మనలో మనిషి మహాశ్వేత – ఎన్‌.వేణుగోపాల్‌

గుర్తు చేసుకుంటుంటే అదంతా నిన్ననో, మొన్ననో జరిగినట్టు కళ్ళలో కదలాడుతోంది. అప్పుడే ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి. 1991 సెప్టెంబర్‌ చివరి వారం, ‘సమయం’లో తొమ్మిది నెలల నిర్వ్యాపక ఉద్యోగం అప్పుడప్పుడే వదిలిపోయి, మంచి నిరుద్యోగం చేస్తున్నాను. ”మహాశ్వేతాదేవి ఊళ్ళోకొస్తోంది. కలవదలచుకుంటే అన్వేషికి రండి” అని కబురు.

నిజానికి మహాశ్వేత రచనతో అప్పటికి పది సంవత్సరా లకు పైగా పరిచయం. 1980 మొదట్లో ఆమె రాసిన ‘రైటింగ్‌ టుడే – సమ్‌ క్వశ్చన్స్‌’ అనే వ్యాసం చిన్న పుస్తకంగా వచ్చి చేతికందింది. సాహిత్య, కళా రూపాల్లో హింస చిత్రణ క్రమక్రమంగా మనిషిని హింస పట్ల ఎట్లా నిరాసక్తం చేస్తుందో, నక్సల్బరీ మార్గపు విశేషత ఏమిటో, ప్రజా సాహిత్యం రాయద లచిన వాళ్ళు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో, ఏయే అంశాలు అధ్యయనం చేయాలో ఆమె ఆ వ్యాసంలో అద్భుతమైన విశ్లేషణా శక్తితో వివరించింది. వస్తువులో గొప్ప ఆర్ద్రతను, శైలిలో నిరాడం బరమైన సూటిదనాన్ని నింపుకున్న ఆ వ్యాసాన్ని వెంటనే తెలుగు చేశాను. ఆ వ్యాసం ‘ఇవాల్టి రచన – కొన్ని ప్రశ్నలు’ పేరుతో 1980 అక్టోబర్‌ ‘సృజన’లో అచ్చయింది. బహుశా తెలుగులోకి వచ్చిన మహాశ్వేత మొదటి రచన అదే కావచ్చు.

ఆ తర్వాత హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుణ్యమా అని రాకాసి కోర, ఎవరిదీ అడవి, ఒక తల్లి నవలలు కూడా తెలుగులోకి వచ్చాయి. కొన్ని కథలూ పత్రికల్లోను, సంకలనంగాను తెలుగులోకి వచ్చాయి. బెంగాల్‌, బీహార్‌ సరిహద్దు అటవీ ప్రాంత గిరిజనుల మధ్య మహాశ్వేత సాగిస్తున్న కృషి గురించి వార్తలు అప్పటికే తెలుస్తూ ఉన్నాయి.

ఇంతగా పరిచయమయ్యీ, ముఖ పరిచయం లేని మహాశ్వేతను చూడడానికి అన్వేషికి వెళ్ళాం. అప్పుడు రెండు రోజులు, ఆ తర్వాత ఉత్తరాల్లో, అక్షర ప్రపంచంలో మహాశ్వేతతో ఎన్నో జ్ఞాపకాలు, సంతోషాలు, సంభ్రమాలు, నిష్టురాలు…

మొట్టమొదట ఆమె గురించి వ్యాసం రాయడం కోసం ఇంటర్వ్యూగా మొదలయినదల్లా, ఇష్టాగోష్టిగా, స్నేహ సంభాషణలు, మైత్రిగా పరిణమించింది. ఆ రోజు అన్వేషిలో సంభాషణ సాహిత్యం కన్నా ఎక్కువగా సమాజం మీదనే నడిచింది. రచనల్లో లాగానే, మాటల్లోనూ ఆమెదిలోత యిన, ఆవేశం నిండిన అభివ్యక్తి. హృదయానికి దగ్గరి విషయం మాట్లాడే టప్పుడు ఆమెది ఏకాగ్ర దృష్టి. చాదస్తమనిపిం చేటంత గాఢమైన అభినివేశం.

