వర్తమాన లేఖ: శిలాలోలిత

అత్యంత ప్రేమ పాత్రులైన అబ్బూరి ఛాయాదేవిగార్కి,
నమస్తే, ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. బాగ్‌లింగంపల్లిలో మీరున్నప్పుడు ఎక్కువగా కలిసే వీలుండేది. ఇప్పుడు ‘ఓల్డ్‌ఏజ్‌ హోమ్‌’కి మీరు వెళ్ళిపోయిన తర్వాత కుదరడం లేదు. ఐతే, అప్పటికన్నా ఎక్కువగానే తలుచుకుం టున్నాను. ఎందుకంటే కలుద్దామనుకుంటే, కుదరడం లేదుకదా! అని కొందరి జ్ఞాపకా లు, స్మృతులూ, చల్లని పలకరింపుల్లాగా ఆహ్లాదపరుస్తాయి. మీ సెన్సాఫ్‌ హ్యూమర్‌ (చీరల వ్యాపారి సంగతి), స్పోర్టివ్‌నెస్‌, అందరి కలుపుకునే మీ తీరు, ఏ అరమరి కలు లేని మీ స్నేహశీలత నన్నెంతగానో ఆకట్టుకుంది. మీ మనసు పచ్చదనం వల్ల మీకు వయస్సెప్పటికీ రాదు. చిన్న పిల్లల్లో సైతం కలగలిసిపోయే తత్త్వం మీది. అందుకే నాలాంటి ఎందరికో మీరు ఆత్మీయ హస్తమైనారు.
ఒకరోజెప్పుడో, కాలేజీ నుంచి డైరక్ట్‌గా మీదగ్గరి కొచ్చాను. ఆ రోజెందుకో ఉదయపు పనుల ఒత్తిడిలో తినడమూ, బాక్స్‌ పెట్టుకోవడమూ మర్చిపోయాను. మీరా రోజు అన్ని రకాల పిండుల్ని అప్పటికప్పుడు కలిపి దోసెవేసిచ్చారు. ఎంతరుచిగా  ఉందో, ఆకలి విలువ తెలిసిందప్పుడు. మీ ఆప్యాయతకు కన్నీళ్ళు వచ్చాయి. మీ ఇంటి ఆవరణలోకి రాగానే పూల పరిమిళం గుప్పుమనేది. విలక్షణమైన కాలింగ్‌ బేల్‌ మీది. రోటీన్‌ కాలింగ్‌ బెల్లులకు భిన్నంగా మీరు తయారు చేశారది. గాజుకు తాడుకట్టి వుండేది. లాగితే లోపల గంట మోగేది. వెంటనే మీకత్యంత ఇష్టమైన పిల్లుల్లో ఒకటిలా తొంగి చూసేది. మొక్కల్లోంచి మరోపిల్లి ఎగురుతూ వచ్చేది. చిర్నవ్వుతో తలుపు తోసేవారప్పుడు. మీ నిరాడంబరత, ఇంటిని అమర్చుకున్నతీరు, మీరు తయారు చేసిన బొమ్మలు, ఎటు చూసినా కళాత్మకతే కన్పించేది. ముఖ్యంగా మీరు తయారు చేసిన ‘చాట’ భారతం అద్భుతం. భారతంలోని ప్రధాన ఘట్టాలను వరసగా బొమ్మల రూపంలో తయారు చేశారు. మీరు నవ్వనంటే ఒక విషయం చెబ్తాను. ఎక్కడ పిల్లి కనబడ్డా మీరు గుర్తొస్తారు. మీ కిష్టం కదా! అని. అలాగే శాంత సుందరిగారికి కూడా పిల్లులంటే  ఇష్టం. ఒకసారి వాళ్ళింటి కెళ్ళినప్పుడు కూడా గభాల్న నా ఒళ్ళో కొచ్చి కూర్చుంది.
మీరు సంపాదకత్వం వహించిన ‘కవిత’ పత్రికలో మీరు రాసిన ‘అలాగే’ కవిత నాకిష్టం. చాలా క్లుప్తంగా రాసిన కవిత అది. మీరుకవిత్వం జోలికి రాలేదు కానీ, రాసుంటే చాలా మంచి కవితలు వచ్చుండేవి. కథలమీదే ఎక్కువగా దృష్టిపెట్టారు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు, మీరురాసిన కథల సంపుటి ‘తన మార్గం’ కు వచ్చింది కదా! అందులోని ప్రతి కథా ఆలోచనాత్మకంగానూ, సందేశాత్మకంగానూ వుంటుంది. రాబోయే తరాలకు సైతం మీ ఆలోచనా సరళిని వ్యక్తీకరించారు. మీరురాసిన  ‘బొన్సాయ్‌ వృక్షం’ కథను హైస్కూల్‌ లెవల్లో పాఠంగా పెట్టారు కదా!  