ఇంటిపేరు’ – వనజ తాతినేని కథ గురించి ”ఉబుసుపోక ఎవరో ఒకరి గురించి అసహ్యంగా మాట్లాడుకునే కొందరికి ఏమీ తెలియక ఏవేవో కథలల్లుకుంటే కూడా నాకేమీ బాధలేదు”.
”దేవత, ఔన్నత్యం లాంటి గుణాలు నాకాపాదించుకోవాలని అస్సల్లేదు. చర్యకి ప్రతిచర్య సమాధానం కాదని నాకు తెలుసు. కానీ అసంకల్పిత ప్రతీకార చర్య ఉంటుంది అప్పుడప్పుడు అలాంటిదే ఈ నా నిర్ణయం కూడా!”
వనజవనమాలి గారు… ఈ ”ఇంటిపేరు” సమస్య సమాజంలో చాలా మందిదని నా అభిప్రాయం… ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి, ముఖ్యంగా ఇలాంటి సమస్యలో ఉన్న వాళ్ళ గురించి ఎదుటి వారు ఆ సమస్యని తమ కోణంలోనే ఆలోచిస్తూ, విశ్లేషిస్తూ, తీర్పులిస్తూ ఉంటారు. ఎవరేమనుకున్నా ”మోసే వాడికే తెలుస్తుంది కావిడి బరువు” అని మా అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పింది… అందుకు తగినట్లుగా ఈ కథ, కథలో చెప్పిన ముగింపు సమంజసంగా ఉందండి. – ఎన్. రాజు నాయుడు (ఇమెయిల్)
……..ఙ……..
”ఓల్గా తీరం వెంట చదివాను, శిలాలోలిత గారు ధన్యవాదాలు. ఈ సాహిత్యం అంతా కొనుక్కోవాలి, కొన్ని చోట్ల కొన్నే
ఉంటున్నాయి, అన్నీ కావాలి. ఎక్కడ దొరుకుతాయో చెప్పండి. (ఓల్గా పుస్తకాలు అన్ని పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతాయి – ఎడిటర్)
– రాకుమారి (ఇమెయిల్)
……..ఙ……..
‘ఇంటిపేరు’ కొత్త విషయం చాలా మంది చెప్పలేని మనసులో భావాలని బాధాకర విషయాలని కథ రూపంలో చక్కగా అందించారు. ఇంటిపేరు వెనుకనున్న మోతని, వేదనని బాగా చెప్పారు. ఈ డాటరాఫ్ / వైఫాప్ / కేరాఫ్ ఎప్పుడు పోతాయో కానీ స్త్రీలందరి తరఫునా వకాల్తా పుచ్చుకున్న గొప్ప కథ ఇది. కథలో ఒకటే లోపం పెద్ద పేరాలుగా ఉంది. పాఠకులకి ఇబ్బంది అదే. శ్రద్ధ తీసుకోవాల్సింది.
– వైష్ణవి (ఇమెయిల్)
……..ఙ……..
శ్రీమతి సత్యవతిగారికి, అమ్మా,
భండారు అచ్చమాంబ కథ బాగలేదననివ్వండి, వారి అభిప్రాయమని సరిపెట్టుకోగలను. కాని తెలుగులో కథ వ్రాసింది మొట్టమొదట ఆమె అని ఒప్పుకొనని వారితో విభేదిస్తాను. ‘ఐక్యత’ ఈ అరికతలో ఒక పిట్టకథ. నేనొక కథ వ్రాసాను అది ఎవ్వరూ ప్రచురించలేదు. అయితే అందులో ఉన్న లక్షణాలే కథకు నిర్వచనం అని చెప్పుకొని నేనే మొదటి కథకుడిని అంటే అది పురుషాధిక్యత చూపించుకొనటం కాదు. నా అవివేకాన్ని రుజువు పరచుకొనడం.
