డౌరీడెత్‌ – సామాజిక దృష్టి – పి లోకేశ్వరి

వరకట్న సమస్య: సమాజం గూర్చి దాని ఆర్థిక పునాదుల గూర్చి స్పష్టమైన అవగాహన లేనందువల్ల, వరకట్నం వంటి సంస్కరణ ఉద్యమాలన్నీ ఒక దశ వరకు ఫలించి దరిమిలా పాల పొంగులా చల్లారిపోతాయి. వరకట్న పిశాచ వృక్షం కూకటి వేళ్లను పెకలించాల్సింది పోయి, మన సంస్కర్తలు మొదలు నరికి సరిపెట్టుకున్నారు. అందువల్ల అది ఎక్కడికక్కడ మళ్లీ మళ్లీ పుట్టి సమాజమంతా అల్లుకుపోతోంది! వరకట్న నిషేధం కోసం చట్టాలు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. పెళ్లి వయస్సు వచ్చి వివాహం కాని ఆడపిల్లలు అసమానతల ఆర్ధిక చట్రం విషపుకోరలకు ఎలా బలి అవుతున్నారో మనకు తెలియంది కాదు. అప్పులు చేసో, ఆస్తులు తెగనమ్మో ఆడపిల్లలకు పెద్ద చదువులు చదివించినా ఆ విద్యనే మహాభాగ్యంగా భావించే వరుని కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? అమ్మాయి శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం, విద్యావంతురాలు స్వావలంబన పరురాలుకావడం, ఎవరికీ ఏ దశలోను భారం కాకపోవడం వంటిది వరకట్న సమస్యకు మంచి విరుగుడు. వరకట్నాన్ని రూపుమాపే అసలైన సంస్కరణ. అమ్మాయి వివాహమైతే చాలునన్న అవసరం వెన్నాడుతున్నపుడు కట్నాలు కానుకలు ఇచ్చేవారు పుచ్చుకునేవారు పరస్పరం ఫిర్యాదులు చేసుకోరు. సహకరించుకుంటారు. దేశంలో స్మగ్లింగ్‌తో పోటీ పడగల రాకెట్‌ వరకట్నం. వివాహిత మహిళలను వేధించడం, పుట్టింటికి పంపేయడం హత్యచేసి ఆత్మహత్యగా బుకాయించడం వెనుక ప్రధాన కారణం వరకట్నం! దేశంలో గంటగంటకూ ఓ వరకట్న హత్య నమోదు అవుతుంది! ఈ కేసుల విచారణలో తీవ్రజాప్యం జరుగుతోంది. ఏళ్లు గడుస్తున్నా నేరస్తులకు శిక్ష పడని పరిస్థితి. వరకట్న హత్యకు ముందు అమ్మాయిలు హింసలు అనుభవిస్తున్నారు. చట్టాలు వరకట్న హత్యలను, హింసలను అదుపు చేయలేవని తేలిపోతోంది. 80 శాతం వివాహితలు ఏదో ఒక రూపంలో వరకట్న హింసలు అనుభవిస్తున్నారు.

కథా వస్తువు: కథావస్తువులో వైవిధ్యం ఉన్నప్పటికి ఈ వైవిధ్యం నుంచి ప్రభవించిన ఒక కొత్త కోణం వుంటుంది. అది మిగిలిన కథల్లాగానే ఉన్నస్థితిని చూపుతుంది రావలసిన మార్పును సూచిస్తుంది. అంతా యధాతధంగానే ఉన్నా వాటిల్లో వున్న నవ్యత ఆకర్షించే కోణం. దీనికి ప్రత్యేక గమనంలేదు. సాధారణ కధల్లాగానే సాగుతూ, మనిషిని నిలువునా కుదిపి మేల్కొల్పి ఆలోచింప చేసేట్టున్న రచనలు అతి స్వల్పంగా వుండవచ్చు. అందులో ఒకటి కొలకలూరి ఇనాక్‌ గారు రచించిన ‘అస్పృశ్యగంగ’ లోని ‘డౌరీడెత్‌’ ఇందులో స్త్రీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒక్కటి వరకట్న సమస్య. ఈ కథ పేరు వినగానే అందరికి స్పృశించే అంశం వరకట్న వేధింపులతో స్త్రీ మరణించిందని అనిపిస్తుంది. కాని వస్తువు ప్రాచీనమైనా, సమస్యకు ఇనాక్‌గారు పరిష్కారాన్ని కొత్తదనంతో మనకందించారు. ఈ డౌరీడెత్‌ ద్వారా తెల్పారు.

