యాకూబ్
ఆమె నిన్ను ప్రేమిస్తుంది
ఆమె నీ ప్రేయసి, అందరి కంటే భిన్నం కద!
పడకటింట్లో నిన్ను ఉన్నత జీవన క్షణాల
అపురూప సందర్భంలో భాగస్వామిని చేస్తుంది.
ప్రేమంటే నిర్వచనమేమిటో
ఆమె తన చేష్టలతో విడమరుస్తుంది
పిల్లల్ని వాళ్ళమ్మ దగ్గరికి పంపి
ఏకాంతానికి ఏ భంగం కలగకుండా నీ కోసమే కేటాయిస్తుంది
కలిసి వండుకుందామని, తనువుల పంచుకుందామని
అతి చిన్న కోర్కె కోరుతుంది
అతి దగ్గరగా ఒదిగిపోవాలనీ
నీతో యిమిడిపోవాలని ఆమె తాపత్రయం
ఇంటిని ప్రేమగూడుగా మార్చేందుకు
అన్ని ప్రయత్నాలు మనసు పెట్టి చేస్తుంది
వంటింటిని సమభాగపు బాధ్యతల్లోకి పంచి
కొత్త రుచుల స్వర్గాన్ని ప్రసాదిస్తుంది
ఆమె ఓ సాన్నిహిత్యపు సారాంశం
మనసెరిగిన మంచితనపు పోగు
సహానుభూతించే సహచరి
అన్ని
ప్రశంసలకు అర్హురాలు
ఆమె
శైశవంలో అమ్మ ఒడిలో విన్న లాలిత్యపు లాలిపాట
కరుణారసగంగా తరంగాల తడిసిన దయాపారావతాలు…
రెక్కలు విదిలించిన సడి పల్లవైన పాట
ఆమె హిమస్నాత పునీత పారిజాతాల దాగిన స్వచ్ఛత
హిమవన్నగమై నాలో ఘనీభవించిన స్తబ్ధతని కరిగించిన
తొలి వేకువ తెలి వెలుగురేఖ.
నా నయనాలలో నలిగిన సుమ స్వప్నాలని…
రాగాలుగా పలికిన “అమృత వీణ”…(ఇంకా చాలా చెప్పాలి మళ్ళి ఎప్పుడైనా..)