స్వప్నమజుందార్
అనువాదం : హేమంత కాకాని
‘భారతదేశంలో అభివృద్ధి కొరకు నిర్వాసితం : మహిళలపై ప్రభావం’ పేరుతో ఈ సంవత్సర ఆరంభంలో విడుదలైన ఈ అధ్యయనం ”మహిళలపై నిర్వాసిత ప్రభావాన్ని అర్థం చేసుకోడంలో ఎంతో తోడ్పడింది.
ఈ అధ్యయనంలో నిర్వాసితం మూలంగా పెరిగిన గృహహింస, ఆరోగ్యక్షీణత, దిగజారిన సామాజిక స్థితిగతులు, కుటుంబ విచ్ఛిన్నత ఎక్కువైనట్లు రుజువైంది.
భారతదేశ స్వాతంత్య్రానంతరం ఇప్పటి వరకు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు – డ్యామ్‌లు, మైనింగు మరియు మౌలిక సదుపాయాల నిర్మాణం మొదలైన కారణంగా 2 కోట్లకు పైగా ప్రజలు నిర్వాసితులైనారు. దీనివల్ల సాంప్రదాయ ఉత్పత్తి విధానాలు దెబ్బతిన్నాయి. కుటుంబ విచ్ఛిన్నం, నిరుద్యోగం, నిరాశ్రయులవడం, అనారోగ్యం చనిపోవడం పెరుగుతోంది.
రెండు సంవత్సరాల క్రితం, అందుబాటులో వున్న ‘నిర్వాసితం’కు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, సమగ్రపరచిన ఈ అధ్యయనాన్ని, Institute of Socio Economic Development (ఒరిస్సా, భువనేశ్వర్‌లోని ఒక రీసెర్చ్ గ్రూప్) వారి సహకారంతో జాతీయ మమిళా కమీషను, న్యూఢిల్లీ నిర్వహించింది.
నిర్వాసిత మహిళల కష్టాలు, ఇప్పటికే భారత సమాజంలో, కుటుంబంలో వున్న జెండర్ అసమానతల వల్ల కలుగుతున్నాయి అని 2003లో ఈ అధ్యయనాన్ని నిర్వహించిన జాతీయ మమిళా కమీషను, మాజీ చైర్‌పర్సన్ డా. పూర్ణిమా అద్వానీ పేర్కొన్నారు. నిరాశ్రయం జీవనోపాధి కోల్పోవడమే కాకుండా నిర్వాసితం అసమానతలని మరింత పెంచుతోందని ఆమె నొక్కిచెప్పారు.
జెండర్ మరియు నిర్వాసిత్వానికున్న సంబంధం పట్ల ప్రభుత్వం తగినంత దృష్టి సారించలేదని అద్వాని పేర్కొన్నారు. అందువల్ల జాతీయ మమిళా కమీషను, ఇప్పుడు నిర్వాసితం వల్ల కలిగే జెండర్ పరమైన అన్యాయాల్ని హైలైట్ చేసి ప్రభుత్వం తగిన చర్య తీసుకొనేటట్లు చేయాలనుకుంటోంది.
50 సంవత్సరాల దుఖీనాయక్ కథని చూద్దాం : దుఖీ నాయక్ ఒరిస్సాలో ఒక గ్రామంలో నివసిస్తుంది. గ్రామంలో ఆమె కుటుంబానికి కొంత వ్యవసాయ భూమి వుంది. ఈ భూమిక ఒక అభివృద్ధి ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తీసుకొంది. దుఖీ మరియు ఆమె భర్త, తమలాంటి ఎందరో వ్యవసాయ కూలీగానే, తమ జీవనోపాధి కోల్పోయారు. ప్రభుత్వం నిర్వాసితులందరికీ ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా, దుఖీ, ఆమెలాంటి ఎంతోమంది ఇంకా ఉపాధికి నోచుకోలేదు.
కొన్ని కేసులలో చర్య తీసుకున్నా అది సరిపడనిదిగా లేదా సరిగా ఆలోచించకుండా జరుగుతుంది. 40 సంవత్సరాల రజనీ సేథీ ఆమె కుటుంబం వారి భూమికి బదులుగా కొంత భూమిని ఒరిస్సా ప్రభుత్వం నుండి పొందారు. ఆమె తన భర్తాపిల్లలతో ఆ రిసెటిల్‌మెంట్ కాలనీలోకి వెళ్ళినప్పుడు ఆమె జీవితం ఒక విషాదకర మలుపు తిరిగినది. వారికి ఇచ్చిన భూమి వ్యవసాయానికి పనికిరానిది. మరోదారి లేక సేథీ ఆమె భర్త రోజు కూలీలుగా మారారు. ఇది కూడా వారి రోజువారీ కనీస అవసరాలను కూడా తీర్చలేదు.
