ఇటీవల ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కోర్ ప్రతినిధివర్గం రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా)కు వెళ్ళినపుడు అక్కడ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఫ్యామిలీ మినిస్టర్ శ్రీమతి క్వాన్కాంగ్ను ప్రత్యేకంగా కలుసుకోటమయింది.
అభివృద్ధి సూచికలు ఎన్ని ఉన్నా అన్నిటికంటె ముఖ్యమైనది సమాజంలో స్త్రీల స్థాయి. స్త్రీల అభివృద్ధి లేకుండా ఏ సమాజమూ, ఏ దేశమూ ముందుకు వెళ్ళలేదు.
శతాబ్దాలుగా పరాయి పాలనలో మగ్గి, తమదైన దేశం ఏర్పడగానే ఉత్తర దక్షిణాలుగా విడిపోయి, చరిత్రపై కొరియా యుద్ధం ముద్రవేసి, చివరకు అకుంఠిత దీక్షతో సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ, అభివృద్ధి చెందుతున్న దేశాలలో గణనీయమైన ఆర్థికాభివృద్ధి గల దేశంగా పేరుపొందిన రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో స్త్రీల స్థితిగతులేమిటి, దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యమేమిటి అని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది.
మంత్రిత్వశాఖ పేరే ”స్త్రీపురుష సమానత్వము, కుటుంబము” అయినందున రిపబ్లిక్ ఆఫ్ కొరియా స్త్రీల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొంది అని అనుకోవచ్చు.
స్త్రీల సాధికారత రాజకీయాలలో, ఆర్థికపరంగా, విద్యాపరంగా, కుటుంబపరంగా ఎలా ఉంది అనే విషయాలు చర్చనీయాలవుతాయి. మంత్రితో చర్చకు వచ్చిన విషయాలు కొన్ని ఈ క్రింద పేర్కొనటమయింది.
1. స్త్రీలు రాజకీయాలలో ప్రవేశించటం సులభమా? కొరియన్ పార్లమెంటులో స్త్రీలకు రిజర్వేషన్లు కావాలనే ఒత్తిడి ఏమైనా ఉందా?
రిజర్వేషన్ల ఒత్తిడి లేకపోయినా పార్లమెంటుకు స్త్రీలు రావటం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 348 మంది సభ్యులున్న అసెంబ్లీలో 48 మంది స్త్రీలున్నారు. అంటే 16 శాతం ఉన్నారు. జిల్లాస్థాయిలో స్త్రీ అభ్యర్థులు చాలామందే ఉన్నారు. కనీసం 30 శాతం కోసం వ్యూహాత్మకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే పార్లమెంటులో స్త్రీల సంఖ్య పెరుగుతుందనే ఆశ ఉంది. ఒక స్త్రీ దేశాధ్యక్షురాలయింది. స్త్రీలు అన్ని రంగాలలో చురుకుగా పాల్గొంటున్నారు. భవిష్యత్తు బాగుంది.
2. ఉద్యోగాలలో చేరే స్త్రీల సంఖ్య ఎక్కువవుతున్నందున వచ్చిన మార్పుకు సమాజం ఎలా స్పందిస్తోంది?
చాలామంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు. అన్ని విషయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఈనాటి తరంలో
ఉన్నతవిద్యలో స్త్రీల సంఖ్య ఎక్కువవుతోంది. నిరుడు 4 శాతం పెరిగితే ఈ సంవత్సరం 7 శాతం పెరిగింది. భవిష్యత్తులో మరింత పెరుగుతుందనే నమ్మకముంది. ప్రతి స్థాయిలోను స్త్రీల నియామకం జరుగుతోంది. ఉన్నతస్థాయిలో నియామకం పెరుగుతోంది.
3. స్త్రీ, పురుష సమానత్వంలో ఐక్యరాజ్యసమితి కొరియాను క్రింది స్థాయిలో చూపిస్తుంది. పరిస్థితులు మెరుగుపరచటానికి ప్రభుత్వం చట్టరూపంలో ఏవైనా చర్యలు తీసుకొందా?
మారుతున్న పరిస్థితులతోపాటు స్త్రీలూ మారుతున్నారు. స్త్రీల హక్కులు పెంపొందించటానికి మేము కష్టపడి పనిచేశాము. చట్టాలు సవరించాము. సమానమైన హక్కులు, అవకాశాలు స్త్రీలకు వచ్చేటట్లు చూశాము. గొప్ప మార్పులొచ్చాయి. కుటుంబానికి, ప్రపంచానికి మధ్య సమతౌల్యం ఉండేటట్లు చూడటమే మా లక్ష్యం. పురుషులు చురుకుగా ఇంటిపనులలో పాల్గొంటున్నారు. యువత ఈ విషయంలో చాలా ముందున్నారు.
ఐక్యరాజ్యసమితి రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు తక్కువ శ్రేణి ఇచ్చి ఉండవచ్చు. కాని స్త్రీ పురుషుల మధ్య తేడాలు తగ్గించి సమానత్వం తీసుకురావటానికి చట్టాలు అమలులోకి వచ్చాయి.
4. మీ మంత్రిత్వశాఖ స్త్రీపురుష సమానత్వానికి ఇంకా ఏమిచేయదలచుకొంది?
ఆడపిల్లల, మగపిల్లల సంఖ్యలో తేడాలు, అంటే నిష్పత్తిలో తేడాలు తగ్గుతున్నాయి. నేను మంత్రి పదవి స్వీకరించి రెండునెలలయింది. ఇది మూడేండ్ల కాలం ఉంటుంది. అన్ని రంగాలలో స్త్రీల భాగస్వామిత్వం పెంపొందించాలని నేను ప్రయత్నిస్తున్నాను.