అందువల్లనే సంభాషణ వెంటనే ప్రెసిడెన్సీ జైల్లో మహిళల దుర్భర స్థితి గురించి మొదలయింది. ఏ విచారణా లేకుండా ఇరవై, ముప్సై ఏళ్ళుగా ఆ జైల్లో మగ్గుతున్న స్త్రీల గురించి మహాశ్వేత మాట్లాడడం మొదలుపెట్టింది. అప్పటికామె బెంగాలీ పత్రిక బర్తమాన్‌లో ఒక వారం వారం శీర్షిక రాస్తోంది. ఆ శీర్షికలో స్త్రీ ఖైదీల గురించి రాసినాకనే ప్రభుత్వం అటు వంటి సమస్య ఒకటుందని గుర్తించి వాళ్ళ పునరావాస చర్యలు చేపడతానని ప్రకటించిందట. ”కానీ చిన్న పిల్లలుగా రోడ్లమీద దొరికిన వాళ్ళను ఎత్తుకొచ్చి జైల్లో పడేస్తే ఇప్పుడు యువతులుగా వాళ్ళెక్కడికి పోవాలి? బంధువులమనే తప్పుడు ఆధారాలతో వచ్చే వేశ్యా గృహాల యజమానులకన్నా మరొక దిక్కు లేదు…” చెపుతూ చెపుతూ మహాశ్వేత ఏడ్చేసింది. పాఠకుడిగా ఆమె ప్రతి రచన లోనూ ఎక్కడో ఒకచోట కళ్ళు చెమర్చిన నాకు ఆ ఆర్ద్ర రహస్యం తెలిసింది.

అక్కడ్నించి సంభాషణ బీహార్‌, బెంగాల్‌లలో మంత్రగత్తెల పేరుమీద హత్యలకు గురవుతున్న స్త్రీల మీదికి మళ్ళింది. అటు నుంచి బ్రిటిష్‌ పాలకుల చేతిలో నేరస్థ తెగలుగా, భారత రాజ్యాంగం కింద అనుసూచిత తెగలుగా గుర్తించబడి అన్యాయానికీ, దోపిడీ పీడనలకూ గురవుతున్న గిరిజనుల గురించి, వారి మధ్య తను చేస్తున్న పని గురించి చెప్పడం మొదలుపెట్టింది. ”ప్రభుత్వం సంక్షేమ రాజ్యంగా కనబడడానికైనా ఎన్నో చట్టాలు చేసింది. వాటిని వాడుకోవాలని గిరిజనులకు చెప్పడం నా పని. అంటే ప్రభుత్వ చట్టాలను, ప్రభుత్వ వనరులను వాడుకోమని గిరిజనులలో చైతన్యం కలిగించడం. ఇందుకు విదేశీ నిధులు ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించను” అంటూ తన చేతి సంచిలోంచి ఒక బెంగాలీ పుస్తకం తీసింది. మామూలు భాషలో గిరిజనుల హక్కుల గురించి తెలియజేసే పుస్తకమది.

గిరిజనులు, గిరిజనుల సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నారి పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా ”మంచి వాళ్ళందరూ గిరిజనులు. చెడ్డ వాళ్ళందరూ గిరిజనేతరులు” అని, వెంటనే ”నువ్వు గిరిజనుడివా కాదా” అని అడిగింది. నేను గిరిజనుణ్ణేనంటే గలగలా నవ్వి ఫ్రాంక్‌ఫర్డ్‌ రచయితల సమావేశంలో ఈ ప్రశ్నే అడిగానని, అక్కడికొచ్చిన వాళ్ళందరూ గిరిజనులమేన న్నారని చెప్పింది.

 

అక్కడ్నుంచి సంభాషణ ‘ఒక తల్లి’ మీదికి మళ్ళింది. ‘ఒక తల్లి’లో తల్లి చిత్రణ ఉన్నంత బిగువుగా ఉద్యమ చిత్రణ ఉన్నదా అని, ఆ నవలలో ఉద్యమ చిత్రణ భయం గొలిపేదిగా ఉంది కదా అని నాకెన్నాళ్ళనుంచో ప్రశ్నలు. ”కావచ్చునేమో, నేను హజార్‌ చౌరాషిర్‌ మా రాసేవరకూ ఉద్యమంలో భాగమయిన తల్లుల గురించే రాశాను. గ్రామీణ కార్యకర్తల తర్వాత ఇద్దరు పట్టణ యువకులు నా దగ్గరకొచ్చి తమ గురించి రాయమన్నారు. వాళ్ళ వేదనలోంచి, రాజకీయాలు తెలియని వాళ్ళ తల్లి వేదన నుంచి ఒక తల్లి పుట్టుకొచ్చింది” అంది మహాశ్వేత.

కొడుకు గురించి వేదన, కొడుగు బాగుకోసం తపన, కొడుకు విజయాల పట్ల గర్వం, ఒక తల్లిలో తల్లివి మాత్రమే కాదు, అవి మహాశ్వేతవి కూడా అంది. నేను పత్రికల్లో పనిచేస్తానని తెలిసి, ”నా కొడుకు నబురణ్‌ కూడా పత్రికల్లో పనిచేస్తాడు. ఇప్పుడు బెంగాలీ సోవియట్‌ లాండ్‌లో సబ్‌ ఎడిటర్‌. వాళ్ళేమో మూసేయబోతున్నారు. ఏమవుతాడో…” అని విచారపడింది.

