స్వాప్నికుడి మరణం – ఉమా నూతక్కి

2016, జనవరి, 17… జీవనదిలా ప్రవహించిన 26 సం||ల రోహిత్‌ వేముల ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి చరిత్రలో చెరగని అధ్యాయం లిఖించిన రోజు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధక విద్యార్ధిగా కంటే కులవివక్ష బాధితుడిగా, బహిష్క ృతుడిగా, హతుడిగా దేశానికి, ప్రపంచానికి తెలిసిన ఒక సున్నిత హృదయుడు. తన మరణంతో ఈ దేశపు ముఖాన వంద ప్రశ్నార్థకాలను లోతుగా చెక్కిపోయిన ఒక స్వాప్నికుడు.

అతని అకాల నిష్క్రమణపై ఇంత దుఃఖం, నిరసన, చర్చోపచర్చలకు కారణం అతడు ఈ దేశ యువత ఆకాంక్షలకు ప్రతినిధి కావడమే. ఈ అసమానతల వ్యవస్థ పరిరక్షకులతో అలుపెరగకుండా పోరాడడమే. మరణించి కూడా మనల్ని ఏమరుపాటు పడవద్దని హెచ్చరిస్తూ

ఉండడమే. అందుకే యావత్‌దేశం అతనిని ఇంతగా తలచుకుంటోంది. భారత మాత గర్భశోకంతో పొగిలి పొగిలి ఏడుస్తోంది.

ఇంత మంది గుండెలను ఇంత గట్టిగా కుదిపి, కళ్ళను చెమరింప చేసి, పిడికిళ్ళను బిగియింప చేసిన రోహిత్‌ను స్మరించుకోవడానికి ”లేమిజరబుల్‌” పబ్లికేషన్స్‌ చేసిన ఒక ప్రయత్నం ”స్వాప్నికుడి మరణం” సంకలనం. మోయలేని వేదన, ఆగ్రహావేశాల, భావోద్వేగాల స్పందన ఇది. మన చుట్టూ పుట్టి పెరుగుతూ, గాలి పీలుస్తూ, ఆశలు పేర్చుకుంటున్న మరింత మంది రోహిత్‌లను అక్కున చేర్చుకుని జర భద్రం కొడుకో అని చేస్తున్న ఆత్మీయపు హెచ్చరిక.

ఈ పుస్తకంలో దాదాపు 50 కవితలు, కొన్ని వ్యాసాలు

ఉన్నాయి. తమ తమ అవగాహనలను బట్టి స్పందించిన కవులూ రచయితల భావ సముచ్ఛయం ఈ పుస్తకం. హెచ్చార్కె, అఫ్సర్‌, ఎన్‌. వేణుగోపాల్‌ మొదలైన వారి వ్యాసాలు సంఘటనపై మరింత అవగాహనను పెంచే విధంగా ఉన్నాయి. కవితల్లో ఇది మరో రాజ్య కుట్ర అనే ఆరోపణ, ఆక్రోశాలకన్నా… సాటిమనిషిగా సమాజం స్పందించిన తీరుపై ఆవేదనల్ని ప్రతిబింబించడానికి ప్రాముఖ్య తనిచ్చాయి.

ప్రముఖ కవి అరణ్య కృష్ణ తన బాధని ఇలా పంచు కుంటారు.

”నువ్వొక్కడివే హతుడువి

హంతకులు మాత్రం కోట్లాది మంది.

మా కళ్ళల్లో ఎంత దిగులు మేఘంగా తారట్లాడినప్పటికీ

మా కన్నీటి చుక్కల్లో కూడా అపరాధ భావముంది. (ఓడిపోని యుద్ధం గురించి నీతో)

వేళ్ళూనుకు పోయిన కులతత్వం గురించి ఆయన ఇంకా ఇలా అంటారు –

”అవును ఈ రోజు చావుకి పేనిన ఉరితాడు నువ్వు పుట్టినప్పుడు నీ బొడ్డు తాడు తోటే పుట్టింది. చెప్పులు చేత పట్టుకుని, మూతికి ముంత కట్టుకుని బెదురు కళ్ళతో తడబడే అడుగులతో వెలివాడల్లోనే నేలరాలిన నీ పూర్వీకుల రక్తమేదో ఇపుడు నీలో ఎలుగెత్తి అరిచింది.”

