మా అమ్మ యంయన్ఆర్ హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తుంది. నాన్న పక్షవాతంతో నెల క్రితం చనిపోయాడు. మా అన్నయ్య ఇంటర్ చదువుతూ పార్టు టైం జాబ్ చేస్తున్నాడు. మా నాయనమ్మ మాతోనే ఉంటుంది. ఇండ్లల్లో వంటలు చేస్తుంది. మా నాయనమ్మ అంటే నాకు చాలా ఇష్టం.
నేను ఇస్మాయిల్ ఖాన్ పేట జడ్పిహెచ్ఎస్ లో 9వ తరగతి చదువుతున్నాను. స్వార్డ్ సంస్థ నుండి భానుప్రియ మేడం మా స్కూల్‌కి వచ్చి బహిష్టు సమయంలో పాటించాల్సిన 5 ముఖ్య విషయాల గురించి మాట్లాడినప్పుడు మా క్లాస్‌లో కిశోర బాలికలందరం ఏమిటి వీళ్ళకి సిగ్గు అనిపించడం లేదా ఇంత గలీజ్‌గా ఎలా మాట్లాడుతారు అనుకుని మేడమ్ వస్తే తలవంచుకొని కూర్చునే దాన్ని. ఏమి చెప్పినా సమాధానం చెప్పకుండా అసహ్యంగా అనిపించేది. మేడమ్ మాత్రం నెలకి రెండు సార్లు స్కూలుకు రావడం పునరుత్పత్తి, అవయవాలు, బహిష్టులో పాటించాల్సిన పద్ధతుల గురించి చెప్పుతూనే ఉండడం చూస్తుంటే, బైటికి ఇష్టం లేనట్లు అన్పించినా గానీ, లోపల వినాలని అన్పించేది, వినేదాన్ని. ఎందుకంటే ఇలాంటి మాటలు విన్నవారిని కూడా సిగ్గులేనివారు అంటారు కదా అందుకే.
స్కూల్లో యంహెచ్యం గురించి ట్రయినింగ్స్ తీసుకోవడానికి కోర్ టీమ్ మెంబర్స్‌ని నలుగురిని మా గ్రామం నుండి ఎంపిక చేసినప్పుడు నేను కూడా పేరు ఇచ్చాను. యంహెచ్యం పై మాస్టర్ ట్రయినింగ్ తీసుకున్నాను. బాగీ మ్యాప్ వేసుకొని ప్రాక్టికల్‌గా యంహెచ్యం గురించి, యవ్వనంలో వచ్చే శారీరక, మానసిక మార్పులు, యంహెచ్యం గురించి ఉన్న ఆచారాలు, నిజాలు, అపోహలు అన్నిటిపై 2 రోజులు సంగారెడ్డిలో ట్రయినింగ్ తీసుకున్నాక నాలో సిగ్గు, సంకోచం, భయం, ఎవరు ఏమి అనుకుంటారో అనే ఆలోచన అన్నీ పోయి, నిర్భయంగా యంహెచ్యం పై మాట్లాడటం మొదలు పెట్టి ముందుగా మా స్కూల్లో పిల్లలకి దాదాపు 300 మంది మెంబర్స్‌కి యంహెచ్యం పై నాతోటి పియర్ గ్రూప్ మెంబర్స్ 12 నుండి 14 సంత్సరాలలోపు పిల్లలందరికి అవగాహన కలిగించాను. అదే కాకుండా మా స్వార్డ్ సంస్థ ఆధ్వర్యంలో కె.జి.బి.వి. స్కూల్లో బాలికలకి వారితో పాటు 28 మంది ఏయన్‌యంలు, జిల్లా అధికారులు ఆర్‌వియం-పివో గారు, డబ్ల్యుసిడి పిడి, రెడ్‌క్రాస్ సెక్రటరీ, వనజారెడ్డి గారు అందరి సమక్షంలో యంహెచ్యం పై 69 మందికి ట్రయినింగ్ ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు నాపై నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. నేను ఎక్కడయినా, ఎప్పుడయినా బహిష్టు సమయంలో పాటించాల్సిన విషయాలపై చెప్పగలుగుతున్నాను. మా గ్రామంలో చాలా సమస్యలు, అడ్డంకులు ఎదుర్కొన్నాను. ఇంట్లో సభ్యులు, గ్రామంలో మహిళలు హేళన జేసారు, తోటి విద్యార్థులు కూడా. ఇప్పుడు మాత్రం అందరూ నన్ను ఒక మోడల్‌గా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ యంహెచ్యం పై అందరికీ అవగాహన కలిగిస్తూనే ఉంటాను.