బెహన్‌జీ మాయావతి బహుజన కులాలకు, జెండర్‌లకు ఒక రాజకీయ ఐకాన్. ఉత్తరప్రదేశ్‌కు నాలుగు సార్లు ఒక దళిత మహిళ, అందులో కులాధిపత్య మగ రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉండడం, నెగ్గుకు రావడం రాజకీయ చరిత్రలకు ఒక గొప్ప మలుపు.
నిజంగా బీఎస్‌పీని నిలబెట్టింది, నిర్మించింది బహుజన రాజ్యాధికారం కోసం. దానికోసం బహుజన తాత్విక చరిత్రల పునాదిగా భారతదేశ కులాధిపత్యాల, మగాధిపత్య రాజకీయాలకు సవాలుగా అంబేద్కర్ సిద్ధాంతాలను సఫలీకృతంగా సాధించింది కాన్షీరామ్. కాన్షీరామ్ దార్శనికత చాలా గొప్పది. మనువాద మగరాజకీయాలు ఆచరించాల్సిన ఒక గొప్ప మానవీయ, రాజకీయ దార్శనికత మాన్యశ్రీ కాన్షీరామ్‌ది. కాన్షీరామ్ రాజ్యాధికార దృక్పథాల్లో మనువాద మగరాజకీయాల్ని, ఆధిపత్య కులరాజకీయాల్ని, మొత్తంగా మగపెత్తనాల్నే పక్కనపెట్టి ఒక దళిత మహిళకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడం ఒక గొప్ప జెండర్ ప్రజాస్వామ్యము.
ఆధిపత్య కులరాజకీయాల్లో కూడా ఇందిరాగాంధీ లాంటి వాల్లు కనిపించొచ్చు కానీ అవి వారసత్వ రాజకీయాలు. కానీ బహుజన సమాజ్ పార్టీలో జరిగింది వారసత్వాధిపత్యం కాదు. బహుజన సంస్కృతిలో మహిళదే పెద్ద స్థానము. ఎందుకంటే సామాజిక ఉత్పత్తి శక్తులుగా ఉన్నవాల్లు బహుజన మహిళలు. గడపదాటని మహిళలు కాదు. సామాజిక ఉత్పత్తిలో సగ భాగం వాటా పొందాల్సినవాల్లు. సామాజిక చరిత్రల్లో, పోరాటాల్లో, జ్ఞానాల్లో ముందున్నవాల్లు. అట్లాంటి వారసత్వ సంపద ఉన్నవాల్లు బహుజన మహిళలు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మహిళల్ని భాగస్వామ్యం చేయనిదే ఏ రంగం అభివృద్ధిలో ముందుబడదు అని అనేకమంది రాజకీయ, ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు చెప్పుతుండ్రు.
అయినా మనువాద కుల, మత మగస్వామ్యాలకు ఇవి చెవిన్నే ఎక్కవు. మహిళా ఫ్రీ రంగాలను చూస్తున్నము. కానీ మాన్యశ్రీ కాన్షీరామ్ మగ పెత్తనాలకు వ్యతిరేకంగా దళిత మహిళను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడం రాజకీయ, సామాజిక చరిత్రలో ఒక గొప్ప మార్పు, మలుపు.
జెండర్ సమానత్వాలను వల్లించడం వేరు, జెండర్ ఆధిపత్యాలను అంగీకరించడం ఒక గొప్ప మానవీయమైన అంశము. మాయావతి ముఖ్యమంత్రి అయినప్పుడల్లా యిక్కడ విజయోత్సవాలు చేసిండ్రు. విశేషమేంటంటే విజయోత్సవాల్లో ఒక్క మహిళను కూడా పిలవకుండా… ఇదీ ఇక్కడ బహుజన మగరాయుల్లు నేర్చుకున్న కాన్షీరామ్ జెండర్ ప్రజాస్వామ్యాల్ని.