అది పిల్లల్లో చాలా చైతన్యాన్ని తీసుకొని వచ్చింది. ఆలోచనలలో మార్పును, పరిపూర్ణతను తీసుకు రాగలిగింది. ఐతే సరైన టీచర్‌ లేకపోతే మాత్రం ఫలితంలేదు. ఎందుకంటే ఆ వయస్సులో పిల్లలు తెల్ల కాగితాల్లాంటి వాళ్ళు. మనం ఏ రంగులు చిమ్మితే, ఏ బొమ్మను చెక్కితే, ఏ భావాల్ని పంచితే వాళ్ళు వెంటనే స్వీకరిస్తారు కదా! మొన్నీ మధ్యన ‘భూమిక’ ఎడిటోరియల్‌ మీటింగ్‌లో సుజాతా మూర్తిగారు, అమృతలత కలిశారు. ఆ రోజు మీ గురించి మాట్లాడుకున్నాం కూడా! ఇక్కడే ఉంటుంటే తప్పకుండా కలిసే వాళ్ళమని. నేను ఎక్కువ చేసి చెబ్తున్నానని మీరనుకోకపోతే మా తరానికి మీరు ‘దిక్చూచి’ లాంటివారు. రైటర్స్‌ టూర్లవల్లనే మనందరిలో సాన్నిహిత్యం, స్నేహం ఎక్కువగా పెరిగాయి. ఒకవిధంగా చెప్పాలంటే ‘సత్యలాంటి నిరంతర స్నేహ సముద్రం మనందర్నీ ఒక దగ్గరికి చేర్చిందని చెప్పొచ్చు. వాకపల్లి టూర్‌లో మీరు చూపించిన ధైర్యం. కొండల్లో, గుట్టల్లో సైతం మీరే నడిచి రావడం, ఎవరినీ చేయిసైతం పట్టుకోనివ్వకపోవడం, మీరు మీకై నడవగలనన్న నిర్ణయ ప్రకటన. అలిసిపోతే ఆగారేతప్ప, ఆధారపడడం లేదు. నాకు మీ వ్యక్తిత్వం చాలా నచ్చిందప్పుడు. నేను చాలా సార్లు పరాన్న జీవిలాగే ప్రవర్తిస్తూ ఉంటాను. నేను మారాలి తప్పదు అనుకు న్నాను. మీరు నవ్వకుండా వేసే జోకులన్నీ గుర్తొచ్చినప్పుడల్లా నవ్వును మోసుకొస్తూనే ఉంటాయి.
ఒకరోజంతా మీ దగ్గరికి వచ్చి మీతో గడపాలనిఉంది. సుజాతా పట్వారీ, నేనూ వస్తాం. అన్నట్లు చెప్పడం మరిచాను పట్వారి వాళ్ళ నాన్నగారు గత వారంలో వెళ్ళిపోయారు. చాలా బాధనిపించింది. వాళ్ళ నాన్నంటే తనకు చాలా ఇష్టం. దుఃఖ పడొద్దునాన్న, అమ్మలు కలిసి ఇచ్చిన శరీరంలోనే నువ్వున్నావు కదా! అంటే నీలోనాన్న ఉన్నట్లే, ఆయన నీ మనసులో జ్ఞాపకాలుగా జీవించే ఉంటారని చెప్పాను. మళ్ళీ ఆ మనిషిని చూడలేకపోవడమనే సత్యాన్ని జీర్ణించుకోవడానికి కొంత కాలం పడ్తుంది. తప్పదు.
ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? శీతాకాలంలో బాగా ఇబ్బంది పడ్తారుకదా! ఇప్పుడు వేసవి కాలమే కాబట్టి కొంత బాగుండవచ్చనుకుంటా. మీ ఆప్యాయత, ఆదరణ, స్నేహం ఎప్పటికీ ఇలాగే నిలిచిపో వాలని మనసారా కోరుకుంటానెప్పుడూ!
‘ఇండియాస్‌ డాటర్‌’ – గురించి ఎంత దారుణం జరుగుతుందో కదా! ఇంకెన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు, ఇంకానా! అని ఎన్నిసార్లు అనుకుంటున్నా మారని స్థితే కనబడుతోంది. తలుచుకోగానే వాటిపై కామెంట్లు వినగానే విపరీతమైన కోపం వస్తోంది.
తొందర్లోనే మీ దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతానికి సెలవామరి-

మిమ్మల్ని ఎంతో ఆరాధించే
– మీ శిలాలోలిత.

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.