పంజరంలో పక్షి ఎందుకు పాడుతుందో నాకు తెలుసు

పి. సత్యవతి

ఎనిమిది సంవత్సరాల వయసు నించీ జీవితంతో పోరాడుతూ ఇప్పుడు ఎనభై సంవత్సరాల పరిపక్వ ప్రాయంలో తనుంటున్న దేశంలో ఒక ఉన్నత మహిళగా ఎదిగిన మాయా ఏంజిలో ఆత్మకథ పేరు ఈ శీర్షికది.

  ఆమె వ్రాసిన ఆత్మకథా సంపుటాలలో మొదటిది, అత్యంత సంచలనాత్మకమైనది.  ఎనభై ఏళ్ళ కిందట అమెరికాలో నల్లపిల్లగా పుట్టటం అంటే పుట్టుకనించీ జీవితం ఒక పెను యుద్ధమే.  దారిద్య్రం, వర్ణ వివక్ష, మళ్ళీ సవర్ణంలోనే లింగవివక్ష, ఇన్నింటిని భరిస్తూ పోరాడుతూ, ఓడుతూ, గెలుస్తూ, ఈ అనుభవ సారాన్నంతా అంతిమ విజయానికి ఒక మూలధనంగా వాడుకుంటూ, జీవనో త్సాహాన్ని ఇనుమడింపజేసుకుంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న ఆఫ్రికన్‌ అమెరికన్‌ రచయిత్రి, గాయకురాలు, నర్తకి, క్రియశీల, మాయా ఏంజిలో…

1928 ఏప్రిల్‌ నాలుగో తేదీన పుట్టిన మాయా అమ్మమ్మ తల్లి (జేజమ్మ)ది ఒక దుర్భర గాథ.  ఆమె పేరు మేరీ లీ.  బానిస విముక్తికి పూర్వం, ఈమె తన శ్వేతజాతి యజవని వలన గర్భవతైంది.  అతను ఈ నేరాన్ని ఇంకొకరి మీదకు నెడుతూ ఆమెచేత బలవంతంగా తప్పుడు ప్రకటన ఇప్పించాడు.  కానీ న్యాయమూర్తులు మేరీ చేత అట్లా చెప్పించినందుకు అతన్ని శిక్షార్హుడుగా ప్రకటించారు.  అయినప్పటికీ అతను ఆ శిక్షనించీ తప్పించుకున్నాడు.
”పాపం ఆ బీద నల్లపిల్ల శారీరకంగానూ మానసికంగానూ గాయపడింది” అంటుంది మాయా, ఈ విషయం తెలిసినప్పుడు. అట్లా అన్ని విధాలా గాయపడ్డ బీద నల్ల పిల్లలెందరో అప్పుడు లెక్కలేదు.  ”పంజరంలో పక్షి ఎందుకు పాడుతుందో నాకు తెలుసు” అనే పుస్తకంలో ఆమె మొదటి పదిహేడేళ్ళ జీవితం వుంది.  ఆమె వ్రాసిన ఆత్మకథలు ఆరింటిలోనూ పంజరంలోని పక్షి ఆవేదనని బానిస విముక్తికి సంకేతంగా ఉపయెగిస్తుంది.  ఈ కవితా పంక్తి డన్బర్‌ వ్రాసిన కవితలోది.  మాయాకు మూడు, ఆమె అన్నకు నాలుగు సంవత్సరాల వయసప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు.  అప్పుడు వాళ్ల నాన్న బెయిలీ జాన్సన్‌ ఆ పిల్లలిద్దర్నీ ఎవరితోడూ లేకుండా రైలెక్కించి తన తల్లి దగ్గరికి ఆర్కన్సాస్‌ పంపించాడు.  అప్పుడు ఆర్థిక కాటకం రోజులు.  ఆ పిల్లల నానమ్మకి ఒక నిత్యావసర సరుకుల దుకాణం వుండటంతో ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని యుద్ధం సమయంలో ఆవిడ బాగానే సంపాదించింది.  తరువాత నాలుగు సంవత్సరాలకి వాళ్ల నాన్న అకస్మాత్తుగా ఊడిపడి వాళ్ళిద్దర్నీ సెంట్‌ లూయీలో వున్న వాళ్ళమ్మ దగ్గర వదిలి పెట్టాడు.  అయితే ఎనిమిదేళ్ళ మాయాపైన వాళ్ళమ్మ ప్రియుడు ఫ్రీమన్‌ అనేవాడు అత్యాచారం చేసాడు.  ఆ సంగతి మాయా తన అన్నకి మాత్రమే చెప్పుకోగలిగింది.  అతను అందరికీ చెప్పటంతో ఫ్రీమన్‌కి ఒకరోజు జైలు శిక్ష పడింది.  కానీ నాలుగు రోజుల తరువాత అతన్ని ఎవరో బాగా కొట్టి చంపేశారు.  దీనితో దిగ్భ్రమ చెందిన మాయా తను నోరు తెరిచి మాట్లాడితే ఎవరో ఒకరు చనిపోతారనీ నోరుమూసుకోవడమంత ఉత్తమం లేదనీ అనుకుని దాదాపు మూగదే అయిపోయింది.  అట్లా ఆమె అయిదేళ్ళు మూగదాన్లా ఉండిపోయింది.  ఆ తరవాత మళ్ళీ వాళ్ళిద్దర్నీ వాళ్ళ నానమ్మ దగ్గిరికే ఆర్కన్సాస్‌లో స్టాంప్స్‌కి పంపేశారు.  అక్కడ ఒక స్నేహితురాలు బెర్తా ప్లవర్స్‌ అనే టీచరు మాయాని తిరిగి మాట్లాడించడమే కాక ఆమెకి చార్లెస్‌ డికెన్స్‌ వంటి ప్రఖ్యాత రచయితల పుస్తకాలు చదవడం నేర్పింది.  మళ్ళీ పదమూడేళ్ళ వయసులో మాయా ఆమె అన్నా తమ తల్లి దగ్గరకి శాన్‌ఫ్రాసిస్కో వెళ్ళారు.  అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతోంది.  మాయా హైస్కూల్లో చేరింది.  కాలిఫోర్నియ లేబర్‌ స్కూల్లో స్కాలర్‌షిప్‌ మీద నాట్యం, నాటక కళలో శిక్షణ కూడా తీసుకుంది.  తరువాత శాన్‌ఫ్రాన్‌సిస్కోలో మొట్ట మొదటి నల్ల మహిళా కండక్టర్‌గా పనిచేసింది.  హైస్కూల్‌ చదువు పూర్తవుతూనే ఆమె తల్లి అయింది.  కొడుక్కి గైజాన్సన్‌ అని పేరు పెట్టుకుంది.  మాయా రెండవ ఆత్మకథ పుస్తకం ”గ్యాదర్‌ టుగెదర్‌ ఇన్‌ మై నేమ్‌”.  ఆమె పదిహేడవ ఏటినుంచీ పంతొమ్మిదవ ఏటి వరకూ గడిపిన జీవితాన్ని చిత్రించింది.

