చలం ఇంకా – ఇంకా – గోటేటి లలితాశేఖర్‌

జీవితాన్ని కాస్త ఆర్ద్రంగా జీవించాలనుకునే వారికి చలం కావాలి. జీవితాన్ని సౌందర్యభరితం చేసుకోవాలనుకునే వారికి చలం కావాలి. సత్యస్ఫూర్తితో జీవించాలనుకునే వారికి చలం కావాలి. ఇలా చలం ఇంకా-ఇంకా వందేళ్ళ వరకూ కాదు మానవ సమాజం వున్నంతవరకూ. స్త్రీ – పురుష సంబంధాలు అర్ధవంతమై సఫలం చెందే వరకూ ‘చలం’ మనకు కావాలి.

”చలానికి నూరేళ్ళు నిండినా చలం మీద ఆపోహాలకూ అపార్ధాలకు మాత్రం నూరేళ్ళు నిండకపోతే ఎలా? అంటారు. వావిలాల సుబ్బారావు గారు తన వ్యాస సంపుటి ‘చలం ఇంకా ఇంకా’లో

ఈ వ్యాస సంపుటిలో మొత్తం 31 వ్యాసాలున్నాయి. చలం సాహిత్య, జీవిత దీపోత్సవాన్ని వివిధ కోణాల్లో చిత్రీకరించిన ప్రతిభ వావిలాల సుబ్బారావు గారిది. సూర్య గమనం వంటి చలం జీవితం, సాహిత్యంలోని మూడ్స్‌ను దశల్ని వివిధ షేడ్స్‌గా చిత్రించింది సుబ్బారావు గారి కుంచె. ఈ ప్రకటనకు ముందు ఒక జీవిత కాలపు కృషి వుందనడానికి ఈ వ్యాసాలే నిదర్శనం.

”సూనృతము” అనే పదం చలం గారికి పర్యాయపదమైతే ”నిస్పాక్షిక పరిశోధన” అన్న పదం శ్రీ వావిలాల సుబ్బారావు గారి సొత్తు అనడాన్ని ఈ 31 వ్యాసాలు నిరూపిస్తాయి.

ఈ సంపుటికి ముందు మాట రాసిన అంపశయ్య నవీన్‌ ఇలా అంటారు. ”నాకు ఈ వ్యాసాలను చదువుతోంటే చలం గారిని ‘రీడిస్కవర్‌’ చేసినట్టుగా తోచింది. నాకు తెలిసి చలంగారి వివిధ దశల్ని సూటికి నూరుపాళ్ళు అర్ధం చేసికొన్న అరుదైన మేధావి వావిలాల సుబ్బారావు”. అంటారు.

ఇంక ఈ వ్యాస సంపుటిలోని వ్యాసాలను పరిశీలిస్తే, ఇవేవో చలాన్ని అభిమానిస్తోనో, ఆరాధిస్తోనో చేసిన విమర్శలు మాత్రమే కాదు. అనుమానిస్తూ, అన్వేషిస్తూ ఒక్క మాటలో చెప్పాలంటే మైక్రోస్కోప్‌లో వుంచి డిసెక్టు చేసిన దాఖలాలు మనకే వ్యాసాలు చదువుతూంటే కనబడతాయి.

”లేచిపోవటం’ – అనబడే స్త్రీ పుంసంయోగం” అనే వ్యాసంలో ఇలా అంటారు. ”అసలు ఎవరుగానీ ఎందుకు లేచిపోతారు. సుఖాన ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టుకుంటారా? కుటుంబం, సమాజం ఇచ్చే భద్రతావలయం నుండి, ఇంక తిరిగి రాలేనంతగా దూరం అవుతారా? ఒకవేళ అట్లాంటి (చపలులు) తెలివి తక్కువ వాళ్ళు ఆత్మవినాశనం చేసుకొనే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళను గొప్పచేసి చలం వ్రాస్తాడా? వ్రాస్తే మాత్రం ఇంతకాలం నిలుస్తాడా? అని ప్రశ్నలు వేసికొని లేచిపోయిన వాళ్ళ మీద మన అసహ్యత కోపతాపాలు ప్రక్కనపెట్టి విచారణ చేస్తే నాకు కనువిప్పు కలిగింది.