రోహిత్‌ మరణం తర్వాత తన కుల ప్రస్తావన సృష్టించిన చర్చను ప్రస్తావిస్తూ…

”నీ తండ్రి ఏ కులంలో పుడితే ఏముంది. నువ్వే అమ్మకి పుట్టావన్నదే ముఖ్యం. ఆ అమ్మ ఏ మట్టి వేళ్ళలో నిన్ను సాకిందనేది ముఖ్యం. బీజ విసర్జనతో చేతులు దులుపుకునే వాడి గొప్పదనమేముంది???”

అదే విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్న అరుణ గోగులమండ ”జాగ్రత్త పరుల జాబితాలో నా జాతి జనుల పేరున్నంత వరకూ విశ్వంలో ఏమూలనున్న విశ్వవిద్యాలయంలోనైనా మనవాడనే ప్రతి వాడి బ్రతుకు జాడ ఒక జీవిత కాలపు వెలివాడ” అంటారు. ఈ వ్యాక్యాలు సంఘటితమై జీవించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తాయి.

రోహిత్‌ మొదటి వాడు కాదు చివరివాడూ కాదంటూ ప్రముఖ కవి అఫ్సర్‌ ఇలా అంటారు.

”మరణంలో మాత్రమే నిన్నూ నన్నూ ఎవరినైనా పలకరించే పరమ లౌక్య, లౌకిక కాలంలో ఉన్నవాళ్ళం కదా…

నువ్వున్నంత కాలమూ ప్రతి క్షణమూ కనిపించని / కనిపించనివ్వని…

తెలియని / తెలియనివ్వనీ లెక్కలేనన్ని గోడలకి మాత్రమే చెప్పుకున్న కథలన్నీ

నిస్సహాయ అంతః శోకంలో పంచుకున్న కేకలన్నీ

ఇపుడే వినిపిస్తున్నయి నాకూ…. నా లోకానికి” అంటారు.

సడ్లపల్లె చిదంబరరెడ్డి ”చావడానికి కాదు నీవిక్కడక చ్చింది. ఈ కంచెలన్నీ విరూప అనాకార ఆకారాల ఆయుధాల్ని నీ శక్తి మేరా ద్వంసం చేయడానికి…

చేయి అందిన మేరా పచ్చని తీగగా నీకు నీవే పంచుకుని

అస్థిత్వ నిరూపణ చేసుకోవాల్సిందే. మరణించేదాక మానవ శక్తిగా పోరాడాల్సిందే” అంటారు.

ఇవి కేవల మచ్చుతునకలు.

హెచ్చార్కె తన వ్యాసం ”అబద్ధమా నీ పేరు రాజకీయమా నశించు” లో రోహిత్‌ కులం గురించి, అతని ఆశయాల గురించి రైటిస్టులు చేసిన చెత్త ప్రచారం గురించి కూలంకషంగా చర్చిస్తారు. రోహిత్‌ జీవితమూ, మరణమూ సమాజానికి నేర్పిన పాఠాల గురించి ఎన్‌. వేణుగోపాల్‌ మన ముందు పరుస్తారు.

ప్రతీ ఆత్మహత్యకూ సామాజిక కారణాలూ, వ్యక్తిగత కారణాలూ ఉంటాయి. సుదీర్ఘ కాలంగా పేరుకున్న కారణాలూ… అప్పటికప్పుడు తోసుకొచ్చిన ఉధృత ఉద్వేగ కారణాలూ ఉంటాయి. పరిశీలించి చూస్తే ఆత్మహత్యలుగా ప్రచారమయ్యేవన్నీ సమాజం చేసే హత్యలే అంటారు ఎన్‌. వేణుగోపాల్‌. సమాజం అన్నప్పుడు మన చుట్టూ ఉండే మనుష్యులు మాత్రమే కాదు తరతరాలుగా సామాజిక సంస్క ృతులలో భాగమైన హీన, దుర్మార్గ విలువలన్నీ కూడా మనిషిని ఎప్పటికప్పుడు ఆత్మన్యూనతలోకి, నిస్పృహ లోకి, నెడుతుంటాయి అంటారాయన.

కాలం ప్రజల చైతన్యాన్ని హతమార్చిందన్నది అంబేద్కర్‌ భావన. కులం వల్ల నిస్సహాయులైన వారి పట్ల సానుభూతి లేకపోగా కనీస సాయం కూడా కానరాని కాలంలోనే సమాజం మగ్గుతోందన్న వాస్తవానికి తాజా ఉదాహరణ రోహిత్‌ వేముల మరణం. అమెరికన్‌ రచయిత్రి ఓనీ మారిసన్‌ అన్నట్లు దారి తప్పించడం జాత్యహం కారానికి ఉన్న లక్షణం.

రోహిత్‌ మరణం వెనుక కారణాలు ఎన్నున్నా వెనుకబాటు తనపు ముద్ర ప్రబల కారణం. అక్కున చేర్చుకునే సమాజం లేనపుడు మనిషి తలక్రిందులవుతాడు. నిలిచే వారు కొందరే. రాలిన వాళ్ళలో రోహిత్‌ లాంటి పసిమొగ్గలే ఎక్కువ. అతను రాసిన చివరి ఉత్తరం యావత్‌ ప్రపంచాన్ని నివ్వెరపాటుకి గురిచేసింది.

ఆ తరువాత రాజకీయ కారణాలు ఎన్నో కలిసి ఉద్యమ స్థాయిని పెంచాయి. ఆలోచనని రగిలించిన అతని ఆఖరి ఉత్తరం వర్గ బేధాలకు అతీతంగా ”ఇంకెన్నాళ్ళీ వెతుకులాట” అంటూ కారణాలు వెతకడానికి కారణమయ్యింది.

కళ కళ కోసమే కాక ఒక ప్రయోజనం కోసమనుకునే నిబద్ధత కలిగిన రచయితల రచనలు ఇందులో కనిపిస్తాయి. అద్భుతం అనిపించే సాహిత్యమూ కనిపిస్తుంది. ఆవేశంతో పెల్లుబికిన కావ్య ఖండికలు కొన్నైతే ఆలోచనలు రేకెత్తించే ప్రశ్నలు మరికొన్ని. రోహిత్‌ ఉత్తరం, మరణం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇందులో దొరక్కపోవచ్చు. ఒక పక్షి మరణం ఆది కావ్యానికి ప్రేరణ అయినప్పుడు ఒక స్వాప్నికుడి మరణం ఎందుకు కాకూడదు??? సమాజ ప్రేమికులు అందరూ ఈ స్వాప్నికుడి మరణానంతరం మరమ్మత్తు పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

ఇది ఒక మహా దుఃఖితుని వేదనా పర్యవసానం. వెలివేయబడి, వేధింపబడి, వధించబడిన రక్షణలేని ఆత్మల ఘోష. ఈ రక్త చరిత్ర మరలా పునరావృతం కాకూడదన్న ఒక ఆశయం.

బానిసత్వం జన జీవనమైన చోట

బతకడం కోసమే కాదు

చావడం కూడా

ఒక హక్కుల పోరాటమే

ఏక వ్యక్తిగా నిన్న నువ్వు చేసిన పోరాటం

అనేకానేక రోహితాంశల పరంపరయై నేడు

యుద్ధ భూమిలో దునుమాడుతుంది

అనేకాలన్నీ మమేకమై

నీ మరణాన్ని అమరం చేసే సమయం

ఇప్పుడిక్కడ నా కళ్ళల్లో కదలాడుతుంది

నిజం…

ఇప్పుడిక రోహిత్‌ ఒక్కడు కాదు!

రోహిత్‌ ఆశయం ఏకవచనం కాదు

ఒక్క రోహితే నేలరాలితే

ఇక్కడ వేల జనం

జెండాలై రెపరెప లాడతారు.

 

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.