అతి….ఫేస్‌….బుక్‌ అవుతారు – కవిని ఆలూరి

అది ప్రముఖ సైకాలజిస్ట్‌ రమణి కన్సల్టెంట్‌ రూము. ఆ రూమంతా నిశ్శబ్దం ఆవహించి వున్నది. డా|| రమణికి ఎదురుకుండా 18 సంవత్సరాల మధురిమ, పక్కన 45సం||రాల ఊర్మిళ కూర్చొని వున్నారు. మధురిమ చూపులు ఎటో చూస్తున్నట్లుగా వున్నాయి. ఆమె ముఖంలో ఏ భావనలూ లేవు. అడుగుతున్న ప్రశ్నలకు ఆగి ఆగి సమాధానం చెప్తోంది.

వివరాలన్నీ పరిశీలించాక డా|| రమణి ఊర్మిళతో ఇలా

ఉన్నది” నాకు అర్థమయినంత వరకూ మధురిమ ఇలా వుండటానికి మీ నిర్లక్ష్యం కూడా కొంత కారణం అనిపిస్తోంది. ఆమెకు మానసికంగా మీ నుంచి తగినంత సపోర్టు దొరకలేదు అనిపిస్తోంది”. ఊర్మిళ భావనలను పసికడుతున్నట్లుగా అన్నది డా|| రమణి.

ఊర్మిళ మౌనంగా వింటూవున్నది ”ఈ టీనేజ్‌లో పిల్లలకు తల్లిదండ్రుల నుండి ప్రేమాభిమానాలు ఎక్కువగా కావాలి. ఈ ఆధునిక కాలంలో కుటుంబాలన్నీ దాదాపుగా ఉమ్మడి కుటుంబాల సంస్కృతి తగ్గిపోయి చిన్న కుటుంబాలుగా వుంటున్నాయి. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్థులయితే పిల్లల సంరక్షణలో ఇబ్బందులు వస్తున్నాయి. మీరు ఒక్కసారి పరిశీలించుకోండి… ఇంతకీ మీరు జాబ్‌ చేస్తారా?”

”మేడమ్‌ నేను హౌజ్‌ వైఫ్‌ను” అన్నది ఊర్మిళ.

”పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే అవకాశం జాబ్‌ హోల్డర్‌ల కంటే మీకే ఎక్కువగా వుంటుంది. మధురిమ ఇలా ఎందుకయ్యిందో? మీరే నాకు చెప్పాలి… మీ సహకారం లేకుండా ఈ కేసు ముందుకెళ్ళటం కష్టం.”

ఊర్మిళ ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి.

బయట బాల్కనీలో ఎవరో తలుపు తడుతున్నట్టుగా అనిపించింది ఊర్మిళకు. ఎవరైవుంటారో అని మనసులోనే అనుకుంటూ ”మధూ కొంచెం చూడవే బాబూ… ఎవరో? ఏమో?” అని దాదాపుగా అరచినంత గట్టిగా అన్నది ఊర్మిళ. డ్రాయింగ్‌ రూంలో వున్న మధురిమ సమాధానం చెప్పకపోయేసరికి ”ఏమిటో ఇది ఎంత పిలిచినా వినిపించుకోదు” అని మనసులోనే అనుకుంటూ

”మధూ…. నా మాట వినిపించుకుంటున్నావా?” అని అన్నది ఊర్మిళ.

”అబ్బ… వస్తున్నా వుండమ్మా…” కొంత విసుగు కలసిన స్వరంలో అన్నది మధు.

”ఆ రూములో కంప్యూటర్‌ ముందు కూర్చుంటే ఏం శని పడుతుందో? ఏమో? కానీ ఈ లోకంలో వుండనే వుండవు… ఎవరో వచ్చినట్టున్నారు చూడవే…” ఒక నిమిషం ఆగి స్టౌ మీదవున్న పాల గిన్నె కింద మంట తగ్గించి ”ఇది లేవనే లేవదూ” అనుకుంటా

”ఉండండి… ఉండండి… వస్తున్నా వుండండి.. అంటూ గబగబా పరిగెత్తుతున్నట్టుగా వంట గదిలోంచి హాల్లోకి వచ్చి తలుపు తీసింది.

