ఒరే రోహితూ.. వీలేంట్రా.. నువ్వేదో యిప్పుడే కొత్తగా వురితాడు మెడకేసుకొని వూయలేదో వూగుతున్నట్టు చెపుతున్నారు? నీ మెడలో నా మెడలో మనవాళ్ళందరి మెడలో వురితాడు లేనిదెప్పుడు చెప్పు? నువ్వు మీ అమ్మ కడుపులో పడినప్పుడు నీకు పేగుతాడు పడకముందే వురితాడు పడిందని వీళ్ళకు తెలీదు! పుట్టినప్పుడు బొడ్డుతాడు కోస్తారుగాని మెడలో వురితాడు కొయ్యరని కొయ్యలేరని వీళ్ళకు తెలీదు! తాడులేకుండా మనకి తనువుండదని కూడా వీళ్ళకు తెలీదు!
ఒరే గుర్తుందిరా.. నువ్వు చిన్నప్పుడు నా మెడలో ఈ తాడేమిటీ అని అడిగేవాడివి! అమ్మ యేమంది? బ్రామ్మర్లకి జంద్యమెలాగో మనకి యీ వురితాడు అలాగ అనేది! మూతికి ముంత – ముడ్డికి తాటాకు కట్టుకోడం కన్నా మెడలో తాడుంటే తప్ప కాదంది! తప్పు చేసినప్పుడు తప్ప దానితో ప్రమాదం లేదంది!
ఏదయినొరే.. నువ్వు తప్పు చేసావురా.. ఆల్లు యిదము అంటే యిదము.. పదము అంటే అదే పదము.. అలా అని వుంటే యిప్పటికి బతికిపోదువు కదరా.. లోకమెలా చచ్చి బతికిపోతోందో చూస్తున్నావు కదరా.. నువ్వెందుకురా బతికి చచ్చిపోదామనుకున్నావ్?
కొత్తేట్రా నీకు.. నువ్వు అద్దంలో చూసుకుంటే మసిబొగ్గు అని నవ్వినోల్లని యేమన్నావ్? నలుపు కూడా వొక రంగే అన్నావ్! నువ్వు చదివితే కలక్టర్ దిగాడండీ అని బడిలో నవ్వినట్టే యూనివర్సిటీలోనూ ఆమాట అనకుండా నవ్వినోల్లని యేమన్నావ్? నానవ్వు నాదన్నావ్! నిజమేరా.. నీ నవ్వు యెవరూ కాపీ కొట్టలేరు! నువ్వు వాళ్ళలాగ నవ్వనందుకు వాళ్ళు యెంతో యేడ్చారు!
నువ్వు ఆకాశంలో నక్షత్రాలను చూస్తుంటే వాళ్ళు నీ పాదాల బురదని చూసారు! నీ నీలిరంగు జుబ్బా వాళ్ళకి నచ్చలేదు! వాళ్ళు కాషాయపు గోచీ కట్టమన్నారు! కట్టనన్నావు! కట్టిందే కట్టడం నాకు నచ్చదన్నావ్! పైగా గోచీ కనపడితే చింపుతానన్నావ్! కాషాయానికి అంటిన రక్తపు మరలు నీకు నచ్చలేదు! దాని మాంసపు వాసన వొంట్లో తిప్పుతోందన్నావ్! తోడేలుగా మారలేనన్నావ్! వాళ్ళంతా విడిచిన బట్టలే తొడుక్కున్నారు.. వాడిన చెప్పులే వేసుకున్నారు.. వాడేసిన కళ్ళజోడే వాడుతున్నారు.. నా కళ్ళజోడు నాదన్నావ్! మీ కళ్ళజోడుతో చూడనన్నావ్.. చూడలేనన్నావ్! వాళ్ళు తాగి వదిలిన తీర్థమే తాగుతున్నారు. యెంగిలి తింటూ ప్రసాదమన్నారు.. పెట్టినబొట్టే పెట్టుకున్నారు. నెత్తికి కాషాయం చుట్టుకున్నారు. నంది అంటే నంది అన్నారు.. పంది అంటే పంది అన్నారు.. ఆ పాఠాలే ప్రొఫెసర్ల నుండి వీసీ దాక పాడుతుంటే అరిగిన రాగం అందుకోనన్నావ్! ఆ రాగంలో ఆర్తనాదాలు వున్నాయన్నావ్! వాళ్ళ పలుకు పలకలేక పోయావ్!