సర్వసుఖాలు వదలి అడవులలో దేవుడొస్తాడు ఆనందం ఇస్తాడు అన్న గ్యారంటీ లేకపోయినా తపస్సు చేసే యోగులకు – ఈ ప్రేమయోగులకూ నాకు భేదం కనిపించలేదు. ఇది ఇద్దరూ కలిసి చేసే యోగసాధన. ఆ ఒకరి ఆత్మను మరొకరు ఆరాధించే యోగం. పెళ్ళాం మీద అలిగి పిల్లల్ని పోషించలేక కాషాయగుడ్డలు కట్టిన ప్రతీవాడు యోగి ఎట్లాకాడో – పరాయి స్త్రీ చేయిపట్టుకున్న ప్రతి పోకిరివాడు ప్రేమయోగి కాడు. విభేదాన్ని విజ్ఞులు అంచనా కట్టగలరు” – అంటారు సుబ్బారావు గారు.

”ఇక చలం చేతిలో హాస్యం” అన్న వ్యాసంలో చలం గారిలో శృంగార చాపల్యమెంతో హస్యచాపల్యం అంత అంటారు. చలంగారివి ఒక ఐదారు కథలున్నాయి. వాటిని హాస్యకథలుగా వుండాలని భావించి వ్రాసారు. కానీ చాలా పేలవంగా వుండి – ఇవి ఎందుకు వ్రాశారా అనిపిస్తుంది. ”అట్లపిండి -” నా మొదటి క్రాపు – నాటకం – విచిత్ర వళనీయం – వీటిలో పాత్రలు తోలుబోమ్మలు సన్నివేశాలు కృత్రిమాలు – అందువల్ల – ఉదారమయిన హస్యం వీటిలో నాకు కనిపించలేదు”, అంటారు.

చలంగారి హాస్యం రెండు సందర్భాలలోనే రక్తి కడుతుంది జీవితోల్లాసం వ్యక్తమయ్యే మిత్ర సంభాషణల్లోనూ, ఎగతాళికి హాస్యాన్ని సాధనం చేసుకున్న సందర్భాలలోనూ మాత్రమే రాణించింది.

‘చలం దేశభక్తి’ అన్న వ్యాసంలో ఇలా అంటారు. దేశాన్ని దేవత చెయ్యటం ఒక అసత్య విశ్వాసాన్ని ప్రచారం చెయ్యటమే దేశాన్ని ప్రేమించటం – అభివృద్ధి చేసుకోవటంలో చలానికి వ్యతిరేకత లేదు. దేశాన్ని ప్రేమించటం వేరు. భక్తితో పూజలు చేయటం వేరు. భక్తి అంటే దేశానికి దైవత్వం ఇవ్వడం. భారతమాత, ఆంధ్రమాత అనే సమాసాలు కవిత్వంలో రూపకాలంకారాలేగానీ చెరగని సత్యాలు కావు. భారతమాతను ముందు కవిత్వంలో పుట్టించి, తర్వాత దాని చుట్టూ సెంటిమెంట్లు అల్లి, మళ్ళీ వాటి చుట్టూ కవిత్వం పేనడం మొదలు పెట్టారు. కొత్త దేవతలు పుడతారా? పాకిస్తాన్‌ మాత ఎక్కడుంది? సిగ్గు లేదూ? భారతమాత, రష్యాపిత – చైనా తాత ఏ నాటికైనా ముందు తరాల వాళ్ళు నవ్వుకోరూ ! నిజం చెప్పు పద్యాలకేం గానీ ఆ మట్టి నీకు తల్లి అనిపించిందా?” అంటూ ఎడాపెడా వాయించాడు.