”నబురణ్‌ అంటే నబురణ్‌ భట్టాచార్యేనా?” అని సంభ్రమంతో అడిగాను. ఆయన రాసిన ‘మృత్యులోయ నా మాతృభూమి కాదు’ అనే ఒక దీర్ఘ కవితను 1984లో నేను తెలుగు చేశాను. ఆ కవిత అచ్చయిన సృజన సంచిక మీద, సంపాదకురాలి మీద ఆ కవితలోని కొన్ని పదాలు రాజద్రోహకరంగా ఉన్నాయని కేసు పెట్టారు.

”ఔను, నీకెట్లా తెలుసు” అని ప్రశ్నించి, నేను చెప్పిన కథ విని ఉప్పొంగిపోయింది మహాశ్వేత. ‘నబురణ్‌ను ఇక్కడికి పంపిస్తాను, మీరు కలిసి మాట్లాడుకోవాలి” అంది.

ఆమెకు ఇష్టం లేకపోయినా ఇక కుటుంబం కథ మొదలయింది. మహాశ్వేత తండ్రి మనీష్‌ ఘటక్‌ నవలాకారుడు, తల్లి ధరిత్రీదేవి రచయిత, సంఘ సేవకురాలు. మేనమామ సచిన్‌ చౌధురి ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ వ్యవస్థాపక సంపాదకుడు. చిన్నాన్న రిత్విక్‌ ఘటక్‌ ఈ దేశపు అత్యుద్భుత సినిమా దర్శకుల్లో ఒకరు. మహాశ్వేత చిన్నతనం కమ్యూనిస్టు రాజకీయాలు నిండిన ఈ వాతావరణంలో గడిచింది. వైవాహిక జీవితం ఎక్కువ కాలం సరిగా నడవకపోయినా, బెంగాలీ అభ్యుదయ నాటకకర్త బిజన భట్టాచార్యతో కొన్నాళ్ళు సహజీవనం చేసింది. కమ్యూనిస్టు గనుక ఒక ఉద్యోగం పోగొట్టుకుంది.

సంభాషణ సహజంగానే కమ్యూనిస్టుల మీదికి సాగింది. రాజకీయాలు కాదు, సంస్కృతి, విలువలు. ”కమ్యూనిస్టులవి పాషాణ హృదయాలని చాలామంది అనుకుంటుంటారు గదా. ఒక సంఘటన చెప్పనా? అది కథ రాద్దామని ఎన్నాళ్ళనుంచో అనుకుంటున్నాను” అంటూ హాస్య, కరుణ, వీర, ఆశ్చర్య రసభరితమైన ఒక ఉదంతం చెప్పింది.

”ఝాన్సీ రాణి పుస్తకానికి సమాచారం సేకరిస్తూ మధ్యప్రదేశ్‌లో తిరుగుతున్నాను. 1950ల తొలి రోజులు. తెభాగా పోరాటం ముగిసిపోయి, కమ్యూనిస్టులు నిషేధం నుంచి, నిర్బంధాల నుంచి తప్పించుకోవడానికి బెంగాల్‌ నుంచి మధ్యప్రదేశ్‌ వెళ్ళి తలదాచుకుంటున్నారు. అటువంటి ఒక ప్రవాసి కుటుంబంతో రెండు రోజులున్నాను. ఆయన తెభాగా పోరాటంలో వీరోచితంగా పాల్గొన్న యోధుడు. తన పోరాట జ్ఞాపకాలు తలుచుకుంటూ, ఆ రోజుల్లో అక్కడ్నుంచి వస్తుండగా, గంగా తీరాన ఒక గాయపడిన మొసలి కనబడితే దాన్ని దగ్గరికి తీసి చికిత్స చేసిన వైనం చెప్పుకొచ్చాడు. ఒక వైపేమో రహస్య జీవితం. తానే తల దాచుకోవడానికి మరోచోటికి పారిపోతున్న స్థితి. అందువల్ల ఇక గత్యంతరం లేక, ఆ మొసలిని ఒక గంపలో పెట్టి హౌరా స్టేషన్‌లో ప్లాట్‌ఫారం మీద వదిలేసి మధ్యప్రదేశ్‌ బండెక్కాడని చెప్పాడు. అప్పటికి రెండు సంవత్సరాల కింద కలకత్తాలో పత్రికల్లో మార్మోగిపోయిన వార్త నాకు గుర్తొచ్చింది. అది హౌరా స్టేషన్‌లో గంపలో మొసలి దొరికిన వార్త! ఆ మొసలి ఫోటోలు పత్రికల్లో వేశారు. దాన్ని చివరకు జూకు ఇచ్చేశారు. ఈ పత్రికల వార్తల సంగతి నేనాయనకు చెప్పడం మొదలుపెట్టానో లేదో ఆయన సంతోషంతో నిలువెల్లా ఊగిపోయాడు. వయసు, అనారోగ్యం లెక్క చేయకుండా ఎగిరి గంతులు వేస్తూ ”హమ్మయ్య! బతికి ఉందన్నమాట! బావుందా? నువు చూశావా? నుదుటి మీద నిలువుగా ఓ చార ఉంటుంది! అదే గదూ! నా మనస్సిప్పుడు శాంతించింది! అని ఉబ్బి తబ్బిబ్బయిపోయాడు” అంటున్న మహాశ్వేత కళ్ళల్లో మళ్ళీ తడి.