ఊర్మిళ వరండాలో తలుపు దగ్గర నిలబడి వున్న మధు క్లాస్‌మేట్‌ ప్రీతి ”హాయ్‌…ఆంటీ” అన్నది.

”నువ్వా… ప్రీతి.. అక్కడే వున్నావేంటి? రా లోపలకు ఏంటి నువ్వు కూడా కాలేజీకి డుమ్మానా?

నీ ఫ్రెండ్‌లాగా?” ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే వున్నది ఊర్మిళ.

లోపలకు వస్తూ ”లేదాంటీ.. ఈ రోజు రెండు క్లాసులే వున్నాయి… అదీ మధ్యాహ్నం అని అంత ఇంపార్టంట్‌ క్లాసులు కూడా కాదు.. రెండు క్లాసుల కోసం అంత దూరం కాలేజ్‌కి వెళ్ళటం ఎందుకని ఆగిపోయాను..”

”అట్లాగా… సరే… మధూ నీ ఫ్రెండ్‌ వచ్చింది చూడవే” ”ఆ రూములోకి వెళ్ళమ్మా… అది ఈ లోకంలో వుండనే వుండదు.” ”అవతల పాలు పొంగుతున్నాయ్‌ అంటూ వంటగదిలోకి వెళ్ళింది ఊర్మిళ.

ప్రీతి డ్రాయింగ్‌ రూములోకి వెళ్ళింది. ఇంటి పనిలో నిమగ్నమైపోయింది ఊర్మిళ..

”హాయ్‌ .మధూ…”కంప్యూటర్‌లో మునిగిపోయిన మధురిమ తల తప్పకుండానే అన్నది..

”హాయ్‌… ప్రీతి … ఏంటి నువ్వూ కాలేజ్‌కి డుమ్మా కొట్టావా?”

”నిన్న నువ్వు ఛాటింగ్‌లో చెప్పవుగా … కాలేజీకి వెళ్ళనని… అందుకే నేను వెళ్ళలేదు…”

”సరే కూర్చో” అంటూ ప్రీతికి కుర్చీ చూపించింది మధురిమ.

ప్రీతి కుర్చీలో కూర్చుంటూ.. ”ఏం చేస్తున్నావ్‌… కంప్యూటర్లో … ఓ ఫేస్‌ బుక్కా…”

”సరే కానీ మన స్కూల్‌మేట్‌ పవన్‌ ప్రొఫైల్‌ చూశావా” చూడలేదన్నట్టుగా తల అడ్డంగా వూపింది ప్రీతి…

”చూస్తే నవ్వి.. నవ్వి చచ్చిపోతావ్‌… మొహం ఇలాపెట్టుకుని, వెహికల్‌ మీద కూర్చున్న ఫోటో పెట్టాడు…

”ఏది చూద్దాం ప్రొఫైల్‌ ఓపెన్‌ చెయ్యి… ఇద్దరూ ప్రొఫైల్‌ చూస్తుంటారు. ”నా ఫ్రెండ్స్‌ లిస్టులో మన రమ, అరుణ వాళ్ల అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్‌, వాళ్ళ ఫ్రెండ్స్‌ ఇంకా ఎంతో మంది వున్నారు తెలుసా…”

”సరే – చాటింగ్‌ చేస్తావా…”

”పవన్‌ ఏం రాశాడో చూడు” అని మధురిమ అనగానే ”సరే… చూద్దాం…” అంటూ మధురిమ, ప్రీతి ఇద్దరూ ఛాటింగ్‌లు చదవటం మొదలు పెట్టారు.

”ఈ డ్రస్సులో నువ్వు ప్రిన్సెస్‌ లాగా వున్నావు?” – పవన్‌

”నాకీ డ్రస్సు అంత బాగుందా?” – మధురిమ

”అవును… నీకు బాయ్‌ ఫ్రెండ్‌ లేడా?” – పవన్‌

”అవును… లేడు” …… మధురిమ

”ఎందుకు” – పవన్‌

”ప్రిన్స్‌ దొరకలేదు అందుకు..” – మధురిమ

”హ హ … హ .. హ..” – పవన్‌

”భలేగా అన్నావే మధు….” అన్నది ప్రీతి

”ఇదిగో… ఇలా చూడు… రమ వాళ్ళ ఫ్రెండ్‌ రోహిత్‌తోనే చేసిన ఛాటింగ్‌”.