కథా విశ్లేషణ – సామాజిక దృష్టి: లత మధ్యతరగతి కుటుంబంలో జన్మించినప్పటికి తల్లిదండ్రులు తనను బాగా చదివించారు. లత చాలా అందంగా చలాకీగా వుంటుంది.రవి బాగా చదువుకున్నాడు. ఉద్యోగం చేస్తున్నాడు. లత గుండ్రని కళ్ళకు ముగ్ధుడైనాడు రవి. ”అంత అందమైన కళ్ళు భూప్రపంచం మీద లేవనుకున్నాడు. ఆ కళ్ళు కావాలనుకున్నాడు” ఇక్కడ ఇనాక్‌గారు చాలా అద్భుతంగా సమయస్పూర్తితో ఈ వాక్యాన్ని రాసారు.

లత మనస్సుకాదు, లత అందం కావాలి, అందులో కూడా కళ్ళు మాత్రం కావాలి. స్త్రీకి విలువలేదు. కాని స్త్రీ శరీరం మాత్రమే కావాలి. ఆ స్త్రీ అతన్ని వివాహం చేసుకుంటే జీవితాంతం భరించాలి.

రవి ఆ కళ్ళు జీవితాంతం కావాలనుకున్నాడు. పెళ్ళి చూపుల్లోనే లతను పెళ్లాడుతానని మాటిచ్చేశాడు. స్త్రీ జీవితంలో ప్రధానమైన భాగాన్ని ఆక్రమించేది వివాహం. భాష వ్యవస్థాగతమైన భావాలనే ప్రతిబింబింస్తుంది. స్త్రీని ఈ సమాజం భోగవస్తువుగా మార్చేసింది. స్త్రీ అందంగా వుండాలి. స్త్రీ వ్యక్తిత్వం కాని, వాళ్ళ వేదనకాని, రోదనలుకాని ఎవ్వరికి అవసరంలేదు. రవి లతను చూశాడు. ఇష్టపడ్డాడు. వివాహానికి అంగీకరించాడు కాని ఇక్కడ లత అభిప్రాయానికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. కనీసం జీవితాంతం కలిసి బతకాల్సిన వ్యక్తి తనను అర్ధం చేసుకుంటాడా లేదా అని కూడా తెలియదు. అయినాసరే పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే లత తల్లిదండ్రులు చెప్పిన విధంగా వినాలి తప్ప వారికి ఎదురు ప్రశ్న వేయకూడదు. స్త్రీకి తన మనస్సులో వున్న భావాలను వ్యక్తం చేసే హక్కు, అధికారం లేవు. పెళ్లి వయస్సు వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులకు గుండెలపై కుంపటి; అందుకే కట్నం లేకుండా ఉద్యోగం చేసే అల్లుడు దొరికాడని లత తల్లిదండ్రులు సంతోషంతో లతకు వివాహం చేయడానికి అంగీకరించారు. ఇక్కడ తల్లిదండ్రులు వారి బాధ్యతలను దించుకోవాలనే స్వార్ధం.

రవి తల్లికి కట్నం కావాలి, కాని లత తల్లిదండ్రులకు కట్నం ఇచ్చే స్తోమతలేదు. కట్నం అడిగి ఇవ్వలేదనిపించుకోవడం ఇష్టంలేక, రవి లతను కట్నం లేకుండానే వివాహం చేసుకోవటానికి అందరి ముందు అంగీకరించాడు. కాని కట్నంకోసం రవిని తల్లి వారిస్తుంది, మందలిస్తుంది. రవి అన్నయ్య కూడా దీన్ని వ్యతిరేకిస్తాడు. కాని ఎవరి మాటలను లెక్కపెట్టకుండా తనకు నచ్చినట్లే చేశాడు రవి. రవికి ఎవరి అభిప్రాయాలతోనూ అవసరం లేదు తనకు నచ్చినట్లే అందరూ వినాలనుకోనే స్వభావాన్ని చూడవచ్చు. ఎందుకంటే అతడు పురుషుడు.

