1970 సం|| సెప్టెంబరున ఈ సంఘటన జరిగింది. కుజూ కార్మికులు మా యూనియన్ విజయాలు విని వాళ్ళ ఊళ్ళో కూడా యూనియన్ని స్థాపించమని అడిగారు. రామేశ్వర్ ప్రసాద్ సిన్హా సంయుక్త సోషలిస్ట్ పార్టీ నేత. ఆయన మాజీ మంత్రి అయిన సచ్చిదానంద సింహ్‌కి మిత్రుడు కూడా. ఆయనని అక్కడి విశేషాలు తెలుసుకోమని పంపించాను. మేం కేదలా నుండి హజారీబాగ్‌కి తిరిగి వచ్చినప్పుడు మగధ్ హోటల్లో ఉండేవాళ్ళం. పక్కన ఉన్న చోటుమల్ హోరుమల్ ఇంట్లో ఒక గదిలో ఆఫీసు పెట్టాము. భోజనం మగధ్ హోటల్లో చేసేవాళ్ళం. రామేశ్వర్ బాబు మగధ్ హోటల్లో ఉండేవారు. నా దగ్గర ఒక డొక్కు స్టేషన్ వాగన్ ఉండేది. దాని టైర్ మాటిమాటికి పంక్చర్ అవుతూ ఉండేది. దానిని వెనక నుండి తోస్తేనే కాని కదిలేది కాదు. డ్రైవర్ వయస్సులో పెద్దవాడు. అతడు టీ.బి. పేషెంట్.
రామ్‌ఘడ్ రాజు బొగ్గు గనులు కేదలా – ఝార్ఖండ్‌లో ఉన్నాయి. వాటి మీద బిహారు ప్రభుత్వం రిసీవర్ని పెట్టేసింది. ఈ బొగ్గు గనులలో మేము కార్మికుల హక్కుల కోసం చేస్తున్న పోరాటం, లభించిన విజయం గురించి అంతటా పాకిపోయాయి. కార్మికుల సంఘాలలో మా గురించిన చర్చ మొదలయింది. ఈ బొగ్గుగనులకు రాజు బొగ్గు గనులు అని పిలిచేవారు. పక్కనే ఘటోటండ్లో వెస్ట్ భొకారో గనులు ఉన్నాయి. అక్కడి కార్మికులకు వేజ్‌బోర్డుని అనుసరించే కూలి దొరికేది. ఘాటో తరువాత సాడుబేడా, ఆరా, కుజు, మురసా, హెస్సాగఢ్ ఉన్నాయి. ఎన్.ఎచ్ 3 దగ్గర తోపా, పిండురా, తోయడా మొదలైన గనులు ఉన్నాయి. ఇంకా ముందు గిద్దిలో ఎన్.సి.డి.సి ప్రభుత్వం గనులు ఉన్నాయి. ఎన్.సి.డి.సి గిద్దీ పక్కన బర్డ్ కంపెనీ రైకీ గఢా బొగ్గుగని ఉండేది. దీన్ని రసిక్ భాయీ బోరా నడిపించేవాడు. బర్డ్ కంపెనీ ఆయనని తొలగించింది. ఆరా, సారూ బేడా, షీబూకాలీకి చెందిన గనులు, తోపా, తోయరా, బంగాలీ, మాతిక్ చటర్జీ గనులు, ఇవన్నీ ప్రైవేటు యాజమాన్యం వారు నడుపుతున్నారు. కాంట్రక్టర్లు వీటిని నడిపిస్తూ యజమానులకు రాయలిటీ ఇచ్చేవారు. యజమానులు ఎక్కువగా కలకత్తాలో (ఇప్పుడు కొలకత్తా) ఉండేవారు. కాని వాళ్ళు గనులకి దగ్గరగా పెద్ద పెద్ద బంగళాలు నిర్మించుకునేవారు. వాళ్ళ గుమాస్తాలు రాయల్టీ వసూలు చేసేవాళ్ళు. పెద్దకాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్లకు గనులు అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుండి రాయలిటీని వసూలు చేసేవారు. ఈ గనులలో యజమానుల ద్వారా ఇన్‌టెక్ యూనియన్లు నడిచేవి. నేతలు నేతలుగా పనిచేస్తూ ఆ గనులలో కాంట్రాక్టర్లుగా కూడా పనిచేసేవాళ్లు. సురక్ష నియమాల అనుసారంగా నాలుగైదు గనులపైన మైనింగ్ మేనేజర్ని నియమించే వాళ్ళు. ఇదేవిధంగా ఓవర్‌మెన్, మైనింగ్ సర్దార్లు కూడా నియమింపబడేవారు. కాని పేరుకి మాత్రమే. యజమానులు, కాంట్రాక్టర్లు వీళ్ళకి కూడా అంతో ఇంతో సమర్పించేవారు. వీళ్ళని సంతోషపరిస్తే వాళ్ళు రక్షణ నియమాలను తు.చా తప్పకుండా పాటించకుండా ఎక్కువ లాభం వచ్చేలా చూస్తారు. వేరే పార్టీల యూనియన్లలోకి వెళ్ళకుండా చూస్తారు. అంటే కార్మికులు మరేదైనా యూనియన్ ఏర్పాటు చేసుకోకుండా మైనింగ్ స్టాఫ్ ఇన్టక్ తప్పితే మరే యూనియన్ని ఏర్పరచడంలో వీళ్ళు ఎంతమాత్రం సహాయం చేయరు. గనులలో ముంషి, హజారీబాబూల తరువాత కార్మికులకు ఎక్కువగా మైనింగ్ స్టాఫ్‌తోనే పనిబడుతుంది. వీళ్ళే వాళ్ళకి పనులు ఎలాట్ చేస్తారు. కార్మికులకి కూలి విషయంలో ఎక్కువ తక్కువ ఇచ్చేది వీళ్ళే.
