ఆ గువ్వకు ఇప్పుడు ఎగరడమొచ్చింది! – రాజేష్ గారి కథ బావుంది. ఇలాంటి నాగరికత మన మధ్య ప్రవేశించి చాలా కాలమైంది. దానికి మీరు అక్షరరూపమిచ్చిన తీరు చాలా నచ్చింది. వివాహపు ముసుగులో స్త్రీలపై జరిగే ఇలాంటి లైంగిక ఒత్తిడుల నుండి బయటపడి ఎగరడం నేర్చుకునే గువ్వలు కావాలి. అక్షరాలలో గువ్వనెగరేసిన మీకు అభినందనలు. – వనజ తాతినేని (ఇమెయిల్)
*****
”కేన్యా టు కేన్యా – ఆర్. శాంతసుందరి: ఆరి సీతారామయ్య గారి ‘కెన్యా టు కెన్యా’ కథల సంపుటిపై ఆర్. శాంతసుందరి గారి సమీక్ష చాలా బాగుంది. కేవలం పుస్తకాన్ని మాత్రమే కాకుండా రచయిత కథారచయితగా ఎప్పటి నుండి గుర్తించవచ్చో కాలంతో సహా చెప్పారు. ‘పై చదువు’ కథలో భారతీయ విద్యావ్యవస్థలో రావాల్సిన మార్పుల్ని గుర్తించగలిగేలా చెప్తూనే, సందేశం ఇస్తున్నట్లుగా కాకుండా సమస్యను సున్నితంగా మనముందుంచారు ఆరి సీతారామయ్య గారు. వాతావరణ కల్పన కూడా చాలా బాగా వర్ణించారు. దీన్ని సమీక్షకురాలు చాలా వరకు స్పృశించారు. ”సీతారామయ్య రచనా వైశిష్టి ఏమిటో చెప్పాలంటే ఎంత లోతైన విషయాలని కథగా మలిచినా, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉన్నా, రచయిత కథలోగాని, పాత్రల్లోగాని ప్రవేశించడు, అసలు ఆయన కనబడడు. పాత్రలూ, సంఘటనలూ ఒక సినిమా చూస్తున్నట్టు కళ్ళ ముందు నిలుస్తాయి. బాధపడతాయి, సమస్యలతో పోరాడతాయి. ఆత్మగౌరవం ఉన్న స్త్రీ వీరి కథలన్నింటిలోనూ కనిపించే ప్రత్యేకత.” అని వ్యాఖ్యానించిన భావాలు ఆయన కథలు చదివిన నాలాంటి వాళ్ళకు కూడా అలాగే అనిపించాయి. దీనితోపాటు సీతారామయ్యగారు తెలుగు కావ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటారనేది కూడా గమనించాలనిపిస్తుంది. మంచి సమీక్ష ప్రచురించారు.
– డా. దార్ల వెంకటేశ్వరరావు (ఇమెయిల్)
*****
‘నాకప్పుడే పెళ్ళేంటి’ చాలా ప్రేరణ ఇచ్చేలా ఉంది. మారుమూల ప్రాంతాలలోని ప్రజలను ఇంకా చైతన్యపరచాల్సి ఉంది. – లహరి వాల్మీకం (ఇమెయిల్)
*****
నా జీవితం – ఉద్యమాలు – పోరాటాలు: మంచి కథనం. భూమిక గురించి : మీ సేవకు కృతజ్ఞతలు
– శ్రీనివాస్ (ఇమెయిల్)
*****