‘తాళితెంచే శుభవేళలు’ మామూలు విషయంగాదు. హిందూ మగ సమాజానికి మొల్దారాలు లూజయినయి, నిద్రలు తెగిపోయినయి హిందూ మగ బూములు బద్దలైనయి, హిందు మనువాద మగమేగాలు ఉరుములు మెరుపులతో అల్లల్లాడినయి. గాజు సామాను షాపులోకి ఏనుగుల దాడిలాగ అల్లకల్లోలమైంది.
ద్రవిడ కజగం పార్టీ నాయకుడు వీరమణి యిట్లాంటి పిలుపివ్వడం మహిళలకు చాలా సంతోషకరమైన అంశం. యిట్లాంటి సంస్కరణల విప్లవ పునాదులకు యీ పార్టీ వ్యవస్థాపకులు పెరియార్ రామస్వామి. యీ పార్టీ అణగారిన కులాల స్వేచ్ఛ సమానత్వాల కోసం ఏర్పడిన ఆత్మగౌరవ పార్టి. యిప్పటిలో యీ పార్టీ లీడర్ పెరియార్ రామస్వామిని మల్లా గుర్తు చేసే ప్రోగ్రామ్ తాళితెంచే కార్యక్రమము.
మనువాదము, హిందూ అగ్రకుల వ్యతిరేక సంస్కరణలు, కార్యక్రమాలు తెలుగు రాష్ట్రంలో కూడా హేతువాద సంగాలు, నాస్తిక సంగాలు, అభ్యుదయ కమ్యూనిస్టు పార్టీలు కొంతమంది ఫెమినిస్టులు తాలికట్టే పెండ్లిల్లకు వ్యతిరేకంగా స్టేజీ మీద దండల పెండ్లిల్లు చేస్కున్నరు, చేసిండ్రు గానీ… అసలు తాలికట్టే పెండ్లిల్లకు వ్యతిరేకంగా ఎలాంటి సాంస్కృతిక ఉద్యమాలు చేయలే. యిక తాలితెంచే ప్రోగ్రామ్స్ అసలే చేయలేదని చెప్పొచ్చు. ద్రవిడకజగం పార్టీ ‘తాళితెంచుడు’ కార్యక్రమం హిందూ ఆదిపత్యాలను దంచుడు కార్యక్రమంగా అర్థం చేసుకోవాలి.
తాలి అనేది బానిస లైసెన్స్. మగవాడి ఆధిపత్య లైసెన్స్. ఒక గొలుసు / తాడు దానికో రెండు బిల్లలు అనుకోడాని క్కాదు. దానికొక పవిత్రత అంటగట్టి, అది లేని మెడల్ని తక్కువగా చూడడం, వున్న ఆడవాల్లని ముత్తైదువలుగా చూడడము, తాలి లేకుంటే మగ ఆధిపత్యాల్ని విలువల్ని వ్యతిరేకించే మహిళగా, మగ బానిసత్వాల్ని తోసి పుచ్చే మహిళగా హిందూ అగ్రకుల సమాజం చూస్తుంది.
కాని దళిత కులాల సమాజంలో, ఆదివాసీ సమాజంలో తాలికట్టే పెండ్లిల్లుండయి. హిందూ కులాల్లో వున్న విలువలు, పవిత్రాలు, అదిలేని ముత్తైదువలు నీల్లు కూడా ముట్టని, బైటకు రాని తుక్కు విలువలు లేవు. యిప్పుడిప్పుడు కొంతమంది హిందువులను అనుకరిస్తూ తాలి తాడేస్కూంటుండ్రుగానీ, యిప్పటికి గ్రామాలకు బొయిచూస్తే ఏ ఆడామె మెడల తాలిగొలుసుండది. వుంటే గింటే వుత్తదారం మెడలుంటది. దానికి పిన్నీసు ముఖ్యంగా తాళం వుంటది. కొంతమంది ఆ దారం గూడ కట్టుకోరు. మొండిమెడలే వుంటయి. యీ తాలి గుదిబండలుండయి.