ఉత్పత్తి ఎక్కువగా జరగాలంటే వీళ్ళ మీదే ఆధారపడాలి. 1970లో ఝార్ఖండ్ పోరాటం, విజయం గురించి విని కుజూక్షేత్రంలో ఉన్న గనుల దగ్గరి కర్మాబస్తీలోని కార్మికులు నన్ను అక్కడికి తీసుకువెళ్ళడానికి వచ్చారు. కర్మా బస్తీలో ఉండే కార్మికుడు దంగల్ (ఈయన సారూ బేడా, ఆరాలో పనిచేసేవాడు) సర్దార్ హమీద్‌తో పాటు ముగ్గురు నల్గురు కార్మికులని కూడా కేదలాలో
ఉన్న మా యూనియన్ ఆఫీసుకు నన్ను కలవడానికి పంపించాడు. వీళ్ళు రహస్యంగా మమ్మల్ని కలిసారు. అందరి ముందు కలవడం అంటే ఉద్యోగాన్ని పోగొట్టు కోవడమే కాదు పహల్వాన్లతో దెబ్బలు కూడా తినాల్సివస్తుంది. శ్రీ ఆర్.పి. సింహ్ మేనేజరుగా పనిచేసేవాడు. అతడు క్షత్రియుడు. ఈయన స్వతంత్ర సేనాని రామ్‌నారాయణ్ కుమారుడు. ఈ క్షేత్రంలోని క్షత్రియులు జమీందారులు. అడవులలో, గనులలో కాంట్రాక్టు తీసుకునేవారు. పహల్వాన్ల పనులు కూడా చేసేవారు. వాళ్ళు అవతలి వాళ్ళని అదిరించి – బెదిరించి కాంట్రాక్టు తీసుకునే వారు. తరువాత చిన్నా-చితక కాంట్రాక్టర్ల ద్వారా ఏ శ్రమ చేయకుండా రాయల్టీ ఇచ్చి పుచ్చుకునేవారు. చాలా సంపాదించేవారు. బీదక్షత్రియులు చిన్నా-చితకా కాంట్రాక్టర్ల పని చేస్తూ, పహల్వాన్ల, గార్డ్, చపరాసీ పనులు చేస్తూ ఉండేవారు. పెత్తనం చేస్తూ ఉండేవారు.
మేం ఈ స్థితిగతులన్నింటిని అర్థం చేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం ఢిల్లీలో జార్జ్ఫర్నాండిస్తో మాట్లాడి లాడలీ మోహన్ నిగమ్ (సోషలిస్టు నేత) మీటింగ్‌లను కూడా ఆరా గనుల దగ్గరి ఆరా చెక్‌పోస్టు దగ్గర పెట్టాము. ఆరా నుండి ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఆరా గనుల ఆఫీసు పక్కన చెక్‌పోస్టు ఉంది. ఆరా మలుపు దగ్గరనుండి గ్రామీణ కార్మికుల ఊరేగింపు మాతో రావాలి. థేడే కార్మికులు కూడా ఆ చెక్ పోస్టు దగ్గరే కలవాలి. కాని ఆరోజు మేం అక్కడికి చేరకముందే ఆరా మలుపు దగ్గర పోలీసులు ఉన్నారు. లాఠీఛార్జ్ చేసి జెండాలున్న కర్రలను లాక్కున్నారు. టాంగియాం, (గొడ్డళ్ళు – ఛోటా నాగ్‌పూర్‌లో ప్రతి గ్రామీణ వ్యక్తి తప్పకుండా తన దగ్గర ఉంచుకుంటాడు)లను కూడా లాక్కున్నారు. అయినా కొంత మంది సాహసవంతులైన కార్మికులు నిమ్మకు నీరెత్తినట్లుగా అట్లాగే నిల్చున్నారు. లాఠీఛార్జి వార్త గనులలోని కార్మికులలో క్రోధాన్ని పెంచింది. మేం అందరం ఒక ట్రక్‌ని అద్దెకు తీసుకుని వెళ్ళాం. అక్కడ జరుగుతున్న అల్లరిని చూసి ట్రక్ డ్రైవర్ ఎంతో భయపడ్డాడు. గని దాకా వెళ్ళడానికి భయపడ్డాడు. కాంట్రాక్టర్లు హజారీబాగ్, రామ్ గఢ్‌లలో, టాక్సీస్టాండ్లో మాకు టాక్సీలు ఇవ్వరాదని చెప్పారు. చెక్‌పోస్ట్ దగ్గరి కార్మికులలో మేం అక్కడికి వస్తాం అన్న నమ్మకం లేదు. అందువలన మేం ఎట్టి పరిస్థితిలోను గనుల దగ్గరికి వెళ్ళి, యూనియన్ వాళ్ళు గనులదాకా రాకూడదని ఎన్నో ఆటంకాలు కలిగించిన కాంట్రాక్టర్లకు గుణపాఠం నేర్పించాలనుకున్నాం. యూనియన్ అంటే నిజానికి యూనియన్ నేతలు అనే అర్థం. అందువలన నేను లాడలీ మోహన్ నిగమ్‌ని తీసుకుని కాలినడకన ఆరా చెక్‌పోస్ట్ దగ్గరికి వెళ్ళాను. పోలీసులకి కూడా మాతో పాటు నడవాల్సి వచ్చింది. ఆరా చెక్‌పోస్టు అవతలి వైపు ఉన్న లేన్‌లో కాంట్రాక్టర్లు, ఇంటక్ నేత వశిష్ఠ సింహ్, ఇంకా కొందరు గుండా టైపు నేతలు అక్కడికి చేరారు. వాళ్ళు తెల్లటి ఖాదీ దుస్తులను వేసుకుని ఉన్నారు. నిజానికి నేతలు ఎవరో కాంట్రాక్టర్లు ఎవరో చెప్పడం కష్టం. వాళ్ళ వెనక ఒక మూలన కొందరు కార్మికులు కూర్చున్నారు. కొందరు నిల్చున్నారు. వాళ్ళ చేతుల్లో బరిసెలు ఇంకా మరికొన్ని ఆయుధాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. మమ్మల్ని చెక్‌పోస్టుకి వెళ్ళకుండా అడ్డుపడ్డారు. అయినా నేను పట్టుబట్టి, పోలీసుల సహాయంతో చెక్‌పోస్ట్‌ని దాటాను. గుడారాలలో కూర్చుని ఉన్న కార్మికుల దృష్టి అంతా మావైపే ఉంది. మళ్ళీ ఇంకా బలగంతో వస్తామని వాళ్ళకి చెప్పి మేము వెనక్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఏదైనా దుర్ఘటన జరిగితే కార్మికులు భయపడతారు. పోలీసులు, ఆల్ ఇండియా నేత లాడకీ మోహన్ మాతో ఉన్నారు. నిజానికి నన్ను చంపడానికి ప్రయత్నం జరిగింది. వాళ్ళు ప్లాన్ కూడా వేసుకున్నారు. కాని వాళ్ళు దీనిని అమలు జరపలేకపోయారు.
