నా పేరు ప్రమీల. నాకు 38 ఏళ్ళు. అనంతపురం జిల్లా ఓ.డి.సి. మండలం, వసుకువారిపల్లి మా ఊరు. నా భర్త అయిన నరసింహారెడ్డి 10 సంవత్సరాల క్రితము నన్ను వదిలివేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పటి నుండి చిన్న పిల్లలైన ఇద్దరు పిల్లలను పోషించుకొంటూ తిరిగి వ్యవసాయం చేసుకొంటూ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని సమాజంలో ఒంటరి స్త్రీగా అనేక అవమానాలకు గురై పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాను. అలాంటి పరిస్థితులలో రెడ్స్ సంస్థ కదిరి వారు మా గ్రామానికి వచ్చి నాలాంటి ఒంటరి స్త్రీలను, మహిళా రైతులను గుర్తించి గ్రామ కమిటీలు ఏర్పాటుచేసి ఆ కమిటీలన్నింటిని కలిపి మండల స్థాయిలో కూడా ఒంటరి స్త్రీల సమైఖ్యలను ఏర్పాటు చేసుకొనేటట్లు అవకాశం కల్పిస్తూ సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అనేక శిక్షణలు ఇచ్చి మరియు విత్తనాలను నాగు పద్ధతిలో ఇచ్చి వ్యవసాయం చేసుకోవడానికి అనేక సహాయ సహకారాలు అందివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వ్యవసాయం చేయడానికి పెట్టుబడులు లేకపోవడంతో మహిళా రైతు అనే గుర్తింపు లేకపోవడంతో ప్రభుత్వ సంస్థలైన బ్యాంకులలో మరియు ప్రైవేటు సంస్థల దగ్గర కూడా అప్పులు దొరకడం చాలా కష్టతరంగా ఉంది. దీనితోపాటు మహిళా రైతుగా దుక్కిదున్నడం నుండి పంట చేతికి వచ్చేంత వరకు అనేక పనులు నేనే స్వయంగా ముందుండి చేసి సాటి రైతులతో పోటీపడి తిరిగి వ్యవసాయాన్ని చేసుకుంటున్నాను. పిల్లలను కూడా వృద్ధిబాటలో నడిపించుకోవడానికి అనేక కష్టాలను, సమస్యలను ఎదుర్కొని జీవనం సాగిస్తున్నాను. ప్రస్తుతము ఉన్న భూమి కూడా నా పేరుతో లేకుండా నా భర్త పేరుతోనే ఉన్నందున బ్యాంకులలో కూడా అప్పులు ఇవ్వడం లేదు. వితంతు పెన్షన్ కోసం తహసీల్దారు, ఆర్.డి.ఓ. ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా నీ భర్త చనిపోయి వుంటేనే నీకు పెన్షన్ వస్తుంది లేకపోతే రాదు అని చెబుతున్నారు.
ఈ స్థితిలో నేను కోరుకుంటున్నదేమంటే… 1. మహిళా రైతుగా గుర్తింపును ఇవ్వాలి. 2. వ్యవసాయం చేయడానికి వడ్డీ లేని రుణాలను ఇవ్వాలి. 3 ప్రత్యామ్నాయ జీవనోపాధి శిక్షణ కల్పించాలి. 4. పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అదించాలి. 5. వితంతు పెన్షన్ మంజూరు చేయాలి. 6. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (యన్.ఎఫ్.బి.ఎస్) ద్వారా ఆర్థిక సహాయం అందించాలి.
(రెడ్స్ సంస్థ సౌజన్యంతో….)