కేంద్రంలో బీజేపి గెలిచినంక ఎనిమిది వందల యేండ్ల తర్వాత మల్లా హిందూ రాజ్యమొచ్చిందనీ సంబురాలు చేస్కున్నయి హిందూ సంస్థలు. కానీ ఒక చరిత్రకారుడు మురాద్ అలీ బేగ్ అన్నట్లు హిందూ సామ్రాజ్యాలు లేవు బౌద్ధం, జైనం, ముస్లిమ్, క్రిస్టియన్ మతాల వాల్లే సామ్రాజ్యాలుగ పాలించారు. హిందూ రాజ్యాలుగ భారతదేశం ఎప్పుడూ లేదంటడు. అసలు యీ భారతదేశమనే కాన్సెప్ట్ భారతీయులం అనేది కూడా మూడువందల సంవత్సరాలనుంచే మొదలైందంటడు. అంతకు ముందు తమిళులుగా, ఆంధ్రులు గా, మరాఠాలుగా, బెంగాలీయులుగా వుండే దనీ బ్రిటీషిండియా వ్యతిరేక ఉద్యమాల నుంచే యివన్ని సంతరించుకున్న యంటడు. అట్లనే హిందుత్వం, హిందూ మతం అనే మత సంబంధ పదాలు కూడా అట్లా వచ్చినవే అంటడు యీ చరిత్రకారుడు. హిందుత్వము అనే పదము కాయిన్ చేయకముందు వైష్ణవులు, శైవులు, బౌద్ధులు, సిక్కులు, రవిదాసులు, కబీర్‌పంత్‌లు యిట్లా ప్రజలు తమ నమ్మకాలకు సంబంధించిన అభిమతాలతో తమ గురించి తాము చెప్పుకునే వాల్లు. యిక అంటరాని ఎస్సీ కులాల వాల్లు తమ మతంకు సంబంధించిన అంశాలు వచ్చినపుడు ఎల్లమ్మలోల్లు, పోషమ్మలోల్లు, మైసమ్మలోల్లు అని చెప్పుకుంటుంటరు.
యిప్పటికి తెలంగాణ గ్రామాల్లో యిట్లా చెప్పుకోడం చూస్తుంటము. మా చిన్నప్పుడు క్లాసుల టీచరు మనది భారతదేశమనీ, మనం హిందువులమని చెప్తే అస్సలర్థంకాక పోయేది. ఎందుకంటే మా వూల్లల్ల యిండ్లల్ల ఆ పదాలు వుండకపోయేది. వోరంగల్లు వొక దేశము, కన్నాగరం (కరీంనగర్) యింకో దేశమనీ, మనం పోషవ్వలోల్లమని చెప్పేది. యీ రెండిటిల టీచరు చెప్పింది పుస్తకాలల్ల చదివిందే నిజమని పట్టుకునేది. కాని యీ చరిత్రలు చదువుతుంటే మాముసలవ్వలు, తాతలు చెప్పినయి చాలా సత్యాలనిపిస్తున్నయి.
అయితే యిప్పుడు హిందుత్వము రాజ్యం చేస్తుందనీ హిందూ అజెండాను అమలు చేస్తుంది బహుజనుల మీద. భారతదేశం వర్సెస్ – నాన్ వెజ్ పేరు మీద, భారత్ వర్సెస్ – హిందూమతము, భారత్ వర్సెస్ – రిజర్వేషన్ వ్యతిరేకతగా బహుజన కులాలమీద విషయం చిమ్ముతుంది హిందుత్వము. యీ మొత్తం తతంగం భారతదేశ మూలవాసుల మీద దాడిగా ముందుకొస్తుంది.