మంత్రితో సమావేశం ముగిశాక, అదే సాయంత్రం కొరియాలోని మహిళా జర్నలిస్టులను కలిశాము. ఆ చర్చల్లో ఆ దేశంలోని మీడియా స్థితి స్పష్టమయింది. దక్షిణ కొరియాలో కేంద్రీకృత విధానమున్నందున చాలామంది జర్నలిస్టులు రాజధాని అయిన సియోల్లోనే ఉన్నారు. మిగిలిన కొన్ని మహానగరాలలో మరికొందరున్నారు.
పూర్తిగా జర్నలిస్టులుగా ఉన్న స్త్రీలు 22.8 శాతం కాగా పురుషుల శాతం 59.7. పాక్షికంగా జర్నలిస్టులుగా పనిచేసేవారు 66 శాతం స్త్రీలు, 10.7 శాతం పురుషులు.
అక్కడ కూడా పని విభజనలో వివక్ష ఉంది. స్త్రీలకు సంబంధించిన విషయాలు, స్త్రీలకు సంబంధించని అనగా పురుషులే నైపుణ్యంతో చేయగలిగిన విషయాలు అని తేడా ఉంది. జర్నలిజంలో ఉన్నత పదవులలో ఉన్న స్త్రీలు తక్కువ.
సాంప్రదాయకమైన కొరియా దుస్తులు తమ పనికి ఆటంకమని మహిళా జర్నలిస్టులు భావిస్తారు. భారీగా ఉన్న లంగా మీద చొక్కా లేదా జాకెట్టులా ఉన్న సాంప్రదాయికమైన దుస్తుల్లో వేగంగా కదలికలు కష్టమని ఎవరికైనా అర్థమవుతుంది.
స్త్రీలు అన్ని ఉద్యోగాలలోనూ కనిపిస్తారు. విదేశీయులతో వ్యవహరించవలసిన వారందరికీ ఇంగ్లీషులో ప్రావీణ్యముంటుంది. టూరిస్టు గైడుల్లా పనిచేయటం సాధారణ విషయం. వీరొకొకసారి పర్యాటక బృందాలతో లేక ప్రతినిధి వర్గాలతో సియోల్ వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఉద్యోగంలో కష్టనష్టాల గురించి, సమాజంలో స్త్రీల పరిస్థితి గురించి తెలుసుకొందామని మాతో ఉన్న వివియెన్తో అరగంట కాలం గడిపాను.
వివియెన్ అసలుపేరు బ్యోంగ్జు ఆహ్న. పర్యాటక రంగంలో ఉన్నవారు విదేశీయుల సౌలభ్యం కోసం ఇంగ్లీషు పేర్లు పెట్టుకొంటారు. ఈ ధోరణి మలేషియా, చైనాలలో కూడా కన్పిస్తుంది.
వివియెన్ తాను ప్రభుత్వ ఏజెన్సీలకు, డిపార్ట్మెంటుల కోసం ఎక్కువగా పనిచేస్తున్నట్టు తెలిపింది. ఈ ఫీల్డులో వాళ్ళకు శిక్షణ ఉంటుంది. భర్తకు తన పని గురించి అవగాహన ఉన్నందున వేరే ప్రాంతాలకు వెళ్ళినా ఇంటి గురించి చింత లేదు.
ఖర్చులెక్కువవుతున్న ఈ రోజుల్లో భార్యాభర్తలిరువురూ పనిచేసి సంపాదిస్తే గాని ఇల్లు గడవని స్థితి. ఇంటి పనులలో కూడా భర్తలు సాయం చెయ్యాలి. లేకపోతే భార్య ఇంటిపట్టునే ఉంటానంటే ఇల్లు గడిచేది కష్టం.
సంతానం విషయంలో ఆడ మగ భేదాలు లేవు. కాని పిల్లలు లేని స్త్రీని కాస్త తక్కువగా చూస్తారుగాని పరిస్థితులు మారుతున్నాయి. (తనకు సంతానం లేదు) పెళ్ళిళ్ళలో కట్నాల బాధలు లేవు. గృహహింస లేదు. స్త్రీల పట్ల నేరాలూ తక్కువే. ప్రభుత్వం సామాజిక భద్రత కోసం చేపట్టిన కార్యక్రమాలు బాగానే నడుస్తున్నాయి.
వివియెన్ తన దేశప్రతిష్టకు భంగం కలిగించే ఏ విషయమూ చెప్పదని అర్థమయింది. కాకపోయినా కొరియా ప్రజలు సరళస్వభావులు. విదేశీయులపట్ల మర్యాదగా వ్యవహరిస్తారు. తమ చేతనయిన సహాయమూ చేస్తారు.
మత్తుపానీయాలు తాగటం వీరికి సాధారణ విషయం. ఒక రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో మా హోటలుకు నడచివెళ్తున్నప్పుడు కొందరు యువకులు రోడ్డుమధ్య విన్యాసాలు చేస్తూ, బిగ్గరగా మాట్లాడుతూ నవ్వుతున్నారు.
నాతో ఉన్న కొరియన్ అమ్మాయి, సుజన్ ఇమ్ ”వీరు తాగి ఉన్నారు” అని చెప్పింది. ”ఈ సమయంలో ఆడపిల్లలు ఈ దారిన వెళ్తే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందా?” అని అడిగాను.
”అప్పుడప్పుడు” అంది సుజన్ చిరునవ్వుతో.
ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని అనుకోవలసిందే. ప్రపంచవ్యాప్తంగా దుష్టులకు దూరంగా ఉండవలసిన బాధ్యత స్త్రీలదే. కానీ ఎలుగెత్తి నిరసన ప్రదర్శించటం, నిలదీసి అడగటం భావ్యమే. మనస్సాక్షిని తట్టిలేపటమూ అగత్యమే.