ఊపిరి సలపడం లేదన్నావ్! ఉరితాడు తడుముకున్నావ్! యూనివర్సిటీలో చేరినరోజు మెడలోని వురితాడు తీసి నాకింక దీనితో పనిలేదని తీసి విసిరి పారేసావ్! వీసీతీసి దాచాడు!
నువ్వేమి తినాలో.. నువ్వేమి తాగాలో.. నువ్వేమి ఆలోచించాలో నీబాగుకోరి చెపుతామంటే కాదనేసావ్! వాళ్లకు నచ్చినట్టు తుమ్మడం రాదన్నావ్.. వాళ్లకు నచ్చినట్టు దగ్గడం రాదన్నావ్.. వాళ్ళలా పోతపోసినట్టు వుండరా అంటే వుండలేనూ రాత మార్చుకుంటానూ అన్నావ్.. నారాత నేనే రాసుకుంటానూ అన్నావ్.. అందరూ ఎద్దుకి మొక్కితే నువ్వు పొద్దుకి మొక్కావ్..
నా అభిమతం నాదన్నావ్.. వాడి మతం కాదన్నావ్.. వెక్కిరించాడు.. నువ్వు యెర్రగా చూస్తే తప్పయిపోయిందని అన్నాడు.. ఈ చేత్తో క్షమాపణ పత్రం రాసిచ్చాడు.. ఆ చేత్తో పిటీషనూ యిచ్చాడు.. పోలీసులకి బెదరలేదు.. ఆస్పెటిల్ సాక్షం చెల్లలేదు.. కమిటీ కథ ముగిసింది అంది.. వాడు భయపడ్డాడు.. భంగపడ్డాడు.. వొకపక్క కోర్టుకెక్కాడు.. మరోపక్క కుర్చీకి బావురుమన్నాడు.. మేమంతా మీ వానరసైన్యం అని, యిలా అయితే రామరాజ్యాన్ని నిలబెట్టలేమన్నాడు.. ముగిసిన కథ మళ్ళీ మొదలయి మొదటికొచ్చింది.. కోర్టులు తీర్పివ్వకముందే కొరడాదెబ్బలకి మంత్రిగారి అర్జీల మీద అర్జీలు.. శాంతిభద్రతల సమస్య.. సంఘవిద్రోహుల సమస్య.. తీవ్రవాద సమస్య.. కులోన్మాద సమస్య.. సమస్యల తీవ్రతని గుర్తించిన రాణీగారు ఆదేశాలు.. ఆజ్ఞలు.. వీసీ తలారయ్యాడు.. మూటాముల్లె తీసి పడేసాడు.. నిన్నూ నీ నలుగురు నేస్తాలని బహిష్కరించాడు!
మీరంతా గుంపుగా తిరగకూడదన్నాడు! బహిరంగప్రదేశాల్లో తిరగకూడదన్నాడు! ఒంటరిగా మీకు మీరే వొక జైలు కావాలన్నాడు! వర్సిటీలో నివాసం వుండరాదన్నాడు! చెట్టుకింద పిట్టలయ్యారు! ఎండనక వాననక పగలనక రాత్రనక వెలిలో చలిలో వున్నారు! ఆగక, ఆందోళన చెయ్యకూడదన్నాడు! ఆకలికి అరవకూడదన్నాడు! యిదే కాప్ తీర్పన్నాడు! అదే సాంఘీక బహిష్కారం అన్నాడు! సరే అని సిద్ధమైపోయారు.. మనకి వెలి కొత్త కాదుగా? వూరిలో వెలి! బడిలో వెలి! గుడిలో వెలి! పేరుపెద్ద వూరుదిబ్బ అయిన హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ నట్టనడుమన వెలి! వెలి వాడ! మనమున్న చోటల్లా వెలివాడే! చలికీ పులికీ దొరకనివాడు మనలో యెవడు అన్నావ్! నేస్తం జ్వరంతో వుంటే మనము యిలాగే చచ్చిపోవాలా అని బెంగపడ్డావ్! అమ్మవాళ్ళకి డబ్బులు పంపలేదని బాధపడ్డావ్! ఫెలోషిప్ రాని ఫెలోస్ అయిపోయారు మీరు! ఏడు నెలలు ఎండబెట్టారు! యిప్పుడు మీడియాకి మంచి ఫుటేజి.. గొప్ప రేటింగ్.. యాడ్స్‌తో యిన్కం పెరిగింది.. ఒక్క నా కొడుకూ మంచు ముద్దలైనప్పుడు రాలే.. నువ్వు మాంసపు ముద్దవైతే తప్ప! అంత గుట్టుగా అంచెలంచెలుగా చెండుకు తిన్నారని ఆగేవా?
