సంవత్సరన్నర తరువాత చండీఘర్‌లో మళ్ళీ ప్రవేశం. పాత వాసనలను గుండె నిండా పీల్చుకొంటూ తిరుగుతున్నాను. గతంలో వేసిన అడుగు అచ్చుల్లో మళ్ళీ అవే పాదాలు వేసి ఆ రోజు ఆలోచించిన ఆలోచనలను పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. చెట్టు ఆకాశంలో కబుర్లు చెప్పుకొనే చోట, గడ్డి చీల్చిన గతుకుల బాటల్లో ఆనాటి అనుభూతులు వెదుక్కొంటున్నాను. సుఖాన్ లేక్ అలలను సుదీర్ఘంగా చూస్తూ చాలా సేపు నిలబడ్డాను. కొంత సంతోషం, కొంతపరవశం, కొంత దిగులు, కొంత అసంతృప్తి, కొంత వంటరితనం, కొంత నైరాశ్యంతో కూడిన ఆ పురాతన ఉద్వేగం మళ్ళీ చవి చూడాలని ప్రయత్నిస్తున్నాను. అంతమంది నా చుట్టూ ఉన్నా ఎంచక్కా కాసేపు వంటరినై సంచరించాను.
సెవెన్త్ సెక్టార్ జంక్షన్లో నిలబడి నాకు పరిచయం అయిన పరిసరాలను అదృశ్యనై పరిశీలించాను. అక్కడ నుండి వచ్చేస్తుంటే ”బహన్ జీ” పిలుపు వినబడింది. నాకు అప్పుడు బట్టలు కుట్టిన సన్నటి దర్జీ. నా ముఖం వెలిగిపోయింది.
”ఆంధ్రలో అందరు బాగున్నారా? మెటీరియల్ తెచ్చుకోండి కుట్టిస్తాను.” పాన్ పరాగ్ పక్కకు ఊస్తూ ఉన్నాడు. ‘నేను రేపు వెళ్ళిపోతున్నాను.’ చెప్పాను.
”అయినా పర్వాలేదు. రాత్రికి ఇచ్చేస్తాను.” చెప్పాడు.
”నీకు నాకూ బంధం బట్టలేనా?” అనలేదు నేను. అంతకంటే ఏముంటుంది? ఆయన తన వృత్తి ద్వారానే నాకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయాన్ని మనసుకి ఎలా తీసుకొన్నాననేది నాకు సంబంధించిన విషయం. బట్టలకు సంబందించినవే అయినా నాతో పలికిన నాలుగు దయగల మాటలు నేను జీవితాంతం మర్చిపోలేను. ‘నిన్ను మళ్ళీ కలుస్తాను భయ్యా” చెప్పి బయలుదేరాను.
కాలేజ్ కాంపస్‌లోని పలుకరింపుల్లో ‘అరె. నువ్వు మాయమైపోయావు కదా. మళ్ళీ ఎలా వచ్చావు?’ అనే విస్మయం కనిపించింది. కిందకు దిగి వస్తుంటే ఎదురు వచ్చారు ఖన్నా గారు. ”కం టు మై ఆఫీస్” ముందకు కదిలారు. దారిలో మా పాత క్లాస్ రూమ్‌ని అద్దాల విండో లోంచి చూశాను. లోపల క్లాస్ జరుగుతుంది. అక్కడ అదిగో ఆ ఫస్ట్ రోల్ జీన్స్ పాంట్, దేసీ టాప్ వేసుకొని కూర్చొని బెంగగా ముఖం ముడుచుకొని కూర్చొన్న ఆవిడ ఎవరు? నేను కదా?
”కాఫీ తీసుకొందామా?” ఆఫర్ చేశారు ఖన్నా సర్. తలూపి ”మీ రిటైర్మెంట్ ఎప్పుడు?” అడిగాను. ”నెక్ట్స్ ఇయర్.” చెప్పారు. ఇక్కడ 65 ఏళ్ళకు రిటైర్మెంట్ ఉంటుంది. ఈయన నా ప్రాజెక్ట్ గైడ్ అప్పుడు. నుదిటి మీద చారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోజుకు రెండుసార్లు వాకింగ్ చేసి ఖన్నా సార్ ఫిజికల్ హెల్త్‌ను ఫిట్‌గా
ఉంచుకొన్నారు కానీ….