ఇక్కడ లత ఒక వస్తువుగా మారింది. తల్లిదండ్రుల స్వార్ధం కోసం, మరొక్కరికి తన శరీరం కావాలి. ఇంకొక్కరికి తను తీసుకొచ్చే కట్నం కావాలి. భగవంతుడు లతకు అందమైతే ఇచ్చాడు కాని డబ్బు, ఆస్తి ఇవ్వలేదు. తప్పనిసరై రవితల్లి, అన్న కట్నం లేకుండా వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నారు.

రవి తల్లికి, అన్నకు తప్పలేదు ఎందుకంటే రవి ఎంత చెప్పినా తమ మాట వినలేదు. మనం ఒప్పుకున్నా లేకున్నా రవి పెళ్లి చేసుకుంటాడని భయంతో పెళ్లికి అంగీకరించారు ఇద్దరూ.

వివాహంతో స్త్రీ స్థానం పుట్టింటి నుండి మెట్టినింటికి మారుతుంది. అత్తగారింట్లో వధువు భర్త ఆదరణలో సేదదీరాలనుకుంటుంది. అందరిలాగే లతకూడా అత్తింటిలో అడుగు పెట్టింది. కాని లత ”కాపురానికి రావటం, భయం పుట్టటం ఒకేసారి జరిగాయి. ”కాపురం, భయం కవలపిల్లలు”, ఇనాక్‌ గారు భయాన్ని అత్తింటిని చాలా చక్కగా కవల పిల్లలతో పోల్చి వర్ణించారు.

అత్తింటివారు సంపన్నులు కాని పుట్టింటివారు పేదలు. అత్త లతతో మంచిగా మాట్లాడిన రోజులే లేవు. అత్త లతతో మాట్లాడిందంటే చాలు అన్నీ డబ్బు మాటలే. పెళ్లికి ఎటూ కట్నంతేలేదు, ఇప్పుడైనా కొంత డబ్బు తెచ్చుకో, మా కోసం వద్దులే, నీకోసం నీ తిండి కోసం సరిపడే డబ్బులు తెచ్చుకో. ఆ డబ్బుదాచుకో. దానిపై వచ్చే వడ్డీతో నువ్వు సుఖపడు, నీ అవసరాలను తీర్చుకో, అంటూ మొదలు పెట్టేది.

జీవితాంతం పోషించడానికి కట్నం అనుకుందాం అంటే పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని ఊరికే కూర్చోపెట్టి తిండి పెట్టరు. నిద్ర లేచినప్పటి నుండి అర్ధరాత్రి నిద్రపోయే వరకు ఇంటిల్లిపాదికి చాకిరి చేయాలి. అందరి అవసరాలు తీర్చాలి. భర్తను సుఖపెట్టాలి. ఇలా అన్నింటిని సక్రమంగా నిర్వర్తించాలి. దీనికి ఆమెకు నెలకు జీతం ఇస్తే, ఆమె జీవిత పర్యంతం ఒక్క ఇంటిపనిలో సంపాదించే సంపాదన కొన్ని లక్షల రూపాయలు లెక్కతేలుతుంది. కాని లత అత్తగారు మాత్రం ఊరికే అప్పనంగా తిండిపెట్టలేము అని రోజూ తిట్టడం ప్రారంభించింది.

”నిద్ర లేని కళ్ళు నీరసంగా ఉంటున్నాయి” రచయిత ఈ వాక్యం చెప్పడంలో అంతర్యం. నిద్ర ఎందుకు లేదు అంటే లత దగ్గర సమాధానం వుంది కాని బయటికి చెప్పలేని పరిస్థితి. అత్త గురించి భర్తకు చెప్పితే ఎలా? చెప్పకూడదని అనుకుంటుంది. ఈ విషయాన్ని ఇనాక్‌గారు ఆమె అందమైన కళ్ళు కాదు అందమైన జీవితం ఇప్పుడు అందవిహీనంగా మారాయని చెప్పారు.

