పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం – 2013

పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు నిరోధించటం, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలతో వ్యవహరించేందుకై ఈ చట్టాన్ని తెచ్చారు. దీనిని అమలుపరిచే బాధ్యతను సంస్థ/కార్యాలయపు యజమాని లేదా అధికారితో బాటు జిల్లా మేజిస్ట్రేటు, అదనపు మేజిస్ట్రేటు లేదా కలెక్టరు కానీ లేదా డిప్యూటీ కలెక్టరులపై ఉంచటమైంది.

ఈ చట్ట ప్రకారం ‘ఉద్యోగి’ అనే పదం ఒక పని ప్రదేశంలో శాశ్వతంగా గానీ, తాత్కాలికంగా కానీ, దినసరి కూలీగా కానీ, ఎలా పని చేస్తున్నా అందరికీ వర్తిస్తుంది. అలా పనిచేసే స్త్రీ ఆ సంస్థచే నియమించబడకుండా ఎవరైనా ఏజెంటు, కంట్రాక్టరు వంటివారిచేత నియమించబడ్డా కూడా ‘ఉద్యోగి’ క్రిందకే వస్తారు. సహ ఉద్యోగి, కాంట్రాక్టు ఉద్యోగి, ప్రొబేషనరు, ట్రయినీ, అప్రెంటీసు వంటి పేర్లతో ఎలా పిలిచినా వారంతా ఉద్యోగుల కిందకే వస్తారు.

‘యజమాని’ (ఎంప్లాయర్‌) అంటే ఏ ప్రభుత్వ శాఖ కానీ, ప్రభుత్వరంగ సంస్థ కానీ, స్థానిక ప్రభుత్వానికి సంబంధించి కానీ, సహకార సంస్థ కానీ, విద్యాసంస్థ కానీ, పరిశ్రమకు సంబంధించి కానీ, వాటి ముఖ్య కార్యాలయం కానీ, ఏ బ్రాంచి అయినా లేదా ఏ పని ప్రదేశమయినా అక్కడి ముఖ్య అధికారి, మేనేజిమెంటు, బోర్డు వంటివి అన్నీ దీనికిందికి వస్తాయి. ఏ పని ప్రదేశంలో పనిచేసేవారయినా ఈ చట్ట పరిధిలోకి వస్తారు.

అసంఘటిత రంగ పనిప్రదేశం అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి నడిపే సంస్థ, వస్తువుల తయారీ, అమ్మకం వంటి ఏరకమయిన సేవలందించే వాటితో సంబంధమున్నదైనా, పదిమంది కంటే తక్కువ పనివారున్న సంస్థ కూడా ఈ చట్టం కిందికి వస్తుంది.

ఇతర పరిస్థితులతో బాటుగా క్రింది విధంగా లైంగికపరమైన ఉద్దేశ్యంతో ఏం జరిగినా అది కూడా లైంగికవేధింపు క్రిందికి వస్తుంది. (అ) తన పనిలో ప్రాధాన్యత కల్పించేటట్లు చేస్తానని భ్రమ పెట్టడం (ఆ) తన పనిలో తక్కువ స్థాయి పని కల్పించేటట్లు బెదిరింపుగా వ్యక్తీకరించటం (ఇ) ఉద్యోగిని ఉద్యోగం యొక్క ప్రస్తుత లేదా వర్తమానస్థాయిపై ప్రభావం చూపటం (ఈ) ఉద్యోగిని చేసే పనిలో జోక్యం చేసుకొని సాన్నిహిత్యం నెరపటం లేదా పనిపై వేధించటం, తదితరాలు (ఉ) ఆమె ఆరోగ్యం, రక్షణలపై ప్రభావం చూపేట్లుగా బాధలకు గురిచేయటం వంటివన్నీ పని ప్రదేశంలో వేధింపుల క్రిందకే వస్తాయి.

ఈ చట్టం ప్రకారం ప్రతి యజమాని రాతపూర్వక ఉత్తర్వులతో ‘అంతర్గత ఫిర్యాదుల కమిటి’ పేరుతో లైంగిక వేధింపుల నిరోధానికి పని ప్రదేశంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఒక సంస్థ కార్యాలయం, పరిశ్రమ వంటివి అనేక ప్రదేశాలలో హెడ్‌ ఆఫీసు, బ్రాంచి యూనిట్‌ వంటివి వేరువేరు చోట్ల ఏర్పాటు చేసిన పక్షంలో ప్రతిచోటా ఈ కమిటీని ఏర్పాటు చేయాలి.

ప్రతి కమిటీలోనూ ప్రిసైడింగ్‌ అధికారిగా అక్కడ పనిచేసే స్త్రీని నియమించాలి. ఒకవేళ ఆ యూనిట్‌లో ప్రిసైడింగ్‌ అధికారిగా నియమించదగ్గ మహిళ లేని పక్షంలో అదే సంస్థకు చెందిన ఇతర యూనిట్‌లో ఉన్న మహిళను నియమించవచ్చు. ఒకవేళ ఇతర యూనిట్లలో కూడా అందుకు అర్హమైన మహిళ దొరకని పక్షంలో దగ్గరలోని ఇతర ఉద్యోగినిని/కార్మికురాలిని నియమించాలి. ఈ ప్రిసైడింగ్‌ అధికారితోబాటు అక్కడి ఉద్యోగులలో స్త్రీల సమస్యలపట్ల అంకితభావం ఉన్న లేదా సమాజ సేవారంగ అనుభవం ఉన్న లేదా న్యాయశాస్త్రం తెలిసిన స్త్రీలను ఇద్దరిని కమిటి సభ్యులుగా నియమించాలి. ప్రభుత్వేతర రంగ సంస్థలనుంచి లేదా మహిళా సంఘాలకు సంబంధించి కూడా ఒకరిని నియమించాలి. వీరికి నిర్దేశించిన ఫీజు, అలవెన్సులు చెల్లించాలి. ఈ కమిటీలలో కనీసం సగం మంది స్త్రీలే సభ్యులుగా ఉండాలి. ఈ కమిటీ మూడు సంవత్సరాలకు మించని కాలానికి పనిచేస్తుంది. తర్వాత కొత్త కమిటీని ఎన్నుకుంటారు. ఈ సభ్యులు ఎవరూ ఏవిధమైన నేరారోపణలు ఎదుర్కొన్నవారై ఉండకూడదు. ఒకవేళ అనంతరకాలంలో వారు ఈ రకమైన నేరారోపణలు ఎదుర్కొన్న పక్షంలో వారిని తీసివేసి కొత్తవారిని ఎంపిక చేసుకోవాలి.

ఒకవేళ పదిమంది కంటే తక్కువ పనిచేసేవారున్న చోటయితే, అటువంటివాటికి జిల్లాస్థాయిలోని అధికారి ఆధ్వర్యంలో ‘స్థానిక ఫిర్యాదుల కమిటీ’ ఏర్పాటవుతుంది. జిల్లాస్థాయి అధికారి ప్రతి మండలం, గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో ఈ కమిటి బ్రాంచీలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు పనిప్రదేశాలలో స్త్రీలపై జరిగే వేధింపులను గురించిన ఫిర్యాదులు స్వీకరించి వాటిని ఏడురోజులలోగా విచారణకై ‘స్థానిక ఫిర్యాదుల కమిటీ’కి అందేట్లు చూడాలి. ఈ స్థానిక కంప్లయింట్‌ కమిటీకి స్త్రీల సమస్యల పట్ల అంకితభావమున్న, సామాజిక సేవారంగంలో నిష్ణాతురాలైన స్త్రీని, చైర్‌పర్సన్‌గా నియమించాలి. ఆమెతోబాటుగా ఆ జిల్లాలోని సదరు మండలం, మున్సిపాలిటి వంటి వాటిచోట్ల పనిచేస్తుండే స్త్రీని ఒకరిని,  మహిళలకోసం పనిచేసే ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధి ఒకరిని, లైంగిక వేధింపుల సమస్యలపై పనిచేసేవారుగా పేరొందిన మరొకరిని సభ్యులుగా నియమించాలి. వీరిలో ఒకరైనా ఎస్‌.సి/ఎస్‌.టి లేదా బిసి/మైనారిటీకి సంబంధించిన వారు, ఒకరయినా న్యాయవాది లేదా న్యాయవిజ్ఞానం కలిగిన వారు ఉండాలి. ఇందుకు సంబంధించిన విషయాలు చూసే సాంఘిక సంక్షేమ శాఖకు గానీ, స్త్రీ శిశు సంక్షేమశాఖకుగానీ చెందిన ప్రభుత్వ అధికారి ఈ కమిటీకి ‘ఎక్స్‌ అఫీషియో’ సభ్యులుగా ఉంటారు.

ఫిర్యాదు : పనిప్రదేశంలో లైంగిక హింస/ వేధింపుకు గురి అయిన మహిళ, ఆ విషయాన్ని తను పనిచేస్తుండే విభాగంలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీకి, ఒకవేళ అక్కడ ఫిర్యాదుల కమిటీ లేనట్లయితే స్థానిక ఫిర్యాదుల కమిటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదును వేధింపు సంఘటన జరిగిన మూడు నెలలలోగా ఇవ్వాలి. ఈ లైంగిక వేధింపు వరుసగా కొంతకాలం నుంచీ జరుగుతున్న నేపథ్యంలో చివరి సంఘటన జరిగిన నాటినుంచి మూడు నెలలలోగా ఫిర్యాదు చేయాలి. ఒకవేళ బాధితురాలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేని పరిస్థితులలో ఉంటే అందుకు సంబంధించిన ఫిర్యాదుల కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేసి, మౌఖిక ఫిర్యాదు నమోదు చేసుకునేట్లు చూడాలి. ఫిర్యాదు చేయాల్సిన మహిళ చనిపోవటం, మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినటం వంటి సందర్భాలలో, ఆమెకు గల వారసులుగానీ, నిర్దేశించిన మరోవ్యక్తిగానీ ఫిర్యాదు చేయవచ్చు.

ఫిర్యాదును అందుకున్న తరువాత సంబంధిత ఫిర్యాదుల కమిటీ బాధితురాలిని, బాధ్యుడినీ పిలిచి సంప్రదింపులు జరుపవచ్చు. ఈ సంప్రదింపుల ఫలితంగా బాధితురాలికి పరిహారంగా డబ్బు ఇచ్చి సెటిల్‌మెంట్‌ చేసుకోవటం వంటివి చేయకూడదు. ఒకవేళ ఇలా (డబ్బుతో కాకుండా) సెటిల్‌మెంట్‌ చేసుకున్న సందర్భాలలో ఆ విషయాలన్నిటిని నమోదు చేసుకుని బాధ్యుడికి, బాధితురాలికి ఆ పత్రాలు అందజేయాలి. ఈ సెటిల్‌మెంట్‌పై నిర్ణయం తీసుకునేందుకు సంస్థ యజమానికి, అధికారికి, జిల్లా అధికారికి కూడా సదరు పత్రాలను పంపాలి.

ఈ ఫిర్యాదును స్వీకరించిన తరువాత, వారికి వర్తించే సర్వీస్‌రూల్స్‌కు అనుగుణంగా విచారణ చేయడానికి సంబంధిత అధికారికి అందజేయాలి. ఒకవేళ అటువంటి సర్వీస్‌రూల్స్‌ లేని పక్షంలో ఈ విషయమై కేసు నమోదు చేసుకునేందుకు ఏడు రోజులలోగా సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు పంపే బాధ్యతను ఫిర్యాదుల కమిటీ నిర్వర్తించాలి.

ఈ ఫిర్యాదు అంది, పరిశీలనలో ఉన్న సమయంలో ఫిర్యాదుల కమిటీ ఫిర్యాదు చేసిన మహిళను కానీ, బాధ్యుడిని కానీ వేరే పనిప్రదేశానికి బదిలీ చేయమని యజమానిని కోరవచ్చు. లేదా సదరు మహిళకు మూడు నెలల ప్రత్యేక సెలవు మంజూరీకి, లేదా బాధిత మహిళకు ఊరట కల్గించే ఇతర చర్యలకు కానీ శిఫార్సు చేయవచ్చు.

ఫిర్యాదుల కమిటీ తన విచారణను పూర్తి చేసుకున్న తరువాత ఒకవేళ నేరారోపణకు గురయిన వ్యక్తి వల్ల దోషం లేనట్లు తేలితే, అతనిపై ఏ చర్య తీసుకోరాదని యజమానికి గానీ, జిల్లా అధికారికి గానీ తెలియజేయవచ్చు.

విచారణలో నిందితుడు దోషిగా తేలిన పక్షంలో విచారణ కమిటీ సదరు యజమానికిగానీ, జిల్లా అధికారికిగానీ తగు చర్యలకై సిఫార్సు చేయవచ్చు. ఆ చర్యలు క్రింది విధంగా ఉంటాయి.

అ) ప్రవర్తనా నియమావళి (సర్వీస్‌రూల్స్‌) వర్తించే సందర్భంలో, దుష్ప్రవర్తనకు గానూ సూచించిన శిక్షను, సర్వీస్‌రూల్స్‌ లేని సందర్భంలో అందుకు వర్తించే శిక్షనూ

ఆ) బాధిత మహిళకు ఊరట నిచ్చేందుకు సర్వీస్‌రూల్స్‌లో ఏంచెప్పారనే దానికి సంబంధం లేకుండా, బాధ్యుడి జీతభత్యాలనుంచీ చెప్పినంత మొత్తాన్ని తగ్గించి, ఆ సొమ్మును బాధిత మహిళకుగాని, ఆమె వారసులకుగానీ చెల్లించటం. ఒకవేళ సదరు దోషి ఉద్యోగం ఎగ్గొట్టి తిరగటం వంటి సందర్భాలలో యజమాని/అధికారి అతని జీతంనుంచీ చెల్లించటం కుదరని పరిస్థితుల్లో దోషినే చెల్లించాలని ఆదేశించాలి. అతని నుంచి సొమ్ము రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఆస్తుల జప్తువంటి చర్యలకై సంబంధిత జిల్లా అధికారికి పంపాలి. ఆ అధికారి ఉత్తర్వులు అందిన 60 రోజులలోగా తగిన చర్యలు తీసుకోవాలి.

దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదుదారు అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం వంటి వాటికి శిక్ష విధించటం జరుగుతుంది. అయితే సరైన విధంగా దీన్ని నిర్ధారించుకోవాలి. అంతేకాని ఫిర్యాదుదారు రుజువులు చూపించుకోవటానికి కుదరలేదని భావించినపుడు ఫిర్యాదు చేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు.

నేరం రుజువైన పక్షంలో బాధితురాలికి జరిగిన మానసిక, శారీరక నష్టాలు, విధుల గైర్హాజరీ, ఉద్యోగానికి జరిగే నష్టం, వైద్య ఖర్చుల వంటి వాటితో బాటు నిందితుడి ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకొని పరిహారం నిర్ణయించాలి. ఈ పరిహారం ఒకేసారికానీ, వాయిదా పద్ధతులలో కానీ చెల్లించే వెసులుబాటు ఉంది.

సమాచార హక్కు చట్టంలో ఏముందనే దానితో సంబంధం లేకుండా బాధిత మహిళకు సంబంధించి ఆమెను గుర్తించే విధంగా వివరాలు ఏవీ పత్రికలు, టీవీలతో సహా ఎవరూ బయటపెట్టకూడదు. ఒకవేళ ఎవరయినా బయటపెడితే వారు జైలు శిక్షకు గురౌతారు.

ఈ చట్టంలో కార్యాలయం లేదా పని ప్రదేశంలో తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించారు.

–  పని ప్రదేశంలో భద్రతకు, రక్షణకు బయటినుంచి వివిధ పనుల కోసం వారివద్దకు వచ్చే వారినుంచీ భద్రత కల్గించే ఏర్పాట్లు ఉండాలి.

–  పని ప్రదేశంలో లైంగిక వేధింపులు శిక్షార్హమనే ప్రకటనతో బాటు ఫిర్యాదుల కమిటీ ఉత్తర్వులను తెలియజేస్తూ నోటీసు బోర్డులో ఉంచాలి.

– నిర్ణీత సమయాల్లో అవగాహన సదస్సులు, ఫిర్యాదుల కమిటీకి అధ్యయన, శిక్షణా తరగతులు నిర్వహించాలి.

– ఫిర్యాదుల కమిటీకి అన్ని సందర్భాలలోనూ అవసరమైన అన్ని వసతులతో కూడిన ఏర్పాట్లు చేయాలి.

– ఈ కమిటీ ముందుకు నిందితుడిని ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలి.

– అవసరమైన సమాచారాన్నంతా ఈ ఫిర్యాదుల విచారణ కమిటీకి కోరినప్పుడల్లా ఇవ్వాలి.

– సర్వీస్‌ రూల్స్‌లో లైంగిక వేధింపులను దుష్ప్రవర్తనగా చేర్చాలి.

బహిరంగ ప్రదేశాల్లో స్త్రీల భద్రత కోసం ఏర్పాటయిన ‘షీ టీమ్స్‌’ని చేరటానికి 100 కాల్‌ చేయండి

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - స్త్ర్లీలు - చట్టాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.