరికి గుర్రం రావటం, ఆగటం, రాధ మొగుడు గుర్రం దిగి దేవునికి దండం పెట్టడం అన్నీ స్తంభం చాటునుంచే చూశారు. ఆయన గుర్రం ఎక్కి దౌడు తీశారు. అంతా ఊపిరి పీల్చుకొని, కుదట పడ్డారు.
‘రాధా! నీ మొగుడు బాగున్నాడే’ చంద్రమ్మ ఆనందంగా చెప్పింది. ‘ఏమో ఎవరు చూసినారు?’ అంది రాధ మూతిముడుచుకొని ‘ఇంటికి పోవా?’ శాంతమ్మ ప్రశ్న.
‘…ఊ… నేనెందుకు పోతాను, నాకేం పని?’ అనింది రాధమ్మ. రాధని చూడకుండానే రాధ మొగుడు ఊరెళ్ళి పోయాడు సాయంత్రానికి. గోధూళివేళ, పశువుల్తో పాటు రాధ, స్నేహితు
రాళ్ళు ఇంటి ముఖం పట్టినారు. చెంగున ఎగిరే లేగదూడ తోక పట్టుకొని, చెంగు చెంగున ఎగురుతూ రాధ ఇల్లు చేరింది.
”రాధని ఎన్నాళ్ళని మనింట్లో పెట్టుకుంటాం.” రాధ తండ్రి కోపంగా నిలదీశాడు రాధ మేనత్తని.
‘అదింగా పసిది. అన్నెంపున్నెం తెలీదు, శరీరం ఎదగల్ల, పనీపాటా నేర్వల్ల, అది ఇదీ తెల్సుకోవల్లగదా.” అని మేనత్త వివరణ.
”పిల్ల ఎదగకాదని ఎన్నాళ్ళు బొంకల్లు” సూటిగా అడిగాడు రాధ తండ్రి.
”ఇంకా రెండేండ్లు సామీ’, అంటూ మేనత్త ప్రాధేయపడింది.
‘ఇంకా రెండేండ్లు’ దీర్ఘం తీశారు రాధ తండ్రి.
రాధ మేనత్త మాట ప్రకారమే, రాధని అత్తింటికి పంపలేదు. మరో రెండేండ్లు గడిచినాయి. ”దిన దిన గండం నూరేళ్ళాయుస్సు” లా రోజుల్ని నెట్టుతా వుండారు. రాధ స్నేహితురాండ్లు అత్తింటికి పొయినారు. తనకంటె చిన్నవాళ్ళతో రాధ ఆటలు సాగుతున్నాయి.
ఇంట్లో అన్నకి, చెల్లికి మధ్య రాధని అత్తింటికి పంపించే విషయంలో గొడవలు జరిగేవి. రాధ తల్లి గూడా ‘రాధని పంపితే మేలు’ అంటుంది. ఒకరోజు రాధ, సుగుణ, కాంత మర్రి చెట్టెక్కి కూర్చొని మాటాడుకుంటున్నారు. రాధ ఇంటి ముందున్న ఊడల మర్రంటే రాధకి ప్రాణం. ఆ చెట్టెక్కటం కష్టం. ఊడలు పట్టుకొని జారడం మరీ కష్టం. మర్రి ఆకుల్ని కాయల్ని దూసిపోయడం, కొమ్మమీదనుంచి మరో కొమ్మకి పాకటం చేస్తున్నారు. ఈలోగా లకలకమంటూ గుర్రపు గిట్టల శబ్దం వినబడింది. రేగిన దుమ్ము కనపడింది. అందరూ చెవులు రిక్కించి చూశారు చెట్టు మీద నుంచే.
‘వచ్చేది రాధ మొగుడు’.సుగుణ అంది.
ఆ ఊడలమర్రి కింద గుర్రాన్ని కట్టేసి, గబగబా లోపలికెళ్ళారు రాధ మొగుడు. వాకిట్లోనే రాధతండ్రి ఎదురై కుశల ప్రశ్న వేశారు.
రాధ మొదటిసారిగా మొగుణ్ణి చూసింది.
