పాకీపని (మాన్యువల్ శ్కావెన్జింగ్) భారతదేశపు మానవతపై చెరగని మచ్చ. సామాజిక అసమానతల ద్వారా అణచివేయబడ్డ భారతదేశపు ”అంటరాని వారు”, దళితులు చేసే ఈ పని మరుగు దొడ్ల నుండి మానవ మలాన్ని చేత్తో తట్టల్లోకి ఎత్తి తలపై మోసుకుంటూ వెళ్ళి దూరంగా పారవేయడం: ‘పాకీపని’. వంశపారంపర్యంగా వస్తున్న ఈ వృత్తి పనిలో 1,80,000 దళిత కుటుంబాలు భారతదేశంలోని 7,90,000 పబ్లిక్, ప్రైవేటు మరుగుదొడ్లను శుభ్రపరుస్తున్నారు. వీరిలో 98% మంది స్త్రీలు, బాలికలే. వీరికి చెల్లించే వేతనం అతి తక్కువ. ఒకపక్క మన రాజ్యాంగం, ఇతర చట్టాలు డ్రై లెట్రిన్‌లను, వ్యక్తులను పాకీ పనిలో నియమించుకోడాన్ని నిషేధించినా దీనిని ఉల్లంఘిస్తున్న వారిలో ప్రభుత్వమే ముందుంది. కనుక వాటి అమలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.
బెజవాడ విల్సన్ కర్నాటక రాష్ట్రంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ టౌన్ షిప్‌లో ఒక దళిత కుటుంబంలో 1966 సం||లో పుట్టాడు. తరతరాలుగా తన కుటుంబం పాకీపనిలో ఉన్నా, అతను మాత్రం ఆ పని నుండి తప్పించుకోగలిగాడు. కుటుంబంలో పెద్ద చదువులు చదువుకున్న మొట్టమొదటి వ్యక్తి విల్సన్. బడిలో వెలివేయబడినట్లు చూడబడి, తన కుటుంబ స్థితి పట్ల పూర్తి ఎరుకతో ఉన్న విల్సన్ గొప్ప కోపంతో రగిలిపోతుండేవాడు. ఐతే తన కోపాన్ని తర్వాత ఈ పాకీ పనిని అంతం చేయడానికి ఒక యుద్ధాన్ని చేపట్టే దిశగా మలచుకున్నాడు.
ఇది అతను తన కుటుంబ సభ్యులు, బంధువుల తోనే ప్రారంభించాడు. దళితునిగా ఉండడమనేది వారి తలరాత కాదు, ఇది సమాజంచే రుద్దబడిన స్థితి అని, మనుషులెవ్వరూ పాకీపని వంటి హీనమైన పనిని చేయకూడదని వారికి వివరించాడు. 1986లో విల్సన్ పట్టణ అధికారులకు డ్రై లెట్రిన్‌ల గురించి ఒక ఫిర్యాదు పంపాడు. దానిని వారు పట్టించుకోకపోవడంతో చట్టపరమైన చర్యలను తీసుకోవలసి వస్తుందని తెలియచేస్తూ ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసాడు. ఫలితంగా, పట్టణంలోని డ్రై లెట్రిన్‌లను నీటిని ఉపయోగించే లెట్రిన్‌లుగా మార్చడం, పాకీపనిలో ఉన్న వారిని ఇతర పనులలో నియమించడం జరిగింది.
తర్వాత విల్సన్ తన యుద్ధాన్ని ఇతర రాష్ట్రాలకు వ్యాపింప చేశాడు. దళిత కార్యకర్తలతో పని చేస్తూ, స్వచ్ఛంద సేవకులను నియమించుకుంటూపోయాడు. తర్వాత అది ఒక ప్రజా ఉద్యమంగా రూపుదాల్చి పాకీ పనివారు, వారి పిల్లల భాగస్వామ్యంతో సఫాయి కర్మచారి ఆందోళన్ (SKA)గా రూపుదిద్దుకుంది. ఇది బెజవాడ విల్సన్ జాతీయ కన్వీనర్‌గా 1993లో ప్రారంభమైంది. విల్సన్ భారత సర్వోన్నత న్యాయస్థానంలో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేసాడు. ఇందులో అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను, ప్రభుత్వ శాఖలైన రైల్వే, రక్షణ, న్యాయ, విద్యా శాఖలను డ్రై లెట్రిన్‌ల వాడకాన్ని, పారిశుద్ధ్య పనికి వ్యక్తులను నియమించడాన్ని నిషేధిస్తూ ఏర్పడిన 1993 నిషేధ చట్టాన్ని ఉల్లంఘించినవారిగా పేర్కొన్నాడు.