ఏజెంట్ శ్రీ ఆర్.పి. సింహ్ కరమా బస్తీకి చెందిన హమీద్‌తో 18 మంది కార్మికులు మా యూనియన్ని ఆరా తీసుకువచ్చారని ఆరోపిస్తూ మా యూనియన్ని తరువాత రోజు బాన్ చేసారని బాదత్ చెప్పారు. మేం ఈ కార్మికులని పనిలోకి మళ్ళీ తీసుకోవాలని ఒక ఉత్తరం గని యాజమాన్యం వారికి రాసాము. నిర్ధారిత సమయంలో పని ఇవ్వకపోతే ఆరాగనిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని నోటీసు పంపించాము. ఒక ప్రతిని కేంద్రీయ లేబర్ కార్యాలయానికి పంపించాం. పోలీసులకి భారత్, బిహార్ ప్రభుత్వంలోని మంత్రులకు పంపించాము. దీనికి ముందు మా బలప్రదర్శన చూపించాలన్న ఉద్దేశ్యంతో కుందరియా (ఆరా మలుపు దగ్గరిలో ఆదివాసీల ఊరు) లో గ్రామ ప్రజలు, గనుల కార్మికులను పిలిచి ఒక మీటింగు పెట్టాము. ఎందుకంటే ఎక్కువమంది బలగంతో గనులలో ప్రవేశం చేయవచ్చును. మరునాడు కుందరియాకి నన్ను బాదల్ తీసుకువెళ్ళాలి. కాని రెండు మూడు రోజుల క్రితం నుండే ‘ఈ సారి మిమ్మల్ని చంపడానికి షీబూకాలీ అని ఏర్పాట్లు చేస్తున్నాడు’ అంటూ మాకు వార్తలు వస్తూనే ఉన్నాయి.
రామేశ్వర్ బాబు మా యూనియన్‌కి ఉపాధ్యక్షుడు. ఆయన భూమిహార్ జాతివాడు. అందువలన రాజ్‌పుత్ ఏజెంట్లతో, కాంట్రాక్టర్లతో ఆయన సమీకరణ కుదరలేదు. ఆయన ఒక వ్యక్తిని నా కార్యాలయానికి తీసుకువచ్చాడు. ఆయన అన్నారు- ”నేను మీ మంచి కోరే వాడిని. మీరు ఆరా గనుల దగ్గర జరిగే మీటింగ్‌కి వెళ్ళవద్దు. షీబూకాశీ బెనర్జీ బెంగాల్ నుండి నక్సలైట్‌ని పిలిచాడు. మిమ్మల్ని చంపాలని ప్లాన్ వేసారు. మిమ్మల్ని ప్రాణాలతో చస్తే పంపించరు.”
నేను ఆయన మాటలను విన్నాను. సరే అన్నాను. కాని లోలోపల నవ్వుకున్నాను. ఈ నక్సలైట్స్ కూలీల విరుద్ధంగా ఎందుకు పోరాడుతున్నారు? ఆ రోజుల్లో పోలీసులు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్లు నక్సలైట్ల పైన నేరస్థులు అని ముద్రవేసారు. ఏమైనా ఆవ్యక్తి ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుని వెళ్ళిపోయాడు.
తరువాత రోజు 17 సెప్టెంబరు ప్రొద్దున్నే మేం కుందరియా ఊరుకి వెళ్ళాలి. ప్రొద్దున్నే మగధ హోటల్ యజమాని నగేంద్ర సింహ్ బాబు భరత్ సింహ్‌ని తన వెంట తీసుకు వచ్చారు. భరత్ సింహ్ రాళ్ళ క్వారీకి కాంట్రాక్టరు. బొగ్గు గనులకు చెందిన బాబూ సాహెబ్లందరు హజారీబాగ్‌లో మగధ్ హోటల్లో అడ్డా పెట్టేవారు. భరత్ సింహ్ అన్నారు- ”పోలీసులు కూడా వీళ్ళతో కలిసి ఉన్నారు. అందువలన గుప్తాగారూ మీరు వెళ్లవద్దు. మిమ్మల్ని చంపాలనే
వాళ్ళు నిర్ణయించుకున్నారు. చుట్టు పక్కల ఉండే గనుల కాంట్రాక్టర్లు కూడా వాళ్ళతో చేతులు కలిపారు.”
నేను ఎంతో ధైర్యంగా అన్నాను- ”ఒకవేళ నేను ఇవాళ వెళ్ళకపోతే ఇక ఎప్పటికీ వెళ్ళలేను భరత్ బాబు! మీరు చెప్పేదంతా నిజమే అయితే నేను వెళ్ళడం ఇంకా అవసరం. అక్కడికి వెళ్ళడం ఎంత అపాయం అయినా వెళ్ళి తీరాల్సిందే. నేను వెళ్ళకపోవడం అంటే అర్థం భయపడటం. భయపడితే అర్థం కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయడమే. ఉద్యమం చప్పబడి పోతుంది. అందువలన కార్మికులు నిరుత్సాహం చెందకుండా ఉండాలంటే నేను వెళ్ళి తీరాలి. నేతృత్వంలో వాళ్ళు నమ్మకం కోల్పోకూడదు. నిజానికి మీరు నా గురించి ఎంతో చింతిస్తున్నారు. కృతజ్ఞురాలను. కాని మీరు కార్మికుల వైపు నుండి ఆలోచించి చెప్పండి. నేను కార్మికుల కోసం వెళ్ళడం సరియైనదా కాదా? ఇవాళ నేను చనిపోయినా సరే కార్మికుల ఉద్యమాలకి ఒక దారి కనిపిస్తుంది.”