వాడొక బంటు.. వాడొక బానిస.. వాడొక కీ యిస్తే తిరిగే మరబొమ్మ.. కుర్చీకి కాళ్ళొత్తే వాడెవడయినా వాడొక తలారి.. తలారి పనేంటి? తలలు తియ్యడమే! పది తలలు రాలినట్టే పదకుండో తల! వాడి లెక్కలు వాడివి! తల నువ్వు తీసేది యేమిటి! నా తల నేనే తీసుకుంటానన్నావ్! యింత విషమిమ్మన్నావ్! లేదంటే నా వురితాడు నాకివ్వు అన్నావ్! ఎప్పటిలాగే మళ్ళీ మెడలో ఉరితాడు వేసుకున్నావ్.. ఉసురు తీసుకుంటావని అనుకోలేదని నీ నేస్తగాళ్ళు దొంత ప్రసాదు, చెముడుగుంట శేషయ్య, పెద్దపూడి విజయ్, వేల్పుల సుంకన్న వెక్కి వెక్కి యేడుస్తున్నార్రా.. నువ్వు చుక్కల్లో కలిస్తే చూడరా..
ఉరికి ఉమన్న గది వాడుకున్నానని క్షమాపణలు అడిగావు, చావడానికి చోటుకూడాలేని నీ లోలోపలి ఖాళీతనమేమిటో.. నిన్ను కమ్మేసిన శూన్యమేమిటో బోధపడినట్టు వుమన్న శూన్యంలోకి చూస్తున్నాడు చూడు.. ఏయస్‌ఏ ని నీ కుటుంబమన్నావ్.. క్షమిస్తారని యెంత నమ్మకంరా నీకు? రోజుకూలి చేసి రోజూ నీకు అన్నం పెట్టి చదివించిన అమ్మ నువ్వు ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేసారని అర్థం చేసుకుంది, కడుపు తీపికి పేగులు తెగేలా యేడుస్తోందిరా.. తమ్ముడూ చెల్లీ నమ్మకమిచ్చే నువ్వు లేక బితుకుబితుకుమంటున్నార్రా..
నువ్వన్నట్టు ‘గాయపడకుండా నిజంగా ప్రేమించడం చాలా కష్టం అయింది’ రా..
‘నన్ను నేను చంపుకోవడానికి యెవరూ బాధ్యలు కారు’ అని భలే మర్యాదలు పాటించావులే! విష సర్పాలకు పాలు పోసినట్టు లేదూ నీ మంచితనం? నీ హత్యకు నువ్వే కారణం అని యెంత అబద్ధం ఆడావురా?! నిజం తెలిసిన నేనే కాదు, లోకం మొత్తం నిన్ను క్షమిస్తుంది లే! నిన్ను వురితీసిన చోట నీ స్థూపం రాబోయే తరాలకు చెప్పాల్సిన పాఠమేదో చెపుతుందిలే! సైన్సు రచయితగా నీ రచనలు చదివే అదృష్టం మాకు లేకపోయినా- నీవు నడిచిన తోవ యెరుకనిచ్చి రేపటి చరిత్ర చెద పట్టకుండా కొత్తతరానికి యివ్వాల్సిన ఆయుధమేదో యిస్తుందిలే!
చివరిగా నీవన్న నీ మాటతో గొంతులో గొంతు కలిపి.. (సారంగ వెబ్ మేగజైన్ సౌజన్యంతో)
జై భీమ్!
నీ సావాసగాడు – బమ్మిడి జగదీశ్వరరావు