టి. వనజ
విఫలమయిన రెండు పార్శ్వాలకి చిరునామాని నేను…
నాతిచరామి అని నిలువునా దగాచేసినా
అనుకోని అతిథిలా వచ్చి కొండంత ప్రేమని
కఠినశిలలా మార్చి దిగాలుతో కుదిపేసినా
జీవచ్ఛవాన్ని కాలేదు… కానీ
మళ్ళీ మళ్ళీ వసంతం వస్తుందంటే నమ్మని మోడుని నేను…
అదేం చిత్రమో!
రాతిలోనూ రాగాలు పలికించగల వైణికుడు ఉంటాడని
ప్రేమ సంజీవనితో బ్రతికిస్తాడని
భావ ఉద్వేగాల ఉప్పెనలో, ఆలోచనా తరంగాలతో
జీవనతీరాలని స్పృశించుకుని, ఆకర్షణకు తావేలేని
అంతరాలు తెలియనివ్వని ఆత్మబంధువు అవుతాడని ఊహించనేలేదు…
ప్రాణహితుడా! నేను నిర్మించుకున్న చట్రం నుండి
నేనే వెలుపలికి వచ్చానో, నువ్వే జొచ్చుకుని వచ్చావో…!?
వద్దు వద్దు అనుకుంటూనే హృదయపు వాకిళ్ళు తెరచి
ఎదను చిగుర్చుకుంటూ గంపెడాశతో చిగురంత ప్రేమని
ఆహ్వానించానే!…..
పది శరత్కాలాలు ఎక్కడో దాక్కుని హఠాత్తుగా మళ్ళీ
నాకోసమే అన్నట్లు వెన్నెల నింపుకుని వచ్చిన చంద్రుడా…
నాకొక రక్షణ కవచమై నిలిచావే…!
ప్రేమపాత్రని ఒంపి రోజుకొక చుక్కాచుక్కా రుచి చూపిస్తూ
జవసత్వాలు నింపావే…!
ఎన్నెన్ని దీర్ఘరాత్రాలు ఎవరికి చెప్పని ”సం”గతాలు
నీ స్నేహ పరిష్వంగంలో కరిగి నా ”ఆ”వేదనని తేలిక పరచాయె…
నా ఆలోచనా సహచరుడా… ఎన్నెన్ని కలలు వాస్తవాలు అవుతాయని
పచ్చబొట్టంత గాఢంగా నీ ముద్రని ధరించి
హృదయభాంఢాగారంలో నిక్షిప్తం చేసుకున్నానో… హఠాత్తుగా
ఏ సంశయాలు వేధించాయో… చేసుకున్న వాగ్దానాలు భంగపడ్డాయో…!
అపనమ్మకం ముంచెత్తిందో… దూరంగా జరుగుతూ నీవు
దూరం ఊహించని నేను… వేరొకరి నీడనే కాదు
నా నీడని కూడా నేను ద్వేషించి ద్వేషించి
జీవనగమనంలో ఎవరి గమనానికి, గమ్యానికి అడ్డుతగలని బాటసారినయి
ఎవరిని తిరిగి ప్రశ్నించని మౌనశతఘ్నినయి
లోకానికి వెల్లడించుకోలేని అముద్రిత విషాద సంచికనయి
శరీరాన్ని కాపాడుకున్నంత భద్రంగా మనసుని కాపాడుకోలేకపోయానని
కుములుతూ, ప్రతిక్షణం నీవలపు నా తలపుని తాకినవేళ
నా హృదిపై ఒక బాధావీచిక పయనించి వెళుతుంది….
కనుకొనకల నుండి ఒక చుక్క నిర్వేదంగా నిలిచింది
”ఒంటరి” అయి అచ్చు నాలా….
జీవితాన్ని ప్రేమించుకోవటం, జీవనాన్ని ప్రేమించడం, ఇతరుల ప్రేమని
ఆశించకుండా ఉండటం అవసరమని….
దశాబ్దాల నా అనుభవం నొక్కి చెప్పింది….
సత్యం శివం సుందరమయి….