SKA ద్వారా విస్తుృతంగా జిల్లాస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో పాకీపనిపై, కుల వ్యవస్థపై, 1993 నిషేధ చట్టంపై అవగాహన కల్పించేవారు. ఉద్యమానికై స్థానిక నాయకులను, స్వచ్ఛంద సేవా కార్యకర్తలను తయారు చేసారు. 2004-2005లో, ఆంధ్రప్రదేశ్ అంతటా పెద్ద ఎత్తున డ్రై లెట్రిన్లను కూల్చివేసే పనిని మొదలుపెట్టారు; పాకీపనిలో ఉన్న స్త్రీలపై జరుగుతున్న వృత్తిపరమైన హింసను బహిర్గతం చేసారు; డ్రై లెట్రిన్‌ల కూల్చివేత, పాకీ పనిని వృత్తిగా చేపట్టిన వారికి ఇతర పనులను కల్పించాలన్న డిమాండ్‌లతో అధికారులని కలిసారు. 2010లో పాకీపనిని పూర్తిగా నిర్మూలించాలంటూSKA భారత దేశమంతటా ఒక పాదయాత్రను నిర్వహించింది. తిరిగి 2015లో 30 రాష్ట్రాలను 125 రోజుల్లో చుట్టివచ్చేలా బస్సు యాత్రను చేపట్టింది. దీని ద్వారా ఆయా రాష్ట్రాలలో మనుషులు పారిశుధ్య పనుల్లో నియమించ కుండా ఉండేందుకు ప్రజలను చైతన్యపరిచారు. అప్పట్నుండి ఉద్యమం చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించింది. 2013లోSKA పారిశుధ్య కార్మికులకు పునరావాసం కల్పిస్తూ ఒక క్రొత్త చట్టాన్ని తేవడానికి చేసిన ప్రయత్నంలో విజయం సాధించింది. అలాగే పాకీపని వారి పిల్లలకు ఉపకారవేతనాలు ఇవ్వాలని, వారి కూతుళ్ళకు గౌరవప్రదమైన పనులు కల్పించడానికి అవసరమైన వృత్తిశిక్షణను ఇవ్వాల్సిందిగా స్థానిక అధికారులతో సంప్రదింపులు జరిపింది. ప్రస్తుతం పారిశుధ్య కార్మికులు క్రొత్త ఉపాధులకు మారేందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించేటువంటి కొత్త చట్టాన్ని రూపొందించడంలో నిమగ్నమైంది.
50 ఏళ్ళ బెజవాడ విల్సన్ జీవితంలో 32 ఏళ్ళపాటు ఈ యుద్ధం చేస్తూనే గడిపాడు. అతను ఒక నైతిక కోపంతో ఈ యుద్ధాన్ని నడపడమే కాక అద్భుతమైన ప్రజా సమీకరణ సామర్థ్యాలను కనబరుస్తూ, అత్యంత క్లిష్టమైన భారత న్యాయ వ్యవస్థతో పనిచేస్తూ ముందుకు సాగాడు.SKA దేశంలోని 500 జిల్లాల్లో 7000 మంది సభ్యుల నెట్‌వర్క్‌గా ఎదిగింది. దేశంలోని దాదాపు 6 లక్షల మంది పారిశుధ్య పని వారిలో సుమారు 3 లక్షల మందిని ఆ పని నుండి విముక్తపరచగలిగింది SKA. విల్సన్ దళితుల స్వీయ విముక్తిని తన పనిలో కీలకమైన అంశంగా చేసినా, వ్యక్తులు పారిశుధ్య పనిని చేయడమనేది ఒక రంగానికి సంబంధించిన సమస్య కాదనేది ఒత్తి చెప్తుంటాడు: ”ఇది సమాజంలోని వ్యక్తులందరికీ సంబంధించిన విషయం, ఎందుకంటే ఏ మనిషీ ఇలాంటి అమానవీయ మైన పద్ధతులకు గురికాకూడదు”. సమాజం మొత్తంగా మారాలి.
2016 రామన్ మెగసెసె అవార్డుకు బెజవాడ విల్సన్‌ను ఎంపిక చేయడంలో ట్రస్టీల బోర్డు భారతదేశంలోని మానవ పాకీపని అనే అవమానకర దాస్యాన్ని నిర్మూలించడానికి ఒక క్షేత్రస్థాయి ఉద్యమాన్ని నడపడంలోను, దళితులకు జన్మహక్కైన గౌరవప్రదమైన జీవితాన్ని తిరిగి పొందేలా చేయడంలోను అతను చూపించిన నైతిక శక్తిని, అద్భుతమైన నైపుణ్యాలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసింది.
2016 రామన్ మెగసెసె అవార్డు పొందిన బెజవాడ విల్సన్‌కు భూమిక శుభాకాంక్షలు తెలుపుతుంది. ఈ అమానవీయ ఆచారాన్ని అరికట్టడంలో భూమిక ఎప్పుడూ ఈ ఉద్యమంలో భాగంగా మీతో ఉంది… ఉంటుంది.