ఈ ఆలోచనలతోనే లతకు నిద్ర పట్టదు. అందువల్ల రవికి ఇష్టమైన లత కళ్ళు ఇప్పుడు అందవిహీనంగా మారాయి. లత శరీరానికి జబ్బు చేయలేదు. లత మనస్సుకు వచ్చింది అనారోగ్యం. ప్రతిక్షణం భయం భయంగా ఎప్పుడు అత్తగారు ఏమని తిడతారో తెలియదు. ఈ ఆలోచనలతోనే తన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది. లత ఆరోగ్య పరిస్థితి బాగాలేదని రవి డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాడు. కాని ప్రయోజనం లేదు. పుట్టింటికి పంపాడు, సినిమాలు చూపించాడు, దేవాలయాలు తిప్పాడుకాని ప్రయోజనంలేదు. ఇల్లు వదిలి బయటకు వచ్చిందంటే చాలు లేడిపిల్లలా గంతులు వేస్తుంది. ఇంటికి వచ్చిందంటే ముడుచుకుపోతుంది. లత పరిస్థితి రవికి అర్ధంకాలేదు.

ఆత్త మాటలను భరించలేక తల్లిదండ్రులను డబ్బులు అడుగుతుంది. తల్లిదండ్రులు మా స్వార్ధం వదులుకుని నిన్ను చదివించాము, ఉద్యోగం చేసి మమ్మల్ని ఉద్దరిస్తావని అనుకున్నాం. కాని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయావు. మేము పెన్షన్‌తో  బ్రతుకుతాం, వున్న ఇంటిని అమ్మి వచ్చింది తీసుకెళ్ళు, మేం ఏ చెట్టుకిందో వుంటాం అని నిరాశ్రయంగా మాట్లాడటం భరించలేకపోయింది.

తల్లిదండ్రుల బాధను చూసి ఓర్చుకోలేకపోయింది. నేను అత్తింటికి వెళ్లను ఇక్కడే వుండి ఉద్యోగం చేసి మిమ్మల్ని చూసుకుంటాను అంటుంది లత. అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోరు ఎందుకంటే కూతురు భర్తను వదిలేసి పుట్టింట్లో వుండటం వాళ్ళకు చిన్నతనం, పరువుపోతుందని భయం. అందుకే లతను అత్తింట్లో దింపారు. ఇక్కడ కూడా తల్లిదండ్రులు పరువు మర్యాదంటూ కూతురు పడే కష్టాన్ని పట్టించుకోలేదు. దిగులుతో, తోడులేక, ఆసరాకోసం ఓదార్పుకోసం నిట్టూర్పుతో అలమటిస్తూ తిరిగి అత్తింట్లో కాలు పెట్టింది.

అప్పటికి లత అందం అందవిహీనంగా మారింది. అద్దంలో తనరూపం చూసి తనే భయపడే విధంగా మారింది. ఇంటిలో పరిస్థితులను గమనించకుండా, లత అందంగా లేదు కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ వుండు, సంతోషంగా వుండు అని నీతులు చెప్పుతాడు భర్త. దీన్ని చూస్తే తెలుస్తుంది సమాజంలో స్త్రీని ఎలా గౌరవిస్తారు అనే విషయం. లత వల్ల కొడుకు తన మాట వినలేదు. అందుకే పెళ్లి వద్దన్నా చేసుకున్నాడు. అప్పటినుండి మొదలైన కోపం పెరుగుతూ వచ్చింది. కాని పుట్టింటి నుండి వట్టి చేతులతో రావడం చూసిన అత్తకి ”ఆరని కుంపటి” లాగా కోడల్ని చూస్తే వొళ్లంతా మంట. పొగలు, సెగలు పట్టించేంత కోపం. భాష, చూసే చీదరింపు చూపులు, చికాకు, అసహ్యం పుట్టించే విధంగా వున్నాయి. బావ తన భార్యను పుట్టింటికి పంపాడు. తలుపు దగ్గర గుసగుసలు. భయం వేసింది లతకు. పెరట్లో చేదబావి దగ్గర నీళ్ళు తోడుతుంటే ఇద్దరు రాక్షసత్వం కలిగిన మనుషులు అక్కడికి వచ్చారు, భయపడినట్లే బావిలో తోసి చంపడానికి ప్రయత్నించారు. వారిని ఏమి చేయలేని స్థితి గోడను గట్టిగా పట్టుకుని కేకలు పెట్టింది. ఇంతలో భర్త భయటకువచ్చి ఏం జరిగిందని అడిగితే. తల్లి నీ భార్య బావిలో పడి చావాలనుకుంది. మనందరినీ నవ్వులపాలు చేయాలని కంకణం కట్టుకుంది అని లతపైనే నిందవేశారు. తల్లి మాట పెళ్ళిలో పెడచెవిన పెట్టినా, మిగిలిన విషయాల్లో తల్లిమాట జవదాటడు రవి.

