శిలాలోలిత
‘A poem is the emotion of having a thought- Robert Frost’ అన్నట్లుగా కవిత చదివాక ఒక హాయి తాలుకు ఆలోచన రేకెత్తడం ఉత్తమ కవిత్వ లక్షణం.
కేవలం అనుభవాన్ని ఆవిష్కరించడమే కాక క్రమంగా అనుభవాన్ని ఆలోచనా స్థాయిలోనికి విస్తరింపజేయడం కవిత్వం చేసేపని.
కె. జ్యోత్స్న చిరు’సవ్వడి’ చేస్త కవిత్వ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ప్రకృతి పట్ల ఆమెకు గల మమకారమే ముఖచిత్రమైంది. ఈమె శైలి భావకవితాశైలి. సున్నితమైన పదబంధాలు, ఈస్తటిక్ సెన్స్ ఎక్కువ. సహజంగానే మృదుభాషిణి, స్నేహశీలి కావడం వల్ల అదే సామ్యత, సరళత ఆమె కవిత్వంలోనూ ప్రయాణించింది.
లలితమైన భావప్రకటనలు, చిన్న చిన్న సంఘటనలు, సందర్భాలు సైతం, ఆమె భావోద్వేగ ప్రకటనల్తో, కవిత్వమైనాయి.
ఈమెకు తెలుగు సాహిత్య అధ్యయనం విస్తృతమైనందువల్ల అనేక కొత్తకొత్త పదబంధాల్ని చొప్పించడం అలవాటు. పాత పాత పదాలు కూడా కొత్త అర్థపు ముఖాన్ని తొడుక్కుని, ముందు ప్రత్యక్షమవుతుంటాయి.
దేవులపల్లి కృష్ణశాస్త్రి, తిలక్‌ల ప్రభావం ఎక్కువగా కన్పిస్తుంటుంది. జీవితంలోని అన్నింటినీ మించినదేదంటే అది ప్రేమ, మానవత్వం, స్నేహం అని ఆమె విశ్వాసం. ఆ భావాలే రకరకాల రూపాల్లో వ్యక్తీకరిస్తూ వచ్చింది. కవిత్వాన్ని గురించి ఓచోట ఇలా నిర్వచిస్తుంది. కవిత్వం కన్నీళ్ళకు భాష్యమని/జీవనభాషకు వ్యాకరణమని/జీవితమనే గీతానికి తాత్పర్యమని – అంటుంది. ‘వేదన తెలియని ఏ కవి హృదయం నుంచైనా నాలుగు అక్షరం ముక్కలు తెచ్చివ్వగలవా?’ – అని ఓచోట ప్రశ్నిస్తుంది. మరణం లేని ఇంటి నుంచి గుప్పెడు గింజలు పట్టుకురమ్మనడం గుర్తొచ్చింది. అదెలా వుండదో – వేదన లేని కవి కూడా వుండటం సాధ్యం కాదు. కవిత్వానికి వేదన, సంవేదన, ఘర్షణ, సంఘర్షణ నిత్యావసరాలంత సహజ కవచకుండలాలు.
‘మరణం తర్వాత కూడా/కిరణంలా నిల్చిపోవాలని తపన పడ్తున్నా’ – తన కవితాక్షరాల ద్వారా ఎప్పటికీ జీవించే వుండాలనే జ్యోత్స్న ఆకాంక్ష నెరవేరినట్లే. ఎందుకంటే మనిషికి భౌతికరూపం ఒక్కటే – కానీ రచనాస్రష్టలకు అక్షరమే భౌతికరూపం – వారెప్పటికీ నిలిచిపోయే ఉత్తమ సాహిత్యాన్ని రచించినప్పుడు – సదా నిలిచిపోయే వుంటారు.
సహజీవన సౌందర్యాన్ని గురించి ‘త్వమేవాహమ్’ కవితలో, పూలతో జరిపిన సంభాషణ ‘ప్రేరణ’, స్త్రీపురుషుల సమస్థితిని తెలిపే ‘కొత్తసత్రం’, హింసోన్మాదాన్నీ, మతోన్మాదాన్నీ నిరస్తూ ‘ముంబై’, ఉస్మానియా యూనివర్సిటీ పరిమళాలతో ‘జ్ఞాపకం’, శూన్యావరణంలోని పెనుగులాటతో ‘నిష్-శబ్దం’, టీ.వీలు మానవ సంబంధాలపై చూపిన ప్రభావాలు, విలువలు తరుగైపోతున్న యంత్రిక జీవనశైలి పట్ల నిరసన-‘సీ-రియల్’, తల్లీ కూతుళ్ళ మధ్యనున్న ఆత్మీయతాపవనాలు, స్పర్శానురాగాలు, ఆదర్శమూర్తిమత్వాల కలబోత-‘ప్రవాహం’, స్త్రీలు ఎంతటి ఘర్షణకి లోనవుతున్నారో, ఎంతటి ఒత్తిడికి గురవుతున్నారో-‘నీ కోసమే’ కవితలో ఇలాంటివెన్నో కవిత్వ కాంతులున్నాయిందులో – సున్నితమైన వ్యంగ్యం శ్లేష ఎక్కువగా కన్పిస్తుంటాయి.
చలం ‘మ్యూజింగ్సు’లో ఇన్విజిలేషన్ చేసేటప్పటి తన మానసిక స్థితిని రాశాడు ఒకచోట. వీళ్ళంతా ఖైదీలు, నేరస్తులు అని భావించడం, జైలర్‌లా కాపలా కాయడమేమిటనుకున్నాడు. అలాగే జ్యోత్స్న కూడా పరీక్షావిధానంపై నిరసనను, నిర్లిప్తతతను ‘పర్యవేక్షణ’ కవితలో విమర్శిస్తుంది. ‘పాఠం చెప్పనినాడు/నన్ను నేను పోగొట్టుకున్నట్లుంటుంది/పాఠం చెప్తుంటే మళ్ళీ/కొత్తగా పుట్టినట్లుంటుంది ‘అధ్యాపనం’ కవితలోని, పాదాలివి. వృత్తిని ఎంతో ప్రేమించే వైఖరి ఇందులో కనిపిస్తుంది. ‘శాంతినికేతన్’ లాంటి విద్యాసంస్థల ఆవిష్కరణల కోసం తపన పడింది. ‘మరోబడికోసం’, వలసపిట్టల్లా డాలర్ దేశాల కెళ్ళిపోతున్న పిల్లలు, ఒంటరిపక్షుల్లా భారతచెట్టుమీద మిగిలిపోతున్న అవ్మనాన్నల గురించి ‘నిర్వచనం’, సిరిసిల్లా పత్తిరైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలకు తల్లడిల్లి రాసిన కవిత ‘వెలిగించు’. ఇలా చెప్పుకుంటూ పోతే, సముద్రపు ఒడ్డున దొరికే రకరకాల, చిత్ర విచిత్రాల నిధులన్నీ, ఈ కవిత్వపు సముద్రతీరాన లభ్యమౌతాయి.
ఒక మంచి కవిత్వాన్ని సముద్రపు నురగంత స్వచ్ఛమైన కవిత్వాన్ని, సముద్రపు హోరంత బలమైన స్వరంతో, సముద్రపు ఉప్పంత ఘాటైన సంఘర్షణలను పఠితులకు కలగజేస్తుంది ‘సవ్వడి’ తన కవిత్వరీతితో. కవయిత్రి మాటల్లోనే తానేమిటో ఇలా చెప్పుకుంది. ‘అనాహత చేతననాది/ఆగని అక్షరాల సంస్పందనే నేను’.