”ఏవీ చూపించు…” అన్నది ప్రీతి.. ఇద్దరూ ఛాటింగ్‌ చదవడంలో మునిగి పోయారు.

”రెండు రోజుల నుండి ఛాటింగ్‌కు రావటం లేదు ఎందుకు?” – మధురిమ.

”డ్రింక్‌ చేయటానికి వెళ్ళాను…” – రోహిత్‌.

”నీతోనీ గర్ల్‌ఫ్రెండ్‌ కూడా వున్నదా?” – మధురిమ.

”గర్ల్‌ఫ్రెండ్‌ ఇంకా దొరకలేదు… ఏం నువ్వొస్తావా?” – రోహిత్‌

”తీసుకెళ్తే నేను కూడా వచ్చేదాన్నిగా…” – మధురిమ

”ఇట్లా ఎందుకు టైపు చేశావే మధూ?” అన్నది ప్రీతి.

”కావాలనే … రియాక్షన్‌ చూద్దామని….” ”ఆఁ.. తర్వాత చూడు…” అన్నది మధురిమ. ఇద్దరూ ఛాట్‌లు చదువుతూ పగలబడి నవ్వుతున్నారు…

”ఏంటి ఇద్దరూ అంత విపరీతంగా నవ్వుతున్నారు…” అంటూ గబగబా రూములోకి వచ్చింది ఊర్మిళ. కంప్యూటర్‌లో చూస్తూ” ఎవరే ఇతను” అన్నది. ”మా క్లాస్‌మేట్‌ మమ్మీ” అన్నది మధురిమ.

”అబ్బాయిలవి మీ కెందుకే మీది మీరు చూసుకోక….” అన్నది ఊర్మిళ.

”చూస్తే ఏమవుతుందమ్మా… అన్నింటికీ ఏదో ఒకటి చెప్తావ్‌…” కొంచెం గారం కల్సిన స్వరంలో అన్నది మధురిమ.

”సర్లే ఇద్దరూ ఈ క్యారట్‌ జ్యూస్‌ తాగండి” అంటూ చేతులలో వున్న రెండు గ్లాసుల క్యారట్‌ జ్యూస్‌ను అక్కడ వున్న టేబుల్‌ మీద పెట్టింది ఊర్మిళ… వద్దంటున్న ప్రీతితో ”ఈ కాలం పిల్లలు ఏదీ సరిగా తినరు” అందుకే ఇలా వున్నారు… అంటూ వెళ్ళిపోయింది ఊర్మిళ.

మధురిమ కంప్యూటర్‌ను ఆపేసి తన కొత్త కొత్త డ్రస్సులు, చెవలకు పెట్టుకునే లోలాకులు, కొత్త గొలుసులు అన్నీ తీసి ప్రీతికి చూపిస్తూ ‘ఏ డ్రస్సుకు ఏది సెట్‌ అవుతుందో. అడిగింది.

”నాకు బ్లాక్‌, మెరూన్‌ డ్రస్సు వుందండే నమ్మడం లేదు తెలుసా…?” నేను ఈ సెట్‌లో ఫోటో తీసుకుని పంపుతా…”

”ఫోటో పంపితే ఏమవుతుంది? పంపూ… ఎంతమంది ఎన్ని ఫోటోలు పెట్టుకుంటున్నారా? మనమే ఏమీ పెట్టడం లేదు…”

”సరే… ఈ డ్రస్సులో నా ఫోటో సెల్‌లోంచి తీ…”