ఆయన నాకు ఏ జవాబు చెప్పలేక పోయారు. ఆయన కళ్ళలో నన్ను మెచ్చుకుంటున్న భావం వ్యక్తం అవుతోంది. రామేశ్వర్ బాబుని వెళ్ళడానికి సిద్ధంకండి అని చెప్పాను. ఆయన ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోయారు. కాని తిరిగి రాలేదు. ఆ తరువాత కార్మికులెవరు ఆయనని నమ్మలేదు. ఆయన కోసం ఒక గంట ఎదురు చూసి నేను అమీర్‌ఖాన్‌ని, బాదల్ని తీసుకుని కుజుకి వెళ్ళిపోయాను. అమీర్‌ఖాన్ కేదలా శాఖకి సెక్రటరీ. ఎంతో ధైర్యవంతుడు. ఇవాళ పోట్లాటలు జరుగుతాయని తెలుసు. ఆయన్ని కూడా చంపేస్తారు అనీ తెలుసు. అయినా ఆయన నాతో వచ్చారు. డుగ్ డుగ్ని వాయించి అందరికి నేను ఆ ఊరికి వచ్చానని తెలియపరచాను. కర్మా, రత్వై, సుగియు, కుజు, మురపా, బైన్పూర్ నుండి ఆదివాసీలు, దళితులు ఇంకా కొందరు గ్రామస్థులు అక్కడికి చేరారు. అందరి దగ్గర కర్రలు, బల్లాలు, గొడ్డళ్ళు, జెండాలు, బాణాలు, గుతేర్లు ఉన్నాయి. మహిళలు రక్షణ కోసం జోలీలో రాళ్ళు నింపుకున్నారు.. 1970 సం|| సెప్టెంబరు 17వ తేదీ, ఆరోజు కుందరియాలో మీటింగు జరిగింది. మూడు రోజుల తరువాత సెప్టెంబరు 20న ఆరాలో నిరాహారదీక్షపై కూర్చోవాలని, అందరు ఆయుధాలతో రావాలని, నగారాలు, డుగ్డుగీలను వాయిస్తూ అక్కడికి వెళ్ళాలని అక్కడ మైదానంలో ఆగాల్సి వస్తే ఆగాలని ప్రకటించారు. ఇవాళ శాంతియుతంగా ఊరేగింపు తీయాలని, కుజు దాకా వెళ్లాలని చెప్పారు. కాంట్రాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా సరే పోట్లాడకూడదు. కేవలం బల ప్రదర్శన చేయాలి. పోట్లాటలు-హింస మాకు ఇష్టం లేదని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవడం మా లక్ష్యం అని అందరికి చెప్పాము. యాజమాన్యం వారికి, ప్రభుత్వానికి తమ శక్తిని నిరూపించాలంటే కార్మికులు పెద్ద-పెద్ద ఊరేగింపులు తీయాలని, అందరు ఆయుధాలు ధరించాలని కార్మికుల అభిప్రాయం. రెండు వైపులు సమానమైన శక్తి ఉంటే ప్రభుత్వం వారు మద్యస్థం చేస్తూ తీర్పు చెబుతారని లేకపోతే యాజమాన్యం వారితో చేతులు కలుపుతారని, కార్మికుల బలహీనతను పసిగట్టి వాళ్ళని అణచివేస్తారని మేం తెలియ చెప్పాం. పోలీసులు అధికారం వర్గం వాళ్ళు అమ్ముడు పోయారని తెలిసింది. అందుకని వాళ్ళముందే మా బలప్రదర్శన చేయాలని అనుకున్నాం. ప్రెస్
వాళ్ళు రాలేదు. మేం అందరం శాంతియుతంగా పోరాడాలి అని అనుకునేవాళ్ళం. కాని ఇది మా బలహీనత అని వాళ్ళు అనుకోకూడదని కూడా మేం దృష్టిలో పెట్టుకున్నాం. ఆయుధాలు ఉన్నా, వీటిని ప్రయోగించకపోవడం మా శక్తే అని మా అభిప్రాయం. వేడిగా ఉన్నప్పుడే ఇనుముపై వేటు వేయడం అన్నింటినీ పరీక్షించడం మా రణనీతి.
కుందరియా నుండి ఊరేగింపుని తీసుకుని కుజు వైపు బయలు దేరాము. దారిలో ఆరా మలుపు దగ్గర ఏజెంట్ ఆర్. పిి. సింహ్, కాంట్రాక్టర్లు, కర్రలు-కటారులతో గూండాలు నిల్చుని ఉన్నారు. నన్ను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టడం మొదలు పెట్టారు. కార్మికులు విని కోపంతో ఊగిపోవాలని వాళ్ళని ఎదిరించాలని వాళ్ళ ఉద్దేశ్యం. ఏజెంట్ ఆర్.పి. సింహ్ చేతిలో పిస్తోలు ఉంది. యూనియన్ వాళ్ళు పోలీసులకు తెలియచేసినా వాళ్ళు రాలేరు. అంతా ప్లాన్ ప్రకారం నడుస్తోంది. వాళ్ళు తిట్టే తిట్లని పట్టించుకోకుండా, వాళ్ళ చేతిలోని ఆయుధాలను చూసీ చూడకుండా నా కారుని మధ్యలో ఉంచి, రెండు వైపులా వరుసలలో నడుస్తూ డుగుడుగీని వాయిస్తూ బయలు దేరారు. వీళ్ళ చేతుల్లో కర్రలు-బాణాలు, గుతేళ్ళు మొ||లైన ఆయుధాలు ఉన్నాయి. మేము చుట్టు పక్కల ఉన్న అడవులపై కూడా దృష్టి ఉంచాము. అడవులలో దాగి మాపైన ఒక్కసారిగా ఎవరూ దాడి చేయకుండా చూసుకునే వాళ్ళం. ఏడు కిలోమీటర్లు నడిచి కుజూ చేరాలి.
తమ ప్లాను ప్రకారం కాంట్రాక్టర్లు మాపైన దాడి చేయలేరు. అసలు ఇంత మందిని చూసాక వాళ్ళకు ధైర్యం లేకుండా పోయింది. అసలు వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టి తమపైన మేం దాడి చేసేలా ప్రయత్నించారు. తమని తాము రక్షించుకోడానికి మాపై దాడి చేసాం అని చెప్పే అవకాశం లభిస్తుంది. మాలో చాలామందిని చంపే అవకాశం లభిస్తుంది. తక్కిన వాళ్ళని జైల్లో పడేసే అవకాశం కూడా లభిస్తుంది. దీనివలన మూడు రోజుల తరువాత జరిగే స్ట్రైక్ జరగదు. బాదల్ ఇంతకు ముందే వీళ్ళ ప్లాన్ గురించి నాకు చెప్పారు. అందువలనే నేను బస్తీ నుండి పెద్ద ఊరేగింపుని కుజూ దాకా తీసుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఆరోజు కుజులో పెద్ద సంత
ఉన్నది. అడవి వైపు దృష్టిని పెట్టి మేము ముందుకు నడిచే వాళ్ళం. కార్మికులకి నా కారుతో పాటు నడవమని చెప్పాను. దీనివలన ఎవరు రెచ్చిపోయి దాడి చేయరనీ నా అభిప్రాయం.
కుజూ మార్గంలో బాదల్ ఇల్లు ఉంది. అపాయం తప్పిందన్న ఉద్దేశ్యంతో మేం అందరం ఆయుధాలను ఆయన ఇంట్లో పెట్టాం. కార్మికులతో సంతకి వెళ్ళమని చెప్పాను. ఇదే మేం చేసిన పొరపాటు. కుజూ బజార్ ఎన్.ఎల్ 31లో ఉంది. బాహాటంగా మమ్మల్ని ఎవరు ఏమీ చేయరని అనుకున్నాం. ఆరోజు ఎస్.పి. హజారీబాగ్‌లో కుజూకి మేం రాకముందు కొంచెం సమయం క్రితమే వచ్చి వెళ్ళారని తెలుసుకున్నాం.