అయితే ఇంత గొప్ప ఫిలాసఫీగా ఎదిగి బహుజన సమాజ్ పార్టీ నుంచి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా నిలదొక్కుకోవడమంటే… అదీ ఒక అంటరాని మహిళ నిలదొక్కు కోవడమంటే మామూలు విషయం కాదు. ఎన్ని కుల కుట్రలు, మగాధిపత్య కుట్రలు, మనువాద కుట్రల నుంచి బచాయించడ మంటే చిన్న సంగతి కాదు. ఆమె మీద అనేక ఆరోపణలు, అవమానాలు, దూషణలు చేసింది మగ మనువాద రాజకీయం. ఆమెకు రాజకీయ భవిష్యత్తు లేకుండా కుయుక్తులు చేసింది అగ్రకుల మీడియా. ఆమె 5 వేల రూపాయల ఖరీదైన సూటు వేస్కుంటదనీ, బొంబాయి నుంచి షూస్ తెప్పించుకుంటదని లెక్కలు, బొక్కలు తీసి రాసిన మీడియా … సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే సింధియా, జయలలిత ధరించే చీరల ఖరీదులు, బంగారం, వజ్ర వైఢూర్య ఖరీదుల్ని రాస్తుందా…? దళిత మహిళలు మంచి బట్టలు, చెప్పులేస్కున్నా అగ్ర కుల రాజకీయాలకు, మీడియాకు కంటగింపే… ఇంతటి నెగలనివ్వని రాజకీయాల్లో కూడా మాయావతి ప్రస్తుతం పార్లమెంటు సభ్యులయ్యారు.
పార్లమెంటులో దళిత సమస్యలు, బహుజన కులాల సమస్యలమీద ఎలుగెత్తి పోరాడుతున్న మాయావతి బీజేపీ రాజకీయాలకు గొడ్డలి పెట్టయింది. తెలంగాణా ఉద్యమానికి మద్దతునిచ్చిన మహా నాయకురాలు మాయావతి. గుజరాత్‌లో దళితుల్ని కారుకు కట్టేసి గోమాత రక్షకులు అనే ఆంబోతులు చచ్చినావు చర్మాన్ని వొలిచిండ్రని వంతులవారీగా బాదిన దుర్మార్గాన్ని నిరసించి బీజేపీకి చుక్కలు చూయించిన మాయావతిని అణగదొక్క డానికి, కుంగదీయడానికి ఆమెను ‘వేశ్యకంటే హీనం’ అని దూషించింది. ఆడవాళ్ళని వేశ్యల్ని చేసిందీ… ఆ వేశ్యలకు గౌరవాలు లేకుండా చేసిందీ మను మగజాతే…
దళిత మహిళలు విద్యావంతులైనా, రాజకీయ దురంధులైనా, సీఎంలు, ఎంపీలైనా వల్నరెబుల్స్ అనే మనువాద కుల, మత, మగ ఆధిపత్యాన్ని, అహంకారాన్ని కక్కింది బీజేపీ రాజకీయం. ఇది ఒక్క బీజేపీదే కాదు ఆధిపత్య కుల, మగ రాజకీయాలన్నింటికిదే చులకన, హేళన భావాలున్నాయి. ఈ అవమానాలు ఒక్క దళిత మహిళవే కాదు యావద్భాతర మహిళల అవమానాలు. మహిళల్ని ప్రధానంగా దళిత మహిళల్ని రాజకీయాధి కారాలకు దూరం పెట్టడానికే ఈ దుర్మార్గ మగ దూషణలు అని అర్థం చేస్కోవాలి. అయితే మాయావతిని సులువుగా, చులకనగా అన్నట్లు సుష్మాస్వరాజ్‌ని, వసుంధరా రాజే సింధియాని అనగలరా… అంటే… బత్కుతరా… అట్లా ఉంటయి కుల జెండర్ రాజకీయాలు. ఇట్లాంటి అవమానాలన్నీ రేపు మాయావతికి రాజకీయ ఆయుధాలే…