నీ ఆరోగ్యం బాగాలేదు నువ్వు బావి దగ్గరకు ఎందుకు వెళ్లావని మందలిస్తాడు భర్త. ఇక విషయం దాచిపెట్టి ప్రమాదాన్ని తెచ్చుకోకూడదని, అత్త, బావ తనను చంపటానికి ప్రయత్నిస్తున్నారని రవికి చెప్పుతుంది. తన మాటలను అర్ధం చేసుకుని ఓదార్చుతాడని, పరిస్థితిని చక్కదిద్దుతాడని ఆశ పడుతుంది. కాని రవి దానికి భిన్నంగా మా అమ్మ చాలా మంచిది నువ్వంటే, చాలా ఇష్టం. అనవసరమైన అనుమానాలు మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా వుండు అని చెప్పి లత మాటలను కొట్టి పారేశారు.

జీవితాంతం కాపాడుతాను అని చెప్పిన భర్త కనీసం తన మాటకు కూడా విలువ ఇవ్వలేదు. తన ప్రాణానికి అపాయం పొంచివుందని చెప్పితే, అండగా వుండాల్సింది పొయ్యి నవ్వుతాడు. తన పుట్టుకే అనవసరం అనుకునే సమాజంలోతనమాట వింటారనుకోవడం అవివేకం. అన్యాయం జరిగినా, అవమానం జరిగినా మారుమాట మాట్లాడే ధైర్యంలేక దీనత్వంలో మగ్గిపోయ్యే స్త్రీ లత. తనకు తెలియకుండానే అగాధపు లోతుల్లో కూరుకుపోయింది.

భయపడుతున్న సమయం రానే వచ్చింది అత్త తలుపుగట్టిగా తట్టింది. ఆచప్పుడు వినగానే ఉలిక్కిపడింది, అంతే కదలకుండా పడుకుని గట్టిగా కళ్ళుముసుకుంది. భర్త లేచి తలుపు తీస్తాడని, కాని భర్తకు అత్త నిద్ర మాత్రలు ఇచ్చింది. భర్తలేవలేడు. చిన్నచప్పుడు వచ్చినా లేచే రవి ఎంతసేపటికి లేవలేదు. లతకు అర్ధంకాలేదు ”భర్తను లేపింది, లేవలేదు గుంజింది చలనంలేదు” అప్పుడు అర్ధమైంది లతకు ప్రమాదం ముందు వుందన్న విషయం తెలిసింది. ఏం చేయ్యాలో తెలియదు. ఎవ్వరైనాకాపాడుతారో? లేదో తెలియదు. జీవితాంతం కాపాడుతానని ప్రమాణం చేసిన వ్యక్తి నిద్రలో వున్నాడు. ఎంత ప్రయత్నించినా లేవడు. జన్మనిచ్చి కంటికి రెప్పలాకాపాడిన తండ్రి రాలేడు. అప్పుడనుకుంది నేను బ్రతకాలి చావకూడదు. ”నేను చచ్చినా చావను” అనే వాక్యానికి ఎంతటి నిగూఢార్ధం వుంది. ఇలాంటి పదాలతోనే రచయిత కథంతా సాగించారు. నేను బ్రతకాలని మనసులో గట్టిగా సంకల్పించుకొంది. తలుపుకున్న బోల్టులు తీసి దాని ద్వారా తలుపు తెరుచుకుంది. వెలుతురు వచ్చింది. ధైర్యం వచ్చింది మనసులో ఘర్షణ, చస్తానా? ఎలా చంపుతారు. పోడిచి చంపుతారా, లేక నిప్పు పెడ్తారా అంటూ అనే రకాల అనుమానాలు అన్నింటికి తెరదించింది. అత్త బావ వచ్చి లాక్కెళ్ళారు. అత్త నోరు, జుట్టు పట్టుకుంది. బావ కిరోసిన్‌ డబ్బా రెండు చేతులతో పట్టుకున్నాడు. ”చస్తే చావను, చస్తే చాస్తాను”  ఈ రెండు వాక్యాల్లో వుండే అంతర్యంను చూడాలి. పిరికితనంతో ఎవ్వరోవస్తారని చేస్తారనుకుంటే చస్తాను. ధైర్యంగా వీళ్ళను ఎదుర్కుంటే నేను చావను అనే భావన లతపాత్రను చైతన్యవంతంగా ఆలోచించేవిధంగా తీర్చారు ఇనాక్‌గారు.