‘ఎవరిదీ అడవి’ లాంటి గొప్ప నవల రాసి, అడవి పుత్రులను అణచివేసే ప్రభుత్వపు అవార్డు, పద్మశ్రీ ఎందుకు తీసుకున్నారని నా ప్రశ్న అడగకుండానే ఆ రోజు గడిచిపోయింది.

తర్వాత ఆ రెండు రోజుల అనుభవాన్ని వ్యాసంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో రాసి, ఒక కాపీ ఆమెకు పంపాను. రెండు వారాలు తిరక్కుండానే, ఆ ఆలస్యానికీ బోలెడంత వివరణ ఇస్తూ ఆర్ద్రమైన ఉత్తరం: ”ఆంధ్రకు చేరగానే, నేల మీద మన్ను తీసి నా నుదుటికి పెట్టుకున్నాను. అక్కడ నేను గడిపిన రోజులు, ఇప్పటివరకు నా జీవితమంతటిలోకీ గొప్పవి, సంపన్నమైనవి. మీరందరూ (గిరిజనులు) నాలో కొత్త రక్తాన్ని, కొత్త ప్రేరణను నింపారు… నీ వ్యాసం చూసి ఎంత పొంగిపోయానో చెప్పలేను. కానీ నువ్వు నన్ను మరీ ఎక్కువ పొగిడేశావు. మనం ఒకరినొకరం పొగుడుకోనక్కరలేదు. మన ఆచరణలు ప్రచారం కావాలి అంతే… నా జ్ఞాపకాల నిండా గద్దర్‌ నిండిపోయి, కిక్కిరిపోతున్నాడు…” అంటూ మూడు కథలు సృజన కోసమని పంపింది.

ఆ తర్వాతోసారి నూతన సంవత్సర శుభాకాంక్షల కార్డు పంపితే, ”అన్నీ పోస్టు కార్డులే. గ్రీటింగ్‌ కార్డులొద్దు. అయినా కొత్త సంవత్సరం పాత సంవత్సరాల కన్నా ఏం భిన్నంగా ఉంటుందని? ఇంకా ఘోరంగా ఉంటుందేమో!” అని రాసింది.

గిరిజనుల మీద నిర్బంధం గురించి, తన కార్యక్రమాల గురించి మధ్య మధ్య ఉత్తరాలు, అనువాదం కోసం సమాచారం పంపుతూనే ఉంది.

తన కథ ద్రౌపదిని గాయత్రి చక్రవర్తి ఇంగ్లిష్‌లోకి అనువదించి ప్రపంచానికంతా పరిచయం చేస్తే, ”ఆమె చేసిన అనువాదం చదివితే నా కథ నాకే అర్థం కాలేదు” అని కొట్టివేయగల మహాశ్వేత, భేషజాలకు పోని మహాశ్వేత జ్ఞానపీఠాన్ని అంగీకరించడం బాధ కలిగించింది. ”ఆ డబ్బుతో ఎన్ని గిరిజన గూడాల్లో బావులు తవ్వించొచ్చునో తెలుసా” అని ఆమె వివరణ ఇచ్చినా కసాయివాడి భూతదయ సదస్సుకు జీవకారుణ్యవాది వెళుతున్నట్లే అనిపించింది. చిట్టచివరికి ఆమె ఇప్పుడు కమ్యూనిస్టు వ్యతిరేకి రామన్‌ మెగసెసే అవార్డును కూడా అంతే నిర్లిప్తంగా అంగీకరిస్తుంటే, తెలుగు పాఠకులకు తెలిసిన మహాశ్వేతను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలనిపిస్తోంది. గుర్తు చేసుకుంటుంటే అదంతా నిన్ననో మొన్ననో జరిగినట్టే ఉంది. కాకపోతే ఇవాళ ఆ నిన్న నుంచి వికసించినట్టు లేదు.

ఆంధ్రజ్యోతి, 3 ఆగస్ట్‌ 1997

(పరిచయాలు పుస్తకం నుండి…)

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.