”ఐ యాం ఠైర్డ్” గట్టిగానే చెప్పారు. ఆయన చెప్పకపోయినా నాకు తెలుసు. అబ్బాయి సెటిల్ కాలేదు. అమ్మాయి మారీడ్ లైఫ్ బాగా లేదు. ఆయన భార్యకు అల్జీమర్స్ లక్షణాలు కనబడుతున్నాయి.
‘సొంత ఇంటికి కోసం ఢిల్హీరోడ్లో ప్రయత్నిస్తే ఆ బిల్డర్ ఇంతవరకు మొదలు పెట్టలేదు. ఈ క్వార్టర్స్‌లో రిటైర్మెంట్ తరువాత ఆరు నెలలు కంటే ఉండడానికి లేదు.’ తల వెనక్కి వాల్చి నిసృహాగా మాట్లాడుతున్నాడు.
మూడేళ్ళ క్రితం ఒక నడివయసామె చదువుకోవాల్సి వచ్చి… రాష్ట్రాన్ని, భాషాను, కుటుంబాన్ని వదిలి ఇక్కడకు వచ్చి ఒక నిస్సహాయ పరిస్థితిలో అవమానాలకు గురి అవుతుంటే ఈయనేనా నా ఆత్మ స్థెర్యపు లెవెల్స్ పెంచి నన్ను విజేతగా ఇక్కడి నుండి తిరిగి పంపింది?
”అంతా డెస్టీనీ” నుదుటి మీద అడ్డ గీత గీస్తూ అన్నాడు.
ఉలిక్కి పడ్డాను. నా గైడ్ దైవ భక్తుడు అన్న విషయం ఎప్పుడూ మర్చిపోతుంటాను. నేను. ఈసారి నేనిక్కడకు వచ్చినపుడు ఈయన ఇక్కడ ఉండరు, ఏ ఊరవతల అపార్టెమెంట్ లోనో నేను వెళ్ళలేని స్థలంలోనో ఉంటారు. అప్పటికి ఆయన ప్రయారిటీలు ఏముంటాయో? నా ప్రయారిటీలు ఏమౌతాయో? ఒక దూరపు బంధువును ఇంటికి వచ్చి కలుస్తానని ఫోన్ చేసి చెబితే రిటైర్ అయిపోయిన ఆమె ‘వద్దులేరా. నేనిప్పుడు నిద్రపోతాను’ అనటం అప్పుడు గుర్తుకు వస్తుంది.
ఇక అప్పుడు ఈయన్ని కలవకుండానే వెళ్ళిపోతాను.
మళ్ళీ కలవాలనుకోవటానికి ఈయన్ని నన్ను కలిపే విషయం ఏముంది? అకడమిక్ సంబంధం అయిపోయింది. కృతజ్ఞతలు అయిపోతాయి. నా ఆలోచనలు ఈయన ఆలోచనలు వేరు. ఎక్కువ సేపు ఈయనతో మాట్లాడితే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, హిందూత్వానికి అనుకూలంగా మాట్లాడితే? అప్పుడు నేను ‘తప్పక చండీఘర్‌లో కలవాలనుకొనే మనిషి’ ‘ఎప్పటికీ కలవకూడదని అనుకొనే మనిషి’గా రూపాంతరం చెందుతాడు నిశ్చయంగా.
సన్నపాటి దర్జీ గుర్తుకు వచ్చాడు. అతని గురించి ఏమి తెలుసునని అతన్ని మళ్ళీ కలవాలనుకొన్నాను? సన్నని నవ్వు నా ముఖంలో వచ్చింది.
”మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని.” చెప్పి వచ్చేశాను.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags