షెడ్యూల్డు జాతులు, తెగలు ఆర్థిక విద్యారంగాలలో సమాన అవకాశాలను పొందుటకు, వారికి సామాజిక న్యాయం చేకూర్చుటకు, ధనిక వర్గాలవారి అత్యాచారాల నుండి రక్షించుటకు ఏర్పాటు చేయబడిన చట్టమే, షెడ్యూల్డ్ జాతుల, తెగల అత్యాచార నిరోధక చట్టం. ఇతర వ్యక్తులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వారి న్యాయపరమైన హక్కులకు భంగం కలిగించుట, వారిని అసత్యపు నేరారోపణల ద్వారా దావాలలో ఇరికించుట, వారి సార్వజనీన హక్కులకు భంగం కలిగించుట ఈ చట్టం క్రింద నేరాలుగా పరిగణించబడతాయి. షెడ్యూల్డ్ తెగలు, కులాలకు చెందినవారిని అంటరానివారుగా పరిగణించుట, అవమానించే ఉద్దేశ్యంతో కులం పేరున దూషించుట ఈ చట్టం ప్రకారం శిక్షార్హములు.
షెడ్యూల్డ్ కులాలు లేదా తెగలకు చెందని వ్యక్తి ఈ క్రింది చర్యలు జరిపినచో అవి నేరాలుగా లేదా అత్యాచారాలుగా పరిగణించబడును (సెక్షన్ 3).
– తినరాని పదార్థములు తినమని వారిని బలవంత పెట్టుట అవమాన పరచు ఉద్దేశ్యంతో చెత్త పదార్ధాలు, శవాలు, చెడు పదార్ధాలు మొదలగునవి వారి స్థలంలో బలవంతంగా వేయుట.
– వారి బట్టలు ఊడదీయుట, నగ్నంగా ప్రదర్శించుట వంటి చర్యలు
– వారికి చెందిన భూములను అన్యాయంగా ఆక్రమించుట లేదా సాగు చేయుట లేదా బలవంతంగా బదిలీ చేయుట, అన్యాయంగా వారి స్థలములు / భూముల నుండి ఖాళీ చేయించుట.
– యాచకము లేదా వెట్టి చాకిరి చేయమని బలవంత పెట్టుట.
– ఓటు వేయకుండా అడ్డుపడుట వంటి చర్యలు
– వారిపై తప్పుడు కేసులు బనాయించుట
– ప్రభుత్వ ఉద్యోగులకు తప్పుడు సమాచారమిచ్చి వారి ద్వారా షెడ్యూల్డ్ కులం లేదా తెగకు చెందిన వారికి నష్టం వంటివి కలిగించుట.
– షెడ్యూల్డ్ కులం లేదా తెగకు చెందిన స్త్రీని అగౌరవ పరచుట, బలాత్కారము చేయుట.
పై నేరాలు చేసిన వారికి ఆరు నెలల నుండి ఐదు సంవత్సరముల వరకు శిక్ష మరియు జరిమానా విధించవచ్చును.
వారి ఆస్థులకు నష్టం కలిగించిన నేరస్థులకు ఆరు నెలల నుండి ఏడు సంవత్సరముల వరకు శిక్ష విధించవచ్చును.