నా సలహాను మన్నించి జనవరి నుంచి అబలాసచ్చరిత్ర మాలలో మరో పుష్పాన్ని పరిచయం చేస్తామన్నారు. సంతోషం అచ్చమాంబ పుస్తకంలో అచ్చుతప్పులున్నాయి. పునర్ముద్రణ సమయంలో నేను ప్రూఫులు దిద్దగలను. అది అచ్చమాంబకు నేను చేసే పూజ.
‘ఆ గువ్వకు ఇప్పుడు ఎగరడమొచ్చింది’ చదివిన తరవాత మనసు కకావికలమైపోయింది. ఆ ఘటన జరిగిందో లేదో కాని అలాగే జరగటానికి ఎంతైనా అవకాశమున్న రోజులివి. ‘బౌద్ధ’ సాహిత్యవేత్తల సంపాదకత్వంలో వెలువడుతున్న పత్రికలలో విఠలాచార్య మార్క్ కథలు పఠితలోకానికి నల్లమందు అలవాటు చేస్తున్నారు. మీరూ, భూమికా దాని విరుద్ధుంగా ఆలోచింప చేసేవి వేస్తున్నారు. మీ ఆలోచనలకు, ఆచరణలకు, ధైర్యానికి అభివాదములు. – వి.ఎ.కె.రంగారావు, చెన్నై.
……..ఙ……..
స్త్రీవాద పత్రిక భూమిక ఎడిటర్ కె. సత్యవతి వారికి అభివందనాలు తెలియజేస్తూ వ్రాయుట ఏమనగా
భూమిక తెలుగు మాస పత్రికల్లో ప్రచురణ అవుతున్న వ్యాసాలు, కవితలు తదితర అంశాలు సమాజంల్లోని మహిళలను ఆకర్షించే విధంగా రచనలున్నాయి. నవంబరు నెల విడుదలైన సంచిక పత్రికల్లోని వ్యాసాలు కవితలు అన్నీ పూర్తిగా చదివాను. నా మనస్సును ఎంతగానో ఆకట్టుకున్నాయి. భూమిక పత్రికలో ప్రచురణ అయిన ప్రతి ఒక రచన సమాజానికి స్త్రీలకు చాలా ఉపయోగకరంగా వున్నాయి. ఇక మరిన్ని వ్యాసాలు కవితలు ప్రచురణలు అయ్యేవిధంగా చూడాలని కోరుతున్నాను. భూమిక పత్రికలో రచనలు స్త్రీలను చైతన్యపర్చే విధంగా, మద్యపాన నిషేధానికి మహిళా సంఘాలు స్పందించే విధంగా పత్రికా తోడ్పాటును అందిస్తుందని ఆశిస్తున్నాను. కందుకూరు నియోజక వర్గంలో భూమిక పత్రిక చందాదారులుగా చేర్పించేందుకు నా వంతు కృషి చేస్తాను.
– యస్.కె.యం. భాషా, ఒంగోలు.
……..ఙ……..
భూమిక సంపాదకురాలు ప్రశాంతికి,
భూమికలో నువ్వు రాసిన ‘పచ్చి పసుపు కొమ్ము’ వ్యాసం చదివిన దగ్గర నుండి నాలో ఎన్ని స్పందనలో. హాయిగా నవ్వుకుంటూ, ఎంత చక్కగా రాసిందో అని ఆశ్చర్యపోయాను. చాలా బాగా రాసావ్. ఈ విషయం ఫోన్‌లో చెప్పాలనుకున్నాను కానీ చెప్పేస్తే రాయలేను కదా!
అలాగే ఈ నెల భూమికలో ‘ఆ గువ్వకు ఇప్పుడు ఎగరడమొచ్చింది’ కథ చాలా బావుంది. ముగింపు చాలా నచ్చింది నాకు. జీవితానికి సంబంధించిన ఏ సమస్యనైనా అలా ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటే ఎంత బావుంటుందో! శివపురపు శారద గారి ‘నీ భూమిక’ కవితలో చివరి వాక్యం చాలా బావుంది. చాలా అర్థం వుంది దానిలో. – పి. అనూరాధ, వైజాగ్.
……..ఙ……..