ఊర్మిళ భర్త శ్రీనివాస్‌ అప్పుడే వచ్చారు…. భర్త రాగానే.. ”చూడండి.. నామాట విననే వినదు… ఎప్పుడు చూసినా ఆ కంప్యూటర్‌లో వుంటుంది… నిన్న జడ ఫోటోలు తీసుకుంది… మొన్న అన్నం తింటూ ఫోటో తీసుకుంది… అదీ మూతి దాకానే… అర్ధం వుందా.. అదేంటే అని అడిగితే నాకు పెద్ద జడ వుందంటే నమ్మటం లేదు కాబట్టి ఫోటోలు తీసి పంపుతున్నా నంటుంది… నా మాట వినటం లేదు… కనీసం దానికి మీరైనా చెప్పవచ్చుగా….” ఆదుర్దాగా చెప్పంది ఊర్మిళ…

”ఇక ఆపుతావా… నీ ఉపన్యాసం…. అది నా కూతురు… నీలాగా బుర్రలేనిది కాదు… అదేం చేసినా కరక్ట్‌ చేస్తుంది… ”మధూ… ఇలారా…”

అప్పటి దాకా తల్లిదండ్రుల వాదులాట వింటున్న మధురిమ తండ్రి పిలవగానే గబగబా హాల్లోకి వచ్చింది. ”నా స్కూల్‌ ఫ్రెండ్‌ సుజాత పంపమంటే పంపాను నాన్నా….” దాదాపుగా ఏడుస్తున్న స్వరంలో చెప్పింది మధురిమ.

”ఆడపిల్లలు నీ జడల గురించి, నీ మూతి గురించి, నీ డ్రస్సు గురించి ఎందుకు అడుగుతారే?

”అమ్మ! అన్నీ ఇలాగే అనుకుంటుంది నాన్నా… నమ్మనే నమ్మదు… నిజంగానా స్కూల్‌ ఫ్రెండ్‌ సుజాతతోనే నేను మాట్లాడుతున్నా…. కావాలంటే వచ్చి చూడండి…” అన్నది మధురిమ.

”అది కాదండీ…” ఇంకా ఏదో చెప్పబోతున్న ఊర్మిళతో…” ఇక ఈ చర్చ వదిలేయండి” అంటూ.. ”వెళ్ళమ్మా.. వెళ్ళూ.. నీ పని నువ్‌ చూస్కో.. జాగ్రత్తగా వుండు… సరేనా…” అని మధురిమతో అన్నాడు.

”సరే… డాడీ” అంటూ డ్రాయింగ్‌ రూములోకి వెళ్లింది మధురిమ.

”ముందా వంట కానీ నేను బయటకు వెళ్ళాలి” ఊర్మిళతో అసహనంగా అన్నాడు శ్రీనివాస్‌ రూములోకి అడుగుపెట్టగానే ”మా అమ్మ అంటే నాకస్సలు ఇష్టం వుండదు…”’ అన్నది మధురిమ.

”ఎందుకు…” ఆశ్చర్యంగా అడిగింది ప్రీతి.

”ఇప్పుడే చూశావుగా… ఎలా చేస్తోందో?”

”మా అమ్మా ఇంతే కానీ… ఆంటే కొంచెం ఎక్కువ పోసెసివ్‌-” అన్నది ప్రీతి.

”డ్రస్‌ బాలేదనుకో… అమ్మ అయితే ఏం బాగుందే ఈ డ్రస్సు ఎందుకొన్నావ్‌.. ముందా డ్రస్‌ తీసేసి వేరేది వేస్కొ అంటుంది… అదే నాన్నయితే వేరే ఇంకో డ్రసు లేదా అమ్మా… ” అంటాడు… ”చూడు ఎంత తేడా వుందో?” బాధగా అన్నది మధురిమ

”మా అమ్మ, నాన్న ఇద్దరూ జాబ్‌కు వెళ్తారు.. అమ్మ వచ్చీ రావటంతోటే అలసిపోయి వుంటుంది. వంట చేశాక, ఏ ఫేస్‌బుక్‌లోనో, వాట్స్‌ ఆప్‌లోనో వుండిపోతుంది…. నేను ఏ డ్రస్సు వేసుకున్నా ఏమీ అనదు..”

”ప్చ్‌….” పెదవి విరిచింది మధురిమ.

