అక్షరాలకు ఆయువు పోసిన మా అమ్మ
– కత్తి పద్మారావు
చీకటి విరబూస్తుంది
కనురెప్పలు మూస్తే
స్మతి ప్రపంచం కదులాడుతోంది
అమ్మ నడిపిస్తున్నట్టే ఉంది
అమ్మది ఆత్మీయ స్పర్శ
ఆత్మస్థైర్యం అమ్మ పాఠశాల
నవ్వు, ఏడుపు ఏదైనా నదీ ప్రవాహమే
హిమాలయాలంత ఎత్తు
అమ్మ ఆశయం
అమ్మ మాటలు శాశ్వత సత్యాలు
జున్ను ముక్కల్లో ఉన్న
యాలుకల సౌగంధ్యం ఆమె సూక్తులు
నిరాశలేని నిగర్విత ఆమె
నిద్రాణత లేని సంగీతం ఆమెది
వెదురు బొంగుల్లో నుండి వస్తున్న
స్వరధ్వుని ఆమె లయ
ఆమెది బృందగానం
పెళ్ళిపాటల్లో అమ్మస్వరం ఆకాశపు అంచులదాక
జైలుగోడల అవతల నేను
జైలుగోడల ఇవతల అమ్మ సమూహంతో
సైనికగర్జన ఆమెది
ముఖ్యమంత్రి ఇల్లు చుట్టిముట్టిన వీరవనిత
కోడలితో నడుముగట్టి
జైలునుండి నన్ను విముక్తి చేసిన యోద్ధ
ఆమె ఒక ఉజ్వలత
కొడుక్కి ధైర్యం నేర్పి
సమరానికి సన్నద్ధం చేసిన ఘనచరిత్ర ఆమెది
మోడువారిన వారిని అక్కున చేర్చుకొని
ఓదార్చిన జీవన ప్రభాత ఆమె
ఆమె నడుస్తున్న కడలి
సాహసం ఆమె ఊపిరి
శ్రమ ఆమె జీవధాతువు
అనునయం, అనుసంధానత ఆమె తత్వం
ద్వేషరహితమైన ప్రేమ ఆమెది
మృత్యువుకి ఎదురు వెళ్ళే సాహసం ఆమెది
ఆమె మాటలు పునరుజ్జీవన సూత్రాలు
బెల్లం తడిసిన జొన్న కుడుములు,
ఆమెది అవ్యాజమైన ప్రేమ
పిండారబోసిన వెన్నెల్లా ఆమె స్మృతులు
రెండు పదులనాటి ఆమె నిర్మాణం
ఇంకా చెరగని చిత్రం
ఆమె నాటిన వేపవిత్తులు
మొక్కలై చెట్లై రోజూ
ఉదయానే నిర్మలమైన ప్రేమను
నాతల మీద పూలగా కురుస్తున్నాయి
ఆమె కన్న సంతానం
సూర్యకిరణాల సమూహంలా
నన్ను చుట్టుముడుతూనే ఉన్నాయి
అమ్మ వీధుల్లో వెలిగించిన
కొవ్వొత్తులు వెలుగుతూనే ఉన్నాయి
ఆమెది అమృతహస్తం
నీతి నిజాయితీ ఆమెకు ఊపిరి
ఇతరుల సొమ్ము ఆశించరాదనేది ఆమె బోధన
ఆమె వేదనతో భూమి కంపించింది
అమ్మ ఎన్నో ర్యాలీల్లో పద ఘట్టన చేసింది
ఆమె నా కుమార్తె సృజనలో నిండి ఉంది
అమ్మను అమ్మాయిలో చూసుకుంటున్నాను
కారు చీకటిలో కాంతి రేఖలు పూయించింది
జీవితమంటే సమరం అని ఆమెకు తెలుసు
కన్నీరు తుడవడంలో ఉన్న
అనుభూతిని రుచి చూసింది ఆమె
కులం లేని కుటుంబాన్ని నిర్మించింది
మానవత్వ పరిమళాలు విరజిమ్మింది అమ్మ
పేడ చేతుల్తో అక్షరాలకు ఆయువులు పోసింది
ప్రత్యామ్నాయ సంస్కృతికి పట్టం గట్టింది
లుంబినీకి పునాదులు వేసింది
సాంస్కృతిక విప్లవ భేరి మ్రోగించింది
ఆమెది సామాజిక పునర్జీవన ఉద్యమం
ఆమె నిర్మించిన మార్గంలో
పునరుత్తేజంతో మనమూ పయనిద్దాం.
(అమ్మ చనిపోయి 20 ఏళ్ళు అవుతున్న సందర్భంగా…)