విశాలి.ఎమ్
నా మటుకు నాకు అన్పిస్తూ ఉంటుంది
నా జీవితం నా అనుమతిలేని మజిలీల గమనమనే.
నా నిరంతర ప్రయాణానికి నేనెప్పుడూ టికెట్టు కొనలే
ఎందుకంటే నా భద్రత వారికెంతో ముఖ్యమని
వారంతా టికెట్టు కొంటామంటారు.
అమ్మయితే ఒక పెద్ద ప్రయణానికి సుదీర్ఘ టికెట్టు ఇచ్చి
అంతుతెలియని అర్థం లేని ఈ ప్రయాణానికి చాలా ఖరీదైన
గొప్ప ప్యాసింజర్‌ని చేసింది.
ఇకపై నేనే టిక్కెట్లు కొనలేను.
తెగించి కొందామన్నా, ముందున్న టిక్కెట్టే
అన్ని ప్రయాణాలకు సరిపోతుందని చింపేస్తున్నారు.
అప్పుడు అలా మొదలైన నా ప్రయాణంలో హైవేలు, హైటెక్కులు లేవు
కానీ, బోల్డన్ని ఘాట్‌రోడ్డులున్నాయి, ఎగుడుదిగుడు దార్ల ప్రయాణంలో
నా ఒళ్ళంతా ఎంతో హూనమయ్యిందంటే నమ్మండి
మనసును మండించి, శరీరాన్ని కుదిపేస్తున్న
ఈ ప్రయాణాన్ని రద్దుచేసి టిక్కెట్టు చింపేయాలనుకోవడం
తప్పయిపోయింది కొన్నవాళ్ళకి, తోటి ప్యాసింజర్లకు
అప్పుడు నాకనిపించింది దొంగతనంగా, ఆగిపోయిన బండిలోంచి దూకేసి
టిక్కెట్టులేని ప్రయాణం చేయాలని, సరికొత్త సుందరదేశం చేరాలని.
అందుకే సాహసంతో ఓ ప్రయత్నం చేసా
ప్రయత్న మాత్రానికే,
టిక్కెట్టు కొన్నవారు, తోడువచ్చినవారు
బరబరలాక్కుంటూ, నన్నీడ్చుకుంటూ తీస్కెళ్తుంటే
నిస్సహాయంగా జారగిలబడ్డ నాకు
బాసటగా, భరోసాగా చేతిలో చేరింది ‘భూమిక’
‘భూమిక’ నీలాంటి ప్రయాణికులు చాలా మందున్నారని
నన్నూరడించి ఓదార్పునిస్తోంది.
అందుకే ఇప్పుడు నా ప్రయాణం
కష్టంగా కాదు చాలా ఇష్టంగా మార్చుకున్నాను
”భూమిక” సాక్షిగా…..