”ఒక పని చేద్దామా…” అన్నది ప్రీతి

”చెప్పు….” కొంచెం నీరసంగా అన్నది మధురిమ.

”ఆంటే.. ఎంత దాకా చదువుకుంది…”

”ఎం.ఏ (ఇంగ్లీషు) చేసింది అమ్మ… మా అమ్మ అన్నిట్లోనూ ఫస్టే… డిజైన్లు, ముగ్గులు, ఎంబ్రాయిడరీ…అన్నీ వచ్చు అమ్మకు తెలుసా….” ఉత్సాహంగా చెప్పింది మధురిమ.

”ఐతే ఒక పనిచేద్దాం… ఆంటీకి కొద్దో గొప్పో కంప్యూటర్‌ కూడా తెలుసు కాబట్టి మీ మమ్మీకి ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ క్రియేట్‌ చేద్దాం…”

”ఆఁ.. క్రియేట్‌చేసి…” ఉత్సుకతతో అడిగింది మధురిమ.

”మనం వాట్స్‌ ఆప్‌లోకి వెళ్దాం… సరేనా.. చక్కగా మన గ్రూపంతా ఇష్ట మొచ్చినట్లు మాట్లాడుకోవచ్చు.. నీ ఫ్రెండ్‌ సుజాత కూడా వాట్స్‌ అప్‌లోనే వుంది…”

”సరే…. సరే… అలాగే చేద్దాం…” అన్నది మధురిమ.

శ్రీనివాసరావు అప్పటికే లంచ్‌ చేసి వెళ్ళిపోయాడు. ఊర్మిళ వంట గిన్నెలను సర్దుతోంది.

”అమ్మా.. నీకు మేము హెల్ప్‌ చేస్తాం….” అన్నది మధురిమ… మధురిమ మాటలో మాట కలుపుతూ” అవునాంటీ… పనుంటే చెప్పండి… మీకు మేమూ హెల్ప్‌ చేస్తాం…”

”చాల్లే… మీ పనులేవో మీరు చూసుకోండి… పెళ్ళయ్యాక ఈ వంటా, పెంటా తప్పనే తప్పవు…”

”అమ్మా… నువ్వొకసారి డ్రాయింగ్‌ రూముకు రావా…”

”ఎందుకే బాబూ… వంట గదిలో పనే ఇంకా పూర్తి కాలేదు…”

”రామ్మా… ప్లీజ్‌… బతిమాలాడుతున్నట్లుగా అన్నది మధురిమ.

”ప్లీజ్‌… రండి ఆంటీ…” అన్నది ప్రీతి…

ప్రీతి, మధురిమ ఇద్దరూ కలిసి ఊర్మిళను కంప్యూటర్‌ ముందు కూర్చోబెట్టారు.

ఊర్మిళకు ఛాట్‌ బాక్స్‌ గురించి, నోటిఫికేషన్స్‌ గురించి, హోమ్‌ గురించి, టైమ్‌ లైన్‌ గురించి ఇలా ప్రతి ఒక్కటీ వివరించి చెప్పారు… రెడీమేడ్‌ డ్రస్సులు, డిజైన్లు, ముగ్గులు

ఆక్సిసరీస్‌ లాంటి వన్నీ గూగుల్‌ ఎలా చేసుకొవాలో? / ఇంటర్‌నెట్‌ ఎలా ఓపెన్‌ చెయ్యాలో? వివరించారు. ఊర్మిళను ఆమె ఫ్రెండ్‌ రోహిణితో ఛాట్‌ కూడా చేయించారు.