నేను, బాదల్, అమీర్‌ఖాన్ ఏ ఆయుధాలు లేకుండా కుజు వైపు బయలుదేరాం. కుజు మలుపు దగ్గర ఒక సిపాయి మా కారుని ఆపుతూ అడిగాడు- ”ఎటువంటి అపాయం లేదు కదా! అంతా సరిగానే ఉంది కదా?” ”బజారు మధ్యలో ఏ అపాయం
ఉంటుందని? మేము అపాయాలని అధికమించి వచ్చాము. మీరూ ఉన్నారు కదా! ఇక భయం ఎందుకు?” నేను సందేహంగా అన్నాను. ”సరే హోటల్ దాకా వెళ్దాం పదండి” అంటూ అతడు మా కారులో కూర్చున్నాడు. మేము నేషనల్ హైవే ఎన్.ఎచ్.31 దగ్గరికి వచ్చాం. ఒక సర్దార్జీ హోటలు దగ్గర కారు ఆపి లోపలికి పోయాము. మాలో ఎవరు పొద్దుటి నుండి ఎంగిలి పడలేరు. అమీర్‌ఖాన్, డ్రైవరు వేప పుల్లలు తీసుకుని పళ్ళు తోముకోవడం మొదలుపెట్టారు. నేను, బాదల్, సిపాయి చౌకీ లోపలికి వచ్చి కూర్చున్నాము. హోటల్ వాడికి చాయ్ చేయమని చెప్పాము.
హోటల్ యజమాని సర్దార్ లోపలికి వచ్చాడు. నన్ను చూసి నవ్వాడు. ఆయన నవ్వు నాకు విచిత్రంగా అనిపించింది. మేం మళ్ళీ చాయ్ అడిగాము. తల ఊపుతూ నవ్వుకుంటూ బయటకి వెళ్ళిపోయాడు. చాలాసార్లు లోపలికి వచ్చాడు. నా కుశల సమాచారాలు అడిగాడు. కాని చాయ్ మాత్రం తయారు చేయలేదు. ఇంతలో ఒక కారు వచ్చింది. కొంచెంసేపు ఆగింది. తరువాత స్టార్ట్ అయింది. కారులోంచి షీబూ కాళీ, వీరేంద్ర పాండే (తరువాత ఈయన మాండుకి ఎమ్.ఎల్.ఎ. అయ్యారు) కాంట్రాక్టరు శర్మ కూడా వచ్చారు. ఆయన లోపలికి వచ్చాడు. నన్ను ఎట్లా ఉన్నావని అడిగారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు. అని నేను అడిగాను. అతడి వ్యవహారం అదోలా అనిపించింది. తరువాత ఆయన బయటకి వెళ్ళిపోయాడు. పళ్ళు కొరుకుతూ కోపంగా మాట్లాడాడు అని నాకనిపించింది. కొంచెం సేపయ్యాక అకస్మాత్‌గా హోటల్లో పనిచేసే చిన్నపిల్లలు కూడా బయటకి వెళ్ళిపోయారు. మేం ముగ్గురం కూర్చున్నాము. ఏదో అపాయం పొంచి ఉందని నాకనిపించింది. బాదల్ కూడా ఆందోళన చెందాడు. మళ్ళీ ఒక ట్రక్ రోడ్డు మీదకి వచ్చింది. మమ్మల్ని నాలుగు వైపుల నుండి చుట్టు ముట్టారని అర్థం అయింది. ఉచ్చు బిగిస్తున్నారని తెలిసింది. బాదల్ నా దగ్గరిగా వచ్చి కూర్చున్నాడు.
హోటల్లో సామాను అట్లాగే ఉంది. పొయ్యి వెలుగుతునే ఉంది. కాని మనుషులు ఎవరు లేరు. నేను హోటల్ ద్వారం దగ్గర ఓ మూల కూర్చున్నాను. పక్కన బాదల్ కూర్చున్నాడు. తరువాత ఆ సిపాయి. నా దగ్గర ఏ ఆయుధాలు లేవు. నేను బాగ్‌లో కాని, చీరలో కాని పిస్తోలు పెట్టుకుంటానని అందరు అనుకునే వారు.
హోటల్‌కి ఉన్న మూడు ద్వారాల నుండి ఎన్నో ముఖాలు తొంగి చూస్తున్నాయి. ఎన్నో ఎన్నెన్నో కళ్ళు కోపంగా చూస్తున్నాయి. ఎన్నో కర్రలు హోటలులో (గుడిసె) ప్రవేశించాయి. ఇక బూతులు చెప్పనే వద్దు.
”ఈయన వశిష్ఠ సింహ్ ఇంటక్ నేత. గనుల కాంట్రాక్టర్” బాదల్ గొణిగాడు.
వశిష్ఠ సింహ్ నాపై గురిచూసి ఒక జెండాను విసిరివేసాడు. ఆ హోటల్ కప్పుకింద ఉండటం వలన సరాసరి లాఠీని విసిరి వేయడం కష్టం. అందుకు కొంత వంకరగా విసిరి వేసాడు. రెండో కాంట్రాక్టరు నా తలను గురి చూసి లాఠీని విసిరి వేసాడు. వెంటనే బాదల్ వచ్చి మధ్యలో నిల్చున్నాడు. నాకేం కాలేదు కాని అతడి తలకి దెబ్బ తగిలింది. గాయం అయింది. రక్తం కారసాగింది. అతడు ‘మయ్యా’ (అమ్మ) అంటూ నా కాళ్ళ దగ్గర పడిపోయాడు.
”ఇదేనా మీ నీతి! ఒంటరిగా ఉన్నప్పుడు దాడి చేయడం? మాతో పాటు వందల మంది కార్మికులు ఉన్నప్పుడు మీరెక్కడున్నారు.” నేను కోపంగా అడిగాను.
