పంజాబీ మూలం : సుఖ్‌విందర్ అమృత్
తెలుగు : డాక్టర్ దేవరాజు మహారాజు
ప్రతి యుగంలో తల్లులు
తమ కూతుళ్ళకు తప్పకుండా
ఏవో కొన్ని విషయాలు చెప్పుకుంటారు
వారికి జీవితంలో పనికొచ్చేవి.
వారికి ఒకదారి చూపేవి
తరం తర్వాత తరం
జరుగుతుంది ఇది నిరంతరం….
మా అమ్మ నాకు చెప్పింది –
బుద్ధిమంతులైన ఆడపిల్లలు
నోరు విప్పనే విప్పరని
అణిగిమణిగి ఉంటారని
ముసుగేసుకుని, తలవంచి నడుస్తారనీ చెప్పింది.
గొంతువిప్పి పెద్దగా మాట్లాడగూడదని
మనసువిప్పి హాయిగా నవ్వగూడదని
ఆడపిల్లలు తమ దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోగూడదని
బాధతో తడిసి ముద్దయి కళ్ళనీళ్ళ పర్యంతమయినా
ఎవరికీ కనబడనీయక
వంటింటి పొగ వంకతో
నిశ్శబ్దంగా గోడల చాటున ఉండిపోవాలని
ఆడపిల్లలు సిగ్గు మూటగట్టిన దినుసు పొట్లాలవ్వాలని
ఎల్లప్పుడూ తలవంచి ఉండాలని
కళ్ళయినా పైకెత్తగూడదని మా అమ్మ చెప్పింది
పవిత్రమైన పరిశుద్ధమైన పరిపూర్ణమైన
గోమాతలు ఆడపిల్లలేనని…
ఎక్కడ ఏ గుంజకు కట్టేస్తే, అక్కడే ఉంటారని-అమ్మ చెప్పింది.
నేను కూడా అలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంది
పాపం అమ్మ చెప్పిన ఆ మాటలేవీ
నాకు ఉపయెగపడలేదు
ఆమె చెప్పిన ప్రతివాక్యం
అడుగడుక్కీ నాకు అడ్డుగోడై నిలిచింది
అమ్మ చెప్పిన ప్రతి సూక్తీ
నా విముక్తిని దెబ్బతీస్తూ వచ్చింది
నేను కూడా మా అమ్మాయికి
కొన్ని విషయాలు నేర్పుకున్నాను-
ప్రతి అడుగులో ఎదురయ్యే అడ్డుగోడలతో
ఎక్కడా రాజీపడవద్దన్నాను
ఎగరాలనుకునే తమ వాంఛల్ని
పంజరాల దగ్గర తాకట్టు పెట్టొద్దన్నాను
తమ అస్థిత్వాన్ని దృఢపరచుకోవాలన్నాను
దేదీప్యమానంగా వెలిగించుకోవాలన్నాను
ఏ చీకటైనా సరే తన దరిదాపులకు రావాలంటేనే
గజగజ వణికిపోవాలి
ప్రతి అడ్డుగోడా తనను చూడగానే ఆగిపోవాలి
సంకెళ్ళేవైనా తనను తాకగానే తెగిపోవాలి
ప్రతి అమ్మాయి గౌరవంగా బతకాలి
ప్రతి అమ్మాయి గౌరవంగా చావాలి
అడ్డుగోడలతో ఆమె ఎప్పుడూ ఎక్కడా
లాలూచీ పడగూడదు
నా ఆత్మ విశ్వాసమంతా
నా కూతురికి నూరిపోశాను
నా కూతురు కూడా తన కూతురికి తప్పకుండా
ఏవో కొన్ని మంచి మాటలు చెప్పుకుంటుంది –
నేను చెప్పిన మాటలకన్నా అవి మంచి మాటలై ఉంటాయి
శక్తిగల మాటలు, స్వేచ్ఛా వాంఛితాలు, ప్రేమపూరితాలు
బహుశా యుగాలు యుగాలు
ఈ విధంగానే దొర్లిపోతుంటాయేమో-
అదే యుగధర్మమేమో-
ప్రతి యుగంలో, ప్రతి తరంలో
తల్లులు తమ కూతుళ్ళకు తప్పకుండా
ఏవో కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటారు
వారికి జీవితంలో పనికొచ్చేవి!
వారికి దారి చూపించేవి!!
బాగుంధి–రాజు గారు