తమ్మెర రాధిక
ప్రవహించే నదులు
పక్కవాళ్ళ కళ్ళల్లోంచి దూకుతే
చిరునవ్వులు అంతమయిన మొహాల్లో
వసంతాలే తీరున విరబూస్తాయి?
గురువింద పొదల్లో కూరుకుపోయిన
మనస్తత్వం –
వల్లె తోటల్లో వికసిస్తుందా?
అనుమానం ఆనవాల్లేని మనిషిని
అగ్నిపర్వతం అంచున కూర్చోబెట్టనంత
మాత్రాన
అయెనిజ సీత కాకుండా పోయిందా?
లోకమంతా చాకలివాడైనా
లోకమాత పూజనీయత
పురాణకాలం నుంచీ లోకుల్లో నానుతూనే ఉంది.
పోయిన కాలపు రక్కసులు
ఈ కాలపు అనుమాన పిశాచులు
సుస్వప్నాల నిదుర కలలను
కొండచిలువలై చుట్టేసి
మెలకువలో కూడా నిజాలను చీలిక చేస్తున్నాయి,
నాలుకలను తాటమట్టచేస్తూ,
‘సీతారామాస్వామీ నే చేసిన నేరములేమి?’
రీతిలో…………….
యుద్ధమేఘాలు అలుముకున్న మనసేదైనా
ఇలాగే అన్యాయం ముందు తలొంచాల్సి వస్తుంది.
అందుకే
ఒక కొత్త వరవడిని ప్రశ్నించడం మొదలుపెట్టాను
దాని భాష మౌనం!
వజ్రం అనుకున్న రాయి
మొత్తటం మొదలుపెట్టే సరికి
విజ్ఞతలో భేదం అర్థం అయ్యింది.
ఇక కమ్మరి కొలిమి గుత్తాకు తీసుకున్నా
తుపమి కత్తులు సానపడదామని.
వాళ్ళ బారిపడ్డ బకరాలన్నింటినీ
మూస పద్ధతిలో హలాల్ చేస్తారని
విని!!
కాగడాలని కత్తులుగా మారుద్దామని వుంది,
బకరాల బర్‌కత్,
మాంసం కొట్టులో తాకట్టు పెట్టిన ఇంద్రజిత్తుల
ఎత్తులు తుత్తినియలు చేయడానికి
ప్రశ్నించడం మొదలెట్టాను,
దాని భాష మౌనం!