సేథీ కుటుంబంలో లాంటి పరిస్థితులలో చూస్తే, కుటుంబంలో మహిళలు ఆఖరున తినడమే కాదు, ఎన్నోసార్లు అతి కొద్దిగా తినడం, ఆహారకొరత సమయంలో మిగిలిన కుటుంబ సభ్యుల కోసం పస్తులుండటం జరుగుతోంది. ఆహార ప్రదాతలే, ఆహార అభద్రతలో చిక్కుకోవడంతో మహిళలు ఆకలి పేదరికం అనే విషవలయం నుండి బయటకు రాలేకపోతున్నారు. ఆర్థిక వృద్ధికి సాధనమైన ‘అభివృద్ధి’ మహిళలపై ఎందుకింత నెగెటివ్ ప్రభావాన్ని చూపుతోంది? ”అభివృద్ధి తప్పుకాదు. అందుకోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల జీవనోపాధి నష్టపోవడం, గృహహింస పెరగడం మహిళల సామాజిక స్థితి దిగజారడం జరుగుతోంది” అంటారు కుముద్ శర్మ, ‘Centre for Women’s Development Studies’ (CWDS).
ఆక్టివిస్ట్ విద్యాదాస్ ఈ వాదన ఒప్పుకొంటూ, ‘అభివృద్ధి అనేది మహిళలకు ఒక భయానక పదంగా మారింది, ముఖ్యంగా గిరిజన మహిళలకు” అని అన్నారు. అభివృద్ధి వల్ల కలిగే నిరాశ్రయం నిరుద్యోగం కారణంగా నీరు, వంటచెఱకు, పశుగ్రాసం, ఆహారం, పిల్లలను పెంచడం వంటి బాధ్యతలు నిర్వర్తించడం మరింత కష్టతరమౌతోంది.
విద్యాదాస్ ఆమె సహచరులు ”అగ్రగామి” అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒరిస్సాలో అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల నిర్వాసితంకు గురైన వారి హక్కులు మరియు పునరావాసం కోసం పోరాడుతున్నారు. నిర్వాసితం కారణంగా జీవనాధారాలు నాశనమైనపుడు, మహిళలు ఇల్లుదాటి, గ్రామం దాటి ఉపాధి వెతుక్కోక తప్పడంలేదు. ఇది వారు లైంగిక మరియు ఇతర రకాలైన వేధింపులకు మరింతగా గురవడానికి కారణమౌతోంది అని ఆమె అన్నారు.
పురుషులు అధికారం కోల్పోయినపుడు వారి నిరుత్సాహం మహిళలు చిన్నపిల్లలపై చూపుతారని పూర్వపు స్టడీస్ తెలియజేసాయి. ఈ నిజం NCW స్టడీలో మరోసారి నిరూపితమైంది. ఇందులో నిర్వాసితం వల్ల పురుషులలో ఆందోళన, సోమరితనం, అభద్రతాభావం పెరుగుతోంది. ఇది తాగుడుకు భార్యను హింసించడానికి దారితీస్తోంది.
దీనిమీద ఒక సమగ్ర జాతీయ విధానం (Single Comprehensive National Policy) ఇప్పటి వరకు లేకపోవడం అవకతవకల మరియు తప్పుడు విధానాలకు కారణం అని నిపుణులు భావిస్తున్నారు. ఈ విధానాలు ఒక రాష్ట్రంకు మరొక రాష్ట్రంకు, ఒక ప్రాజెక్టుకు మరొక ప్రాజెక్టుకు మరియు ఒక అథారిటీకు మరొక అథారిటీకు చాలా తేడాలున్నాయి. దీనివల్ల అభివృద్ధి పథకాలకు సరైన రూపకల్పన లేదా సరిగ్గా అమలుపరచలేకపోవడం జరుగుతోంది. ఇది అసంపూర్ణమైన మరియు అసంబద్ధమైన పునరావాసానికి కారణమవుతోంది.
ఐతే, జాతీయ పునరావాస విధానం (National Rehabilitation Policy) 2004లో ప్రభుత్వం రూపొందించింది. ఇందులో వీలైనంతలో నిర్వాసితం లేకుండా లేదా తక్కువ నిర్వాసితం ఉండేలా ప్రత్యామ్నాయాలను కనుగొనాలని పేర్కొన్నా, మహిళల అవసరాలు లేదా సాధక బాధకాలకు సరైన ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఈ విధానం వల్ల అవలంబించబడి తప్పుడు పద్ధతి – కనీస అవసరాలైన రక్షిత మంచినీరు, విద్యావసరాలు, విద్యుత్తు మరియు ఆసుపత్రుల వ్యవస్థాపనను Rehabilitation Aedministrator (ఒక జాతీయ స్థాయి అథారిటీ) నిర్ణయానికి వదిలిపెట్టడం. ఈ అధికారి, సంబంధిత అథారిటీని (ఏ కంపెనీ లేదా అథారిటీ కొరకై ఆ భూమి తీసుకొనబడినదో) సంప్రదిస్తే చాలు.