అడవిలో దావాగ్ని పుడితే చంద్రమతిని ”నిప్పుల్లోపోయి దూకు చల్లారుతుంది. ఇపుడు నీ మహత్యం చూపు – ఇది వరకు పతివ్రతలు ఈ పనే చేశారు.” అంటూ పోరు పెడతాడు హరిశ్చంద్రుడు చంద్రమతిని అమ్ముతున్నపుడు ”నన్ను కొన్నవాడు దుష్టుడై నన్ను ఏమైనా చేస్తే…” అంటుంది ఆమె. ”రాముడి మల్లే నిన్నింకోసారి నిప్పులో దూకించి శుద్ధి చేసుకుంటాలేవే” అంటాడు.

తెలుగు హస్యరచయితల్లో అగ్రశేణిలో వుండదగిన పలుకు, కులుకు చలం దగ్గర వున్నాయి. సమాజ విమర్మాసాధనంగా హాస్యానికున్న సాహిత్య శక్తిని గుర్తించి వినియోగించినవారు కందుకూరి గురజడాలతో పాటు చలంగూడ – అంటారు వావిలాల.

అంతేకాదు గొప్ప విలువలను చిత్రించే సమయంలో పాత్రలు దుఃఖవ్యగ్రంగా వున్న కథలలోనూ చలంగారు హాస్యానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. తీవ్ర సన్నివేశంలో అవన్నీ సద్దుమణుగుతాయి. గాఢతకు చోటిచ్చి ప్రక్కకు తప్పుకుంటాయి అంటారు.

మరోక వ్యాసం ”చలం పురుష పాత్రలు” అన్న వ్యాసంలో ”అనురాగ బంధాలలోని స్వేచ్ఛను చెవికెక్కించుకోని సమాజం, ప్రేమను వదలి పెండ్లికే ప్రాధాన్యమిచ్చే న్యాయస్థానాలు. ‘స్త్రీ’ దుస్థితికి కొంత కారణాలు అంతకన్నా ఎక్కువగ పురుష స్వభావం కారణం. స్త్రీ సహజమైన కొన్ని సుగుణాలు కూడా కారణమే ‘స్త్రీ’లోని ప్రేమ, జాలి, ఆర్ద్రత, గుణారాధన మొదలైన ఉత్తమ గుణాలు కూడా కారణమే. ఈ సుగుణాలవల్ల బలహీనతకు లొంగిపోయి కూడా సమాజంలో మర్యాదగా బ్రతకాలంటే స్త్రీ ఎక్కడా బయటపడని మోసగత్తె, అబద్ధీకురాలన్నా కావాలి. లేక అతనికి హృదయములో స్థలము ఇవ్వని పాషాణురాలన్నా కావాలి. స్త్రీ కరుణించి ఇచ్చిన వరాల ఉన్నతిని తెలియకపోతే అది తమ ఘనత అనుకొని గర్వపడ్డ పురుషుడు చివరకు ఆ వరాన్నే కోల్పోతాడు.”

బృహస్పతి అన్నట్టు ఇదంతా నాది – నా కోసం అన్నభావం నుండి నేను అందరి కోసం. అంతా నేనే అన్నభావంలోకి వికసించడమే పురుష ధర్మం. ఈ రెండు స్థితులకు మధ్య భిన్న స్థాయిలందుకున్న పురుషపాత్రలను చలంగారు సజీవమూర్తులుగా కనుల ముందుంచారు అంటారు సుబ్బారావు గారు.