నేను ఈ మాటలు అన్నానో లేదో నామీద లాఠీలు విసిరి వేసారు. బూతులు తిడుతూ నన్ను చంపాలన్న ఉద్దేశ్యంతో వశిష్ఠ సింహ్ విసిరివేసిన లాఠీ నా చేతికి చిక్కింది. నేను ఆ లాఠీతో అతడిని ఎదిరించాను. కాని నా మోచేతి మీద దెబ్బ తగిలింది. నాచేతి లోంచి లాఠీ పడిపోయింది. నా చేయి దగ్గర ఎముక విరిగి పోయింది. ఒక బల్లెం సరాసరి నాకళ్ళపైన నుండి కనుబొమ్మలను గాయపరుస్తూ వెళ్ళిపోయింది. రక్తం చెంపల నుండి పెదవుల దాకా ప్రవహించడం మొదలు పెట్టింది. సిపాయి లేస్తూ అన్నాడు- ”పరుగెత్తండి అమ్మగారూ! మిమ్మల్ని నేను రక్షించలేను”
”నేను చస్తే పారిపోను. మీరందరు ఏం చేస్తున్నారో నేను తెలుసుకున్నాను.” అని అన్నాను.
సిపాయి బయటకి వెళ్ళిపోయాడు. నేను గోడని ఆనుకుని కూర్చుని ఉన్నాను. ఇంకా లాఠీల వర్షం కురుస్తూనే ఉంది. నేను మౌనంగా ఉండిపోయాను. వాళ్ళల్లో ఒక్కొక్కడు వచ్చి నామీద లాఠీలు విసరడం మొదలు పెట్టారు. బయట అమీర్‌ఖాన్, డ్రైవర్ అవాక్ అయిపోయారు. నిస్సహాయ స్థితిలో నిల్చుండి పోయారు. వాళ్ళ నోటి నుండి ఏమైనా మాట వచ్చిందంటే వాళ్ళు చంపేస్తారు.
ఒక్కసారిగా బయట చీకటి వ్యాపించింది. అందరి ముఖాలలో ఆందోళన వ్యక్తం అవుతోంది. గోడలు, నేల గిర్రున తిరుగుతున్నట్లుగా అనిపించింది. ఇప్పుడు తిట్లు మెల్లిగా వినబడుతున్నాయి. వాక్యాలు, మాటలు వేరువేరుగా వినిపించడం లేదు కాని ఈగలు భీన్ – భీన్ అంటూ చేస్తున్న మోత మాత్రం వినిపిస్తున్నాయి. చివరి వాక్యం వినిపించింది. ఇక చాలించు. చచ్చిపోయింది. ఇక వదిలేయి. చచ్చిన దాన్ని చంపడం ఎందుకు?
మళ్ళీ వేగంగా పడుతున్న అడుగులు దూరంగా ట్రక్ గరగర శబ్దాలు, పిస్తోలు పేల్చుతున్న చప్పుళ్ళు… అట్టహాసం… తరువాత అంతా నిశ్శబ్దం…
అమీర్‌ఖాన్ డ్రైవరు నన్ను, బాదల్ని ఎత్తి కారులో పడుకోపెట్టారు. ”పిరికి పందల్లారా! ఎదురు చూడండి. ప్రతీకారం తీర్చుకోడానికి నేను మళ్ళీ వస్తాను. మీ దుంపతెంపుతాను” అని నేను అపస్మారక స్థితిలో కూడా అరిచానని అమీర్‌ఖాన్ నాకు చెప్పాడు.
దారిపొడుగునా అమీర్‌ఖాన్ – ‘నెత్తురుకి ప్రతీకారం నెత్తురుతోనే తీసుకుంటాను’ అని అరుస్తూనే ఉన్నాడు. నేను తెలివిలోకి రాగానే అరిచేదాన్ని మళ్ళీ తెలివి తప్పి పడిపోయేదాన్ని.
ఒక ట్రక్ మా కారు వెనక వస్తోంది. డ్రైవర్ అమీర్‌ఖాన్‌తో అన్నాడు- ‘వీడు గుండాయే’. డ్రైవర్ కారు వేగం పెంచాడు. ట్రక్ మా కారుని ఢీకొట్టి లోయలో పడేసి హత్యను (నేను చనిపోయానని అనుకున్నారు) ఒక దుర్ఘటనగా నిరూపించాలని అనుకున్నాడు. కాని ఆరోజు మా డొక్కు కారు మాకెంతో సహాయం చేసింది. అరిగిపోయిన కారు టైర్లు కూడా. మేం మాండూని దాటాం. ఆ రోజుల్లో మాండూ ఇన్స్పెక్టర్గా ఖరే పనిచేసేవాడు. ఆయన పోలీసు స్టేషన్ పరిధి చరహీ వరకే ఉండేది. వాళ్ళందరు ఈయనతో చేతులు కలిపారు. వాళ్ళ పరిధిని మాండు వరకే అందువలన హద్దు సమాప్తం కాగానే ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. టి.బి. పేషెంట్ అయిన మా డ్రైవరు ధైర్యంతో వాళ్ళ ప్లాన్ సక్సెస్ కాకుండా ఎదిరించాడు. వాళ్ళందరు దూధీ నది వంతెన నుండే వెనక్కి వెళ్ళిపోయారు.
అమీర్‌ఖాన్ నన్ను డిప్యూటీ కమీషనర్ బంగళాలోకి తీసుకువెళ్ళాడు. నేను రక్తసిక్తంగా ఇంతకు ముందటి స్థితిలోనే
ఉన్నాను. ఆయన లేరు. తరువాత అతడు ఎస్.పి. దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా లేరు. చివరికి నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ డా. మిశ్రా పర్యవేక్షణలో ఉన్నాను. కార్మికులకు మిశ్రా ఏ కాంట్రాక్టర్లకు అమ్ముడుపోడని, నాకు ఏ హాని చేయడని నమ్మకం ఉంది. అక్కడ ఎంతో మంది అధికారులు కాంట్రాక్టర్లతో చేతులు కలిపేవాళ్ళు. ఇక లాయర్లు డాక్టర్లు చేతులు కలిపినా ఆశ్చర్యపడ నఖ్ఖరలేదు. ఈ డా. మిశ్రా కొడుకే తరువాత ఢిల్లీలో ఎస్.పి. అయ్యాడు.
మరుసటి రోజు దాదాపు 20 వేల మంది కార్మికులు మొత్తం పట్టణాన్ని చుట్టుముట్టారు. లైలీగఢా గిద్దీ, సొందా దగ్గరినుండి కూడా వచ్చారు. అమీర్‌ఖాన్ పన్నాలాయి, పటేల్రామ్, సియారామ్, తులారామ్, బుధారామ్ నేతృత్వంలో కర్షకులు, కార్మికులు దాదాపు నలభైమైళ్ళు నడిచి వచ్చారు.