లత గింజుకుంది ఇద్దరి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. గట్టిగా అరిచింది. అర్ధరాత్రి చుట్టూ ఎవరూలేరు. రెండు చేతులతో బావచేతిలోవునన డబ్బాను గట్టిగా వెనక్కి నెట్టింది. అంతే లతకు ధైర్యం పెరిగింది. నేనే ఎందుకు చావాలి అనే ప్రశ్న నుండి తనకు కావలసిన సమాధానం లభించింది. తడబడకుండా, వెంటనే అగిపుల్లను వెలిగించింది. అమంటల్లో లత ముఖం ఎర్రని కాంతితో వెలిగిపోయింది. తన శరీరంతోపాటు తన జీవితాన్ని కూడా కాంతివంతంగా వెలిగించుకోవలనే తన ప్రయత్నం సఫలమైంది. ఈ విధంగా లతను చైతన్యవంతమైన స్త్రీగా నేటి సమాజంలో జరిగే అన్యాయాలను ఎదుర్కునే ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలిచింది ఇనాక్‌గారు రాసిన డౌరీడెత్‌.

పాత్ర చిత్రణ: డౌరీడెత్‌ కథలో రవి ప్రేమించి పెద్దలను ఒప్పించి లతను పెళ్లి చేసుకున్నాడు. కట్నం తేకుండా వచ్చిందని అత్త బావ పెట్టే బాధను భరిస్తూ వచ్చింది లత. ఈ విషయం భర్తకు చెప్పినా నమ్మకపోగా లతనే తప్పు పట్టాడు. చేసేదిలేక కట్నం కోసం తల్లిదండ్రులకు విషయం చెప్పుతుంది. కాని ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ప్రతి క్షణం భయపడుతూ కాలం గడిపింది. రవి నిద్రపోయిన తర్వాత తలుపులు  తట్టిన శబ్దం, లత బయపడినట్లే బావ అత్త, లతను చంపటానికి నిర్ణయించారు అని తెలిసిపోయింది. రవికి పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది తల్లి. రవి రక్షించలేడు. తండ్రి రాడు కాపాడలేడు. లతను బలవంతంగా, ఇంటి బయటకు తీసుకెళ్ళి చంపటానికి ప్రయత్నించారు. వారి నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూండగా కిరోసిన్‌ టిన్ను అత్త, బావలపై పడింది. అంత వరకు భయపడిన లత ధైర్యం కూడగట్టుకుని అగ్గిపుల్ల వెలిగించింది.

ముగింపు: కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా వాటికి భయపడినప్పటికి, తెలివిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని సమస్య నుండి బయటపడే విధంగా, చైతన్యవంతంగా ముందుకు సాగే మహిళగా లత పాత్రను తీర్చిదిద్దారు పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌ గారు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.