పేరుకి తాలిలేకుండ స్టేజి మీద జరిగే దండల పెండ్లిల, పెండ్లి పెద్దలు మాట్లాడే ‘పెండ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు’ విన్నంకగూడ ఆయా హిందూ కుటుంబాల్లో బలవంతంగా రెండు బిళ్లల గొలుసు తలిగిస్తుంటరు ఆడవాల్లకి. ‘ఎందుకు? నేనేసుకోను’ అని ఆ సదరు మహిళ ప్రశ్నిస్తే ‘పెళ్లయినట్టు తెల్వాలె యితరులకు, లేకుంటే ప్రతోడికి లోకువ, అదే మెడల వుంటే గబాల్న ఏమి అనలేరు దడ్సుకుంటరు ఏముంది పెద్ద బరువా ఏంది? మనకే రక్షణ కవచం, ఒక గౌరవ గుర్తింపు’ అని మగవాల్ల ఆధిపత్య నియంత్రణ ఎజెండాలు మహిళల చేత అమలు చేయిస్తుంటరు. మరి మగవాల్లక్కూడా పెండ్లి తాలుకు గుర్తింపులుండాలి గదా! వాల్లకెందుకు లేవంటే సమాధానాలు లేక పోగా నోర్లు మూయిస్తుంటరు హిందూ మగ సమాజాలు. యీ జాడ్యాలన్ని దళిత ఆదివాసీ, క్రిస్టియన్, ముస్లిమ్ సమాజాల్లో కనిపించవు.
తమిళనాడు తాలితెంచే ప్రోగ్రామ్‌కి వ్యతిరేకంగా ప్రేమికులరోజు తాలి తాడులు పట్టుకొని వేటగాల్లయి వురితాల్లుగా కట్టిస్తున్న హిందూ సంగాలు శివసేన, బిజేపి పార్టీలు పెద్ద ఎత్తున గొడవలు జేసి హైకోర్టుకు బొయిండ్రు కాని హైకోర్టు జడ్జి సామాజిక సంస్కరణకు తనవంతు బాద్యతగా ‘తాలితెంచుడు’కు అనుమతివ్వడం న్యాయ వ్యవస్థలోనే చాలా గొప్ప విషయం. సామాజిక ఉద్యమాలకు, సంస్కరణ ఉద్యమాలకు న్యాయవ్యవస్థ కూడా తోడయితే విప్లవకరమైన మార్పులకు దోహదం చేస్తుందని యీ జడ్జిమెంట్ నిదర్శనం. అయితే యీ జడ్జిమెంట్‌ని తట్టుకోలేని హిందూ అగ్రకుల ప్రభుత్వం ‘తాలితెంచే కార్యక్రమం, దానికి అనుమతించిన జడ్జిమెంట్ మెజారిటీ ప్రజల సంస్కృతి సంప్రదాయాలను కించపరిచేదిగా వుందని ‘స్టే’ యిచ్చింది. మెజారిటీ అనేది అబద్దం. కొద్దిమంది హిందూ అగ్రకుల మగ అణచివేత సంస్కృతిని కించ పరిచేదిగా అర్థం చేసుకోవాలి.
దేశంలోవున్న రాష్ట్రాల్లో ‘తాళితెంచే’ కార్యక్రమాన్ని నిరసిస్తూ గొడవలు చేస్తున్నపుడు, ప్రగతిశీల, విప్లవశక్తులు, హేతువాద, నాస్తిక శక్తులు కూడా తాలితెంచే ప్రోగ్రామ్‌ని దేశ వ్యాప్తంగా ఎందుకు నిర్వహించలేక పోతున్నారు? అనేది ఆత్మవిమర్శ చేస్కోవాలి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
భూమిక అంటే సమస్యల్లో వున్న ఆడవారికి helpline అనుకున్నాను. ఇలాంటి వ్యాసం ఈ పత్రిక లో ఎందుకు వ్రాసారో అర్ధం కావట్లేదు. ఇలాంటివి వ్రాసి తెలిసీ తెలియని స్త్రీ లని రెచ్చగొట్టడం దేనికి? మన భారత దేశం లో హిందువులే కాదు మతం తో సంబంధం లేకుండా నల్ల ఫూసలు వేసుకుంటుంటారు. అదీ పెళ్ళయిన వాళ్ళూ మాత్రమే. తాళి అనేది లైసెన్స్ కాదు. బానిసత్వం అంతకంటే కాదు. తాళి , మట్టెలు, గాజులు వేసుకోమనేది , స్త్రీలకి పెళ్ళయ్యాక శరీరం లో హార్మోనులు అరికట్టడానికే. అందుకే వున్నంతలో బంగారం తో చేయించమంటారు. కుదరక పోతె పసుపు తాడు అయినా పర్వాలేదు అంటారు. పెళ్లి అనేది ఒకర్ని ఒకరు అర్ధం చేసుకోడం. తాళి కట్టించుకోడం బానిసత్వం అనుకుంటే అసలు పెళ్ళెందుకు చేసుకోడం? పెళ్లి చేసుకోకపోతే బోలెడు స్వేఛ్చ మరి!! మగవాడు స్త్రీ మీద అధికారం చెలాయించాలి అనుకుంటే తాళి కట్టానా లేదా అని ఆలోచించడు ఇది ఆడది అని మాత్రమే అని అధికారం చెలాయిస్తాడు.