మరునాడు నాకు తెలివి వచ్చింది. ఎదురుకుండా శ్రీజైన్ కూర్చుని ఉన్నారు. ఈయన హజారీబాగ్ ఎస్.పి.గా పనిచేసేవారు. తరువాత బిహారుకి ఐ.జి గా పనిచేసారు.
”మీ ఇన్స్పెక్టర్ ఖరే సమక్షంలో ఇదంతా జరిగింది. ఆయన హంతకులతో చేతులు కలిపారు. కుట్ర పన్నారు. రక్షకుడే భక్షకుడయ్యాడా అని బాధగా ఉంది” అని ఆయన్ని ప్రశ్నిస్తూ స్టేట్మెంట్ ఇచ్చాను.
”ఎవరు చంపే ప్రయత్నం చేసారు” ఎస్.పి. అడిగాడు.
”ఆర్.పి. సింహ్, శర్మ, వశిష్ఠ సింహ్, ఛోటే సింహ్ ఇంకా కొందరు కాంట్రాక్టర్ల హస్తం ఈ కుట్రలో ఉంది. నేను వాళ్ళని గుర్తు పట్టగలుగుతాను.”
”నాకు ఇరవై నాలుగు గంటల టైమ్ ఇవ్వండి గుప్తా గారూ!” అంటూ ఎస్.పి. లేచారు.
నా స్టేట్మెంట్ని రాసుకున్నారు. నా శరీరం మీద దాదాపు ఇరవై గాయాలు ఉన్నాయి. లాఠీల దెబ్బల వలన ఈ గాయాలయ్యాయి. బల్లెం విసరడం వలన కూడా గాయం అయింది. కాలర్ బోన్ విరిగి పోయింది. చేతి మణికట్టు ముక్కలయింది. చాలా నెప్పిగా ఉంది.
ఆసుపత్రిలో వరండాలో ఉన్న రూమ్‌లో నన్ను పడుకోబెట్టారు. అక్కడ కిటికీ ఉంది. కార్మికులు బయటనుండే నాకు దండం పెట్టవచ్చునని గదిలో ఎక్కువ జనం గుమిగూడరన్న ఉద్దేశ్యంతో నన్ను అక్కడ పడుకోపెట్టారు. నేను ‘ఇన్కలబ్ జిందాబాద్’ అని మధ్య మధ్యలో నినాదం చేసాను. మధ్య మధ్యలో కోర్టు నుండి కూడా నినాదాలు ఆసుపత్రి దాకా వినిపిస్తూనే ఉన్నాయి. మరునాడు అన్ని వార్తా పత్రికలలో ఈ వార్తలు పడ్డాయి. కొన్ని వార్తలు కార్మికులను సమర్థిస్తున్నాయి. కొన్ని యాజమాన్యాన్ని సమర్థిస్తున్నాయి.
హజారీబాగ్ పట్టణంలో పాకీవాళ్ళ స్ట్రైక్ నడుస్తోంది. దాదాపు ఇరవై వేల మంది దాకా కార్మికులు కోళ్ళను, మేకలు-పందులను తీసుకుని కోర్టు ఆవరణలో నిల్చున్నారు. పట్టణం అంతా దుర్గంధంతో నిండిపోయింది. కలరా వచ్చే ప్రమాదముంది. గవర్నమెంటుకి తలనొప్పిగా మారింది.
మూడో రోజు దామోదర్ పాండె (ఎమ్.పి.) తనతోపాటు ఇంటక్ నేత అయిన వశిష్ఠ సింహ్, గనుల కాంట్రాక్టర్ శర్మ, ఛోటే సింహ్‌లని తీసుకుని శ్రీ జైన్ (ఎస్.పి) దగ్గరికి వచ్చారు. పైరవీ చేయించి అరెస్ట్ చేయకుండా చూడాలని ఆయన ఉద్దేశ్యం. వాళ్ళు ట్రక్కులలో కొంతమంది కార్మికులను తీసుకువచ్చారు. వాళ్ళు నన్ను ఉద్దేశిస్తూ ‘మురాదాబాద్’ అని అరిచారు. కాని ‘జిందాబాద్’ అంటున్న కార్మికుల సంఖ్యను చూసి వీళ్ళు మురదాబాద్ బదులు ‘జిందాబాద్’ అని అరవడం మొదలు పెట్టారు. ప్రెస్ వాళ్ళు వాళ్ళని అడిగినప్పుడు ప్రతివ్యక్తికి ఐదు రూపాయలు ఇచ్చారని ‘ముర్దాబాద్’ అని నినాదం చేయమని చెప్పారని వాళ్ళు చెప్పారు. ఈ వార్త కూడా వార్తా పత్రికలలో ప్రచురింపబడ్డది.
దామోదర పాండే గారు ఎస్.పి.కి అందరి పేర్లు చెప్పారు. ఆయన ముగ్గురిని ఆయన ముందే అరెస్టు చేసారు. అంతకుముందు కార్మికుల సభలో పన్నాభాయి సూచించిన ప్రకారంగా వాళ్ళ నడుములకు తాళ్ళు కట్టి ముగ్గురిని కార్మికులందరి మధ్య తీసుకు వెళ్ళారు. ఇన్స్పెక్టర్ ఖరేని కోర్టు మైదానంలో నిల్చోబెట్టి సస్పెంషన్ చేసారని, ఆయన బాడ్జీని తీసి పడేసారని కార్మికులు చెప్పారు.
కార్మికులకు ఈ విజయం ఎంతో సంతోషాన్ని కలిగించింది. కాని నా కోసం చింతించసాగారు. కోర్టులో అధికారులను అరెస్టు చేసాక ఆసుపత్రికి రావడం మొదలు పెట్టారు. డాక్టర్లలో ఆందోళన పెరిగింది. నాకు ఏమైనా అయితే కార్మికులు ఆసుపత్రికి ఎక్కడ నిప్పంటిస్తారోనని వాళ్ళు భయపడ్డారు. నా ఆరోగ్యం విషయం వాళ్ళు ఇంకా ఏమీ చెప్పలేదు.