ఇది ముఖ్యంగా ఒక ఒంటరి తల్లి జీవితంలోని చీకటి కోణాలని చూపించింది.  ఒక నల్ల జాతి మహిళగా ఎన్నో అవరోధాలని ఎదుర్కొంటూ ఆమె తన బిడ్డను పెంచు కోవడం వ్రాసింది.  నాట్యం నేర్చుకోడానికి స్కాలర్‌షిప్‌ రావడం, అనేక ప్రదర్శనలివ్వడం, యూరపియన్‌ దేశాల పర్యటన వీటన్నిటి తరువాత ఆమె 1950లో న్యూయార్క్‌ చేరుకుంది.  బ్రాడ్వే నాటకాల్లో పాల్గొంటూ పౌరహక్కుల ఉద్యమంతో సంబంధమున్న అనేకమంది కళాకారులతో పరిచయాలు పెంచుకుంది.
1960లో వర్టిన్‌ లథర్‌ కింగు జూనియర్‌ అభ్యర్థన మీద సదరన్‌ క్రిస్టియన్‌ లీడర్‌షిప్‌ సమావేశాలకు నార్దరన్‌ కోఆర్డినేటర్‌గా పనిచేసింది.  తరువాత ఆఫ్రికన్‌ స్వాతంత్య్ర సమరయోధుడైన ‘పుసుమిమాకె’ తో కొంతకాలం సహజీవనం చేసింది.  అప్పుడు తన కొడుకు గై తో కైరో వెళ్ళింది.  అక్కడ అరబ్‌ అబ్సర్వర్‌ అనే పత్రికకి సహ సంపాదకత్వం వహించింది.  మాకె తో తెగతెంపులు చేసుకుని ఘనా బయలుదేరింది.  ఘనా సంగీత పాఠశాలలో అడ్మినిస్ట్రేటర్‌గా వుంటూ ఆఫ్రికన్‌ రెవ్యూలో కూడా ఫీచర్‌ ఎడిటర్‌గా పనిచేసింది. అనేక నాటకాలు వ్రాసింది.  నటించింది.
ఘనాలో ఆమెకి మాల్కొల్మ్‌ ఎక్స్‌ తో బాగా స్నేహమైంది.  ఆమె మళ్ళీ అమెరికా తిరిగి వచ్చి పౌరహక్కుల ఉద్యమంలో అతనికి సాయపడింది.
ఆత్మకథలు, కవితలు, వ్యాసాలు, బాలసాహిత్యం, నాటకాలు, సినిమా స్క్రిప్ట్‌లు, టెలివిజన్‌ కార్యక్రమాలు లెక్కలేనన్ని చేసిన మాయా ఏంజిలో బిల్‌క్లింటన్‌ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తన కవిత ‘ఆన్‌ది పల్స్‌ ఆఫ్‌ మార్నింగు’ చదివింది.  ప్రఖ్యాత టెలివిజన్‌ హోస్ట్‌ ఓప్రావిన్‌ ఫ్రీ కి శ్రేయెభిలాషి మాయా ఏంజిలో.  అంచేత ఆమె 70వ పుట్టిన రోజు కానుకగా ఓఫ్రా ఆమెకొక క్రూజ్‌ బహూకరించింది.  అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఆమె తన స్నేహితురాలు ఓప్రా లాగా ఒబామాను బలపరచక, హిల్లరీకే తన మద్దతు ప్రకటించింది.  ఇప్పటికింకా ఎన్నో ఉపన్యాసాలిస్తూ, టాక్‌ షోలలో పాల్గొంటూ చాలా ఉత్సాహంగా ఉంది మాయా.  ఆమె అసలు పేరు మార్గరెట్‌ ఆన్‌ జాన్సన్‌.  ఆమె అన్న మాయా అన్న ఈ సార్థక నామధేయన్ని సరదాగా పెట్టగా అదే ఖరారై పోయింది.
”ఓ భగవంతుడా, ఈ ఆరడగుల నల్ల మహిళా రచయితని గుర్తు పెట్టుకో’ అని తన గురించి భగవంతుడికి చెప్పు కుంటుందట. అట్లా తనని వర్ణించుకున్నప్పు డంతా భగవంతుడు దాదాపు పలుకుతాడు అంటుంది మాయా.

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.