మంచికంటి
భర్తల్లేని కాలాన్ని
స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు
హద్దులు చెరిపేసిన ఆకాశంగా ప్రకటించండి
తిని తాగి పైనబడి రక్కీ కొట్టి
హింసల్లోనే సుఖాలు వెతుక్కునే
పురుష పుంగవులకి
ఏ రోజూ మీ చల్లని చూపులు సోకకుండా తెల్లవారదు
నిద్రలో కూడా కలవరింతలతో పొద్దు పుచ్చే మీకు
మెలుకువలోన ఎన్ని దుష్టస్వప్నాలో
బెదిరింపుల బుజ్జగింపుల
లాలింపుల ఆదరింపుల్లోన ఎన్ని దాష్టీకాలో
భర్తలు వొదిలేసిన కాలాన్ని
చల్లని వాయు సమీరాల్ని కురులు విప్పార్చుకుని
ఆనందాశ్రువులుగా రాల్చండి
భర్తలు తరిమేసిన కాలానికి నిప్పు ముట్టించి
వీథి వీధి దివిటీలు పట్టుకు తిరగండి
కొంతకాలమైనా స్వేచ్ఛను ప్రసాదించినందుకు
కోటి కాంతుల హారతుల్ని నీరాజనాలుగా ఇవ్వండి
వొదిలేసినా కాలాల్నీ తరిమేసిన లోకాల్నీ
కాసింత కసిదీరా తిట్టుకుంటూ
ఆనందోత్సవాలు జరుపుకోండి
ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ వొచ్చి
కాళ్ల మీద పడి క్షమాపణలు అడగాల్సిన వాళ్ళే కదా
పురుషులు వొర్ఠి పరాన్న జీవులు
మీరు లేకుండా వొక్క క్షణం ముందుకు సాగదు
– బెదిరించే పురుష పుంగవులకు