డాక్టర్లు నన్ను పాట్నా తీసుకు వెళ్ళమని సలహా ఇచ్చారు. కాంగ్రెసు పార్టీకి చెందిన చతరా ఎమ్.పి. శంకర్‌దయాళ్ సింహ్ నన్ను కలవడానికి వచ్చారు. ఆయన నన్ను పాట్నాలో ఆసుపత్రిలో చేర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసారు. నేను వెళ్తున్నాను అన్న వార్త వినగానే కార్మికుల సంఖ్య పెరిగింది. వాళ్ళందరు నాకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. రాత్రంతా ఉన్నారు. నాకు నిద్ర వచ్చే ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెట్టారు. పొద్దున్నే నాకు తెలివి వచ్చింది. నినాదాలు చేస్తూ వాళ్ళు నాకు వీడ్కోలు చెప్పారు. అమీర్‌ఖాన్, దాదూదయారామ్ ఇంకా మరికొందరు కార్మిక నేతలు కూడా వచ్చారు. పాట్నా నేను వెళ్ళకముందే మాజీ మంత్రి రామానంద తివారీ కూడా అందులో చేరారు. ఆయన మీద ఫ్యాక్టరీల యజమానులు హత్యాప్రయత్నం చేయించారు.
డా. ముఖోపాధ్యాయ, ఇంకా మరికొందరు డాక్టర్లు నా మణికట్టులో విరిగిన ఎముకలు సరిచేయడానికి ఆపరేషన్ చేయాలన్నారు. కార్మికులందరు భయపడ్డారు. కాని నాకేం కాదని గట్టి నమ్మకం. నేనేం చావను ఎందుకంటే పోరాటం పూర్తి కాలేదు. ఇంత కాలం కార్మికులకు కేవలం ఎనిమిది అణాలు ఇచ్చి పనిచేయించుకున్న యాజమాన్యానికి బుద్ధి చెప్పాలి. పెద్ద యుద్ధం చేయడానికి ఇంకా ఎంతో మది కార్మికులను సమావేశపరచాలి. ముక్తి యుద్ధం పూర్తి కాలేదు. నేను నా మజిలీకి తప్పకుండా చేరుకుంటానని నా నమ్మకం. ఉద్యమం సగంలో ఉంటే నేనెట్లా చస్తాను? నా శత్రువులకు గుణపాఠం చెప్పాలి. అందుకే నేను బతికి బట్టకట్టాను.
నా పేరు వార్తా పత్రికలలో రావడం నా మిత్రులు ఓర్వలేకపోయారు. నేను రాష్ట్రీయ స్థాయికి ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు. నన్ను కొట్టారు అన్న విషయాన్ని ఇంతగా హైలైట్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. నన్ను సమర్థిస్తూ నావైపున వేలమంది రావడం వాళ్ళకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అసలు రమణికా గుప్తాకి ఇంతపేరు ఎట్లా వచ్చింది? కాంట్రాక్టర్ల యజమానులకు ముఖంలో నెత్తుటి చుక్క లేకుండా పోయింది. యూనియన్‌లో నన్ను శత్రువుగా చూసే కొందరికి ఇంకా కోపం వచ్చింది. హజారీబాగ్‌లో నాకోసం వేల సంఖ్యలో కార్మికులు రావడం చూసి వాళ్ళు ఓర్వలేకపోయారు.
ఒకవేళ యాజమాన్యం వాళ్ళు అనుకున్నట్లుగా నేను భయపడితే, వెనక్కి తగ్గి ఉంటే ఉద్యమం చప్పపడి పోయేది. ‘మీ నాయకురాలు భయపడి పారిపోయింది’ అని ప్రచారం జరిగేది. అందువలన ప్రాణం పోతుందని తెలిసినా ఆ పరిస్థితులలో ధైర్యంగా నిలబడాలి. అదే సాహసం. నా ఉద్దేశ్యంలో ప్రాణం మీదకి వచ్చినా సరే ఆడది మొగవాడి కన్నా ఎటువంటి ఘోరమైన స్థితిని అయినా ఎదిరించగలదు. నాతో పని చేస్తున్న కార్యకర్తలు ఆరోజున అక్కడికి వెళ్ళవద్దన్నారు. కాని ఆ రోజు వెళ్ళకపోయి ఉంటే అసలు ఇక ముందడుగు వేసేదాన్నో లేదో.
కోల్డ్మైన్స్ నేషనలైజ్ అయినప్పుడు గనుల మేనేజర్లు, ఏజెంట్లు, ఆఫీసు సిబ్బంది సి.సి.ఎల్. కి అధికారుల పదవులని పొందారు. ఆరాకి చెందిన శ్రీ ఆర్.ఎన్. సింహ్ కూడా సొందారీహ్ గనులలో ప్లానింగ్ ఆఫీసరయ్యారు. నేను ఇంటక్ రాష్ట్రీయ కోల్ మైన్స్‌లో కార్మిక సంఘానికి ఉపాధ్యక్షురాలనయ్యాను. వశిష్ఠసింహ్ మైన్స్ కార్మిక సంఘం (ఇంటక్) లో కేంద్రీయ కార్యాలయంలో మెంబరు అయ్యారు. నేను ఈ నేరస్థులని టి.ఐ పెరేడ్లో గుర్తు పట్టాను. ఆ కేసులో వీళ్ళకి శిక్ష పడుతుంది తప్పదు. మళ్ళీ కేసుని ఓపెన్ చేసారు. కేసు నడుస్తోంది. అందరు కలిసి బిందేశ్వరీ దుబెని నన్ను కేసు వెనక్కి తీసుకోమని చెప్పమని అడిగారు. వీళ్ళు దాస్‌గుప్త, కాంతి మెహతాలని సమర్థిస్తారు. అందువలన కాంతి మెహతా చేత నాకు చెప్పించారు. ఇప్పుడు దాదాపు అన్ని కోల్‌మైన్స్ నేషనలైజ్ అయిపోయాయి. పరిస్థితులు మారాయి. చట్టపరంగా ఈ కేసుని వెనక్కి తీసుకోవడం కుదరదు. వీళ్ళందరి మీద ఆర్టికల్ 307 కింద హత్యకేసులు నమోదు అయ్యాయి. అయినా నేను మా యూనియన్ వాళ్ళతో, బాదల్‌తో సహృదయంగా చర్చించాను. నేను ఒక షరతు పెట్టాను. మేం అందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆర్.ఎన్.సింహ్ (సౌందాలో ఉన్నారు) ని సౌందాలో మా కేడర్ సురేంద్ర సింహ్‌కి సహాయం చేయాలని, ఇంటక్ వడ్డీ వ్యాపారస్థులైన నేతలకు ఏమాత్రం సహాయ సహకారాలు అందించకూడదని చెప్పాం. వాళ్ళు నేనన్నదానికి ఒప్పుకున్నారు. నేను స్వయంగా ఈ కేసుని డ్రాప్ చేసుకుంటానని జడ్జికి రాసి ఇచ్చాను. పాత శతృత్వాన్ని మరచి పోవడం మంచిదని నాకనిపించింది. (ఇంకావుంది