‘చలం దృష్టిలో సాహిత్యానుభవం’ అనే వ్యాసంలో సుబ్బారావుగారి పరిశీలన ఎంతో సహేతుకంగా వుంటుంది. ”ఏ రకమైన ఔన్నత్యమయినా మన ఇష్టాయిష్టాలతో నిమిత్తంగానీ వాటిపట్ల పక్షపాతం గానీ లేకుండా ఆస్వాదించగలగాలి అది చలం ఆశించిన సహృదయత ధర్మం.” ”గీతాంజలి” కన్నా ఫలానా డిటెక్టివ్‌ నవల గొప్పది అన్న శ్రీశ్రీ వ్యాఖ్యానానికి తన అయిష్టపూర్వకమయిన ఆశ్చర్యాన్ని ప్రకటించాడు చలం. విశ్వాస బేధాలున్నా మన సిద్ధాంతాలు రసానుభవానికి అడ్డురాకూడదు. కమిటెడ్‌ రచయిత లుండవచ్చుగానీ కమిటెడ్‌ ఆస్వాదన వుండకూడదన్న మాట ‘కమిటెడ్‌ ఆస్వాదన’ అంటూ అతిస్పష్టమయిన వివరణ ఇస్తారు సుబ్బారావుగారు ఈ వ్యాసంలో ఇంక ”చలం కొందరికోసమే” అన్న వ్యాసంలో ”చలంలో పోరాటశక్తి తగ్గి ఈదలేక పిచ్చుక లంకలు పట్టాడని” సెమినార్‌ ప్రారంభోపన్యాసంలో శ్రీ సినారె వ్యాఖ్యానించారు. స్వీయ తత్వాన్వేషణ సాహిత్య సృజన ఏకత్రా వున్న తెలుగు రచయిత చలం ఒక్కడే. ”సిద్ధాన్నంగా వున్న తాత్విక మార్గాన్ని స్వీకరించక తనకు తానై రహదారి నిర్మించుకుంటూ ప్రయాణం చేసిన ఏకైక తెలుగు రచయిత.” అలాంటి చలాన్ని ”మనసు చంచలం, సాహిత్యంలో నిశ్చలం” అని మరో వాక్యంలో సూత్రీకరించారు సినారే. ”అందంగా కనిపించే ఈ వాక్యంలో అసంగతం చాలావుంది. చంచలమైన మనసు నుండి నిశ్చలమైన సాహిత్యం పుట్టడం కానీ లేక చంచలమైన మనస్సు సాహిత్యంలో నిశ్చలం కావటంగాని సాధ్యమా? చంచల నిశ్చలాలకు కార్యకారణ సంబంధం కుదురుతుందా. అంటూ ప్రశ్నిస్తారు సుబ్బారావుగారు.

ఇలా 31 వ్యాసాలున్న ఈ సంపుటి ”చలం — ఇంకా – ఇంకా” లో కొండంత చలాన్ని అద్దంలో చూపే ప్రయత్నం నూటికి నూరుపాళ్ళూ విజయవంతమైందని చెప్పడానికి ఎంతో సంతోషంగా వుంది. భావగాఢత. భాష సంక్లిష్టత వున్న వ్యాసాలను సాధారణ పాఠకులంత సుఖంగా, సునాయాసంగా చదవలేరు. ఈ వ్యాస సంపుటికి మరొక వన్నె అతి సరళమైన భాష. లోతైన భావాలను గూడా తేలికగా చెప్పగలగడం సుబ్బారావు గారి నేర్పుకు నిదర్శనం.

ఒక సంస్కారిని మరొక సంస్కారి గుర్తించగలడు. ఒకరి పాండిత్య విలువను మరొక పండితుడు తూచగలడు. ఒక హృదయ జీవిని మరొక సహృదయుడు మాత్రమే అర్ధం చేసుకోగలడు కానీ తర్కబద్ధమైన కొలమానాలతో కాదు.

”చలం ఇంకా ఇంకా” ఈ విమర్శా వ్యాస సంపుటి కున్న ప్రత్యేకత నిప్పాక్షిక విమర్శ. చలం జీవితాన్ని, సాహిత్యాన్ని సంపూర్ణంగా చేసిన అధ్యయనం వెనుక ఒక జీవిత కాలపు కృషి శ్రీ వావిలాల సుబ్బారావుగారిది. చలం సాహిత్యానికి అంతిమ తీర్పు లాంటి ఈ వ్యాస సంపుటిని ఎవరికి వారుగా చదువుకుని ఆనందించవలసిందే.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.