జీతగాడు పోతన్న రాధ మొగుడికి సపర్యలు చేస్తూ, వాళ్ళ మాటల్ని వినసాగాడు.
కాసేపటికి పోతన్న గబగబా బయటకొచ్చి, మర్రిమానెక్కి రాధ చెవిలో గుసగుస లాడాడు. రాధ ముఖం వివర్ణమైంది. గుర్రాన్నికట్టేసిన చోటే, మానుపై కొమ్మ మీదుంది రాధ.
పోతన్న ఇంకేదో మళ్ళీ గుసగుస లాడాడు. తలూపింది రాధ.
‘ఏందిరా! పోతి….’ అని అడిగింది సుగుణ. పోతన్న ఏం చెప్పలా. ”మాకూ చెప్పరా పోతన్నా’ అని అడిగారు.
రాధ, పోతన్న గుసగుసల్లో మునిగారు. రాధ మొగుడు ఇంట్లో నుంచి విసవిసా బుస బుసా బయటకొచ్చారు. ముఖం కోపాగ్నితో రగిలింది. ‘నీ మొగుడు లోపల్నుంచి బయట కొచ్చినాడు చూడన్నట్లు పోతన్న రాధ వంక చూసి సైగ చేశాడు.
రాధ చూసింది. రాధ మొగుడు చెట్టు దగ్గరకొచ్చి, చెట్టుకు కట్టిన గుర్రపు తాడుని ఊడదీశారు. రాజులా గుర్రమెక్కారు.కాలితో గుర్రపు పొట్టలో ఒక్క తన్ను తంతే చాలు గుర్రం దౌడుతీస్తుంది.
పొతన్న సైగ చేశాడు. రాధ మొగుడు గుర్రాన్ని తన్నేలోగా, రాధ చెట్టు మీద నుంచి మర్రి ఊడ పట్టుకొని జరజరా జారి గుర్రం మీదికి దూకటం, గుర్రం దౌడుదీయటం ఒకేసారి జరిగాయి.
రాధ గట్టిగా మొగుణ్ణి వాటేసుకొని కూచుంది. ఎవరో పై నుంచి దూకారని భయపడి రాధ మొగుడు గుర్రాన్ని ఆపాడు. వెనుదిరిగి చూస్తే అందాల భరిణి. ”ఓ దొరా! నీ పెండ్లాం రాధమ్మ దొరా, నీ రాధమ్మ దొరా… పో…పరుగుతో” అంటూ పోతన్న కేకలేశాడు. ఆ గుర్రం దౌడు తీసింది. రాధ, రాధ మొగుడు రాజు, రాణీలాగా గుర్రం మీద పారిపోయారు. మేనత్త ముక్కున వేలేసుకుంది.
‘ఆలస్యం అమృతం విషం’ అయ్యేటట్టుంది. వాడు రెండో పెళ్లి చేసుకుంటానని బెదిస్తున్నాడు”. అని అనుకుంది.
ఆ వింతని చూస్తున్న కాంత అడిగింది పోతన్నని.
‘పోతన్నా! రాధమ్మ చెవిలో ఏం సెప్పితివిరా’ అని అడిగింది. వీడింకా ఆ ఆనందంలోనే వున్నాడు బయట పళ్ళేదు పోతన్న
”ఓరి పోతన్నా! సెప్పరా” అంటూ రెట్టించింది కాంత.
పోతన్న అందుకొని, ”ఈ పొద్దు గన్క మీరు మీ పిల్లని కాపురానికి పంపీకపోతే, నేను మారుమనువు సేసుకుంటా సూడండి. దిన్నమూ నేను రావడం, తిరిగెల్లి పోవడం ఎన్నాళ్ళని ఇట్ల” అని, కోపం కోపంగా తినకుండా ఊరికి పోబోయినారు, అవన్నీ రాధమ్మకి సెప్పి, ”అమ్మయ్యా! నువ్వు నీ మొగునూరుకు పో, దూకు గుర్రంపైకి …. పో”, అని చెప్పితినని పోతన్న అంటే కాంత ఆశ్చర్యపోయింది.