ఊర్మిళకు తొందర తొందరగా వంట పూర్తి చేసుకోవటం, భర్త పిల్లలు వెళ్ళగానే కంప్యూటర్‌ ముందు కూర్చోవటం అలవాటైపోయింది… పిల్లలు వచ్చేదాకా ఎక్కువ శాతం కంప్యూటరు ముందే కూర్చునేది… ఆమె కష్టమైన డిజైన్లు, ఆక్సీసరీస్‌, తెలిసిన వాళ్ళ పెళ్ళి ఫోటోలు, ఇంకా ఇలా ఎన్నో… వాటిల్లో పూర్తిగా మునిగిపోయేది… ఒక్కొక్కసారి మధురిమ, కొడకు ప్రశాంత్‌ వచ్చి పలకరించినా… వినిపించుకునే స్థితిలో వుండేదికాదు…

”అమ్మా… నే చెప్పేది … వినమ్మా…”

”అబ్బ వుండవే.. రోహిణి ఆంటే కూతురు పెళ్ళికి ఎంత మంచి చీరలు సెలెక్ట్‌ చేసిందో ఈ ఫోటోల్లో కనపడతున్నాయ్‌ చూడు… రేపు నీ పెళ్లికి కూడా ఇలాంటివే సెలెక్ట్‌ చేయాలి..” అలా వెళ్లిపోతావేమే.. ఇలారా ఈ పెళ్లి కూతురు వేసుకున్న బ్లౌజ్‌ డిజైన్‌ చూడు… ఎంత బాగుందో… ఇటొచ్చి చూడవే మధూ…”

ముభావంగా వుండి పోయింది మధురిమ.

”అమ్మా.. అసలేమయ్యిందంటే… సుజాత సుజాత కాదమ్మా…”

”నీ మొహం సుజాత సుజాత కాకుండా మరేమవుతుందే… ఇదిగో ఈ పెళ్లి మండపం డిజైన్‌ చూడు ఎంత బాగుందో?.. తల తిప్పకుండానే అన్నది ఊర్మిళ.

”అమ్మా… నా ఫ్రెండ్‌ సుజాత కనపడితే అడిగా… దానికి ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ లేదుట.. మా క్లాస్‌మేట్‌ సమీర్‌ దానిపేరు మీద ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ క్రియేట్‌ చేసుకుంటానంటే.. ఫోటో పంపిందిట.

”చేసుకుంటే చేసుకున్నాడు లేవే.. దానిదేముంది?”

”అమ్మా.. తను సుజాతను కాదు సమీర్‌నని చెప్పాడమ్మా కానీ నేనే సుజాత జోక్‌ చేస్తోంది అనుకున్నానమ్మా….”

”అమ్మా… నేనుసుజాత అనుకుని తనతో అన్నీ పంచుకున్నానమ్మా… చెప్పకూడనివన్నీ చెప్పానమ్మా.. అఖరికి మంత్లీ ప్రాబ్లమ్స్‌తో సహా… అమ్మా…సమీర్‌ అన్నాడు.. అతని ఫ్రెండ్సంతా చదివారటమ్మా…”

”అమ్మా.. అమ్మా… ఒక్కసారి వినమ్మా….”

గబగబా కంప్యూటర్‌లో ఫేస్‌బుక్‌ను లాగ్‌ అవుట్‌ చేసి ”అబ్బ… ఇక లాగవుట్‌ చేశాను కానీ ఇప్పుడు చెప్పు.. ఏమయ్యింది?” అన్నది ఊర్మిళ.

‘ఇందాకటి నుండే నే చెప్తున్నా వినలేదు కదా అమ్మా… ఇక నీకు నేను చెప్పను ఫో…” కన్నీరు మున్నీరవుతున్న కూతుర్ని చూసి హతాశురాలైంది ఊర్మిళ…

చాలా సేపటి తర్వాత ఊర్మిళ డా|| రమణితో ఇలా అన్నది ”సోషల్‌ నెట్‌ వర్క్‌, ఫేస్‌బుక్‌లో పడి నేను కుటుంబాన్ని కోల్పోతే.. నా కూతురు ఏకంగా తన జీవితాన్నే కోల్పోయింది.. అంతకు మించి మరింకేమీ చెప్పలేను డాక్టర్‌…” ఈసారి కౌన్సిలింగ్‌కు వెళ్ళినప్పుడు మీరే చూస్తారుగా.. మధులో ఎంత మార్పు వచ్చిందో?” అన్నది ఊర్మిళ..

ఊర్మిళ మాటలకు సమాధానంగా … ”సాంకేతిక సంబంధాల కన్నా మావన సంబంధాలే మిన్న” అన్నది డా|| రమణి..

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.