మా తిండిమీద మాంసమని, ఎద్దుకూరని నిషేధాలు, మమ్మల్ని హిందు వులని ముద్రేసుడు, మా రిజర్వేషండ్లమీద ఉక్కుపాదాలు మోపే ప్రయత్నాలు పన్నాగా లు నడుస్తున్నయి. యింకా అధికారంలోకి రాముని సంతానమే సంతతే రావాలట అక్రమ సంతానం రావొద్దట. రాముడి సంతతంటే రామున్ని కొనసాగించడం, రామున్ని ఆదర్శంగా చేయడం. రాముడి కేంద్రంగా 3 అంశాలు ముడివడివున్నయి. 1. ఉత్పత్తి కులాలైన బహుజనులను క్రూరంగా అణచివేయడమే రామధర్మము- శంబూకవధ, సుగ్రీవ వెన్నుపోటు, వానర బలాల్ని వుపయోగించుకొని తర్వాత కోతులుగా అవమానించడం.
2. రాముడు మహిళలపట్ల చూయించిన ఆదర్శాలు కూడా శూన్యము. నమ్ముకున్న భార్యను (సీత) అనుమానించి మోసంగా అడవులకు తోలిన చరిత్ర రాముడిది. మనసు పడిన మహిళ శూర్పణఖను ముక్కు చెవులు కోసి హింసించిన కిరాతకం రాముడిది.
3. వర్ణ ధర్మాన్ని, కుల ధర్మాన్ని కాపాడేందుకు, నిట్టేడులా నిలబెట్టేందుకు రాముడు కృషి చేసిండు.
యిట్లాంటివి రాచరిక వ్యవస్థలోని తిరోగమన వాదాన్ని తీసుకొచ్చే హిందుత్వాలకి రాముడు ఆదర్శం. కాని రాముడు బహుజన కులాల వ్యతిరేకి. యీ దేశమూల వాసుల బద్ధ శత్రువు.
హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత అనీ యిప్పుడు జాతీయ గ్రంథంగా ప్రకటించాలనే ప్రతిపాదనలు వినబడ్తు న్నాయి. గీత ప్రధాన సారాంశం హింసను పురికొల్పేదని చెప్తుంటరు. యిక్కడ ఉత్పత్తి కులాలైన బహుజన కులాల మీదికి ఆదిపత్యాల కులాలు ప్రయోగించే హింసలు న్యాయమైనవే అని కితాబివ్వడానికి గీతను జాతీయ గ్రంథంగా చేయబోతున్న ప్రయత్నాలు జరుగుతున్నయి. యిప్పుడు హిందూత్వ సంస్థలు కృష్ణుడై మోదిని అర్జునుడిగా నడిపిస్తున్నయి.
యింకోటి ప్రతి హిందూ మహిళ నలుగురేసి పిల్లల్ని కనాలట. (కంచి అయిలయ్య గారన్నట్లు యీ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు హిందువులే కారు. అది వాస్తవం గూడ.) అయితే ఆడోల్లంటే పిల్లలు కనే గర్బసంచులేనా! మహిళలు కూలినుంచి యాజమాన్యంలోకి, అవిద్య నుంచి విద్యలోకి, నిరుద్యోగులనుంచి ఉద్యోగాల్లోకి, బానిసత్వం నుంచి స్వతంత్య్రంవైపు, పరాదీనతనుంచి సాధికారంలోకి రావడం యిక్కడి మహిళలందరి లక్ష్యం కావాలి. ఎంతమందిని కనాలి కనొద్దు అనేది మత మగ రాజకీయాలు నిర్ణయించొద్దు, అది మహిళలే! స్వయం నిర్ణయాత్మకమైన స్థితికి ఎదిగేందుకు సమాజం అవకాశం కల్పించాలి.
హిందుత్వ సంస్థలు చేసే ఆహార నిషేధాలు, హిందూ ఎజెండాలు, కులాధిపత్యాలు రిజర్వేషన్ వ్యతిరేకాలు, రామరాజ్యాల యుగాలు అన్నీ బహుజనులను యింకా బానిసత్వంలో బిగించడానికే. వీటివల్ల ఎక్కువ నష్టపోయేది బహుజన మహిళ, అంటరాని మహిళనే.