పునరావాస విధానం రూపొందించిన భారత ప్లానింగు కమిషన్ మాజీ సభ్యులు శ్రీ ఎన్.సి. సక్సేనా, ఈ విధానం తుది స్వరూపాన్ని విమర్శిస్తూ పాలసీ డ్రాఫ్ట్ రూపకల్పనలో పాలుపంచుకున్న సక్సేనా, ప్రతిపాదించిన డ్రాఫ్ట్‌లో మహిళలకు మంచి అవకాశం ఇవ్వబడినది అని చెప్పారు.
ఈ డ్రాఫ్ట్ ప్రకారం ప్రాజెక్ట్ రూపకల్పన మరియు అమలుపరిచే అథారిటీలు, తప్పనిసరిగా బాధిత వర్గాల ప్రతినిధులతో మరియు మహిళలు, అణగారిన వర్గాలతో సహాయ పునరావాస పథకం రూపకల్పన, అమలు, పర్యవేక్షణ, అన్ని దశలలో సంప్రదించాలి. దీని ప్రకారం బాధితులు తమ అభిప్రాయాల్ని వివరించడానికి Administrator Public Hearings నిర్వహించాల్సిన అవసరం లేదు.
సహాయ పునరావాస పాలసీలో ‘కుటుంబం’ని నిర్వచించిన పద్ధతివల్ల కూడా మహిళలు నష్టపోతున్నారు. ప్రస్తుత నిర్వచనం వల్ల అవివాహిత మహిళలకు ఎటువంటి ప్రయెజనం ఒనగూరదు. ఎందుకంటే, వీరిని కుటుంబ పెద్ద(పురుషుడు) పై ఆధారపడిన వారిగా విభజించారు, అని సక్సేనా తెలియజేశారు. అంతేకాకుండా చాలా రాష్ట్రాలలో వారసత్వ చట్టాలు పురుష తోబుట్టువులున్న కుమార్తెలు, భూమిని పొందడానికి అనుమతించవు అని అన్నారు. అయితే డ్రాస్ట్ పాలసీ ప్రకారం కుటుంబ నిర్వచనాన్ని పూర్తిగా జెండర్ న్యూట్రల్ చేశారని ఆయన తెలియజేశారు. డ్రాప్ట్ ప్రకారం ”ప్రతి మేజర్ అడల్డ్ సభ్యుడు ఆమె/అతని జీవిత భాగస్వామి, మరియు 18 సం|| లోపు మైనర్ పిల్లలు”. ఈ విధంగా మేజరైన ప్రతి వ్యక్తి స్త్రీ, పురుష సంబంధం లేకుండా ఒక ప్రత్యేక యూనిట్ అవుతారు.
”ఈ భూమి మాది కాదు, ఈ అడవి మాది కాదు, ఈ నీరు మాది కాదు. మాదనేది ఇంకేది? ప్రభుత్వానికి చెందుతాయి లేదా పురుషులకి చెందుతాయి. అన్నీ తీసుకుపోతే మాకేమి మిగులుతుంది?” అని ప్రశ్నిస్తోంది మధ్యప్రదేశ్‌లోని బార్గి డ్యామ్ వల్ల నిర్వాసితురాలైన బసంతీ బాయి.
ప్రభుత్వం దగ్గర ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ఈ పాలసీ ఇప్పటికీ అభివృద్ధి కారక నిర్వాసిత్వ ప్రభావాన్ని జెండర్ దృష్టికోణంలో చూడలేకపోతోంది. ప్రభుత్వం ఆహార భద్రత, యజమానత్వ హక్కులలో సమానత్వం, సమానమైన విద్య, ఉద్యోగావకాశాలు, ఆరోగ్య సేవలు అందించనంత కాలం మహిళలు అభివృద్ధి కోసం భారీమూల్యం చెల్లిస్తూనే వుంటారు.
(New Delhi Women’s Feature Service సౌజన్యంతో )
”ఈ భమి వది కాదు, ఈ అడవి వది కాదు, ఈ నీరు వది కాదు. వదనేది ఇంకేది? ప్రభుత్వానికి చెందుతాయి లేదా పురుషులకి చెందుతాయి. అన్నీ తీసుకుపోతే వకేమి మిగులుతుంది?” అని ప్రశ్నిస్తోంది మధ్యప్రదేశ్‌లోని బార్గి డ్యామ్ వల్ల నిర్వాసితురాలైన బసంతీ బాయి.